30, డిసెంబర్ 2016, శుక్రవారం

2017 లో ప్రతిపక్షాలను కాదు ప్రజలను చూడండి ప్రభువులూ!


(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 01-01-16,SUNDAY)

అనాదిగా అలుపులేకుండా తిరుగుతున్న కాలచక్రం, తిరిగి తిరిగి, తిరిగొచ్చిన చోటికే తిరిగిరావడం  మామూలే.
అనేక అనుభవాలను, అనుభూతులను మన మదిలో, ఒడిలో  ఒదిలిపెట్టి  గత  ఏడాది సెలవు తీసుకుంది. సరికొత్త ఆశలతో కొత్త ఏడాది గడప దాటి అడుగు పెట్టింది.
చివరాఖర్లో కొంత హడావిడి చేసి 2016  తప్పుకుంటోంది. ఆ ప్రకంపనలను వారసత్వంగా అందిపుచ్చుకుని  2017 ప్రవేశిస్తోంది.

కొంచెం అటూ ఇటూగా కేంద్రంలోను, రెండు కొత్త తెలుగు రాష్ట్రాలలో నూతన ప్రభుత్వాలు కొలువుతీరి  రెండున్నర సంవత్సరాలు దాటుతోంది. ‘ఎన్నికలకు ముందు చెప్పినవేవీ చేయకుండా చేతులు ముడుచుకు కూర్చున్నారని’ ప్రతిపక్షాల వాదన. ‘కాదు, ఈ కొద్ది కాలంలో మేము చేసినన్ని మంచి పనులు గతంలో చాలాకాలం పాలించిన పార్టీలు ఏవీ చేయలేదని’ ఈ కొత్త పాలకుల సమర్ధన.  2016 లోనే కాదు, గత రెండున్నరేళ్లలో ఏం జరిగిందో సింహావలోకనం చేసుకుందాం.
ముందు ఢిల్లీ నుంచి మొదలుపెడదాం. చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయాన్ని సాధించి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యారు. మొదటి రెండేళ్లలో రాజకీయంగా కొన్ని ఆటుపోట్లు ఎదురయినా వ్యక్తిగతమైన ప్రజాదరణ ఇసుమంత కూడా కోల్పోలేదు. అన్నింటికీ మించి అధికారంలోకి రాగానే సహజంగా అంటుకునే అవినీతి మరకలు ఆయన్ని అంటుకోలేదు. బ్రహ్మాండమయిన పనులేవీ చేసి చూపించిన దాఖాలాలు పెద్దగా లేకపోయినా ప్రజలకు ఆయన పట్ల నమ్మకం తగ్గిపోలేదు.  పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోకుండా తీసుకున్నప్పటికీ, అందువల్ల ముందుగా  చీకాకులు పడుతున్నది తామే అయినప్పటికీ సామాన్య ప్రజలు పంటి బిగువన ఆ కష్టాన్ని భరిస్తూ వచ్చిన విషయం అంత చిన్నవిషయమేమీ  కాదు. కారణం ఏదైనా, కారకులు ఎవరయినా, పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి  మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గత ఏడాది చివరి రెండు మాసాల్లో యావత్ జాతిని ప్రభావితం చేసింది. దేశానికి పట్టిన నల్ల ధనం రోగాన్ని మటుమాయం చేయడానికి మోడీ తలపెట్టిన కాయకల్ప చికిత్స తొలి ప్రభావం సామాన్య జనజీవనంపైనే పడింది. ఈ ఆకస్మిక నిర్ణయం తమ జీవితాల్లో తీసుకొచ్చిన అనూహ్య పరిణామాలను వారు అతి సహజంగా తీసుకుంటున్నారనే చెప్పాలి. వెనిజులా దేశంలో ఇటువంటి నిర్ణయం పట్ల అక్కడి ప్రజలు ఎంత కోపోద్రిక్తులయింది గమనిస్తే, భారతీయులు ప్రదర్శిస్తున్న సహనం మోడీ అదృష్టమనే అనుకోవాలి.  అయితే దాన్ని ప్రజలు తమకిస్తున్న సహకారంగా ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. అందులో కొంత నిజం లేక పోలేదు,  కానీ అది పూర్తిగా నిజం కాదన్న ఎరుక సర్కారు వారికి వున్నట్టు అనిపించడం లేదు.        
 ఈ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న యాగీ పట్ల పాలక పక్షానికి కొంత అసహనం వుండవచ్చు. అలాగని వస్తున్న ప్రతి విమర్శను రాజకీయ కోణం నుంచి చూస్తూ తప్పుపట్టే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రతిపక్షాలు సరే! ప్రజలు ఏమనుకుంటున్నారో చారుల ద్వారా సమాచారం తెప్పించుకుని వారి ఇబ్బందులను కొంతవరకయినా తగ్గించి  ఒకింత ఉపశమనం కలిగించండం మోడీ ప్రభుత్వ ప్రధమ కర్తవ్యం. నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని మోడీ చెప్పుకోవాల్సిన సంకల్పం ఇదే!
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.
దాదాపు పదేళ్ళ విరామం తరువాత చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. చేజారిన అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఏ రాజకీయ నాయకుడికి అయినా ఇంతకుమించిన సంతోషం మరోటి వుండదు. అయితే ఈ ఆనందం ఈ సంతోషం   తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనుభవిస్తున్నారా అంటే ఆ దాఖలా కానరావడం  లేదు. ఎందుకంటే ఈసారి అధికారం లభించింది కానీ దానితోపాటే అనేకానేక సమస్యలు కూడా వెన్నంటి వచ్చాయి.  ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఆయన్ని  చుట్టుముడుతూనే వస్తోంది. ఒకదాని చిక్కుముడి విప్పేలోగా మరోటి సిద్ధం. కొన్ని వచ్చి పడ్డవి అయితే మరి కొన్ని తెచ్చి పెట్టుకున్నవి.
సమస్యను అవకాశంగా మలచుకోవడం తనకలవాటని చెప్పుకునే చంద్రబాబు, ఎదురయిన ప్రతి సమస్యను పార్టీకి, రాష్ట్రానికి పనికి వచ్చే అవకాశంగా మార్చుకునే పనిలో అహరహం కష్టపడుతుంటారు. కనీసం కష్టపడుతున్నట్టు కానవస్తారు. 'పని చేయడంతో సరిపోదు పనిచేసినట్టు కనబడాలి కూడా' అనే ఈ కాలపు రాజకీయానికి నిజానికి ఆయనే ఆద్యులు.
ఎన్ని చేస్తున్నా, ఎన్నో చేస్తున్నామని చెప్పుకుంటున్నా ఇంకా కొన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే వున్నాయి. రాజ్యం వుంది రాజధాని లేదు. ఖజానా వుంది. నిధులు లేవు. కేంద్రంలో మిత్ర ప్రభుత్వం వుంది. అయినా ఆశించిన విధంగా అక్కరకు రావడం లేదు. ఇటువంటి వ్యతిరేక పరిస్తితులను కూడా ఆయన అనుకూలంగా మార్చుకునే పనికే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అందులో కూడా రాజకీయంగా బలపడే ప్రయత్నం స్పష్టంగా కానవస్తుంది. ప్రతిపక్షాన్ని బలహీన పరిచే వ్యూహం దాగుంటుంది.
చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికీ రాని అపూర్వ అవకాశం చంద్రబాబు నాయుడుకి కొత్త రాజధాని నిర్మాణం  విషయంలో లభించింది. కొంత వివాదాస్పదం అవుతున్నప్పటికీ ఈ విషయంలో కూడా చంద్రబాబు తన పంధాను ఏమాత్రం మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని అవసరం కనుక ఆయన ప్రయత్నాలకు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కానరాని మాట నిజమే. కాకపోతే కొత్త రాష్ట్రానికి వుండే ఇబ్బందులను ప్రజలు అర్ధం చేసుకుని సహకరిస్తున్నారు కానీ  ఇష్టపూర్తిగా కాదన్న వాస్తవాన్ని తెలుగు దేశం అధినేత గుర్తుపెట్టుకోవాలి.
ఇక చంద్రబాబుకు మరో సువర్ణావకాశం పోలవరం రూపంలో వచ్చింది.  
దేశంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయాలన్న ఆలోచనలోనుంచే ఈ ప్రాజెక్ట్ పురుడు పోసుకుంది. 1941 జులైలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది.  ప్రెసిడెన్సీ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ ఎల్. వెంకట కృష్ణ అయ్యర్ మొదటి ప్రాజెక్ట్ నివేదిక తయారుచేసారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మూడు లక్షల యాభై వేల ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యంతో పాటు నలభయ్ మెగావాట్ల విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయవచ్చని ఆయన ఆ రోజుల్లోనే తలపోశారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని ఆరున్నర కోట్ల రూపాయలుగా అంచనా వేసారు. ప్రాజెక్ట్ అతీగతీ లేదు కాని అంచనావ్యయం మాత్రం స్వతంత్రం వచ్చేనాటికి ఆరున్నర కోట్ల నుంచి రెండువందల కోట్లు దాటిపోయింది.  ప్రాజెక్ట్ రిజర్వాయర్ జలాలు వెనుకవున్న భద్రాచలం సీతారామస్వామి గుడిని తాకే అవకాశం వున్నందువల్ల 'రామపాద సాగర్' అని పేరు పెట్టారు. తదనంతరం కె.ఎల్.రావు గారు, పోలవరం కుడి గట్టు కాల్వని, కృష్ణానదిపై ఆక్విడక్ట్ నిర్మించి గుంటూరు జిల్లావరకు పొడిగించేట్టు ప్రతిపాదించారు. ఇలా ప్రతిపాదనలన్నీ కాగితాలపై వుండగానే, ప్రాజెక్ట్ అంచనా వ్యయం వేల కోట్లకు పెరిగిపోయింది. 1980 లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు మొదటి పునాది రాయి వేసారు. శంఖుస్థాపన పలకం బీటలు వారిపోయింది కాని ప్రాజెక్టు పనులు ఒక అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఇలా పురోగతి లేకుండా దస్త్రాలలోనే పడివున్న పోలవరం ప్రాజక్టుకు,  వై. ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే తీసుకున్న చొరవతో కదలిక మొదలయింది. ఆయన ఈ ప్రాజెక్టుకు పదమూడువందల కోట్లు మంజూరు చేసి మూలపడ్డ ప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించారు. కుడిగట్టు కాల్వ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అలాగే ఎడమగట్టు కాల్వకోసం మరో పదమూడువందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ కూడా  చంద్రబాబుకు రాజకీయంగా చాలా కీలకం. విభజన తరువాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ తలకు మించిన భారమే.  అయినా ప్రతి సోమవారం ఆ ప్రాజెక్టు పురోగతి గురించిన సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. సమీక్షలతో ప్రాజెక్టు పూర్తి కాదు కదా! అది ఆయనకు బాగా తెలుసు. అందుకే ఢిల్లీ మీద ఒత్తిడి పెంచారు.
ఏడాది చివర్లో చంద్రబాబు ప్రభుత్వానికి చిన్న తీపి కబురు అందింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్ర నిధుల్లో కొంత భాగం చెక్కు రూపంలో చేతికి వచ్చింది. అంతే! క్షణం ఆలస్యం చేయకుండా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే కాంక్రీటు పనులకు స్వయంగా ఆయనే శంకుస్థాపన చేశారు. చెక్కు చేతికి అందిన నాలుగు రోజుల్లోనే మెరుపు వేగంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన  తీరు గమనించిన వారికి సకాలంలోనే దాన్ని పూర్తి చేయగలరన్న నమ్మకం కలిగి వుంటుంది. అయితే కేంద్రం ఎంతో అబ్బురంగా అందించిన డబ్బు, ప్రాజెక్టు అంచనా వ్యయం  ఈ రెంటినీ పోల్చి చూసుకుంటే రెండేళ్లలో పని పూర్తి కావడం సాధ్యమా అనే సందేహం కలుగుతుంది.              
ఈ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు వరంగా మారుతుంది. పూర్తి చేయకుండా ఒదిలేస్తే రాజకీయంగా తెలుగు దేశం పార్టీకి శాపంగా మారుతుంది. అంచేతనే 2018 కల్లా పోలవరం పూర్తి చేసితీరుతామనే ప్రకటనలు ఆ పార్టీ  నాయకులు తరచూ చేస్తూ వస్తున్నారు. ప్రాజెక్ట్ అనుకున్న విధంగా, అనుకున్న వ్యవధిలో పూర్తి అవుతుందా అంటే జవాబులేని ప్రశ్నే.  ఒక సమాధానం మాత్రం ఇబ్బంది లేకుండా చెప్పవచ్చు. ప్రాజక్ట్ అంచనా వ్యయం మాత్రం అంచనాలకు మించి పెరిగిపోవడం ఖాయం.
ఎన్ని సంక్షేమ పధకాలు మొదలు పెట్టినా చంద్ర బాబు ఎన్నికల వైతరణి దాటాలంటే అటు రాజధాని నిర్మాణం కొంతయినా చేసి చూపించాలి. ఇటు పోలవరం ప్రాజక్టును కొంతయినా కట్టి చూపించాలి. ఇది ఎరిగిన రాజకీయ నాయకుడు కావడం వల్లనే ఈ రెండిటి పట్లా ఆయన చాలా శ్రద్ధ చూపిస్తున్నారు.
ఇక చంద్రబాబు నాయుడు చెప్పుకోవాల్సిన నూతన సంవత్సర సంకల్పం.
ప్రతి విషయానికీ ప్రతిపక్షాన్ని ఆడిపోసుకోకుండా, అభివృద్ధికి అడ్డుపడుతున్నారని నెపం మోపకుండా  తన దీక్షాదక్షతలపై  ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా చూసుకోవాలి.
పొతే తెలంగాణా.   
తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం నల్లేరు మీది బండి నడకలా సాగిపోతోంది. కేసీఆర్ మాట అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో సుగ్రీవాజ్ఞగా చెల్లుబడి అవుతోంది. ఎదురులేదన్న నమ్మకంతో వేస్తున్న కొన్ని అడుగులు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయన్న సంగతిని ఆ పార్టీ అధినేత గమనించడం లేదేమో అనిపిస్తోంది. అనేక మంచి పనులు చేస్తున్నప్పుడు అనవసరమైన విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారేమో తెలియదు.
సమస్యలు అన్నింటికీ తెలంగాణా ఏర్పాటు ఒక్కటే సర్వరోగనివారిణి అనీతెలంగాణా రాగానే ఏళ్ళతరబడి పేరుకునివున్ననీళ్ళూ, నిధులూ, నియామకాల వంటి ఈ ప్రాంతపు  సమస్యలన్నీ  మంత్రం వేసినట్టు  మాయం అయిపోతాయని ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నవారు అనుకున్నారు. అయితేవారనుకున్నట్టూ ఏమీ జరగలేదు. రాత్రికి రాత్రే  సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోలేదు.
అయినా కేసీఆర్ పైన ప్రజల అభిమానం చెక్కు చెదరలేదు. రాష్ట్రం ఏర్పాటయిన తరువాత జరిగిన అన్ని ప్రధాన ఎన్నికల్లో టీఆర్ఎస్  నే గెలిపిస్తూ వచ్చారు. కేసీఆర్ తమ కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్న బంగారు తెలంగాణా స్వప్నం పట్ల వాళ్ళ నమ్మకం చెక్కుచెదరలేదు. మొన్నీ మధ్య ఆయన ప్రారంభించిన రెండు పడక గదుల ఇల్లు అనే పధకంతో ఆయన పట్ల నమ్మకం మరింత పెరిగి వుంటుంది కూడా.    
అయితే తెలంగాణాపై తెలంగాణా  ప్రజలు  పెంచుకున్న కోటి ఆశల మాటేమిటి? అవన్నీ నీటిమూటలేనా? నెరవేరే మాటలేనా? తెలంగాణా రాకముందు, వచ్చిన తరువాత తెలంగాణా సాధకుడిగా పేరు మూటగట్టుకున్న కేసీఆర్ చెప్పిన మాటలు ఏమిటి? చేస్తున్న ఆలోచనలు ఏమిటి? అసలు ఇంతకాలంగా చేసింది ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసేఆర్ నేతృత్వం వహిస్తున్న పార్టీలోను, ప్రభుత్వంలోను ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ ప్రచార కోశంలో వీటన్నిటికీ జవాబులు సిద్ధంగా వుండొచ్చు. ప్రచారమే ప్రధానం అనుకుంటే, వాస్తవానికి చరిత్రలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికీ దొరకనంతగా విస్తృత, సానుకూల  ప్రచారం కేసీఆర్ కు లభిస్తోంది. పత్రికలవారితో పన్నెత్తి మాట్లాడడమే అపురూపం. అయినా మీడియాలో ఆయనకు వస్తున్న ప్రచారం అపూర్వం.   
అయితే ఇంతటితో సరా! సరే అని  ఇవ్వాళ ప్రజలు సరిపుచ్చుకోవచ్చు.  రేపూ ఇలాగే వుంటుందనే గ్యారంటీ వుందా?
ఈ కొత్త సంవత్సరం శుభ సందర్భంలో కేసీఆర్ ఒక సంకల్పం చెప్పుకోవాలి. ప్రజలు అప్పగించిన పుణ్య కాలంలో మిగిలిన రెండేళ్ళు, ( చివరి ఆరునెలలు ఎన్నికల హడావిడే సరిపోతుంది) రాజకీయ భేషజాలకు స్వస్తి చెప్పి తనను నమ్ముకున్న ప్రజలను ఓ కంట కనిపెట్టి చూడాలి. ఏ విషయంలో ఎవరయినా ఏదైనా   ప్రశ్నిస్తే అందులోని నిజాయితీని కనిపెట్టగలగాలి. రాజహంస పాలనూ, నీళ్ళనూ వేరు చేసినట్టు, రాజకీయ ఆరోపణలను, నిజాయితీగా చేసే విమర్శలను వేర్వేరుగా చూడగలగాలి.
ఇది కేసీఆర్ చెప్పుకోవాల్సిన సంకల్పం.
ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ముగ్గురినీ కేవలం అనుభవం, సమర్ధత  కారణంగానే ప్రజలు వారు కోరుకున్న గద్దెలు ఎక్కించారు. అనుభవంలో కాని, రాజకీయ చాణక్యంలో కాని ఈ మువ్వురు  ఒకరికొకరు ఏమాత్రం  తీసిపోరు. వీరికి వున్న ఈ సానుకూల లక్షణాలన్నీ జనరంజకమైన పాలనకు దోహదం చేసి తీరాలి. మరి అయిదేళ్ళ విలువైన కాలంలో ఇంత కాలం గడచిపోయింది కానీ జనాలు కోరుకున్నది ఏమన్నా జరిగిందా?
వీరిలో పోలిక కలిగిన లక్షణం కూడా  ఒకటుంది.
ఏదైనా  మంచిపని  చేసినప్పుడు ఆ విషయాన్ని వారంతట వారే బయటకు చెప్పుకుంటున్నట్టే, చేయలేని విషయాన్ని ఎవరయినా ప్రస్తావిస్తే చాలు అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు. ‘అభివృద్ధికి అడ్డు తగులుతున్నారనే’ అభాండం వేస్తున్నారు. లేదా తమ వైఫల్యాలకు మునుపటి  పరిపాలకుల నిర్వాకం కారణం అని  కొట్టి పారేస్తున్నారు. గతంలో  జరిగిన పొరబాట్లను లేదా తప్పులను  చక్కదిద్దే దక్షత వుందన్న కారణంతోనే ప్రజలుతమకు  పట్టం కట్టారన్న సంగతి మరిచి పోతున్నారు.
“మీ సమర్ధతకు మెచ్చి ప్రజలు  ఇచ్చిన నజరానా మీ పదవులు. అందుకు బదులుగా వారికి ఏదైనా చేయండి. సమయం తగ్గిపోతోంది. ప్రతిపక్షాలను పక్కన పెట్టి ప్రజలను అక్కున చేర్చుకోండి.”
నూతన సంవత్సరం సందర్భంగా జనశ్రేయోభిలాషులు వారిని కోరుకునేది ఇదొక్కటే.
ఇలాటి వారందర్నీ రాజకీయ ప్రతికక్షులుల గాటన కట్టి తేలిగ్గా  కొట్టిపారేయడం తగదు. ఎన్నికలకు  ముందు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ, చేసిన పనులను మననం చేసుకుంటూ, అడగాలని అనుకుని అడగలేని బడుగులు కూడా తమను ఎన్నుకున్న జనాల్లో  ఉంటారని ఏలికలు గుర్తు పెట్టుకోవాలి. వీరికి జవాబు చెప్పనక్కరలేదు. గుర్తుపెట్టుకుంటే చాలు. గుర్తుపెట్టుకున్నట్టు కనిపిస్తే మాత్రం  కుదరదు. ఎందుకంటే అయిదేళ్ళు కాగానే అన్నీ గుర్తు పెట్టుకునే గొప్ప ప్రజాస్వామిక లక్షణం ప్రజల్లో  నిండుగా  వుంది.
చరిత్ర రుజువు చేసిన సత్యం ఇది.
సర్వజన హితాన్ని గమనంలో వుంచుకుని రాస్తున్న ఆప్తవాక్యం ఇది.  
(31-12-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595 

6 కామెంట్‌లు:

mmd చెప్పారు...

perfect analysis sir

mmd చెప్పారు...

perfect analysis sir

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@mmd - THANKS

A.venkataramana చెప్పారు...

Fine sir. A very good analysis sir.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@A.venkataramana - THANKS

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీకు మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు భండారు వారూ 🌺🌺.