కీడులో
మేలులా, కరోనా కొంత మంచి కూడా చేస్తోంది. మునుపు సర్కారు
దవాఖానా అంటే జనంలో చిన్న చూపు. కరోనా బాధితులను ప్రైవేటు/ కార్పొరేటు ఆసుపత్రులు చేస్తున్న
లూటీ గురించి తెలుసుకున్న ప్రజల దృష్టి ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ మీద పడింది.
ఈ విషయంలో విశేష సేవ చేస్తున్న ఆసుపత్రులలో గాంధి ఆస్పత్రి ఒకటి.
మొన్నీమధ్య
నా కాలేజ్ మేట్ ఒకరు ఫోను చేశాడు. ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో చాలా పెద్ద పదవిలోనే
రిటైర్ అయ్యాడు. కానీ వస్తుతః నిదానస్తుడు, నిగర్వి,
పదవిని అడ్డం పెట్టుకుని అడ్డదారులు తొక్కని వాడు. పైగా ఆధ్యాత్మిక భావాలు, దైవ
భక్తీ, పాపభీతి. ఇలాంటి వాడికి కరోనా కష్టం వచ్చి పడింది. రెండో
అబ్బాయి రామచంద్రన్ (యితడు ఒకప్పటి
మద్రాసులో పుట్టాడు,
దానితో స్కూలు రిజిస్టరులో పేరు అలా పడింది) పాజిటివ్ అనగానే మనవాడి గుండె
జారిపోయింది. దానికి ప్రధాన కారణం కరోనా అయితే రెండో కారణం కొడుకు పుట్టుకతోనే
బధిరుడు. ఇలాంటి వాడు ఆసుపత్రిలో ఒంటరిగా ఎలా ఉండగలుగుతారు అనేది నా స్నేహితుడి
బెంగ. గాంధి ఆసుపత్రిలో చేర్చి నాకు ఫోను చేశాడు. కానీ నేనూ అతడి పడవలోనే ప్రయాణిస్తున్నాను.
రిటైర్ అయి పదిహేను ఏళ్ళు అవుతోంది. చేయగలిగింది ఒక్కటే మంత్రి కేటీఆర్
గారికి ఆసుపత్రిలో కోవిడ్
ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రభాకరరెడ్డి గారికి వాట్సప్ లో అభ్యర్ధనలు పంపాను. పర్వాలేదు
అన్నట్టుగా ఇద్దరి నుంచి తిరుగు సందేశం
వచ్చింది. పేషెంటుకు వినికిడి సమస్య వుంది కాబట్టి ప్రత్యేక గది కన్నా క్యూబికల్స్
లో వుంటే మంచిది అని డాక్టరు ప్రభాకరరెడ్డి గారు అన్నారు. అదే మంచిదయింది. ఆసుపత్రిలొ
వున్నన్ని రోజులు రోగిని కనిపెట్టి
చూసుకున్నారు. ప్రతిరోజూ పరిశుభ్రమైన, పౌష్టిక ఆహారం అందించేవారు. సిబ్బంది సైతం చాలా
సేవాభావంతో పనిచేసేవారని ఆ అబ్బాయి ఫోనులో చెబుతుంటే, ఇంకా నయం వేరే కార్పొరేట్
హాస్పిటల్ లో చేర్పించక పోవడం మంచిదయిందని
తండ్రి సంతోషపడ్డాడు.
మొత్తం
మీద నెగెటివ్ అనిపించుకుని నిన్ననే అతడు డిశ్చార్జ్ అయ్యాడు. ప్రభుత్వ ఆసుపత్రులపై
తనకు మంచి అభిప్రాయం లేదనీ, కానీ
ఇప్పుడా దురభిప్రాయం పూర్తిగా తొలగిపోయిందనీ ఇంటికి వచ్చిన తర్వాత తండ్రితో
చెప్పాడు. డాక్టర్ ప్రభాకర రెడ్డి గారెతో తను తీయించుకున్న ఫోటోను తన స్నేహితులతో
గర్వంగా పంచుకుంటున్నాడు.
2 కామెంట్లు:
అదృష్టవంతుడు, తేలికలోనే గట్టెక్కగలిగాడు.
కరోనా వలన గాంధీ హాస్పిటల్ ప్రతిష్ఠ కాస్త ఇనుమడించిందనే అనిపిస్తోంది.
మీ మాటను మన్నించిన డాక్టర్ ప్రభాకర రెడ్డి గారు అభినందనీయులు.
May be he got better treatment due to recommendations. Can we expect same thing for common man? I doubt.
కామెంట్‌ను పోస్ట్ చేయండి