24, జూన్ 2016, శుక్రవారం

వార్తలలోని వ్యక్తులు

సూటిగా....సుతిమెత్తగా.......భండారు శ్రీనివాసరావు
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 26-06-2016, SUNDAY)
“చెన్నారెడ్డిని మంత్రి వర్గానికి వెలుపలా, వీ బీ రాజును మంత్రివర్గం లోపలా వుంచితే తంటాలు తప్పవు’ అని తెలుగు రాజకీయాలను పుక్కిటబట్టిన రాజకీయ విశ్లేషకులు గతంలో చెబుతుండేవారు. ఆ విషయాలు మళ్ళీ గుర్తుకు వచ్చేలా దేశంలో ఓ వివాదం సుళ్ళు తిరుగుతోంది.
“ఇతగాడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించండి” అంటూ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులకు, ప్రధాన మంత్రులకు సిఫారసు లేఖలు రాస్తుండడం కద్దు. వాటిల్లో కొత్తదనం ఏమీ లేదు. కాకపొతే ఇదేవిధమైన అభ్యర్ధనతో ఒక  ఉత్తరం ప్రధాని నరేంద్ర మోడీకి వచ్చింది. రాసినాయనే ఆ విషయం బయట పెట్టడం వల్ల అది బయటకి పొక్కింది.
ఆ ఉత్తరం రాసింది రాజ్యసభ సభ్యుడు, పాలక పక్షం బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి కావడం, ఆయన ఉద్యోగం నుంచి తీసివేయమని పట్టుబడుతున్న వ్యక్తి సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ కావడం ఈ అంశం వివాదాస్పదం కావడానికి దోహదం చేసింది.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా రఘురాం రాజన్ ని మరికొంత కాలం కొనసాగిస్తే దేశ ఆర్ధిక పరిస్తితి సంక్లిష్టం అవుతుందని స్వామి తన లేఖలో హెచ్చరించారు.  ఆర్బీఐ  గవర్నర్ గా రాజన్ తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా దేశంలో నిరుద్యోగ సమస్య  మరింత జటిలం అయ్యే ప్రమాదం వుందని కూడా స్వామి సూత్రీకరించారు. సుబ్రమణ్యస్వామి కూడా స్వయంగా ఆర్ధిక వ్యవహారాల నిపుణుడు కావడం మూలాన ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టలేము. అయితే ఆ లేఖలో ఆయన పేర్కొన్న మరి కొన్ని విషయాల కారణంగా రాజన్ పై స్వామి బాణాలు ఎక్కుపెట్టడానికి పైకి కనిపించని గుప్త కారణాలు ఏవో వుండవచ్చునన్న చర్చ మొదలయింది.
“రాజన్ మనదేశంలో నివసిస్తున్నా ఆయన నూటికి నూరుపాళ్ళు  పూర్తిగా భారతీయుడు కాదనీ, అమెరికా ప్రభుత్వం ఇచ్చిన గ్రీన్ కార్డు పైనే ఆయన ఇంకా  కొనసాగుతున్నారని’ స్వామి చేసిన ఆరోపణ అంశాన్ని మరింత సంక్లిష్టం  చేసింది.



‘వివాదం వున్నచోట స్వామి వుంటారు,లేదా స్వామి వున్నచోట వివాదం వుంటుంది’ అని పేరుపడ్డ సుబ్రమణ్య స్వామి చరిత్ర అంతా సంచలనాలమయమే. ఏదో ఒక వివాదాన్ని రాజేసి, తద్వారా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారి మీడియా దృష్టిని ఆకట్టు కుంటారనే అపప్రధ ఆయనపై వుంది. అయితే, నిజాయితీ, నిర్భయం అనే రెండు  లక్షణాలతో  స్వామి, అన్నన్ని వివాదాల నడుమ కూడా విద్యాధికుల మన్ననను, ఆదరణను  చూరగొంటున్నారు. రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా గతంలో ఆయన చేసిన యుద్ధాలు, సాధించిన విజయాల వల్ల ఆయన చెప్పిన దాంట్లో నిజం వుండి తీరుతుందని నమ్మే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.
రాజకీయంగా చేరదీసిన వారి మీదనే స్వామి కత్తి దూస్తాడు అని అంటుంటారు. ఇప్పుడు అల్లాగే జరుగుతోంది.
సరే! రఘురాం రాజన్  ఆర్బీఐ గవర్నర్ గా నియమితులయింది మన్మోహన్ సింగ్ ప్రధానిగా వున్న యూపీఐ హయాములో. కాబట్టి ఆయన్ని తొలగించమని స్వామి కోరడంలో రాజకీయం కొంత ఉన్నప్పటికీ అర్ధం చేసుకోవచ్చు. రాజన్  ని వచ్చే సెప్టెంబరులో పదవీకాలం ముగియగానే సాగనంపడానికి అంతా సిద్ధం అయిన తరువాత కూడా స్వామి తన అంబుల పొదిలో నుంచి మరో బాణం తీసారు. ఈ సారి అది ఎక్కుబెట్టింది ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ధిక సలహాదారుడు అయిన అరవింద్ సుబ్రహ్మణ్యం మీద. రాజన్ నిష్క్రమణ తధ్యం అనిపించే నేపధ్యంలో ఆయన వారసుడిగా ఎంపిక కాదగ్గ వ్యక్తుల వరుసలో ఈ సుబ్రహ్మణ్యం పేరు కూడా వుండడం కాకతాళీయం కావచ్చు. ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి పలానా వారిని తొలగించాలి, లేదా పలానా వారిని పలానా కారణాల మూలంగా తీసుకోకూడదు అనే వాదనల వల్ల సుబ్రమణ్యస్వామి మనస్సులో ఇంకేదయినా ఆలోచన వుందా అనే దిక్కుగా చర్చలు మళ్ళుతున్నాయి.  
రఘురాం రాజన్ కధాకమామిషు  తెలుసుకోవాలంటే పదమూడేళ్ళు  వెనక్కి వెళ్ళాలి.
2007 లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్  అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమావేశం ఢిల్లీలో  జరుగుతోంది. ఆర్ధిక మంత్రి చిదంబరం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్  ఆహ్లూవాలియా, ప్రధాని ఆర్ధిక వ్యవహారాల సలహా మండలి చైర్మన్ సి.రంగరాజన్, ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు హాజరయిన ఈ సమావేశం మధ్యలో ఒక ఆసక్తికరమైన అంశం చర్చకు వచ్చింది. ఈ నలుగురు వ్యక్తులు ఆర్ధిక వ్యవహారాల్లో దిగ్గనాధీరులే. కానీ అందరూ ముదిమి వయస్కులే. కాని కాలగమనంలో వీరి పాత్ర అర్ధాంతరంగా  నిష్క్రమిస్తే అప్పుడు  ఆర్ధిక వ్యవహారాలను సంభాలించే వ్యక్తి ఎవ్వరు? ప్రత్యామ్నాయం గురించి ముందుగా ఆలోచించి పెట్టుకోవాలి కదా!
ప్రధాని మన్మోహన్ సింగ్ ని ఈ అంశం  ఆలోచించేలా చేసింది.  దాని ఫలితమే ఎక్కడో చికాగోలోని కళాశాలలో   ఆర్ధిక పాఠాలు చెప్పుకుంటున్న రఘురాం రాజన్ స్వదేశాగమనం.
తరువాతి సమావేశానికి రమ్మని రాజన్  కు కబురు వెళ్ళింది. వారాంతంలో,చికాగోలో కాలేజీలో పిల్లలకు పాఠాలు చెప్పడం పూర్తి కావడం ఆలస్యం, రాజన్ వెంటనే విమానం ఎక్కి ఢిల్లీ చేరుకునేవారు. విమానాశ్రయం నుంచి నేరుగా మీటింగుకు వెళ్లి తిరిగి అమెరికా వెళ్ళిపోయేవారు. మళ్ళీ సోమవారం యధావిధిగా క్లాసుకు హాజరయ్యేవారు. ఆ విధంగా కష్టపడుతూ రాజన్ భారత ఆర్ధిక సమస్యలకు సంబంధించి ‘వంద చిన్న  అడుగులు’  అనే ఒక నివేదిక తయారు చేసారు.  ఆ కృషిని మెచ్చుకుని ప్రధాని  మన్మోహన్ సింగ్, రఘురాం  రాజన్  ని బాగా  ప్రోత్సహించారు. ప్రధాన మంత్రికి ముఖ్య సలహాదారుడిగా ఏడాదిపాటు పనిచేసిన తరువాత, రాజన్,  2013 సెప్టెంబరులో  ఇరవై మూడో  గవర్నర్ గా రిజర్వ్  బ్యాంకులో   తదుపరి అడుగు పెట్టారు. అప్పటినుంచి ఆయనది ఒకటే లక్ష్యం, త్వరితగతిన క్షీణిస్తున్న  రూపాయి మారకం విలువని పటిష్టం చేయడం. ఒకటే గమ్యం, దేశంలో పెరిగిపోతున్న ఆర్ధిక మాంద్యాన్ని కట్టడి చేయడం. ఈ క్రమంలో భారతీయ బ్యాంకింగు వ్యవస్థను గాడిలో పెట్టాల్సి వచ్చింది. పేరుకుపోతున్న మొండి బకాయిలను తగ్గించే క్రమంలో అటు బ్యాంకులకు, ఇటు నల్ల ధనం కుబేరులకు ఆయన పంటికింద రాయిగా  మారారు.
ఈ దశలో కేంద్రంలో అధికార మార్పిడి జరిగింది. రాజన్  ని ఆర్బీఐ  గవర్నర్ ని చేసిన మన్మోహన్  సింగ్  మాజీ  ప్రధాని అయ్యారు. ఆయన స్థానంలో  బీజేపీ అధినేత నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టారు. ఆరోజు నుంచే రఘురాం రాజన్  కు ఉద్వాసన తప్పదన్న ఊహాగానాలు వినిపిస్తూవస్తున్నాయి. అయినా అవి వాస్తవ రూపం ధరించలేదు.

ఏ ప్రభుత్వానికయినా సొంత ఆర్ధిక విధానాలు  వుంటాయి. నరేంద్ర మోడీ అందుకు భిన్నం కాదు. మోడీది సొంత విధానాలతో ముందుకు పోయే స్వభావం. వాటిని అమలు పరచాలంటే అందుకు అనుగుణమైన వ్యక్తి ఆర్బీఐ  గవర్నర్ గా వుండడం అవసరం. అంచేత యూపీఏ హయాములో ఆ పదవిని పొందిన రాజన్  నిష్క్రమణ ఖాయం అని అందరూ అనుకున్నారు. వడ్డీ రేట్ల తగ్గింపుకు ఆయన ససేమిరా  అనడంతో ప్రభుత్వాధినేతలకు, రాజన్  కు  నడుమ పొరపొచ్చాలు ఏర్పడినట్టు వదంతులు చెలరేగాయి. అదే తరుణంలో  సుబ్రమణ్యస్వామి, ఆర్బీఐ  గవర్నర్  పదవి నుంచి రాజన్ ను తక్షణం తప్పించాలంటూ మొదలుపెట్టిన హడావిడి అంతాఇంతా కాదు. దరిమిలా  రఘురాం  రాజన్ తనకు తానుగానే ఓ నిర్ణయానికి వచ్చారు. ‘సెప్టెంబరు  నాలుగున  పదవీకాలం పూర్తికాగానే తిరిగి చికాగో వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పుకుంటాను’ అని ప్రకటించి, చాలాకాలంగా సాగుతున్న  వివాదానికి తెర దించారు.

కొందరికి పదవులు కీలకం, కొన్ని పదవులకు వ్యక్తులు కీలకం. ఆ పదవుల్లో వున్నవాళ్ళు తీసుకునే నిర్ణయాలు మొత్తం దేశాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువ. అటువంటి పదవుల్లో  రిజర్వ్  బ్యాంకు  గవర్నర్ ఒకటి. యావత్ దేశ ఆర్ధిక వ్యవస్థ పునాదులు బలపడడం, లేదా కదలడం అనేది వీరు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి వుంటుంది.  దీర్ఘకాలంలో ఫలితాలు రాబట్టే పధ్ధతి  పాలకులకు రుచించదు.  తాత్కాలికమైనవి  అయినా సరే,  ఎన్నో కొన్ని ఫలితాలు తక్షణం  కనబడాలని కోరుకుంటారు. వారి అనివార్యతలు అలా వుంటాయి. అక్కడే పాలకులకూ, దార్శనికులకూ ఎడం పెరుగుతుంది. అదే ఇక్కడ జరిగి వుంటుంది.

ఈ ప్రపంచం ఏ ఒక్కరి మీదా ఆధారపడి నడవదు. అలా అని వ్యక్తుల శక్తి సామర్ధ్యాలను తక్కువ అంచనా వేయడం కూడా  సరికాదు. ఆర్బీఐ గవర్నర్ గా గత మూడేళ్ళలో తను అనుకున్నవి సాధించి చూపిన రఘురాం రాజన్  ఆ సమర్ధుల  కోవలోకి  వస్తారు. అంచేతే, రాజన్ నిష్క్రమణ అనంతర పరిణామాల ప్రభావం ఎలా వుండొచ్చు  అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. రాజన్ కు వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన గొప్పదనం తెలిసిన వాళ్ళు  ఆ దేశంలో పుష్కలంగా వున్నారు. చిత్రం ఏమిటంటే ఆయనలోని ప్రతిభను గుర్తించడానికి అమెరికాలో కూడా చాలా సమయమే పట్టింది. అవహేళనలు, అవమానాల తెరలు తొలిగిన తరువాతనే రాజన్ ఆ దేశంలో  ఓ వెలుగు వెలిగారన్న సంగతి మరవకూడదు.
2005 సంవత్సరంలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ రఘురాం రాజన్, అమెరికా ఆర్ధిక వ్యవస్థలో  పెరుగుతూ వస్తున్న పెనుముప్పులను  గురించి ప్రస్తావించారు. వాటిని నివారించడానికి,  పరిణామాల తీవ్రతను తగ్గించడానికి ఆయన కొన్ని సూచనలు చేసారు. అమెరికన్ ఆర్ధిక వేత్తలు ఆయన హెచ్చరికలను లేనిపోని అనుమానాలుగా  కొట్టి వేసారు. అమెరికా ట్రెజరీ కార్యదర్శి  లారెన్స్ సమ్మర్స్  ఏకంగా రఘురాం రాజన్  ని  ‘లడెట్టీ’  ( సాంకేతిక పురోగతిని వ్యతిరేకించేవాడు, అభివృద్ధి నిరోధకుడు అని స్తూలార్ధం) అని అభివర్ణిస్తూ  అవహేళన చేసారు. మూడేళ్ళ తరువాత  రాజన్ జోస్యమే నిజమయింది. అప్పుడు కానీ  రాజన్  గొప్పదనం ఏవిటో  అమెరికన్ ఆర్ధిక నిపుణులకు తెలిసిరాలేదు.

ఉపశృతి:
చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో స్కూలు పిల్లల్ని పెద్దయిన తరువాత  ఏమవ్వాలని వుందని టీచర్లు అడిగేవారు.  ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్  స్కూల్లో చదువుకున్న రఘురాం రాజన్     ఆ ప్రశ్నకు  ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా?
“భారత దేశానికి ప్రధాన మంత్రిని  కావాలి”
(24-06-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595     



1 కామెంట్‌:

నీహారిక చెప్పారు...

>>>>>రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా గతంలో ఆయన చేసిన యుద్ధాలు, సాధించిన విజయాల వల్ల ఆయన చెప్పిన దాంట్లో నిజం వుండి తీరుతుందని నమ్మే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.<<<<<

ఆయన సాధించిన విజయాలు ఏమున్నాయి ?