9, ఆగస్టు 2017, బుధవారం

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (7)


మరో ప్రారంభానికి ఇంకో ఆరంభం
బాల్యం.
ప్రతి మనిషి జీవితంలో ఓ అద్భుత భాగం. కష్టాలున్నా బాధ్యతలు వుండవు. సుఖాలు అనుభవించి ఆనందించడమే కాని కాని వాటిని ఎలా సంపాదించుకోవాలి అనే అవసరం వుండదు. ప్రేమను పొందడమే కాని దాన్ని  తిరిగి ఇతరులకు  పంచే పూచీ వుండదు.
బాధ్యతలు, బరువులు లేని దిలాసా జీవితం, కులాసా జీవనం. అదే బాల్యం. అందుకే ప్రతి మనిషికి అది అపురూపం.
అంతగా గుర్తుండకపోయినా, బాల్యంలో పడ్డ ముద్రలు పెద్దయిన తరువాత కూడా ప్రభావాన్ని చూపిస్తాయి.
నాకు కూడా చిన్ననాటి విషయాలు గురించి పెద్దవాళ్ళు చెప్పగా వినడమే కాని గుర్తున్నవి తక్కువ. గుర్తుంచుకోవాల్సినవి కూడా తక్కువేనేమో!
ఏడుగురు ఆడపిల్లలు, ముగ్గురు మొగపిల్లల తరువాత పదకొండోవాడిని నేను. అందరిలోకి చిన్నవాడినని గారాబం చేయడంతో, కర్ణుడికి  కవచకుండలాల మాదిరిగా నాకు మంకుతనం, ముట్టె పొగరు సహజసిద్దంగా అలవడ్డాయి. పెద్దలను ఎగర్తించి మాట్లాడ్డం, అనుకున్నది దొరికే దాకా గుక్క పట్టి ఏడ్వడం నా చిన్నతనం గురించి మా పెద్దలకు మిగిలిన  జ్ఞాపకాలు. ముఖ్యంగా అన్నం తినేటప్పుడు నెయ్యి కోసం చేసిన యాగీ అంతాఇంతా కాదు. కుడిచేతిలో నెయ్యి పోస్తుంటే అది వేళ్ళ సందుల్లోనుంచి కారిపోయేది. గుప్పెడు నిండేదాకా నెయ్యి వేయలేదని గుక్క తిప్పకుండా ఏడుపు.  గుక్కపట్టడం అనేది ఈనాటి తల్లులకు, పిల్లలకు బహుశా తెలియకపోవచ్చు. ఊపిరి కూడా పీల్చుకోకుండా అదేపనిగా ఆపకుండా ఏడ్వడం వల్ల ఒక్కోసారి పిల్లలు కళ్ళు తేలవేసేవాళ్ళు. అందుకే గుక్క పట్టే పిల్లలంటే తలితండ్రులు భయపడేవాళ్ళు. ఏడుపు మాన్పించడానికి  వాళ్ళు ఏది అడిగితె అది ఆలోచించుకోకుండా చేతిలో పెట్టేవాళ్ళు. నా గుక్క సంగతి అందరికీ తెలుసు కనుక ఇంట్లో నేను ఆడింది ఆటా, పాడింది పాటా.
అన్నాలుతినే సమయంలో నెయ్యి కోసం నేను పెట్టే పోరు తట్టుకోలేక పోయిన మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు ఒక సులువు కనిపెట్టారు. ‘ఇక వీడితో వేగడం ఇలా కాదనుకుని  ఒక చిన్న వెండి గిన్నెలో నెయ్యి నింపి ప్రత్యేకంగా నా కంచం పక్కన పెట్టడం అలవాటు చేశారట. వయసు పెరిగిన కొద్దీ ఆ నెయ్యి అలవాటు కొంతవరకు పోయింది కానీ మొండితనం మాత్రం, తనకు నేనెందుకు నచ్చానో తెలియదు కాని, శాస్వితంగా నాతోనే ఉండిపోయింది. పైగా తనకు తోడుగా ‘మాట తూలడం’ అనే తోబుట్టువును  కూడా తోడు  తెచ్చుకుంది. నిజానికి ఈ రెండూ లేకపోతే నేనూ ఒక ఆదర్శ పురుషుడిని అయ్యేవాడినేమో!  కాని కొందరికి కొన్ని ఇలాటి ‘రోల్డ్ గోల్డ్ ఆభరణాలు’ ఆ దేవుడే కావాలని తగిలిస్తాడు. లేకపోతే ఈ రకం  మనుషుల్ని పట్టుకోవడం కష్టం అన్న సంగతి ఆ దేవుడికి కూడా తెలుసు. ఈ చిన్నప్పటి లక్షణాలే చాలామందికి చివరి వరకు అంటుకుపోతాయి. ‘పుటక- పుడకలు’ సామెత అందుకే పుట్టిందేమో!
సరే! ఈ స్వగతం ఎందుకంటే నాలోని ఆ మొండితనమే మా ఊరు గురించి, చిన్ననాటి కబుర్లు గురించి నాచేత ఇంతగా రాయించేలా చేసింది. ‘బాగున్నాయి, బాగా రాస్తున్నారు’ అని ఎవరయినా కితాబులు  ఇచ్చినప్పుడు, ‘పోనీలే! మొండితనం కూడా ఒక రకంగా మంచితనమే’ అనుకుంటున్నాను.
“వేళ్ళు కొంకర్లు పోయేలా ఏమిటలా కంప్యూటర్ దగ్గర కూర్చుని టిక్కూ టిక్కూ అంటూ కొట్టడం’ అంటూ విసుక్కునే మా ఆవిడ నిర్మల కూడా నా చిన్నతనం కబుర్లు చదువుతూ ఇప్పుడు నస పెట్టడం మానేసింది. రాయడం నాకు కొత్తేమీ కాదు, బ్లాగుకూ, పత్రికలకీ వందల కొద్దీ వ్యాసాలు, వేల పుటల్లో రాసాను. కానీ అవన్నీ రాజకీయ అంశాలు. ఇంటికి వచ్చే పత్రికలలో  పడిన నా వ్యాసాలు, కంటి ఎదురుగా కనిపిస్తున్నా కూడా మా ఆవిడ చదివేది కాదు. అలాంటిది  ఈ మధ్య నేను రాస్తున్న ఈ  ‘బాల్యం’ ముచ్చట్లు చదవడమే కాదు, వాటిని గురించి మాట్లాడుతోంది కూడా.
ఈ విషయంలో నా కెందరో సహకరించారు. ఎందరో ఎన్నో విషయాలు చెప్పారు. నేను రాసిన వాటిల్లో ఎన్నో సంఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని కాను. నిజానికి చాలా సందర్భాల్లో నేను అనేవాడినే నేను. పుట్టక ముందు జరిగిన అనేక సంగతులు చాలామందిని అడిగి తెలుసుకున్నాను. నాకే డెబ్బయి నిండాయి. చాలామంది రాలిపోయారు. కంభంపాడు స్కూల్లో నాతో కలిసి చదువుకున్న మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు, చిన్నప్పటి స్నేహితులు వేమిరెడ్డి ఓబుల రెడ్డి (కోటిరెడ్డి,కోటయ్యఅని పిలిచేవాళ్ళం), పమ్మి సత్యమూర్తి, పర్సా రామ్మూర్తి చనిపోయారు. విషయాలు వివరించడానికి పెద్దలు మిగల్లేదు. మా అక్కయ్యలు తుర్లపాటి సరస్వతి, కొమరగిరి అన్నపూర్ణ రాసిపెట్టుకున్న సంగతులు నాకు అక్కరకు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. కాని వారి జ్ఞాపకాలు ఇలా నా రాతల్లో మిగిలిపోయాయి. వారికి వేనవేల కృతజ్ఞతలు. ఇలాఎందరి నుంచో ఇంకా ఎంతో సమాచారం నా మెదడులో నిక్షిప్తం అయి వుంది. నెమ్మదిగా బయటకు తీసి అక్షర రూపం ఇవ్వాలి. ఈలోగా మా అన్నయ్య రాసిన భండారు వంశం వివరాలు లభించాయి.   
మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు బహు గ్రంధ కర్త. ఆధ్యాత్మిక అంశాలతో పాటు ఎంతో శ్రమించి మా భండారు వంశానికి సంబంధించిన అనేక అంశాలను క్రోడీకరించారు. పుట్టపర్తిలో ఒక చిన్న గదిలో ఆయన పోతూ పోతూ మిగిల్చి వెళ్ళిన రాత ప్రతులను మా వదిన గారు సరోజినీ దేవి భద్రంగా హైదరాబాదు చేర్చి మా అన్నయ్య రామచంద్ర రావు గారి ఇంట్లో భద్రపరిచింది. ఆ భాండాగారంలో దొరికిందే మా అన్నయ్య రాసిపెట్టిన ‘భండారు వంశం’. ఈ విషయంలోనేను కష్టపడింది ఏమీ లేదు, ఆయన రాసి ఉంచిన దాన్ని కంప్యూటర్ కు ఎక్కించడం తప్ప.
ఇది చదివిన తరువాత నేను ఎంతటి అంగుష్ఠమాత్రుడినో నాకు బోధపడింది. నిజంగా నా రచనలు నలుగురికీ నచ్చుతున్నాయి అంటే దానికి కారణం మా అన్నయ్య నుంచి నేను ఏకలవ్యుడిగా పొందిన విద్య. ఆయన రచనలు చదవడం వల్లనే నేనిలా రాయగులుతున్నాను. ఇది సత్యం.
వచ్చే భాగం నుంచే మా అన్నయ్య రాసిన ఆయన చిన్ననాటి విషయాలు, మా ఊరు ముచ్చట్లు కొన్ని పోస్ట్ చేస్తాను. నిజానికి బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ......” అనే  ఈ వ్యాస పరంపరలో ఆయన రాసిందే ప్రధాన భాగం. 
నమస్కారం! 
           



2 కామెంట్‌లు:

హై హై నాయకా చెప్పారు...

వత్సవాయి, ఫస్ట్ బస్, పెనుగంచిప్రోలు, ప్రభ బండ్లు, ఎద్దుల బండి, అబ్బబ్బా ఎన్ని జ్ఞాపకాలు తట్టిలేపారో మీరు. కంభంపాడుకి విజయవాడ నుంచే కాదండి, మా మధిర నుంచి కూడా ఒక బస్ ఉండేది, మధిర పక్కనే ఇంకొక కంభంపాడు ఉండడంతో మేము కాకరాయి (కాకరవాయి) కంభంపాడు అనెవాళ్ళం మీ (మా అమ్మమ్మ వాళ్ళ) వూరిని

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@హై హై నాయకా: అవును మాది కాకరవాయి కంభంపాడు. గమ్మత్తేమిటంటే మా ఊరికి కూడా ఒక ఇంటి పేరు వుంది.