21, ఆగస్టు 2017, సోమవారం

శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్ ఇక లేరు.


ఈ తెల్లవారుఝామున ఫోను మోగింది. పెద్దాయన దాటిపోయారు అని చెప్పారు వల్లీశ్వర్.  ఆదివారం రాత్రే  జ్వాలా, నేనూ కలిసి బంజారా కేర్ ఆసుపత్రికి వెళ్ళాము. ఐ.సి.యూ. లో ప్రసాద్ గారిని చూశాము. జీవితంలో ఎలాంటి బంధాలు లేకుండా బతికిన మనిషి ముక్కు, నోటికి బంధనాలతో చూస్తుంటే ఎంతో బాధ వేసింది. ఈ రాత్రి గడవడం కష్టం అనే భావన డాక్టర్ల అభిప్రాయంగా తోచింది. అయ్యో అనిపించింది. ప్రసాద్ గారి భార్య గోపిక, కొడుకు  సంజీవ్, కుమార్తె మాధవి అంతిమ ఘడియల్లో ఆయన చెంతనే వున్నారు. ఆయన వయస్సు  డెబ్బయి ఏడు సంవత్సరాలు.  ఒక్క రోజు గడిచి వుంటే డెబ్బయి ఎనిమిదిలో ప్రవేశించి వుండేవారు. ఈరోజులలో ఇదేమంత పెద్ద వయస్సేమీ కాదు. కానీ ఆయన నమ్ముకున్న తిరుపతి వెంకటేశ్వరుడికి ఆయన్ని తన దగ్గరకు పిలిపించుకోవాలనే కోరిక కలిగిందేమో. అందుకే శనివారం తెల్లవారుఝామున ఆస్పత్రిలో చేరిన ప్రసాద్ గారు ఎవరినీ కష్ట పెట్టకుండా, తనుమరీ కష్టపడకుండా దాటిపోయారు. ఆధ్యాత్మిక అంశాలతో కూడిన చక్కటి రచనలను మిగిల్చిపోయారు. పుణ్యజీవితం గడిపిన ధన్యజీవి శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్.

Image may contain: 1 person, eyeglasses

నిజానికి ఆయనో ఆధ్యాత్మిక అధికారి.
ఒక ఉన్నతాధికారి జిల్లా కలెక్టర్ కావచ్చు, సచివాలయంలో ఉప కార్యదర్శి కావచ్చు, ఎక్సైజ్ కమీషనర్ కావచ్చు, టీటీడీ ఈవో కావచ్చు, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కావచ్చు, ఏకంగా భారత ప్రధానమంత్రి సలహాదారు కావచ్చు, మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ కావచ్చు, ధర్మ పరిరక్షణ సంస్థ గౌరవ అధ్యక్షులు కావచ్చు – అది ఏ ఉద్యోగం అయినా కానివ్వండి, ఏ హోదా వున్నదయినా కానివ్వండి, ఎంతటి బాధ్యత కలిగినదయినా కానివ్వండి దాన్ని ఒకే నిబద్ధతతో, ఒకే అంకితభావంతో, అంతే సమర్ధంగా నిర్వహించుకుని, నిభాయించుకుని సెహభాష్ అనిపించుకోగల అధికారులను వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు. ఆ లెక్క తీసుకుంటే ఆ వరుసలో మొదట్లో కానవచ్చే వ్యక్తి  తన డెబ్బయి ఏడో ఏట స్వల్పకాల అస్వస్థత అనంతరం ఆగస్టు ఇరవై ఒకటో తేదీ తెల్లవారుఝామున కన్నుమూసిన పీ.వీ. ఆర్. కే. ప్రసాద్. (వారి పూర్తి పేరు పత్రి వేంకట రామకృష్ణ ప్రసాద్)    
నలుగురికే కాదు, ప్రపంచం నలుమూలల  తెలిసిన మనిషి ఆయన.  శనివారం తెల్లవారుఝామున ఆస్పత్రిలో చేరారు. అస్వస్వతకు గురయిన  సంగతి నలుగురికీ తెలిసేలోగానే, ఇరవైనాలుగు గంటలు గడిచీ గడవక ముందే, సోమవారం తెల్లవారుఝామున ఆయన  ఈ ప్రపంచాన్ని వీడిపోయారనే కబురు నేల నాలుగు చెరగులా తెలిసిపోయింది. మరణం అలా ముంచుకురావడం పుణ్యాత్ముల విషయంలోనే జరుగుతుందంటారు. అలాగే జరిగింది కూడా.
ఎన్నెన్నో బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసినా ఎలాటి మచ్చ పడకుండా నెగ్గుకువచ్చారు. తనపైవారికి కానీ, కింది సిబ్బందికి కానీ మాట రాకుండా నిప్పులాంటి నిజాయితీతో విధులను నిర్వహించారు. ఎన్ని గిరులు గీసుకున్నా,మరెన్నో బరులు తన చుట్టూ  బారులు తీరినా, ఏదైనా విషయం సమాజానికి మేలు చేసేది అని తను మనసారా నమ్మితే చాలు, అంతే! ఎలాంటి సంకోచాలు లేకుండా, ఎలాటి భేషజాలకు పోకుండా, అడ్డొచ్చే నిబంధనలను  తోసిరాజనికూడా ప్రజాక్షేమానికి పెద్దపీట వేసే గుండె ధైర్యం ఆయన సొంతం. ఇలాటి విషయాల్లో యువ ఐ.ఏ.ఎస్. అధికారులకు ఆయన చక్కని స్పూర్తి ప్రదాత. నిబంధనల పేరుతొ అధికారుల్లో వుండే చొరవను చిదిమేయవద్దని ప్రసాద్ గారు తరచుగా అంటుండేవారని ఆయన కింద పనిచేసిన ఓ అధికారి గుర్తు చేసుకున్నారు. యువ అధికారులు చొరవ తీసుకుని చక్కని ఫలితాలు రాబట్టే క్రమంలో కొన్ని కొన్ని పొరబాట్లు చేసినప్పుడు ఆయన పెద్ద మనసుతో సర్దిపుచ్చేవారు. నల్గొండ జిల్లాలో ఎస్.ఎఫ్.డి.ఏ. అధికారిగా పనిచేస్తున్నప్పుడు సన్నకారు రైతులకు ప్రయోజనం కల్పించే ఒక పధకం అమల్లో ఆయన అలాంటి  చొరవనే తీసుకున్నారు. ఆ జిల్లాలో  అయన వేసిన కొత్త బాటకు దేశవ్యాప్త ప్రచారం లభించింది. ఢిల్లీలో  జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి స్వయంగా నల్గొండ ప్రయోగం గురించి ప్రస్తావించిన విషయాన్ని నాటి ముఖ్యమంత్రి శ్రీ పీ.వీ. నరసింహారావు గారు స్వయంగా పీవీఆర్కే చెవిన వేశారు. ఈ సంగతిని ఆయన తన అనుభవాల గ్రంధంలో రాసుకున్నారు కూడా.
“అకీర్తిం చాపి భూతాని కధయిష్యంతి తేవ్యయామ్
సంభావితస్యచా కీర్తిర్మరణా దతిరిచ్యతే”
“ప్రజలెప్పుడూ నీ అపకీర్తి గురించే చెప్పుకుంటారు. ఆత్మ గౌరవం కలిగిన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటే దుర్భరమైనది”
భగవద్గీతలో గీతాకారుడు చెప్పిన ఈ సూక్తిని శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్ తన జీవిత పర్యంతం మనసా వాచా కర్మణా గుర్తుంచుకుని జీవన యానం సాగించారేమో అనిపిస్తుంది ఆయన జీవితాన్ని తరచిచూస్తే.
“నాహం కర్తా హరి:కర్తా”
(నేను కాదు కర్తని. చేసేది చేయించేది అంతా శ్రీహరే!)
ఇదీ శ్రీ ప్రసాద్ గారి నమ్మకం. అందుకే కాబోలు తన తిరుపతి అనుభవాల గ్రంధానికి దీన్నే మకుటంగా పెట్టుకున్నారు.


5 కామెంట్‌లు:

అన్యగామి చెప్పారు...

ప్రజలు ఈ రోజున్నట్టు రేపుండరు. కానీ ఒక వ్యక్తి "ఆత్మ గౌరవం కలిగిన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటే దుర్భరమైనది" అనే సూత్రం వంటబట్టించుకొని బ్రతకటం మామూలు విషయం కాదు. ఆయన హయాంలో టీటీడీ వారి అభివృద్ధి ఒక్కటి చాలు ఆయన సామర్థ్యానికి మచ్చుతునక. వారికి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ...

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@anyagaami - ధన్యవాదాలు

శ్యామలీయం చెప్పారు...

నాకు ప్రసాద్ గారి గురించి తెలిసింది తక్కువే. మా తోడల్లుడొకాయన వద్ద నాహంకర్తా హరిఃకర్తా పుస్తకం ఉంటే తీసుకొని చదివాను. గొప్పపుస్తకం. ఒకప్పుడు చిన్నతనంలో తిరుపతిలో ఏవో కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ప్రసాద్ గారి చేతులమీదుగా ఒకటి రెండు పుస్తకాలు అందుకొన్నట్లు గుర్తు.

ఈరోజున ఈనాడులో వారి గురించిన వార్త వచ్చింది. వారి ఇతరపుస్తకాలను గురించి ప్రస్తావించారు కాని ఆయన అఖండఖ్యాతి తెచ్చిన నాహంకర్తా హరిఃకర్తా పుస్తకం గురించిన ప్రస్తావన లేనేలేదు. ఈరోజుల్లో వార్తాకథనాలను ఎంతనిరాసక్తంగా మ్రొక్కుబడిగా తయారుచేస్తున్నారో‌ కదా అనిపించింది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం - నిజమే!

ఇంద్రధనస్సు చెప్పారు...

నూటికొ కోటికో ఒక్కరు. జన్మదినం రోజే మహాభినిష్క్రమణం.