సమైక్య ఆంధ్ర ప్రదేశ్
రెండు రాష్ట్రాలుగా విడిపోయి
రెండేళ్ళు దాటిపోయింది. విభజనకు
పూర్వం చాలా కాలం, తరువాత కొన్నాళ్ళు
విభజానంతర పరిణామాల పట్ల చాలామందిలో, ప్రత్యేకించి హైదరాబాదులో స్థిరపడిన సీమాంధ్రుల మనస్సుల్లో
వున్న భయసందేహాలు చాలా వరకు సద్దుమణిగాయి. ఏవో రాజకీయ సంబంధమయిన
చిటపటలు మినహా మొత్తం మీద చూస్తే అటూ, ఇటూ జనాలు సర్దుకుపోయారనే చెప్పాలి. ఇలాంటి నేపధ్యంలో విభజన కధ పేరుతొ అలనాటి విషయాలను తవ్వి తీస్తూ ఏకంగా ఒక పుస్తకం రాయడం ఎందుకు? అంత అవసరమా ? అనే
ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి.
ఈ గ్రంధం రాసిన వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. పరిచయం అవసరం లేని వ్యక్తి. నేను
మొదటిసారి ఆయన్ని కలుసుకున్నది నడుస్తున్న రైల్లో. కడప జిల్లా, పులివెందులలో
వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్
రెడ్డి వివాహానికి హైదరాబాదు నుంచి కొందరు
పాత్రికేయులం వెడుతున్నాము. అదే రైల్లో ప్రయాణం చేస్తున్న ఉండవల్లి మాతో
చాలాసేపు గడిపారు. ఆయన మాటకారితనం మొదటిసారి తెలిసివచ్చింది అప్పుడే. ఏ విషయం మీద అయినా సాధికారంగా మాట్లాడగల
నేర్పును గమనించాను. తదనంతర కాలంలో అనేక సభల్లో ఉండవల్లి ప్రసంగాలు ఆయన్ని జనాలకు దగ్గర
చేశాయి. వేదిక ఎక్కి మైకు పట్టుకుంటే చాలు అనర్ఘల ప్రసంగాలు అలవోకగా ఆయన నోటివెంట
జాలువారేవి. వాగ్దాటితో జనాలను సమ్మోహితం చేసే ప్రసంగకారుడనే ట్యాగ్
లైన్ ఆయన సొంతం చేసుకున్నారు. రాజీవ్
గాంధీ, సోనియా గాంధి, రాహుల్ గాంధి వంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు బహిరంగ సభల్లో చేసే ఇంగ్లీష్, హిందీ ప్రసంగాలకు తెలుగు అనువాదం చేసే అవకాశాన్ని
వైఎస్ఆర్ కల్పించిన దాదిగా ఇక ఆయనకు
అడ్డులేకుండా పోయింది. ఈ విషయాన్ని ఆయనే
స్వయంగా ఎన్నోసార్లు వెల్లడించి వైఎస్
పట్ల తన కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసుకున్నారు కూడా. అయాచితంగా
లభించిన ఈ బంగారు అవకాశానికి తన
కుశాగ్రబుద్ధితో మరింత పదును పెట్టి
ఆ విషయంలో ఎంతో దిట్ట
అనిపించుకున్నారు.
ఈ దిట్టతనమే కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధినాయకుల కళ్ళల్లో పడేలా చేసింది. అంగబలం, అర్ధబలం, సామాజిక బలం ఇసుమంత
కూడాలేని ఉండవల్లిని రెండు పర్యాయాలు లోక్ సభకు కాంగ్రెస్
సభ్యుడిగా పంపింది. మొదటి గెలుపు గుడ్డేటు అని ఎద్దేవా చేసిన వాళ్లకు ఆయన రెండో గెలుపు కళ్ళు తెరిపిళ్ళు పడేలా చేసింది.
రాజకీయం అన్నాక ప్రత్యర్ధులు ఎట్లాగో
వుంటారు. కాంగ్రెస్ వాళ్లకు ఇంటి పోరు అదనం. వాళ్ళు కూడా ఉండవల్లి నీతి, నిజాయితీల
పట్ల నోరు మెదపరు. అటువంటి నేపధ్యం కలిగిన గళం వీరుడు ఉండవల్లి
అరుణ్ కుమార్ ఇప్పుడు ఈ పుస్తకంతో
కలం వీరుడిగా మారారు. అందుకే అయన రాసిన ఈ పుస్తకం పట్ల చాలామందికి అంత నమ్మకం.
రాజకీయం కోసం కూడా ఆయన అబద్ధాలు రాయడు అనే ఆ నమ్మకమే ఆయన రాసిన ‘విభజన కధ’ అనే పుస్తకం
గురించి ఆవిష్కరణకు ముందే అంచనాలను పెంచింది. ‘మాట మార్చను, మడమ తిప్పను’
అంటుండే వైఎస్ రాజశేఖరరెడ్డి ఆప్తవర్గంలోని మనిషి కావడం వల్లనేమో ఆయనకూ తాను
మాట మార్చను అనే ఓ నమ్మకం. పుస్తకం అట్ట వెనుక
అదే రాసుకున్నారు. 25-01-2013 రాజమండ్రి సభలో
‘విభజన బిల్లు పాసవ్వదు’ అని ఉండవల్లి చెప్పారు. అప్పటినుంచి ఎక్కడ మాట్లాడినా ఇదే
మాట. ఆఖరికి 18-02-2014 న బిల్లు సభ ఆమోదం పొందిన తరువాత కూడా ఆయన తీరులో మార్పు లేదు. కాకపొతే ‘బిల్లు
పాసవ్వదు’ అనే పదం కాస్తా కొద్దిగా మారి ‘బిల్లు
పాసవ్వలేదు’ అనే రూపం సంతరించుకుంది. బిల్లు పాసు
కాకుండానే తెలంగాణా ఏర్పడిందా!
అదెలా సాధ్యం? అది చెప్పడానికే ఈ పుస్తకం.
అందుకే విభజన ‘కధ’ అనే పేరు పెట్టారేమో.
వినే వాళ్లకి ఆయన వాదన విచిత్రంగా తోచవచ్చు. కానీ ఉండవల్లి
మాత్రం ఈ విషయంలో ఉడుంపట్టుతో
వున్నట్టు అనిపిస్తుంది, ఈ పుస్తకం చదివిన
తరువాత.
ఈ విషయంలో ఆయనకు ఎంతో స్పష్టత ఉన్నట్టే వుంది. అయితే అదే
సమయంలో ఆయన మరో విషయంలో కూడా స్పష్టత
ఇస్తున్నారు.
“బిల్లు పాసవలేదు అని చెప్పడం
అంటే ఇప్పుడు ఏర్పడ్డ తెలంగాణాను వ్యతిరేకించడం కాదు. ఆనాడు చట్ట
సభలో జరిగిన విషయాలను ప్రజల దృష్టికి
తీసుకువచ్చేందుకు, అప్పుడు చోటుచేసుకున్న పొరబాట్లను ఎత్తి చూపి మళ్ళీ భవిష్యత్తులో అటువంటివి పునరావృతం కాకుండా
వుండేందుకు మాత్రమే ఈ గ్రంథరచన” అని ఆయన చెప్పడం విశేషం.
రాష్ట్ర విభజనను ఆయన ఎంతగా
వ్యతిరేకించింది అర్ధం చేసుకోవడానికి ఈ పుస్తకం అక్కరలేదు. అది అందరికీ తెలిసిన
విషయమే. ఈ విషయంలో తన వాదన వినిపించడానికి ఆయన కలవని మనిషి లేదు. ఆఖరికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కూడా వాగ్వాదానికి దిగి అక్షింతలు వేయించుకున్నారు.
విభజనను వ్యతిరేకించడంలో ఆయన అనుసరించిన కొన్ని పద్ధతులు మూర్ఖంగా
వ్యవహరిస్తున్నాడనే కితాబును కూడా కట్టబెత్తాయి. అయినా ఆయన తన ధోరణి మార్చుకోలేదు,
ఈనాటికీ కూడా. మొండితనం మాదిరిగా కనిపించే ఈ నిజాయితీయే ఆయన్ని వ్యతిరేకించే వారిలో
కూడా కొంత సానుభూతిని రగిలించింది.
ఆ రోజుల్లో తాను డైరీలో రాసుకున్న విశేషాల ఆధారంగా ఆయన
ఈ పుస్తకం రాశారు. కొన్ని తేదీల వారీగా
వున్నాయి. మరి కొన్ని తనకు సంబంధం లేని, అంటే తాను ప్రత్యక్షంగా లేని, చూడని
సన్నివేశాలను, సంభాషణలను తన ఊహాశక్తితో రచించారు. ఆయా వ్యక్తుల స్వభావాలను అర్ధం
చేసుకున్న వ్యక్తిగా, వారు కొన్ని సందర్భాలలో ఎలా, యేమని మాట్లాడుకుని వుంటారో ఊహించి రాయడం,
అదీ జీవించి వున్న వ్యక్తుల విషయంలో ఇటువంటి ప్రయోగం చేయడం నిజంగా సాహసమే.
ముఖ్యంగా విభజన బిల్లు ఓటింగు విషయంలో
స్పీకర్ ఛాంబర్లో జరిగిన సమావేశం.
స్పీకర్, జైపాల్ రెడ్డి నడుమ జరిగిన
సంభాషణ ఉండవల్లి కల్పనాశక్తికి చక్కని ఉదాహరణలు. కొన్ని పేజీలకు విస్తరించిన ఈ సంభాషణల పర్వం ఈ
పుస్తకానికి హైలైట్. ఉండవల్లి నిజంగానే పరకాయ ప్రవేశం చేసి రాశారా అన్నట్టుగా
వుందా ఘట్టం. విషయ విస్తరణ భీతి వల్ల ఆ మొత్తం వ్యవహారాన్ని యథాతధంగా పేర్కొనడానికి వీలుండదు కనుక,
మచ్చుకు కొన్ని మాత్రమే ప్రస్తావించాల్సి వస్తోంది. (ఒక స్థాయిలో రాజకీయాలు ఏ తీరుగా సాగుతాయో
అనడానికి ఇవి తార్కాణం కూడా).
తాను లేని స్పీకర్ ఛాంబర్లో జై పాల్ రెడ్డి మాట్లాడిన విధానాన్ని
ఉండవల్లి ఎలా ఊహించి రాశారో
గమనించడానికి ఓ ఉదాహరణ.
జైపాల్ రెడ్డి: (స్పీకర్ ను
ఉద్దేశించి) – “కంగారు పడకమ్మా! ఫిఫ్టీ యియర్స్ ఇక్కడ. యాభయ్ ఏళ్ళ ఎక్స్
పీరియన్స్ తో చెబుతున్నా. నువ్వు
అధ్యక్ష స్థానంలో కూర్చోగానే అకస్మాత్తుగా టీవీ
ప్రసారాలు ఆగిపోతాయి. అవి బాగు
చేసేలోగా బిల్లు పాసయిపోతుంది. కొత్త లోక సభ ఏర్పడి ఎంక్వయిరీ చేస్తారనే భయం
అక్కరలేదు. యూపీఏ, కాకపొతే ఎన్డీయే. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ బిల్లు విషయం
ఇంతటితో ముగిసిపోతుంది.
“కట్టేకాడ్ ప్రాంతంలో ఒక తెగ వాళ్ళు
ఆడపిల్ల పుట్టగానే నోట్లో, ముక్కులో బియ్యం గింజలు వేసి చంపేస్తారు. తల్లీ తండ్రీ
ఏకమై పసిగుడ్డును చిదిమేస్తే ఎవరేం
చేయగలరు. కంప్లైంట్ లేనప్పుడు విచారణ ఏమిటి? శిక్ష ఎక్కడ?
“ఇంత దారుణమైన పోలిక తెస్తున్నందుకు
బాధపడకండి. ఈ పార్లమెంటు కూడా ఆ తెగ లాంటిదే.
“తండ్రి లాంటి అధికారపక్షం, తల్లి
లాంటి ప్రతిపక్షం కలిసి బిడ్డను చంపేయాలని అనుకుంటే స్పీకర్ ది మంత్రసాని పాత్రే
అమ్మా!
“అంచేత మీ విధి మీరు నిర్వర్తించండి.
మొదట్లో అదోలా అనిపించినా తర్వాత మీకే అనిపిస్తుంది ఇంత సులువా అని.
“ఆఖరి మాట. మీరేం తప్పు చేయడం లేదు.
రూల్ ప్రకారం తలలు లెక్క పెడుతున్నారు. ఎవరి సీట్లలో వాళ్ళు ఉంటేనే లెక్కపెడతామని మధ్య మధ్యలో చెబుతూ వుండండి.
“....బిల్లు పాసయి రాష్ట్రం విడిపోయిన
తర్వాత దీన్ని గురించి మాట్లాడేవాళ్ళు కానీ, అసలు ఆలోచించేవాళ్ళు కానీ ఉండనే
ఉండరు.
“పదేళ్ళు ఉమ్మడి రాజధాని సరిపోదేమో అనుకుంటున్నారు.
పది నెలల్లో రాజధాని మార్చేస్తామనకపొతే నన్నడగండి.
“నేను చెప్పిన దాంట్లో ఏదైనా కటువుగా,
రాజ్యాంగ విరుద్ధంగా, అధర్మంగా మీకనిపిస్తే అది మీ అవగాహనాలోపమే తప్ప, నా ఆలోచనా
అపరికత్వత మాత్రం కాదు.
“నేను చెప్పదలచుకున్నది ఇంతే!”
ఇలా చెప్పాల్సింది నీళ్ళు నమలకుండా చెప్పేసి, జైపాల్ రెడ్డి స్పీకర్ చాంబర్ నుంచి బయటకు వచ్చిన తరువాత టీ. కాంగ్రెస్ ఎంపీలతో ఆయన చెప్పిన మాటలు కూడా ఉండవల్లి
ఊహాగానమే. అది ఇలా సాగింది ఈ పుస్తకంలో:
“స్పీకర్ చాంబర్లో జరిగింది మరిచిపొండి. ఆ మాటలు నేను
అనలేదు, మీరు వినలేదు. ధర్మ సంస్థాపన కోసం కొంచెం అధర్మంగా నడుచుకున్నా తప్పులేదు.
నేనూ అదే చేసాను. తెలంగాణా ఏర్పడడం తక్షణ అవసరంగా భావించే ఇలా ప్రవర్తించాను. నౌ
ఆర్ నెవ్వర్. ఇప్పుడు అయితే అయినట్టు. లేకపోతే తెలంగాణా ఎప్పటికీ రాదు. నా బాధ్యత నేను నిర్వర్తించాను. కేసీఆర్ పార్టీని
కాంగ్రెస్ లో విలీనం చేయించడమే మీ బాధ్యత.
ఆ పని చేయండి”
జైపాల్ రెడ్డి మాటల్ని ఊహించి
రాసినట్టు ఉండవల్లి మరోమారు చెప్పుకొచ్చారు. జైపాల్ రెడ్డి ఉపన్యాస శైలి తో పరిచయం వుండడం చేత, ఆఖరి గంటలో
స్పీకర్ చాంబర్లో ఆయన ఎలా మాట్లాడి ఉంటారో ఊహించి రాసానని పేర్కొన్నారు.
ఏతావాతా ఉండవల్లి ఈ పుస్తకం ద్వారా
చెప్పదలచింది ఒక్కటే. రాష్ట్ర విభజన
జరిగిన తీరు నియమానుసారంగా లేదని. అనేక అధికారిక డాక్యుమెంట్లు, పార్లమెంటులో
నమోదయిన పత్రాలు, రాజకీయ పార్టీల ఉత్తర ప్రత్యుత్తరాలు ఇలా అనేకం జోడించి ఈ
గ్రంధానికి కొంత సాధికారత కల్పించే
ప్రయత్నం చేసారు. ఒక రిఫరెన్స్ పుస్తకంగా పనికొచ్చేట్టు కూడా రూపొందించారు. అదేసమయంలో,
నేరుగా కాకపోయినా తెలంగాణా ఏర్పడడంలో టీఆర్ ఎస్ తో పాటు కాంగ్రెస్ కు కూడా పాత్ర
వుందని పరోక్షంగా చెప్పే ప్రయత్నం ఇందులో కానవస్తుంది.
పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ ఉండవల్లి చాలా ఉద్వేగంగా తన
మనసుని విప్పి చెప్పారు. “సీమాంధ్రుల కాల్లో ముల్లు గుచ్చుకుంటే తన పంటితో
తీస్తానని చెప్పడం ద్వారా వారి మనసుల్లోని భయసందేహాలను కేసీఆర్ దూరం చేసారు” అంటూ
ముక్తాయింపు ఇచ్చారు.
అది నిజమే. ఉద్యమ కాలంలో జరిగిన
సంఘటనలను ఓసారి మననం చేసుకుంటే నిజమే
అనిపిస్తుంది. లేకపోతె, విభజన బిల్లు ఆమోదం పొందలేదు అని నిర్ధారిస్తూ నగరం నడిబొడ్డులో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం
మామూలు విషయం కాదు.
ఎందుకంటే, రాష్ట్ర విభజన జరిగిపోయిందని తెలంగాణా జనం
నమ్ముతున్నారు. ఎవరయినా నమ్మకపోయినా దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. శుభపరిణామం.
6 కామెంట్లు:
సమకాలీన రాజకీయాల మీద పుస్తకాలొస్తే దుమారం రేగుతుంది.
ఆంధ్రులకి, తెలంగాణా వారికి నిజం అక్కరలేకపోయింది, చిత్రంగా
రాజకీయ నిరుద్యోగి పుస్తకాల మీద పడ్డాడు!
”ఆడలేక మద్దెల ఓడు” అన్నదని సామెత
రాజకీయ నిరుద్యోగి వ్రాసె పుస్త
కమును, రంజిల్ల జేసె రకరకముగను,
"విభ" "జన" కథను తెలిపెను వివరముగను,
ఉండవల్లి అరుణ కుమారుడు, జిలేబి !
జిలేబి
This is a the truth .....now and never......
This is a the truth .....now and never......
కామెంట్‌ను పోస్ట్ చేయండి