14, జులై 2017, శుక్రవారం

బదరీ కేదార్ యాత్ర – ఏడో భాగం (1996) – కొమరగిరి అన్నపూర్ణ


ఇంకా నాలుగు కిలోమీటర్లు వెళ్లాలన్నారు. వర్షం ఆగడం లేదు. చలి దుర్భరంగా వుంది. మేమంతా దుప్పట్లు కప్పుకుని కూర్చున్నాం. భారతి బాధ చూడలేకపోయాం. ఒక  కిలోమీటరు ఉందనగా మళ్ళీ ఆపారు. అక్కడ కొండ నిటారుగా వుంది. డోలీవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడం కష్టంగా వుంది. తొందరగా గదికి చేర్చమని భాష రాకున్నా సైగలతో చెప్పాం. వాళ్లకు అర్ధం అయినట్టు వుంది. పైగా ఇలాంటి ప్రయాణాల్లో అనుభవం కూడా వుంది. మా కష్టం చూసి వాళ్ళు, తమ కష్టాన్ని లెక్కచేయకుండా త్వరత్వరగా కేదార్  లో ఒక గూటికి చేర్చారు. ఐతే ఈ హడావిడిలో గైడు చెప్పిన గదికి కాకుండా మరో దాంట్లో దింపాడు. అందులో మూడు మంచాలు వున్నాయి. భారతిని ఒక మంచంపై పడుకోబెట్టి పరుపు కప్పారు. మేం దారిలో బాగానే వున్నాం కానీ డోలీ దిగేసరికి చలి వెన్నులోనుంచి పుట్టుకొచ్చింది. మా సామాను ఏమైందో తెలియదు. మా వాళ్ళు ఏమైనారో తెలియదు.  పరుపు పైన కప్పుకుని పడుకున్నాము. భారతిని ఏడవకే అని చెబుదామంటే మాట పెగలడం లేదు. నోట్లో మాట బయటకి రావడం లేదు. భగవంతుడా నీదే భారం అనుకున్నాము. గజేంద్ర మోక్షంలో పద్యం జ్ఞాపకం వచ్చింది.
‘లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావులు తప్పెను  మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నించదగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా”
ఇప్పుడు మాదీ అదే పరిస్తితి. ఆయన తప్ప వేరే దిక్కులేదు. మాయదారి మల్లిగాడు సినిమాలో చెప్పినట్టు ‘ఆయన మీదే భారం వేసి వచ్చాం. కాబట్టి చచ్చినట్టు వస్తాడురా దేవుడు’ అనే మొండి ధైర్యం వచ్చి అలాగే కూర్చున్నాము. నిజంగా తలచుకున్నట్టే వచ్చాడు భగవంతుడు స్వర్ణ, సురేష్ ల రూపంలో. మిగిలినవాళ్ళు కూడా వర్షంలో తడిసి గుర్రాల మీద మేమున్న చోటికి చేరుకున్నారు. వాళ్ళను చూడగానే ప్రాణాలు లేచివచ్చాయి. డోలీ వాళ్ళు మమ్మల్ని దింపాల్సిన చోట కాక వేరే చోట దింపారు. మేం ఏమయ్యామో అని వాళ్ళు ఓపక్క చలికి ఒణికిపోతూనే తెగ కంగారు పడుతున్నారు. మమ్మల్ని చూసి వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ఈ లోగా పొద్దుగుంకింది. చలి తీవ్రత మరింత పెరిగింది. చేతులు ఎలా కొంకర్లు పోయాయంటే పొయ్యిలో చేయి పెట్టినా స్పర్స తెలిసేట్టు లేదు. పరుపులు కప్పుకుని పడుకున్నాం కానీ పాడు చలి వాటిల్లోకి కూడా దూరి ఒణికిస్తోంది.

మా పరిస్తితి చూసి వాళ్ళు కంగారు పడ్డారు. వాళ్ళేమో పిల్లవాళ్ళు. పెద్దవాళ్ళ పరిస్తితి చూస్తే ఇలావుంది. అలాగే పడుకున్నాం. ఆశ్చర్యం అలాగే నిద్రపోయాం. శారీరక, భౌతిక ఇబ్బందులను మత్తులా మరిపించే శక్తి ఒక్క నిద్రాదేవతకు మాత్రమే ఉందేమో! (ఇంకా వుంది)         

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఈ యాత్రావిశేషాలు మరీ నెయ్యిగరిటెడంతే విదిలిస్తున్నారు మీరు, శ్రీనివాసరావు గారు 🙁. కాస్త ధారాళంగా వడ్డించండి సర్.