15, ఆగస్టు 2019, గురువారం

‘వొట్రకంబు’ – భండారు శ్రీనివాసరావు

పరీక్షలకోసం పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీయించుకోవడం తప్ప మా చిన్నతనంలో విడిగా కావాలని ఫోటో దిగడం అనేది అబ్బురమే. అసలు కెమెరా అనేది చాలామంది ఇళ్ళల్లో కనిపించేది కాదు. రేడియో, కెమెరా ఉన్నాయంటే కలిగినవాళ్ళని అర్ధం.
అలాంటిది నేను ఓ యాభయ్ ఏళ్ళక్రితం ఫోటో దిగాను అంటే నేనే నమ్మను. కానీ ఏం చెయ్యను కళ్ళెదుట కనిపిస్తుంటే...
నేను బెజవాడ ఎస్సారార్ కాలేజీలో చేరకముందు కాంగ్రెస్ ఆఫీసు రోడ్డులోని సింహాలమేడలోని అనేకానేక వాటాల్లో ఒక దానిలో అద్దెకు వుండేవాళ్ళం. (మా పెద్దన్నగారనుకోండి). ఆ మేడ ఆవరణలోనే రోడ్డుకు ఆనుకుని విశ్వా టైప్ రైటింగ్ ఇన్స్తిటూట్ వుండేది. అందులో సూర్యనారాయణ అని పనిచేస్తుండేవాడు. మాంచి హుషారు మనిషి. ఎప్పుడూ క్రాఫు చెదరకుండా దసరా బుల్లోడిలా ఉండేవాడు. ఆ రోజుల్లో స్కూలు ఫైనల్ పాసయిన ప్రతి వాడూ టైప్ నేర్చుకోవాలని అనుకునేవాడు. ఆ డిప్లొమా చేతిలో వుంటే ప్రభుత్వ ఉద్యోగం తేలిగ్గా వస్తుందని. అమీర్ పేటలో జావాలు, ప్లస్ లూ నేర్చుకునే వాళ్ళ మాదిరిగా అనుకోండి.
ఆ సూర్య నారాయణ ఇన్నేళ్ళ తర్వాత ఫేస్ బుక్ ద్వారా నన్ను పట్టుకుని వాట్స్ అప్ లో మూడు ఫోటోలు పంపాడు. టీవీల్లో నన్ను చూస్తుంటాడట. పేరేమో భండారు శ్రీనివాసరావు అని చెబుతారు, మనిషి చూస్తేనేమో వేరేగా వున్నాడు, ఆయనా ఈయనా ఒకరేనా అనే అనుమానంతో నాకు ఫోన్ చేసి అడిగాడు, టీవీల్లో కనిపించేది నువ్వేనా అని.
ఫోటోలు చూసిన తర్వాత ఆ అనుమానం ఎవరికైనా వస్తుంది. అప్పుడు సన్నగా రివటగా వుండే వాడిని. మా ఆవిడేమో మద్రాసు ఆంధ్రా మెట్రిక్. నాకు ‘వొట్రకంబు’ అని నిక్ నేమ్ పెట్టింది. (అప్పటికి పెళ్లి కాలేదు, ప్రేమ లేఖల స్థాయిలోనే వుంది. ఆ మాటకు అర్ధం పెళ్ళయిన తర్వాత చెప్పింది. అంటే ఇళ్ళల్లో పాజుట్లు (బూజు) దులిపే కర్ర)
సరే! ఏం చేస్తాం!
ఇప్పుడు సూర్యనారాయణ పంపిన పాత ఫోటోలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.


కింది ఫోటోలలో వున్నది: బెజవాడ కృష్ణలో నీళ్ళు లేనప్పుడు వెళ్లి దిగామని అతడే చెప్పాడు. నాతోపాటు (చివరి ఫోటోలో నేను కుడి నుంచి రెండు) వున్నది: సూర్యనారాయణ, డాక్టర్ దాసు మధుసూదనరావు, దాసు శ్రీరాములు, అడ్వొకేట్ గారి అబ్బాయి, ఆంధ్రయూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయి వైజాగ్ లో సెటిలయ్యారట. మూడో అతను అద్దేపల్లి సత్యనారాయణ, కృష్ణ లంక, ఇప్పుడు లేరట)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Indian leftist media desperately wants something untoward to happen. Sorry to disappoint you guys. People are smarter than you. India is going to be great and regain its lost glory under centuries of subjugation and persecution.