13, అక్టోబర్ 2020, మంగళవారం

అసిధారావ్రతం

 


‘మా వెబ్ ఛానల్ కు మీరు ఓ ఇంటర్వ్యూ ఇవ్వాలి, జగన్, కోర్టుల వ్యవహారం మీద’

‘తప్పకుండా. కానీ  అసిధారావ్రతం అనే కండిషన్ మీద

‘అంటే!..’ అన్నదా అమ్మాయి.

నేనూ దాని ఉత్పత్తి అర్ధం జోలికి పోలేదు, పైగా దాని అసలు అర్ధం తెలియకపోవడం మంచిదే అనుకున్నాను.

‘ఏమీ లేదు, కోర్టులకు సంబంధించిన వ్యవహారం కదా! అంచేత మీరు ఏ ప్రశ్న అయినా అడగండి, నాకు అభ్యంతరం లేదు, నేను మాత్రం ఆచితూచి మాట్లాడతాను, మీకేమయినా అభ్యంతరమా

లేదనిపించుకున్న తరవాత ఇంటర్వ్యూ మొదలయింది.

‘ఇప్పుడు ఇలా కోర్టుల మీద యుద్ధం ప్రకటించిన ఏపీ సీఎం జగన్ మోహన రెడ్డికి ఎలాంటి చిక్కులు ఎదురు కాబోతున్నాయి?

‘ఆయనకు ఎదురయ్యే చిక్కుల సంగతి ఏమో కానీ కోర్టుల పట్ల గౌరవంతో కూడిన భయం కారణంగా, రాజకీయ నాయకులు అందరూ  నోరు సంభాళించుకుని మాట్లాడే పరిస్థితి వస్తే జనం చాలా చిక్కులనుంచి బయట పడతారు.’

సరిగ్గా ఇలాగే కాకపోయినా  ఇంటర్వ్యూ ఇలాగే మొదలయింది.

‘ఈ పరిణామాలను వ్యవస్థల మధ్య ఘర్షణగా భూతద్దంలో చూపిస్తున్నారు. నిజానికి ఇది వ్యక్తుల నడుమ, ఇంకా బాగా చెప్పాలంటే రెండు ప్రాంతీయ పార్టీల నడుమ ఎంతో కాలంగా సాగుతూవస్తున్న సంఘర్షణకు పరాకాష్టగా నేను అనుకుంటున్నాను.

‘ఏ వ్యవస్థ అయినా వ్యక్తుల సమూహమే. వ్యక్తులకు వుండే సహజమైన బలాలు, బలహీనతలు ఒక్కొక్కసారి వ్యవస్థల మీద ప్రతిఫలిస్తుంటాయి. అది వ్యవస్థ తప్పుకాదు, కానీ అలాంటి వ్యక్తుల కారణంగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవస్థల మీద మచ్చ పడే ప్రమాదం వుంది.

‘కొందరు రాజకీయ నాయకులు మంచి ప్రజాదరణతో గద్దె ఎక్కుతారు. ఏదో చేయాలన్న తపనతో పాటు ఎవరినో సాధించాలి అనే ఆరాటం కూడా వారిలో వుంటుంది. శ్రీమతి గాంధి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకురాలు. ఇదే బలహీనత ఆమెను అధికారానికి దూరం చేసింది. ఆ తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనతా పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిన పనులు చేయడం కంటే ఇందిరాగాంధీని రాజకీయంగా భ్రస్టు పట్టించడానికే ఎక్కువ సమయం వినియోగించింది. వీటిని ప్రజలు ఎలా గమనిస్తున్నారు అనే విషయం ఆ తదుపరి జరిగిన ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.

‘ఇక జగన్ మోహనరెడ్డి విషయానికి వస్తే రెండేళ్ల కంటే కొంచెం తక్కువగా, ఇంతవరకు  సాగిన ఆయన పాలనలో ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. మొట్టికాయలు, అక్షింతలు  అని మీడియా వ్యవహరిస్తున్న వీటి సంఖ్య సుమారు నూరువరకు ఉండొచ్చని అంచనా. విచారణ సందర్భంలో  న్యాయమూర్తులు చేసే వ్యాఖలకు  కూడా  మీడియా  విశేష  ప్రాధాన్యం  ఇస్తోంది. వాటిమీద  మళ్ళీ  చర్చలు. ఏతావాతా తమ ప్రభుత్వంపై  అన్యాపదేశంగా  జరుగుతున్న దాడి అనే అనుమానం వారిది.

అయితే  కోర్టుల వ్యాఖ్యల తీరుతెన్నుల ఆధారంగానే  జగన్  పాలన రాజ్యాంగ సమ్మతంగా లేదని కొందరు నిర్ధారిస్తున్నారు. సరే. ఒప్పుకుందాం. కానీ చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరయిన టైం చూపిస్తుంది. అటువంటప్పుడు ఇన్ని నిర్ణయాలు వరసగా కోర్టుల స్క్రూటినీలో  తప్పని తేలుతున్నప్పుడు ఎందుకిలా జరుగుతోంది, దీని వెనకాల ఏముంది  అనే అనుమానం వరసగా అక్షింతలు వేయించుకుంటున్న వారికి  కలిగితే దాన్ని మాత్రం ఎలా తప్పుపట్టగలం.

కొందరు న్యాయమూర్తుల పనితీరు, లేదా వారి నిర్ణయాల పట్ల సందేహాలు  వ్యక్తం చేస్తూ చేసిన ప్రకటనను కూడా న్యాయ వ్యవస్థ పట్ల తమ ప్రభుత్వానికి ఎనలేని గౌరవం వుందని ఉద్ఘాటిస్తూనే మొదలుపెట్టారు. ఈ ఫిర్యాదును  నేరుగా సుప్రీం కోర్టు  ప్రధాన న్యాయమూర్తి  దృష్టికే లిఖిత పూర్వకంగా దాఖలు చేసుకున్నారు. ఇది ఒక వ్యక్తిగానే కాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఆయనకు ఉన్న హక్కు. దానిని ఆయన ఉపయోగించుకుంటే ఎలా తప్పుపడతాం చెప్పండి. కాకపొతే, సర్వోన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తికి ఒక ఫిర్యాదు ఇచ్చిన తరువాత, కొంత సమయం ఇచ్చి  వేచి వుండాల్సింది. ఈ లోపలే ఆ విషయాన్ని మీడియా ద్వారా బహిరంగ పరచడం నైతికంగా చూసినప్పుడు పొరబాటే. న్యాయస్థానం  దీన్ని  కోర్టు ధిక్కరణ కింద  పరిగణించే అవకాశం వుంది.

‘కానీ  వర్తమాన రాజకీయాల్లో తప్పుఒప్పుల నడుమ విభజన రేఖ ఎప్పుడో చెరిగిపోయింది. ఎలాగంటే ఒక పార్టీ నాయకుడు రాష్ట్రపతికి ఓ లేఖ రాస్తారు. అది ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరకమునుపే అందులోని విషయాలను మీడియాకు వెల్లడిస్తారు. అయితే సుప్రీం కోర్టు  ప్రధాన న్యాయమూర్తికి చేసిన  ఫిర్యాదు, రాష్ట్రపతికి ఇచ్చిన విజ్ఞాపన పత్రం ఒకటేనా అనే సందేహం మీకూ, నాకూ  రావచ్చు. కానీ రాజకీయాల్లో ఈ విధమైన విచక్షణ నానాటికీ లుప్తం అవుతోంది.

‘పునరుక్తి దోషం అయినా మళ్ళీ ఒకసారి చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది, రాజ్యాంగ వ్యవస్థల నడుమ ఘర్షణ కాదు, రెండు రాజకీయ పార్టీల నడుమ కొనసాగుతూ వస్తున్న సంఘర్షణ ఈ రూపం తీసుకుంటోంది.  

‘ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోర్టుల పట్ల చేసిన వ్యాఖ్యలను గురించి అడిగారు. ఈ పిటీషన్ విచారణ సందర్భంలో న్యాయమూర్తి ఒకరు ఒక ప్రశ్న అడిగారు. ‘ఈ వ్యాఖ్యలు ఆయన సభలో చేసారా లేక బయట చేసారా’ అని. ‘తిరుమలలో చేశార’ని జవాబు వచ్చిన జ్ఞాపకం. అంటే సభ వెలుపల చేస్తే కోర్టు ధిక్కరణ కిందికి రావచ్చేమో. సభలో చేస్తే స్పీకర్ కూడా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న కారణం చేత అలాంటి తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చేమో!

‘ఇదే సూత్రం సోషల్ మీడియాకు కూడా వర్తిస్తుందా? నాకు అంత న్యాయ శాస్త్ర పరిజ్ఞానం లేదు. కోర్టు బయట చేసిన ఇలాంటి వ్యాఖ్యలు  కూడా న్యాయమూర్తుల అభిశంసనకు గురవుతాయా అనేది  న్యాయ కోవిదులే చెప్పాలి.

‘ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటికి ఎంత త్వరగా ముగింపు పలికితే అంత శ్రేయస్కరం  

ఇలాగే సాగింది ఆ ఇంటర్వ్యూ. అచ్చం ఇలాగేనా అంటే కొంత వాచకంలో తేడా వుండి ఉండొచ్చు.

తోకటపా:

ఇక ఆ అమ్మాయి అడిగిన ‘అసిధారావ్రతం’ అంటే ఏమిటో నేను చెప్పలేదు కదూ.

‘చాలా కష్టమైన పని’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు.

అసి అంటే కత్తి. ధారా అంటే అంచు. అసిధారావ్రతమంటే కత్తి అంచు మీద పడుకోవడమనేది భౌతికార్థం!

నిజానికి ఇది బ్రహ్మచర్య దీక్షలో ఒక భాగం. మనసు నిలకడస్థితికి పరీక్ష పెట్టే వ్రతమిది. నాతిగల బ్రహ్మచర్యం విషయంలో కూడా వాడతారు.

ఇక నా కవి హృదయం ఏమిటంటే కోర్టుల వ్యవహారాలు  గురించి  వ్యాఖ్యానించేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అని. (13-10-2020)


Note: Courtesy Image Owner




కామెంట్‌లు లేవు: