24, జూన్ 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (184) : భండారు శ్రీనివాసరావు


దిండు కింద డబ్బు ముల్లె
మా బామ్మ రుక్మిణమ్మ గారికీ నాకూ వయస్సులో అరవై ఏళ్ళు తేడా. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అనే ప్రశ్నకు ఆమే జవాబు చెప్పేది. ఆమె వ్యయ నామ సంవత్సరంలో పుట్టిందట. ఆమెకు అరవయ్యో ఏట అంటే మళ్ళీ వ్యయ నామ సంవత్సరంలో నేను పుట్టానుట. తెలుగు సంవత్సరాల పేర్లు గుర్తు పెట్టుకునే వ్వయసు కాదు కానీ, వ్యయ అనే పేరు మాత్రం గుర్తుండిపోయింది.
మా ఐదో బావగారు కొమరగిరి వెంకట అప్పారావు గారింట్లో యాభయ్ ఏళ్లనాటి పాత పంచాంగాలు కూడా వుండేవి, కొంత పెద్దయిన తర్వాత వాటిని తిరగేస్తే బామ్మ చెప్పిన వ్యయ నామ సంవత్సరం ప్రకారం లెక్క చూస్తే నా స్కూలు రికార్డులలో రెండేళ్ల తేడా వుంది.
గవర్నమెంటు వారికి ఈ పంచాంగాలు, బామ్మ సాక్ష్యాలు పట్టవు. స్కూలు రికార్డుల ప్రకారం, నీకు అరవై వచ్చాయని చెప్పి, 2005 డిసెంబరులో పెన్షన్ లెక్క కట్టి ఇక ఇంటికి వెళ్లి రెస్టు తీసుకోమన్నారు. వారికి అంటే మా ఆఫీసువారికి తెలియని విషయం ఏమిటంటే ఆ మూడు దశాబ్దాల పై చిలుకు సర్వీసులో నేను తీసుకున్నది రెస్టు మాత్రమే అని, చేసింది ఏమీ లేదని. ఉద్యోగంలో ఊడబొడిచింది అంతకన్నా ఏమీ లేదని. అంచేత నేను కూడా వచ్చిందే చాలనుకుని, ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చాను. అంతకంటే చేసేది ఏమీ లేదనుకోండి. కోర్టుకు పోతే ఇన్నాళ్ళు నిద్రపోయావా అంటారు. ఆ నిజం ఒప్పుకోవడం కష్టం కదా!
బామ్మతో కదా ఈ ఎపిసోడు మొదలు పెట్టాను. అక్కడికే వస్తాను.

కాన్పుకయినా, కాటికయినా కాసులే లెక్క

అమెరికాలో స్థిరపడిన ఫేస్ బుక్ మిత్రులు శ్రీనివాస్ సత్తిరాజు గారు, తమ అత్తగారి మరణం గురించి రాస్తూ, ఆమె పిల్లలు తల్లి చనిపోవడానికి ఆరేళ్ల ముందే అంత్యక్రియల కోసం అడ్వాన్సు గా పన్నెండు వేల డాలర్లు సంబంధిత సంస్థకు చెల్లించి వుంచారని, అదే ఇప్పుడయితే ఇరవై వేలు అయ్యేదని రాసుకొచ్చారు. ఇది చదివిన తర్వాత
నా చిన్నతనం జ్ఞాపకం వచ్చింది.

మా బామ్మ దిండు కింద ఓ రోజు చిన్న మూట కనబడింది. అందులో ఏముంది?
తెలుసుకోవాలని ఆత్రుత.
ఒకరోజు ఆమెనే అడిగేశాను ‘ఈ ముల్లెలో ఏముంది బామ్మా’ అని.
‘దాని మీదపడ్డాయి ఏమిట్రా నీ కళ్ళు. అందులో ఏముందిరా అప్పుడప్పుడూ పోగేసుకున్న నాలుగు రాళ్ళుతప్ప’
‘రాళ్ళా! రాళ్ళను దిండు కింద ఎందుకు పెట్టుకున్నట్టు’
నా మనసులో మాట కనుక్కున్నట్టు౦ది.
‘రాళ్లంటే గులక రాళ్ళు కాదురా సన్నాసీ. డబ్బులు’
‘డబ్బులా నీకెందుకు? సినిమాకు పోతావా షికార్లు పోతావా. చాక్లెట్లు బిస్కెట్లు నీకక్కరలేదు కదా!’
‘ఇవి వాటికి కాదు లేరా! కాటికి పోవడానికి’
‘కాటికా! అంటే ఏదైనా గుడా”
‘గుడిలాంటిదే. చివరికి ఎవరైనా ఆ గుడికి వెళ్ళాల్సిందే’
‘గుడికి ఇన్ని డబ్బులెందుకే’
‘నీకెలాచెబితే అర్ధం అవుతుందిరా ఈ వయసులో. కాటికి పోవడం అంటే చనిపోయిన తర్వాత తీసుకువెళ్ళే చోటు. బతికుండగా మనం ఎవరినైనా అడిగితే డబ్బులు ఇస్తారు, వాళ్ళ దగ్గర వుంటే. అదే ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత అడిగితే, వాళ్ళ దగ్గర వున్నా ఇవ్వరు. దహన సంస్కారాలకు ఎవ్వరూ డబ్బు సర్దరు. అలా చేస్తే కీడు అని నమ్మకం. అందుకని ముందుగానే ఈ ముల్లెలో ఆ డబ్బులు దాచుకున్నాను’
బామ్మ మాటలు అప్పుడు అర్ధం కాలేదు.
ఇప్పుడు అర్ధం బోధపడింది. కానీ బామ్మ ఆ రోజుల్లో ముల్లెలో దాచుకున్న డబ్బులు ఈరోజుల్లో ఆ కార్యక్రమాలకు ఏ మూలకూ సరిపోవు అని కూడా అర్ధం అయింది.
ఇప్పుడు పుట్టినా, గిట్టినా అన్నీ లక్షల్లోనే.
అంత్యక్రియలకు డబ్బు సర్దుబాటు చేస్తే అరిష్టం అనుకునే ఆ పాత రోజుల్లో కూడా మా బావగార్లు ఇద్దరు, తుర్లపాటి హనుమంత రావు గారు, కొమరగిరి వెంకట అప్పారావు గారు ఇలాంటి సందర్భాలలో డబ్బు సాయం చేయడం నేను చూశాను. వాళ్ళు పెళ్లిళ్లకు వాటికీ వెళ్ళేవాళ్ళు కాదు కానీ, ఎవరైనా చనిపోయారని కబురు అందితే చాలు ఎంతోకొంత డబ్బు జేబులో పెట్టుకుని ఎంత దూరాలు అయినా సరే వెళ్ళే వాళ్ళు. చనిపోయిన వాళ్ళు మళ్ళీ కనబడరు ఇప్పుడు వెళ్లి చూడకపోతే అనేవాళ్ళు. వెళ్ళడమే కాదు, ఎవరూ చూడకుండా కొంత పైకం ఆ కుటుంబానికి అందించేవారు. నిజానికి డబ్బు అవసరం ఇలాంటి సందర్భాలలోనే ఎక్కువ.
కాలానుగుణంగా ఇటువంటి మనస్తత్వాలు, నమ్మకాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. అంత్యక్రియలకు డబ్బు సాయం చేసే విషయంలో సానుకూల ధోరణులు కానవస్తున్నాయి. మార్పు మంచిదే.

ఉపశృతి:
సియాటిల్ లోని సందీప్ ఇంటి పెరటి చెట్టువద్ద హమ్మింగ్ బర్డ్స్ కోసం వాటర్ ఫీడర్ ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడు నాలుగు పక్షులు అక్కడికి వచ్చిపంచదార కలిపిన తియ్యటి నీళ్ళు తాగి వెడుతుంటాయి. వెడుతూ వెడుతూ, బాల్కనీ అద్దం మీద ముక్కులతో చప్పుడు చేసి వెడతాయిట. ప్రపంచంలో అత్యంత ఆధునిక నాగరీకానికి పెద్దన్న అనిపించుకుంటున్న అమెరికా ప్రజలకు కూడా ఇలాంటివి కొన్ని నమ్మకాలు వున్నాయని గూగులమ్మ చెబుతోంది. చనిపోయిన తమ పూర్వీకులు ఇలా హమ్మింగ్ బర్డ్స్ రూపంలో వచ్చి చూసి వెడుతుంటారని వారి నమ్మకం.
కింది ఫోటోలు:
మా బామ్మ రుక్మిణమ్మ గారు. నాకు తెలిసి ఇది ఫోటో కాదు. ఆమె చనిపోయి యాభయ్ ఏళ్ళు గడిచాయి. మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు పెన్సిల్ తో గీసిన చిత్రం అని నా నమ్మకం. చాలా రోజులు ఆయన దీన్ని పర్సులో పెట్టుకుని తిరిగిన జ్ఞాపకం.
హమ్మింగ్ బర్డ్స్ వాటర్ ఫీడర్




(ఇంకా వుంది)










(ఇంకావుంది)

23, జూన్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (183) : భండారు శ్రీనివాసరావు

 

‘బుద్ధి బుధవారం దాకా వుంటే బూరెలు వండిపెడతాను’ అనే సామెత మా ఆవిడ తరచుగా చెప్పేది, పుష్కరానికి ఒకసారి ఎప్పుడైనా నేను చదివిన పేపర్లు మడతపెట్టి పెడుతున్న సందర్భంలో.
పదకొండుమంది పిల్లలు వున్న ఇంట్లో చిన్నవాడిని కదా! పక్కబట్టలు సర్దిపెట్టడం, బట్టలు ఆరవేయడం, స్నానానికి నీళ్ళు తోడుకోవడం ఇలాంటి చిన్నచిన్న పనులన్నీ నాకు చెప్పేవాళ్ళు కాదు.
ఇక మా ఆవిడ నా జీవితంలో ప్రవేశించినప్పటి నుంచి మా ఇంటికి నేనే స్వయం ప్రకటిత మహారాజుని. సర్వంసహా చక్రవర్తిని. మా ఆవిడ పేరుకు మహామంత్రి కానీ, సమయానికి నాకు అన్నీ అమర్చిపెట్టే జీతం భత్యం లేని సేవకురాలు. దాదాపు యాభయ్ ఏళ్ళు సాగిన ఈ వైభోగానికి, ఆరేళ్ల కిందట మా ఆవిడ పోవడంతో తెర పడిందనే అనుకున్నా. అయినా రాసిపెట్టింది ఎక్కడికి పోతుంది? కొడుకులు, కోడళ్ళ రూపంలో ఆ అదృష్టం కొనసాగుతోంది.
‘నేను రేపటి మనిషిని, నా ఆలోచనలు అభిప్రాయాలు వర్తమానంకంటే చాలా చాలా ముందుంటాయి’ అనేది నా గురించి నేను చాలా కాలంగా పెట్టుకున్న నమ్మకం.
అయితే రేపో మాపో నా వయసు ఎనభయ్యవ పడిలో పడబోతున్న తరుణంలో కానీ, నా నమ్మకంలోని డొల్లతనం ఏమిటన్నది నాకు తెలిసి రాలేదు.
నేను రేపటి మనిషిని కాకపోగా, ఎప్పుడో పుస్తకాల్లో చదువుకున్న పాతరాతి యుగం మనిషిని అనే వాస్తవం తెలిసి రావడానికి ఇంతకాలం పట్టింది. ఎందుకంటే అన్నీ ఇలా జరగాలని అనుకుంటానే కానీ ఆ దిశగా ఒక్క అడుగూ వేయకపోవడం నా ప్రత్యేకత.
“మీరు చాలా అదృష్టవంతులండీ” అన్నది ఓ రోజు పొద్దున్న వచ్చిన పనిమనిషి.
నేనేమీ మాట్లాడలేదు. ఎందుకంటే, ఎందుకు అని అడిగే సందర్భం కాదు కదా!
మళ్ళీ తనే చెబుతోంది.
“పొద్దున్న వస్తానా, ఆయమ్మ అదే మీ కోడలు గారు ప్రతిరోజూ తను పని (అంటే ఆమె ఉద్దేశ్యం Work from Home అన్నమాట) లోకి వెళ్ళే ముందు నాకు ఇవన్నీ పదేపదే చెబుతుంటారు.
‘పాపా పడుకునే బెడ్డు క్లీన్ చేయి. పక్క బట్టలు రెండ్రోజులకోసారి మార్చు. దిండు కవరు మార్చి వేయి. గది బాగా శుభ్రంగా ఉంచు. బాత్‌రూంలో తడి లేకుండా పొడి బట్టతో తుడిచేయి. బయట ఆరేసిన ఆయన బట్టలు అన్నీ తెచ్చి అలమారాలో సర్ది పెట్టు. మంచి నీళ్ళ సీసా, గ్లాసు మరిచిపోకు.’
“ఇలాగే ఎన్నెన్నోజాగర్తలు చెప్పి వెళ్లి ఆ మిషన్ ముందు కూచుంటారు. రోజూ ఇదే వరస. అదేమిటో, ఇవ్వాళ నేను రావడం లేటయింది. కానీ నేను వచ్చేలోపే నాకు రోజూ చెప్పే చెప్పిన పనులన్నీ ఆమెగారే ఈరోజు చేసినట్టున్నారు. గదంతా శుభ్రంగా వుంది. ఇలా కనిపెట్టి చూసే కోడలు దొరకడం మీ అదృష్టం అంటున్నాను. పాపం ఆ మహాతల్లి వుంటే ఆమెని ఎంత సుఖపెట్టేదో ఈ అమ్మాయిగారు.”
అలాగా! అనుకున్నాను. ప్రతిరోజూ నా గది అలాగే శుభ్రంగా వుంటుంది. పనిమనిషి రాని రోజున కోడలు నిషానే ఇవన్నీ చేస్తోంది అని కూడా తెలియదు. అసలు పనిమనిషి వచ్చిందా రాలేదా! ఎవరు ఏ పని చేస్తున్నారు అని గమనించే తీరిక లేకుండా, ఏదో కొంపలు మునిగినట్టు తెల్లారకముందే కంప్యూటర్ ముందు కూచుంటాను. ఇంట్లో ఏమి జరుగుతుందో తెలవదు, ఒకప్పుడు ఇప్పుడు కూడా. వెనుకటిలాగే నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. అదృష్టం కాక మరేమిటి?
అన్నీ వుండి ఏమీ లేకపోవడమే జీవితం
మేరా నాం జోకర్ సినిమాలో రాజ్ కపూర్ పాత్ర చెప్పినట్టు జీవితం ఆగదు, సాగిపోతూనే వుంటుంది.
‘నేను లేకుండా ఈయన ఎట్లా బతుకుతారో ఏమిటో’ అని, తాను చనిపోయే ముందు ఆఖరు క్షణంలో మా ఆవిడ అనుకునే వుంటుంది. ఏదో రాసుకోవడం, స్నేహితులతో పిచ్చాపాటీ కాలక్షేపాలు చేయడం తప్పిస్తే నా మటుకు నాకుగా బతకగల తెలివితేటలు, పని పాటలు చేసుకోగల శక్తియుక్తులు ఆ భగవంతుడు ఇవ్వలేదు. నా బనియన్ సైజ్ ఏమిటో కూడా నాకు తెలియదనేది నా గురించి నేను వేసుకునే జోకు.
కారు సర్వీసింగ్ చేయించడం, కార్ వాష్ చేయించడం, ఇన్వర్టర్ లో వాడే అదేదో డిస్టిల్డ్ వాటర్ బాటిల్ కొనడం, కారుకు పొల్యూషన్ ఫ్రీ సర్టిఫికేట్ తీసుకోవడం, బకాయి ఉన్న ట్రాఫిక్ చలానాలు పే చేయడం, వెహికిల్ ఇన్స్యూ రెన్స్ రెన్యూ చేయడం, నిజానికి ఈ కాలం వారికి ఇవన్నీ చిన్నపనులే కావచ్చు. కాకపోతే బద్దకమే స్టిరాస్తిగా కలిగిన నా వంటి వారికి పెద్ద పనులే. ఇవన్నీ, ఇవన్నే కాదు, ఇంకా చాలా పనులు నాకు తెలియకుండానే చేసేసి, నేను నిశ్చింతగా కాలుమీద కాలు వేసుకుని హాయిగా రోజులు దొర్లించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసిపెట్టే కోడల్ని చూసినప్పుడు, అద్దంలో నాకు నా పాతరాతి యుగం మొహమే కనిపిస్తుంది.
ఇక ఇప్పుడు ఇన్ని వేల మైళ్ళు దాటి అమెరికా వస్తే ఇక్కడా అదే సీను రిపీటు.
ఏదో ఇక్కడ సుఖపడిపోతున్నారని అక్కడ అనుకుంటాము కానీ అది పొరబాటు.
ఒక పక్క ఉద్యోగాలు.. మరో పక్క ఇంటిపనులు. మగవాళ్ల సాయం వుంటుంది కానీ అదేదో నామమాత్రం అని నాకు అనిపిస్తోంది. శనివారం వచ్చింది అంటే చాలు, ఆ రోజు నడుం వాల్చే ప్రసక్తి వుండదు. వారానికి సరిపడా ఇంటెడు చాకిరీ మా కోడలు భావనే. అయిదు వందల మైళ్ళ దూరాన వున్న యూ జీన్ లో ఉంటున్న చిన్నమనుమరాలిని, అక్కడ నాలుగేళ్ళుగా అది ఉంటున్న ఇంటిని ఖాళీ చేయించి, సామాను కారులో వేసి తీసుకురావడానికి మా వాడు సందీప్ శనివారం పొద్దునే బయలుదేరి వెళ్ళాడు. దాంతో భావన ఒక్కతే అన్ని పనులు నిభాయించుకుంటోంది.
చెప్పాకదా! నాకు పక్క బట్టలు పద్దతిగా సర్ది పెట్టుకునే మంచి అలవాట్లు లేవని. ఇక్కడ అంటే అమెరికాలో మా పెద్ద కోడలు భావన ఎప్పుడు మెట్లు దిగి కిందికి వెడుతుందో, ఎప్పుడు గది నీటుగా సర్డుతుందో తెలవదు, నేను స్నానం చేసి వచ్చేసరికి స్టార్ హోటల్లో మాదిరిగా గదీ, పడక క్లీన్ చేసి పెడుతుంది. బ్లాంకెట్లు చక్కగా పరుస్తుంది. దిండు గలీబులు మారుస్తుంది. అయ్యోపాపం రేపు ఈ ఛాన్స్ తనకి ఇవ్వకుండా నేనే సర్ది పెడదాము అని గట్టిగా అనుకుంటాను. కానీ పుట్టుకతో వచ్చిన అలవాట్లు అంత త్వరగా ఎలా మారతాయి. మర్నాడు మళ్ళీ మామూలే. తను చేయడం, నేను చూడడం.
ఉదయం బ్రేక్ ఫాస్ట్, ఫిల్టర్ కాఫీ, కాసేపు ఏదో ఒక ఓటీటీ మూవీ, మధ్యాన్నం వేడివేడిగా భోజనం, సాయంత్రం నా షరామామూలు సాయంకాలక్షేపానంతర విందు. ప్రతి మంగళవారం విధిగా, భాషతో సంబంధం లేకుండా లింకన్ స్క్వేర్ సినీ మార్క్ దియేటర్లో ఒక సినిమా. అందుకే అంటారు జరుగుబాటు వుంటే జబ్బంత సుఖం లేదని.
ఇవన్నీ సరే! ఇవన్నీ వుంటే మనసు నిశ్చింతగా వుంటుందా! ఏమో నాకు డౌటే!
ప్రపంచంలో అతి భయంకరమైనది ఒంటరితనం! దానికీ భయమేమో! అర్ధరాత్రి కాగానే నన్ను కావిలించుకుని పడుకుంటుంది.
రావణుడి లంకలో నిద్రిస్తున్న స్త్రీల మాదిరిగా మంచం మీద అస్తవ్యస్తంగా పరచుకున్న పక్క బట్టలు. నిద్రపట్టని కళ్ళతో కంటున్న పీడకలలు.
అయితేనేం, నిద్ర పట్టనిది ఈ పూటే. రేపు అనేది వుంది కదా! భయమెందుకు?
ఎప్పుడో అరవై ఏళ్ళకు పూర్వం రాసుకున్న గేయం రాత్రివేళ గుర్తుకు వస్తుంది.
“దూరానికి సరళరేఖల్లా కనబడ్డా
నిజానికి ఎన్నో కనబడని వొంకర్లు
ఆలోచనలకు పెయింట్ వేసి వుంచినా
నిద్రపట్టే వేళకు
మెదడు తుప్పురాలుతున్న చప్పుడు
నిశ్శబ్దం చేసే ధ్వని భరించడం ఎలా
పగలు పలురకాల అనుభవాల్ని నమిలి
నాలుక కొసతో నిశీధిని నంజుకుని
నవ్వి, నలిగి
పక్కపై చేరే సమయానికి
ఆలోచనల నల్లుల బారులు
లోపలి వ్యక్తి చేసే చీకటి ఆక్రందనలు
ఇక నిద్రపట్టడం ఎలా?
లేచి లైటు వెయ్యాలి”
కొసమెరుపు: “నువ్వు ఎంత నిరాశాజనకంగా అయినా రచనలు చేయి. కానీ ఒక ఆశావహమైన ముగింపు మాత్రం ఇవ్వు”, అని సలహా ఇస్తూ, ‘లేచి లైటు వెయ్యాలి’ అనే చివరి వాక్యాన్ని తానే జోడించి, ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఈ గేయాన్ని అక్షరం మార్చకుండా ప్రచురించారు నాటి ఎడిటర్ పురాణం సుబ్రమణ్య శర్మగారు. గ్రేట్ ఎడిటర్, గ్రేట్ రైటర్.
(Gratitude can be expressed in many ways. This is one)
కింది ఫోటోలు:
అమెరికాలో నా వైభోగం:
(23-06-2025)
(ఇంకావుంది)

22, జూన్ 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (182) : భండారు శ్రీనివాసరావు

 

ఫోటో మాట్లాడుతుందా!

‘‘ఈ శంఖంలో తీర్ధం కదా పోయాల్సింది, బియ్యం పోస్తున్నావేమిటి’

పొద్దున్నే ఆలోచనల దొంతరలో మంచం పక్కన గోడకు తగిలించి వున్న ఫొటోకు నేను  సంధించిన ప్రశ్న ఇది. నా అజ్ఞానంధకారానికి పరాకాష్ట.  

హైదరాబాదుకు కొన్ని వేల మైళ్ళ దూరంలో, అమెరికా పశ్చిమ భాగంలో సియాటిల్ లోని  మా పెద్దవాడి ఇంట్లో నాకోసం ప్రత్యేకించిన విశాలమైన పడకగదిలో నిద్రపట్టని అర్ధరాత్రివేళ తడిమిలేపుతున్న పాత జ్ఞాపకాలు.

 

మరక మంచిదే అన్నట్టు ఒక్కోసారి ఒంటరితనం కూడా మంచిదే. హాయిగా ఎలాంటి  అంతరాయం లేకుండా ప్రశాంతంగా జ్ఞాపకాలను నెమరు వేసుకోవచ్చు. ఆలోచనలకు ఆటంకం వుండదు. ఎప్పటెప్పటివో చిన్నప్పటి విషయాలు మనసులో సుళ్ళు తిరుగుతుంటాయి. ఏమిటలా శూన్యంలోకి చూస్తున్నావు అని అడిగేవాళ్ళు ఆ సమయంలో వుండరు. అంతూపొంతూ లేకుండా  సాగే ఆలోచనలను  ఆనకట్టలు, అడ్డుకట్టలు లేకుండా అక్షరబద్ధం చేసుకోవచ్చు.  అల్లెక్సా వినిపించే ఘంటసాల పాడిన పాత   సినిమా పాటలు వింటూ ఎంచక్కా రాసుకోవచ్చు. నడిచివచ్చిన దారిని రివైండ్ చేసి చూసుకోవాలి అంటే ఒంటరితనాన్ని మించిన నేపధ్యం వుండదు ఎవరికైనా, ప్రత్యేకించి నా వయసువారికి.

ఇళ్ళల్లో పూజకు వాడే శంఖాల్లో బియ్యమే పోయాలిట. ఇంకోటి తెలుసా! ఇరవై ఏళ్ళ క్రితం కాబోలు  ఆర్వీవీ కృష్ణారావు గారితో మనం  తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన  ఈ శంఖాన్ని ఇస్కాన్ టెంపుల్ లో కొని మనకిచ్చారు’ అంటోంది గోడమీద ఫోటో. నిజమే ఫోటో మాట్లాడుతోంది. మాట్లాడేది మా ఆవిడే. నాకు నోట మాట రాలేదు.

‘.........’

 

ఈ బుల్లి విగ్రహం చూశారా! విష్ణుమూర్తి పాదాల దగ్గర లక్ష్మీదేవి కూర్చున్న ఈ ప్రతిమను శేఖరరెడ్డిగారి భార్య, నా ఫ్రెండ్ అరుణ కొని నాకు ప్రెజెంట్ చేసింది’

‘.......’

ఈ చిన్న వెండి తులసి కోటను   విమలక్కయ్య ఇచ్చింది. ఎనిమిదేళ్ళు దాటింది. అయినా మెరుపు తగ్గలేదు. మన పూజా మందిరంలో ఉన్న వాటిల్లో చాలావరకు ఆమె ఇచ్చినవే. అదిగో ఆ కుంకుమ భరిణ. ఆ  దేవుడి పీట. మంచి మనసుతో ఇచ్చింది. అందుకే ఇన్నేళ్ళయినా  ఇలా మెరిసిపోతున్నాయి’

‘..........’

చనిపోయి ఏ స్వర్గంలో వున్నారో సరస్వతి వదిన గారు. ఈ సరస్వతీ దేవి విగ్రహం ఆమె ఇచ్చిందే. పాతికేళ్ళయి౦దేమో! మనం   మాస్కో నుంచి వచ్చిన కొత్తల్లో చూడడానికి వచ్చినప్పుడు ఇచ్చారు’

‘...........’

ఈ చిన్ని వెండి మందిరం భారతి వదిన గారు ఇచ్చారు. మాస్కోనుంచి తిరిగొచ్చి మనం దుర్గానగర్ లో ముస్లిముల ఇంట్లో అద్దెకు వున్నప్పుడు, అన్నగారికి గుండె ఆపరేషన్ మంచిగా  జరిగి సంతోషంగా ఇంటికి వెడుతూ వదిన గారు ప్రేమతో ఇచ్చిన కానుక ఇది’

‘.........’

ఏడేళ్ళ నాడు బుజ్జివాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వెండి సామాన్లు తీసుకోవడానికి అమీర్ పేట షాపుకు వెళ్ళినప్పుడు మనమూ వెంట వెళ్లాం గుర్తుందా! చిన్ని లక్ష్మీ దేవి, పక్కన రెండు చిన్న ఏనుగులు ఉన్న ప్రతిమ చూసి ముచ్చట పడితే,  మీరు అప్పటికప్పుడే కార్డు గీకి కొనేశారు. బహుశా ఇన్నేళ్ళ కాపురంలో మీరు కొన్న దేవుడి బొమ్మ ఇదొక్కటే!’

‘............’

 

అసలు నేను ఆ పూజ  గదిలోకి అడుగు పెట్టింది ‘విగ్రహాలు కడుగుతూ, కడుగుతూ  ఆ సందట్లో  టిఫిన్ తిని మాత్ర వేసుకోవడం మరిచిపోయావా అని అడగడానికి.

ఇంత పాత సంగతులు ఇలా విపులంగా చెబుతుంటే ఇక మతిమరపు గురించి ఏం అడగను. పులుకడిగిన దేవుళ్లకు ఓ దణ్ణం  పెట్టేసి చక్కా బయటకు వచ్చాను.  

    

దేవుళ్ల సంప్రోక్షణ జరిగింది 2019 జులై 18 వ తేదీన. 

ఆగష్టు 18 న తాను లేదు.

ఈ పూజలన్నీ ఏమైపోయాయో ఏమో మరి.

ఏ పూజలు, పునస్కారాలు తెలియని నేను మాత్రం ఇలాగే వున్నా మరి.

‘ఇంకా పడుకోలేదా! కాసేపు పడుకోండి. మళ్ళీ మనం బయలుదేరి దాదాపు కెనడా దాకా కారులో వెళ్ళాలి. ఈ రాత్రికి వచ్చేద్దాం’ అంటున్నాడు మా వాడు.

దీవిలో ఒక రోజు

 అమెరికా- కెనడా సరిహద్దుల్లో పసిపిక్ మహాసముద్రంలో  దీవులు కొన్ని వున్నాయి. సియాటిల్ నుంచి కెనడాకు రెండున్నర గంటల్లో కారులో వెళ్ళవచ్చు. రోడ్డు మార్గం ద్వారా మాత్రమే  కాకుండా హెలికాప్టర్లు, విమానాల ద్వారా కూడా ఆ దీవులను చేరుకోవచ్చు.

 అనకోర్టెస్ అనే పట్టణం నుంచి ఫెర్రీల (పెద్ద పెద్ద మర బోట్లు) ద్వారా కూడా వెళ్ళవచ్చు. మనతో పాటు మన వాహనాలను కూడా ఈ బోట్లలో తీసుకువెళ్ళడానికి వీలుంది. నిర్ణీత రుసుము చెల్లించి సందీప్ కారుని నేరుగా ఫెర్రీలోని పార్కింగ్ లాట్ లోకి చేర్చాడు. డజన్ల సంఖ్యలో అక్క డ కార్లు పార్క్ చేసుకునే వీలుంది.

 పై అంతస్తులో పర్యాటకులకోసం విశాలమయిన లాంజ్ లు వున్నాయి. అన్ని వైపులా నిలువెత్తు అద్దాలు బిగించడం వల్ల వెచ్చగా, హాయిగా చుట్టూ పరిసరాలను గమనిస్తూ సముద్రయానాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఫెర్రీలో బార్, రెష్టారెంట్ తొ సహా అన్నిరకాల వసతులు వున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు వున్నాయి.

 

 గంటన్నర పాటు సముద్రంలో ప్రయాణించి సాన్ జువాన్ (అమెరికన్లు ‘సాన్ వాన్’ అని పలుకుతారు) దీవుల్లోని ఫ్రైడే హార్బర్ కు చేరుకున్నాము. బోటు నుంచి కారు కిందకు దింపుకుని,  విశాలమయిన దీవిలో సన్నటి రోడ్లపై కలయ తిరిగాము. దీవికి అన్నివైపులా పసిఫిక్ మహాసముద్రం. ఎక్కడో సుదూరంగా నీలి సముద్రాన్ని నీలాకాశం తాకుతున్న ఫీలింగ్.

 పేరుకు దీవి కానీ ఫ్రైడే హార్బర్ అన్ని వసతులు కలిగిన చిన్నపాటి నగరమనే చెప్పాలి. రెష్టారెంట్లు, సినిమా హాళ్ళు, హోటళ్ళు, మ్యూజియం, చిన్న సైజు విమానాలు దిగడానికి ఎయిర్ స్ట్రిప్, సంపన్నులయినవారు విడిది గృహాలుగా కొనుగోలు చేసుకున్న ఖరీదయిన ఇళ్లు,  హాలీవుడ్ చిత్రంలో సెట్ మాదిరిగా చూడచక్కగా వుంది. ఇంటి నుంచి తెచ్చుకున్న పెరుగన్నం,  పులిహార లాగించి చూడాల్సినవి అన్నీ చూసి వస్తుంటే వర్షం మొదలయింది. సాయంత్రం అయిదు గంటలకే చిమ్మ చీకట్లు కమ్మే వాతావరణం. బోటు లంగరు వేసిన ప్రదేశం కనుక్కునే సరికి తాతలు దిగివచ్చారు. మొత్తానికి ఎలాగయితేనేం, కారుతో సహా తిరిగి బోట్లో పడ్డాం.

జీవితమంటేనే జ్ఞాపకాలు.

కింది ఫోటోలు :

మా ఆవిడ ఫోటోతో మాటామంతీ

ఫ్రైడే హార్బర్
















(ఇంకావుంది)