18, జులై 2024, గురువారం

ఎలా గుర్తుంటాయో ఆ దేవుడికే తెలియాలి


‘‘ఈ శంఖంలో తీర్ధం కదా పోయాల్సింది, బియ్యం పోస్తున్నావేమిటి’
నా అజ్ఞానానంధకారంలో నుంచి సంధించిన ప్రశ్న.
 
‘ఇళ్ళల్లో పూజకు వాడే శంఖాల్లో బియ్యమే పోయాలిట. ఇంకోటి తెలుసా! పదిహేనేళ్ళ క్రితం కాబోలు  ఆర్వీవీ కృష్ణారావు గారితో మనం  తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన  ఈ శంఖాన్ని ఇస్కాన్ టెంపుల్ లో కొని మనకిచ్చారు’
‘.........’
‘ ఈ బుల్లి విగ్రహం చూశారా! విష్ణుమూర్తి పాదాల దగ్గర లక్ష్మీదేవి కూర్చున్న ఈ ప్రతిమను శేఖర రెడ్డి గారి భార్య, నా ఫ్రెండ్ అరుణ కొని నాకు ప్రెజెంట్ చేసింది’
‘.......’
‘ఈ చిన్న వెండి తులసి కోటను   విమలక్కయ్య ఇచ్చింది. ఎనిమిదేళ్ళు దాటింది. అయినా మెరుపు తగ్గలేదు. మన పూజా మందిరంలో ఉన్న వాటిల్లో చాలావరకు ఆమె ఇచ్చినవే. అదిగో ఆ కుంకుమ భరిణ. ఆ  దేవుడి పీట. మంచి మనసుతో ఇచ్చింది. అందుకే ఇన్నేళ్ళయినా  ఇలా మెరిసిపోతున్నాయి’
‘..........’
‘చనిపోయి ఏ స్వర్గంలో వున్నారో సరస్వతి వదిన గారు. ఈ సరస్వతీ దేవి విగ్రహం ఆమె ఇచ్చిందే. పాతికేళ్ళయి౦ దేమో! మనం   మాస్కో నుంచి వచ్చిన కొత్తల్లో చూడడానికి వచ్చినప్పుడు ఇచ్చారు’
‘...........’
‘ఈ చిన్ని వెండి మందిరం భారతి వదిన గారు ఇచ్చారు. మాస్కోనుంచి తిరిగొచ్చి మనం దుర్గానగర్ లో ముస్లిముల ఇంట్లో అద్దెకు వున్నప్పుడు అన్నగారికి గుండె ఆపరేషన్ మంచిగా  జరిగి సంతోషంగా ఇంటికి వెడుతూ వదిన గారు ప్రేమతో ఇచ్చిన కానుక ఇది’
‘.........’
‘మూడేళ్ళ నాడు బుజ్జివాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వెండి సామాన్లు తీసుకోవడానికి షాపుకు వెళ్ళినప్పుడు మనమూ వెంట వెళ్లాం గుర్తుందా! చిన్ని లక్ష్మీ దేవి, పక్కన రెండు చిన్న ఏనుగులు ఉన్న ప్రతిమ చూసి ముచ్చట పడితే మీరు అప్పటికప్పుడే కార్డు గీకి కొనేశారు. బహుశా ఇన్నేళ్ళ కాపురంలో మీరు కొన్న దేవుడి బొమ్మ ఇదొక్కటే!’
‘............’

అసలు నేను ఆ గదిలోకి అడుగు పెట్టింది ‘విగ్రహాలు కడుగుతూ, ఆ సందట్లో  టిఫిన్ తిని మాత్ర వేసుకోవడం మరిచిపోయావా అని అడగడానికి.
ఇంత పాత సంగతులు ఇలా విపులంగా చెబుతుంటే ఇక మతిమరపు గురించి ఏం అడగను. ఓ దణ్ణం (పులుకడిగిన దేవుళ్ళకు) పెట్టేసి చక్కా వచ్చాను.  
    
తోక టపా: ఇది జరిగింది 2019 జులై 18 వ తేదీన. 
ఆగష్టు 18 న తాను లేదు.
ఈ పూజలన్నీ ఏమై పోయాయో ఏమో మరి.
ఏ పూజలు, పునస్కారాలు తెలియని నేను మాత్రం ఇలాగే వున్నా మరి.

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అలాగే చీరల గురించి కూడా (తమవే కాక ఎదుటివాళ్లవి కూడా😌).
ఇది ఆడవారికి మాత్రమే స్వంతమైన విద్య. మగవాళ్లు అచ్చెరువొందినా అంతు పట్టదు.

అజ్ఞాత చెప్పారు...

మీ జ్ఞాపక శక్తి కూడా తక్కువేమీ కాదు. ఎన్నో ఏళ్ల క్రితం మీరు కలిసిన నాయకులు ధరించిన దుస్తులు వారు చెప్పిన మాటలు పూసగుచ్చి నట్టు మీరు ఇప్పటికీ వ్రాస్తున్నారు కదా. ఎవరికి ముఖ్యమైన విషయాలు వారికి గుర్తు ఉంటాయి.