25, ఏప్రిల్ 2022, సోమవారం

ఓ కధ చెప్పుకుందాం – భండారు శ్రీనివాసరావు

 నిజానికి ఇది కధ కాదు. నిజ జీవితమే.

కదల కోసం కంచికి పోనవసరం లేదు, జీవితాల్లోకి తొంగి చూస్తే కనబడతాయి, మనసును ఆర్ద్రం చేసే కధలు. అలాంటిదే ఇది.

మా స్వగ్రామంలో పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తి కొంత వుంది. వుందని తెలుసు కానీ వాటి ఆజాపజా  మా అన్నదమ్ములు నలుగురికి కానీ, అన్నదమ్ముల సంతానం పదిమందికి కానీ ఎవరికీ తెలియదు. కొంచెం తెలిసిన మా మూడో అన్నయ్య ఆకాలంగా కాలం చేశాడు. అల్లాగే మా పెద్దన్నయ్య కూడా. ఇప్పుడు ఇద్దరం మిగిలాము. చిన్నవాడి నైన నాకే డెబ్బయి అయిదు. మా రెండో అన్నయ్య ఎనభయ్ కి దగ్గరలో వున్నాడు. ఇక ఆస్తి పాస్తులు గురించి తెలుసుకోవాల్సిన అవసరం మా ఇద్దరికీ ఈ వయసులో ఉంటుందని అనుకోను.

ఈ నేపధ్యంలో మా మూడో అన్నయ్య కొడుకు భండారు రమేశ్ వీటి విషయం తెలుసుకోవాలని నడుం కట్టాడు. అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లూ పుట్టల్ని తొలగించి పొలాలని కొత్తగా సర్వే చేయించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ మండే ఎండల్లో నెత్తికి ఎత్తుకున్నాడు. ఈ క్రమంలో వాడి కంటికి కనిపించిన ఒక మానవీయ దృశ్యానికి అక్షర రూపం ఇచ్చాడు. అదే ఇది:  



“పై ఫోటోలో కనిపిస్తున్న మనిషి పేరు పిండిప్రోలు పిచ్చయ్య. భార్య పేరు పిచ్చమ్మ. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఈమె ఎవరికి కనపడదు. (సరిగా బట్టలు వేసుకోదని బయటకు రానివ్వరు) మండుటెండలో సైతం చెట్టు నీడ కూడా లేకుండా, ఈ రేకుల షెడ్డులోనే ఊరు బయట నాలుగేళ్లుగా ఉంటున్నారు. కనీసం తాగడానికి నీళ్లు లేక పోగా, కనుచూపుమేరలో విద్యుత్ వెలుగులు కనిపించవు. పిలిచినా పలికే నాధుడే లేకపోయినా, కటిక చీకట్లో కాలం వెళ్లదీస్తున్నారు.

 

“వెనుకటి రోజుల్లో పిచ్చమ్మ అనే ఆమె మన ఊళ్ళో ఉండేది. ఈ పిచ్చయ్య ఆమె కుమారుడు. కంభంపాడు లోనే కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాడు. కూతురు కుట్టు మిషన్ పనిచేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేది. అయితే అనుకోని సంఘటనతో వీరి కుటుంబ జీవనం తలకిందులైంది. కొంత మంది కామాంధుల పైశాచిక చేష్టలతో వీళ్ల కూతురు మానసికంగా దెబ్బతింది. దీంతో ఆమె తల్లి కూడా అనారోగ్యానికి గురైంది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ కూడా పిచ్చిగా ప్రవర్తించడంతో గ్రామస్తులు వీరు  తమ  ఇళ్ళ మధ్య ఉండటానికి ఇష్టపడ లేదు.

“ఈ విషయం నాకు ఒకరిద్దరు చెప్పడంతో, కంభంపాడు వెళ్లి మన ట్రాన్స్ఫారం పొలం ఆనుకుని ఒక మూలన పొలంకు అడ్డులేకుండా చివరన తాత్కాలికంగా ఉండమని చెప్పాను. దీంతో వాళ్లు అక్కడ ఒక రేకుల షెడ్డు నిర్మించుకొని ఉంటున్నారు. ప్రతిరోజు వాళ్లకు కావలసినవన్నీ పిచ్చయ్య సమకూర్చుతూ ఉంటాడు. రోజువారి వాడే నీళ్ల నుంచి మంచినీళ్ల వరకు తానే స్వయంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు. పిచ్చయ్య ఒక్కడి రెక్కల కష్టంతోనే వాళ్ళిద్దరూ జీవిస్తున్నారు. పిచ్చయ్య కూడా పెద్దవాడు కావడంతో ఓపిక సన్నగిల్లి ఆదాయవనరులు తగ్గిపోయాయి. తల్లి కూతుర్లు ఆ రేకుల షెడ్డు దాటి బయటకు రారు, రాలేరు.

“అయితే ఇప్పుడు మన పొలాలు కొలిపిస్తున్నందున అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పాను. పిచ్చయ్య నన్ను అడిగిన దాని ప్రకారం ఎక్కడో ఒకచోట వారికి నివాసం ఏర్పాటు చేయాలని అనుకున్నాను. నేను నాతో పాటు నా మిత్రులు, అన్నయ్య, ఇంగువ అనంత రామయ్య గారి మనుమడు గోపాలకృష్ణ కలిసి వీళ్ళకి పోరంబోకు స్థలం చూపించి నివాసం ఏర్పాటు చేయాలని భావించాము. వాళ్ళకి మన ఊళ్ళోనే ఒక నివాసం ఏర్పాటు చేసేందుకు తలా ఒక చేయి వేస్తున్నాము”

ఈ కధనానికి మా కుటుంబంలో వాళ్ళ స్పందన మొదలయింది. అతి త్వరలోనే ఆ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మా  భండారు సంతానం మేలిమి  బంగారం. ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఎప్పుడు ముందే వుంటారు. మేము సైతం అని ముందుకు వచ్చారు.

పిచ్చయ్య కుటుంబానికి  ఆధారం దొరుకుతుంది. కానీ ఇలాంటి అభాగ్యులు ఈ దేశంలో ఎంతమంది వున్నారో!

(25-04-2022)

24, ఏప్రిల్ 2022, ఆదివారం

ఈ ప్రశ్నకు బదులేది? – భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRAPRABHA on 24-04-2022, SUNDAY)

 

1973 లో స్వీడన్ లోని స్టాక్ హోంలో బ్యాంకు దోపిడీ జరిగింది. ఈ సందర్భంలో దోపిడీ దొంగలు కొంతమంది బ్యాంకు  సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. తమని చంపేస్తారేమోనని ముందు బందీలు భయపడ్డా, దొంగలు వారిని ఏమీ చేయలేదు. బందీలుగా వున్న రోజుల్లో వారికీ వీరికీ నడుమ ఒక రకమయిన ఆత్మీయ బంధం ఏర్పడింది. ఆరు రోజుల తరువాత వారిని విడిచిపెడతామన్నా కూడా బందీలు బయట పడడానికి  అంగీకరించలేదు. పైపెచ్చు, తమని బందీలుగా పట్టుకున్న దొంగలనే వారు సమర్ధించారు. వారిపై పెట్టిన కేసు ఖర్చులను కూడా భరించడానికి సిద్ధపడ్డారు. అంతేకాదు, బందీల్లో వున్న ఒక అమ్మాయి, బందిపోటు దొంగల్లో ఒకడిపై మనసు పారేసుకుని అతడినే ఆ తరువాత మనువాడింది కూడా. ఈ రకమయిన మనస్తత్వానికి తదుపరి రోజుల్లో ‘స్టాక్ హోం సిండ్రోం’ అనే పేరు స్తిరపడింది.

ఈ విషయం గుర్తు చేసుకోవడానికి పూర్వరంగం ఒకటుంది.

మేధావులు తమకు తెలిసింది చెబుతారు. సామాన్యులు తమ మనసులోని మాట చెబుతారు. సామాన్యుల మాటలు,  రంగూ రుచీ వాసన లేని స్వచ్ఛమయిన నీరు వంటివి.’

ఒక టీవీ చర్చలో పాల్గొంటూ నేను చెప్పిన ఈ మాటతో నాతోపాటు ఈ కార్యక్రమానికి హాజరయిన  మరో విశ్లేషకుడు ఏకీభవించలేదు.

మేధావులు, చదువుకున్నవాళ్లు, తమకున్న పరిజ్ఞానంతో అది లేని వారికి విషయం విడమరచి చెప్పి, సరయిన తీరులో వాళ్ళు కూడా ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. కాకపొతే మా ఇరువురి నడుమా ఈ సంభాషణ ‘బ్రేక్’ టైం లో సాగింది.

ఆయన అభిప్రాయం కూడా కొట్టిపారేసేది కాదు. కాని మేధావి అంటే ఎవరు? ఒక మేధావి చెప్పింది మరో మేధావి ఒప్పుకునే పరిస్తితి వుందా? అలా వుంటే మేధావి ఎలా అవుతాడు?

సరే! మా సంభాషణ సాగుతుండగానే లైవ్ షో మొదలయింది. నా అభిప్రాయాన్ని సమర్ధించుకుంటూ నేను ఓ అనుభవాన్ని ఉదహరించాను.

ఎనభయ్యవ దశకం ఆఖరులో నేను మాస్కోలో వున్నప్పుడు టీవీలో ఒక టాక్ షో చూసాను. భాష అర్ధం కాకపోయినా భావం అర్ధం అయ్యేలా ఆ షో నడిచింది. ఆ టాక్ షోలో పాల్గొనాల్సివున్న ఒక ప్రసిద్ధ నటుడు సమయానికి రాకపోవడంతో అక్కడ పనిచేసే లైట్ బాయ్ ని పెట్టి ఆ షో నడిపిస్తారు. అతడు దాన్ని యెంత సమర్ధంగా నడిపిస్తాడంటే, ఆ ఒక్క షో తోనే  ప్రేక్షకులు అతడికి బ్రహ్మరధం పడతారు. అవకాశం వచ్చినప్పుడు సామాన్యులు కూడా తమలోని ప్రతిభను బయట పెడతారని అతగాడు రుజువు చేస్తాడు.

ఇది చెప్పి, టీవీ ఛానళ్ళ వాళ్లు కూడా సామాన్యుల అభిప్రాయాలతో కార్యక్రమాలు రూపొందిస్తే జనసామాన్యం అభిప్రాయాలు మరింత బాగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం వెల్లడించాను. అయితే ఇవన్నీ చాలా పాత రోజుల ముచ్చట్లు అనుకోండి. ఇప్పుడు ఇలా మాట్లాడే సావకాశం విశ్లేషకులకు లేదు. అలాంటి అవకాశం ఇచ్చే వీలూసాలూ,  చర్చను నిర్వహించేవారికి కూడా  వున్నట్టు లేదు.

అసలింతకీ విషయం ఏమిటంటే, సమాజంలో నానాటికీ విస్తరిస్తున్న అవినీతి భూతాన్ని సామాన్యులు అంతగా పట్టించుకోవడం లేదని, వారి నిర్లిప్తత వల్ల ఎంతో అనర్ధం జరుగుతుందని ఈనాడు అనేకమంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో వారిని జాగృతం చేయాల్సిన బాధ్యత వివేకులు, విజ్ఞానులు, మేధావులు తీసుకోవాలని వారి డిమాండు. అయితే, ఇతరులని అవినీతిపరులని ముద్ర వేస్తున్న వాళ్లు సయితం ఏమీ తక్కువ తిన్నవాళ్ళు కాకపోవడం వల్లనే, ప్రజలు అవినీతిపట్ల అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న సంగతిని వాళ్లు మరచిపోతున్నారేమో అనిపిస్తున్నది. ఆరోపణలు చేసేవారికి విశ్వసనీయత అడుగంటడమే ఈ పరిస్తితికి దారితీసింది. అందరూ అవినీతిపరులే అన్న భావన, అందరూ ఆ తానులో ముక్కలే అనే అభిప్రాయం  ప్రజల్లో ప్రబలిన తరువాత ఈ నీతివాక్యాలు వారి చెవులకు సోకవు.

ఓట్లు అమ్మకాలు, కొనుగోళ్ల గురించి మా వాచ్ మన్ కుటుంబం దగ్గర ప్రస్తావన తెస్తే వాళ్ళు చెప్పిన జవాబులు కూడా ఆలోచింపచేసేలా వున్నాయి. 

‘రాజకీయాల్లో వున్నవారు ఓ పదవికి ఆశపడితే అది ధర్మం. సామాన్యులు వోటుకు  బదులుగా ఏదయినా కోరుకుంటే అది అధర్మం. నిజానికి ఓటు అమ్మడం అలవాటు చేసింది వాళ్ళే. కొనేవాడు లేకపోతే ఇక అమ్మేదెవరికి? ఓటుకింత అని ఇప్పుడు డిమాండ్ చేస్తున్న మాట కూడా నిజమే.  ఓ వెయ్యో, రెండు వేలో మా మొహాన విదిలించి గెలిచినవాళ్ళు ,కౌన్సిల్, రాజ్యసభ ఎన్నికల్లో వారి ఓటును లక్షలకు అమ్ముకుంటున్నారని టీవీల్లో చూసి తెలుసుకున్నప్పుడు, మరి  మాకు బాధగా ఉండదా! రాజకీయులు ఏదయినా ఓ పార్టీకి కొమ్ముకాస్తూ, తమ పనులు చక్కబెట్టుకుంటే అది నైతికత. రాజకీయంగా సమర్థనీయం. సమాజం మొత్తాన్ని అవినీతిరహితంగా వుంచగలిగితే అందరూ సంతోషిస్తారు. అంతే కాని, పక్కవానికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అని అంటే కుదరదు”

సామాన్యుడు అనేవాడు ఇక ఎంత మాత్రం సామాన్యుడు కాడని, అసామాన్యంగా ఆలోచించడం మొదలు పెట్టాడని  నాకు ఆ మాటలతో తెలిసి వచ్చింది. నువ్వు చేస్తున్నది తప్పు అని అతడికి  చెప్పగలిగే స్థాయి నాకు వుందని నేను అనుకోను.

రాజకీయ నాయకులు, ఆ మాటకు వస్తే సమాజంలో ఎంతోకొంత పలుకుబడి కలిగిన వాళ్లందరూ తమ స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నప్పుడు, తమ విషయంలోనే ఈ పెద్దలు సుద్దులు నూరిపోయడం సామాన్యులు జీర్ణం చేసుకోలేకపోతున్నారన్న మాట.

తోకటపా:  

పూర్వం ఓ మహారాజు పెద్దమనసుతో ప్రతిరోజూ అన్నార్తులకు అన్నదానం చేస్తుండేవాడు. ఇలా పుణ్య కార్యాలు చేస్తూ ఎంతో పుణ్యం మూటగట్టుకుని స్వర్గంలో మంచి స్థానాన్ని ఇప్పటినుంచే సంపాదించి పెట్టుకుంటున్నాడు అని జనం అందరూ వేనోళ్ళ చెప్పుకునేవారు. అయితే అలా దానం చేస్తున్న అన్నం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ‘ఎంగిలి’ అవుతోందన్న విషయం ఆ రాజు గారికి తెలియదు. కాని ఈయనగారు ఇలా నిత్యాన్నదానం కొనసాగిస్తూవుంటే, మరో పక్క నరకంలో ‘ ఆ ఎంగిలి కూడు’ ఓ కొండలా పెరగడం మొదలయింది. త్రిలోక సంచారి అయిన నారదుడు ఈ కొండ విషయం గమనించి ఆ విషయాన్ని భూలోకానికి వచ్చినప్పుడు ఆ రాజుగారి చెవిన వేసాడు. రాజు కంగారు పడిపోయి తరుణోపాయం కోరాడు. అప్పుడు నారదుడు ఇచ్చిన సలహా రాజుగారికి నచ్చకపోయినా గత్యంతరం లేక అమలు చేసాడు. నారద ముని సూచన మేరకు ఓ ఒంటిస్థంభం మేడ కట్టించి అందులో యుక్తవయస్సులో వున్న తన ఏకైక కుమార్తెను ఒంటరిగా వుంచాడు. ప్రతిరోజూ సాయం సంధ్యవేళలో ఆ భవనానికి వెళ్లి, కుమార్తె పడకగది బయట తెల్లవారేవరకు ఆమెకు తెలియకుండా గడిపి తిరిగి రాజభవనం చేరుకునేవాడు. రాజుగారి ఈ వ్యవహారం ఆ నోటా ఈనోటా పడి చివరకు ప్రజలు చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. సొంత కుమార్తెతో రాజు గారికి అక్రమ సంబంధం అంటగట్టి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. భూలోకంలో జనం రాజుగారికి వ్యతిరేకంగా అపనిందల ప్రచారం పుంజుకుంటున్నకొద్దీ, అక్కడ నరకంలో రాజుగారి ‘ఎంగిలి కొండ’ క్రమంగా తరిగిపోవడం మొదలయింది.

త్రిలోక పూజ్యుడయిన నారద మునీంద్రులు రాజుగారి పాప ప్రక్షాళన కోసం ఇచ్చిన సలహా మహిమ అది.

మాదోరి పాప. ఆదోరి బయ్యాలి’ అని కన్నడంలో ఒక సూక్తి. అంటే ఒకరు చేసిన పాపాన్ని వేరొకరు అదేపనిగా చెబుతుంటే ఆ పాపంలో వాటా వాళ్ల ఖాతాలోకి కూడా చేరుతుంది.



 

23, ఏప్రిల్ 2022, శనివారం

తలెత్తుకుని జీవిద్దాం! – భండారు శ్రీనివాసరావు

 

ఆరేళ్ల క్రితం చక్కటి మాట చెప్పాడు నిర్మల్ అక్కరాజు. చక్కటి మాట కాబట్టే ఇప్పటిదాకా గుర్తుంది.

ఆ రోజుల్లో నేను ప్రతి   రోజు   ఒక టీవీ స్టూడియో చర్చకు  వారంలో ఏడురోజులు వెడుతుండేవాడిని. ఇది ప్రతి రోజూ ఉదయం తంతే కనుక మా ఆవిడ నాకు ‘వారాలబ్బాయి’ అనే నిక్ నేమ్ పెట్టింది.

ఆ క్రమంలో నాకు ప్రతి గురువారం ఉదయం స్నేహ టీవీలో ఉభయం. అంటే ఆనాటి వార్తల మీద విశ్లేషణ.

ఒకరోజు ప్రోగ్రాం అయిపోయి తిరిగొస్తున్నప్పుడు అతనన్న మాట ఇది.

తలెత్తుకుని జీవిద్దాం’.

ఈ మాట అంటూ అతడు చూపించిన వైపు దృష్టి సారించాను. రోడ్డు మీద కనబడ్డ వారందరి చేతుల్లో సెల్ ఫోన్లు వున్నాయి. వారిలో రాత్రంతా ప్రయాణం చేసి బస్సులు దిగిన వాళ్ళున్నారు. వాళ్ళను ఇళ్ళకు చేరవేసే ఆటో డ్రైవర్లు వున్నారు. రోడ్లు ఊడ్చే పనివారు వున్నారు. దాదాపు అందరూ తలదించుకుని మొబైల్ ఫోన్లలోకి చూస్తున్నారు.

నిజమే! వీరందరూ ‘తలెత్తుకుని’ ఎప్పుడు జీవిస్తారు?

అప్పట్లో  నిర్మల్  అక్కరాజు టీవీ యాంఖర్. నిజానికి ఆయన ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు. కానీ ఇంత పొద్దున్నే లేచి వచ్చి చేసే ఈ యాంఖర్ కొలువు మాత్రం ఆయన ఇష్టపడి నెత్తికెత్తుకున్నది. అసలాయన అసలు ఇష్టం రేడియో. ఆదివారం సెలవయినా పనికట్టుకుని, ఒకప్పుడు నేను పనిచేసిన రేడియోకి వెళ్లి వార్తలు చదువుతాడు. ఇష్టమయిన పనిచేసేటప్పుడు కష్టం అనిపించదు అంటాడు రేడియో మీద చిన్నప్పటి నుంచి అవ్యాజమైన అనురాగం గుండెలనిండా నింపుకున్న ఈ పెద్దమనిషి.



(PHOTO COURTESY: IMAGE OWNER)


 

21, ఏప్రిల్ 2022, గురువారం

మంచి పిచ్చి అధికారి – భండారు శ్రీనివాసరావు

 ఇది ఇప్పటి మాట కాదు. ఈ రోజుల్లో అయితే ఇలాంటి అనుభవాలకు ఆస్కారమే లేదు.

ఏమండీ ఆయన గారు వచ్చారు, మళ్ళీ ట్రాన్స్ ఫర్ అయిందేమో!”

బయటకు వచ్చి చూస్తే ఆయనే. మొహం వాడిపోయినట్టు వుంది. మనిషి దిగాలుగా వున్నాడు.

పేరుకు పెద్ద అధికారి. పైగా సీనియర్ ఐ.ఏ.ఎస్. మా ఇంటికి వచ్చి నాకోసం ఎదురు చూడడం ఏమిటి చిత్రం కాకపోతే!

నిమిషాల్లో తయారై ఆయన్ని తీసుకుని ఆటోలో వెళ్ళాల్సిన వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆయన్ని బయట కూర్చోబెట్టి లోపల చెప్పాల్సిన వాళ్లకు ఆయన గురించి చెప్పాను.

నువ్వు ఇంతగా చెప్పాలా శ్రీనివాసరావ్ ఆయన గురించి నాకు బాగా తెలుసు. నిజాయితీపరుడు. తన డ్యూటీ శ్రద్ధగా చేస్తాడు. కానీ..”

ఆ కానీ ఏమిటో నాకూ తెలుసండీ. మీరు ఆయన అడిగిన పోస్టు ఇస్తే, రేపు నేను వెళ్లి ఆయన్ని కలిసినా ఎవరు నువ్వు అన్నట్టే చూస్తారు. ఫోన్ చేసినా రెస్పాన్స్ వుండదు. మళ్ళీ బదిలీ అయిన దాకా నేనెవరన్నది ఆయనకు గుర్తు కూడా వుండదు. ఏ పని చేయాలన్నా రూలు బుక్కే వేదం. మీరే కాదు, ముఖ్యమంత్రి చెప్పినా వినే రకం కాదు. నిజంగా ఇలాంటి అధికారులే కావాలి. అందుకే వెంట బెట్టి తీసుకువచ్చాను. ఇక మీ ఇష్టం” అనేశాను.

నేనూ అదే చెబుతున్నా! ఇక నీ ఇష్టం. ఈసారి చేస్తాను. ఆరు నెలల్లో మళ్ళీ నువ్వే వస్తావు, ఆయన సంగతి చూడమని. రూలు బుక్కు అంటూ ఎక్కడా ఇమిడే రకం కాదు. ఎవరి మాటా వినే రకం కాదు.” అన్నాడా మంత్రిగారు.

మూడు రోజుల్లో ఆయన కోరుకున్న పోస్టు దొరికింది. నాకు తెలుసు దొరుకుతుందని. మరో విషయం కూడా తెలుసు తిరిగి బదిలీ అయ్యేదాకా నేను ఎవరన్నది ఆయనకు గుర్తు కూడా ఉండదని.

అయితే ఇలాంటి నిజాయితీ అధికారులు వుండాలి అని కోరుకునే వాడిని కనుక ఆయన నన్ను పట్టించుకున్నాడా లేదా అనే విషయాన్ని పట్టించుకునే వాడిని కాదు.

పొతే, ఇంత నిబద్ధత కలిగిన అధికారికి  పోస్టింగుల మీద  ఈ వ్యామోహం ఏమిటి అనే అనుమానం తొలుస్తూ వుండేది.

ఒకసారి బదిలీ అయినప్పుడు ఆయనే చెప్పారు ఇలా.

సాయం చేయగలిగిన అదీ అవసరంలో వున్న పేదవారికి సహాయపడగలిగిన పోస్టులో వుంటే చేయగలిగింది చేస్తాను. కలక్టరుగా వున్నప్పుడు ఆ స్వేచ్ఛ వుండేది కొంతవరకు. కానీ సచివాలయానికి వచ్చిన తర్వాత అలా కుదరదు. ఎవరికీ ఉపయోగపడలేని పోస్టులో వేస్తె,  గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని జీతం తీసుకుకోవడం తప్పిస్తే ఏం చేయగలను చెప్పు”

అది సరే! మీకు సాయం చేసిన వారి మాట చెవిన పెడితే, మీ గురించి అలా మాట్లాడరు కదా!”

సరి సరి భలే మాట చెప్పావు. వాళ్ళ మాటలు వినడం మొదలు పెడితే నాచేత వాళ్ళు చేయించేవి పనులు కాదు, అకృత్యాలు”

(ఆ అధికారి ఎవరన్నది ముఖ్యం అనుకోను. ఆయనిప్పుడు జీవించి కూడా లేరు. సర్వీసులో ఉన్న రోజుల్లో తోటి అయ్యేసులు ఆయనకి పెట్టిన పేరు పిచ్చోడు)

20, ఏప్రిల్ 2022, బుధవారం

గద్దర్ టు గణేశా! – భండారు శ్రీనివాసరావు

 రెయిన్ బో ఇయర్స్. ఒక తెలుగువాడు రాసిన ఇంగ్లీష్ నవల. దీన్ని నవల అనాలా! లేక కాల్పనిక పాత్రలతో కూర్చిన ఒక వ్యక్తి వాస్తవ  జీవన చిత్రం అనాలా! రాసింది ఆషామాషీ వ్యక్తి అయితే ఇంత చర్చ అనవసరం. కర్నాటక కేడర్ లో అడిషినల్ చీఫ్ సెక్రెటరీ స్థాయివరకు ఎదిగిన ఓ సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి రాయడం వల్ల, పుస్తకం టైటిల్ కు CONFLICTS TO CONTENTMENT అనే ట్యాగ్ లైన్ జోడించడం వల్ల పెరిగిన ఆసక్తి కారణంగా ఈ పుస్తకం గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏర్పడింది.

పుస్తక పరిచయ కార్యక్రమం నిన్న మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని టూరిజం ప్లాజాలో జరిగింది. మండుటెండ మాడుస్తున్నా సభామందిరం కిటకిటలాడింది. అనేకమంది విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారులు, రచయితలు, పాత్రికేయులు హాజరయ్యారు. హాజరీ ఈ స్థాయిలో ఉండడానికి ఈ పుస్తకం గురించి నిన్న ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో మావో నుంచి మహర్షి దాకా అనే శీర్షికతో శ్రీ కారుసాల వెంకటేష్ రాసిన సవివర సమీక్షా వ్యాసం  కూడా చాలావరకు కారణం అని చెప్పవచ్చు.  

పుస్తక రచయిత పేరు మాఢభూషి మదన్ గోపాల్. తెలంగాణా గడ్డ మనిషి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మదన్ గోపాల్ తండ్రి ఎం. వెంకటాచారి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. పుచ్చలపల్లి సుందరయ్యగారితో కలిసి పనిచేశారు.  వామపక్ష భావజాలంతో పుట్టి పెరిగిన మదన్ గోపాల్, మరో అడుగు ముందుకు వేసి మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ సానుభూతిపరుడిగా ఎదిగారు. ఇటువంటి వ్యక్తి  ఇండియన్ సివిల్ సర్వీసులో  ఐ.ఏ.ఎస్. హోదా పొందడం ఓ విచిత్రం.  నక్సలైట్ అభిమాని అనే కారణంతో కొన్నాళ్ళు సస్పెండ్ అయిన చరిత్ర కూడా వుంది.

నవలల్లో రచయిత కధని మలుపులు తిప్పినట్టే, ఊహకు అందని, మనిషి బుర్రకు చిక్కని  ఏదో  మానవాతీత శక్తి కూడా మనుషుల జీవితాలను అనేక మలుపులు తిప్పుతుంది. ఈ క్రమంలో   అనేకరకాల ఘర్షణలు, సంఘర్షణలు. (CONFLICTS).  మరి  CONTENTMENT సాధించడం ఎల్లా!

(ఈ పుస్తకం నేనింకా చదవలేదు. అంచేత ఇందులో పేర్కొన్న అంశాలు ఒక క్రమంలో ఉన్నాయా లేదా అనేది నాకు తెలియదు.  సభలో మాట్లాడిన దాన్నిబట్టి. ఆ తర్వాత ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నప్పుడు చెవినపడ్డ విశేషాలు ఇవి)

మదన్ గోపాల్ కి  చలం గురించి ఎవరు చెప్పారో తెలియదు. తిరువన్ణామలైలో ఉంటున్న గుడిపాటి వెంకటాచలంతో ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలు పెట్టారు. ఆ ఉత్తరాలు చదివిన చలం, నీ రాతలతో నా తల తినడం ఆపేసి ఓసారి నా దగ్గరకు రా అని ఓ కార్డు ముక్కమీద జవాబు రాసిపడేసారు.

మదన్ ఆ పిలుపు పట్టుకుని రమణాశ్రమానికి బయలుదేరి వెళ్ళారు. ఆ సమయంలో చలం,  వచ్చిన వాళ్ళని కలుసుకుంటున్నారు. మదన్ గోపాల్ వెళ్లి ఎదురుగా నిలబడితే ఎవరు నీవు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తుంటావు అనే ప్రశ్న ఒక్కటి కూడా వేయకుండా, వెంటనే  ఆయనకు బస ఏర్పాటు చేశారు. పొద్దున్నే ఉపాహారం కాసేపు తోటపని. పగలు చలం చెంత గడపడం. శ్రీ రమణుని బోధనలు గురించి తెలుసుకోవడం. అప్పుడు అనిపించింది. జీవితం అంటే వేరే ఒకటి వుందని. దాని ద్వారా లభించే CONTENTMENT  ఒకటి ఉంటుందని. మూఢ భక్తి వేరు, ఆధ్యాత్మిక చింతన వేరు . ఆధ్యాత్మికత అంటే తనను తాను తెలుసుకోవడం. అదే శ్రీ రమణుని భక్తిమార్గం అని అప్పుడే తెలిసింది.

సరే ముందు మొదలు పెట్టిన గద్దర్ టు గణేశా ఏమిటి అంటే!

పుస్తక పరిచయ కార్యక్రమం మొదలు కాబోతున్న తరుణంలో వచ్చిన ప్రజా గాయకుడు గద్దర్ ని మదన్ గోపాల్  గద్దర్ లోగడ పాడిన ఓ పాట పాడుతూనే  సగౌరవంగా ఆహ్వానించారు. ఆ తర్వాత గణపతి ప్రార్ధనతో సభ మొదలయింది.

నా ఈ రాతలో కూడా కొన్ని CONFLICTS  కనిపించివుంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే, నేనింకా CONTENTMENT   దశకు చేరుకోలేదు.

తోకటపా: కొత్త పుస్తకం కోసం వెడితే పాత మితృలు, పాత పరిచయస్తులైన అనేకమంది ..ఎస్. అధికారులు కనిపించారు. మిత్రుడు జ్వాలా కోరికమీద రచయిత మదన్ గోపాల్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్,  తెలంగాణా పబ్లిక్ సర్వీసు కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, 108 సర్వీసు మాజీ సీఈఓ వెంకట్ చంగవల్లి, 104 సర్వీసు  మాజీ సీఈఓ డాక్టర్ ఉట్ల బాలాజీ అందరం కలసి జ్వాలా ఇంటికి వెళ్లాం.

మా మేనకోడలు, జ్వాలా శ్రీమతి అయిన వనం  విజయలక్ష్మి,  వండనలయదు నేవురువచ్చిరేని నన్నపూర్ణకు నుద్దియౌనతని గృహిణి” అనే ప్రవరాఖ్యుని ఇల్లాలు బాపతు కాబట్టి, మా అందరికీ అప్పటికప్పుడు వండివార్చిన వేడి వేడి విందుభోజనం నిన్నటి మా కలయికలో నిజంగా హై లైట్.

కింది ఫొటోల్లో : అష్టగ్రహ కూటమి అంటే మేమే. మేము ఎనిమిదిమందిమి అన్నమాట.

PHOTOS COURTESY: JWALA










(20-04-2022)

 

నాకు తెలిసిన చంద్రబాబు - భండారు శ్రీనివాసరావు

 (ఏప్రిల్ 20 చంద్రబాబు జన్మదినం)

“నారా చంద్రబాబు నాయుడు అను నేను .....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా...” అంటూ రెండుసార్లు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రేడియో విలేకరిగా నేను ప్రత్యక్ష సాక్షిని. మూడోమారు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేనాటికి నేను యాక్టివ్ జర్నలిజంలో లేను.
27 ఏళ్ళ కిందటి సంగతులు. ఇప్పుడు నలభయ్ ఏళ్ళ వయసులో ఉన్నవారికి కూడా ఆనాటి సంగతులు సరిగ్గా గుర్తు వుండే అవకాశం లేదు. ఇప్పుడు అంటే ప్యాంటు చొక్కాల రాజకీయ నాయకులు చాలామంది కనబడుతున్నారు. కానీ ఆ రోజుల్లో ప్యాంటు షర్టు చీఫ్ మినిస్టర్ ని చూడడం కొంచెం అటూ ఇటూగా అదే అదే వయసులో వున్న మా బోటి జర్నలిస్టులకు అదే ప్రధమం. పరిచయాలు పెరగడానికి, బలపడడానికి అదొక్కటే కారణం కాదు. పాత్రికేయులతో సత్సంబంధాలు కలిగి ఉండాలనే చంద్రబాబు తత్వం కూడా ప్రధాన కారణం. అంచేత అనేక అనుభవాలు, చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఆయనతో ముడిపడి వున్నాయి.
ఊహకు అందని రాజకీయ పరిణామాల నేపధ్యంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడెనిమిది మాసాలకు ఆయన పుట్టిన రోజు వచ్చింది. ముఖ్యమంత్రి జన్మదినం అంటే చాలా హడావిడి వుంటుంది. కానీ అప్పటికి ఎన్టీఆర్ మరణించి మూడు మాసాలే అయింది. ఆ పరిస్తితిలో వేడుకలు సంభావ్యం కావని భావించి, తనకు శుభాకాంక్షలు చెప్పదలచుకున్న వాళ్ళు పెద్ద పెద్ద పుష్ప గుచ్చాలతో హడావిడి చేయవద్దని చంద్రబాబు ముందస్తుగానే ప్రజలకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు పత్రికాముఖంగా విజ్ఞప్తి చేసారు. సాధారణంగా నాయకులు చేసే ఈ నిరాడంబర వినతులను అభిమానులు, కార్యకర్తలు పెద్దగా పట్టించుకోరు. (విజయవాడ నుంచి ఒక ఉపాధ్యాయురాలు ప్రతియేటా క్రమంతప్పకుండా విజయవాడ నుంచి ముందు రాత్రి బస్సులో వచ్చి ఉదయమే ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పి మళ్ళీ వెంటనే బస్సు పట్టుకుని తిరిగి వెళ్ళిపోవడం ఒక విలేకరిగా నాకు తెలుసు)
అభిమానుల తాకిడి తప్పించుకోవడానికి తరువాతి సంవత్సరాలలో చంద్రబాబు మరో పద్దతిని ఎంచుకున్నారు. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం పెట్టుకుని పుట్టినరోజున ఇంట్లో లేకుండా ఆ రోజంతా ప్రజల నడుమన గడపడం.
ఒక తరానికి చెందిన రాజకీయ నాయకులు అందరితో పోలిస్తే చంద్రబాబు అదృష్టవంతులయిన రాజకీయులలో మొదటి స్థానంలో నిలుస్తారు. అత్యంత పిన్న వయసులో మంత్రి అయ్యారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాగలిగారు. జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగగలిగారు. టీడీపీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో కేంద్రంలో ఆయనంటే పొసగని ప్రభుత్వం వుండేది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబు కనుసన్నల్లో మెలిగే కేంద్ర ప్రభుత్వం వుండేది. రాజకీయంగా చూసినప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రికి ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది కనుక.
ముందే చెప్పినట్టు ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని రాస్తున్న వ్యాసం ఇది. దీన్ని గమనంలో వుంచుకుంటే రాజకీయంగా ఆయనతో విబేధించేవారికి అనవసరమైన అనుమానాలు కలగవు. ఆయనను అభిమానించేవారికి వారు కోరుకునే అవసరమైన అంశాలు కనబడవు. గత నలభయ్ ఏళ్ళకు పైగా ఆయనతో వృత్తిపరంగా పెంచుకున్న సాన్నిహిత్యం కారణంగా తెలియవచ్చిన కొన్ని సంఘటనలు ఒక చోట గుదిగుచ్చి, వాటి ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని బేరీజు వేసుకునే అవకాశాన్ని పాఠకులకే వదిలిపెడుతున్నాను.
కరెంట్స్ కట్స్
చంద్రబాబు నాయుడు గారు తొలిసారో, మలిసారో 'మీడియా సావీ ముఖ్యమంత్రి'గా ఉమ్మడి రాష్ట్రంలో ఎదురులేని పాలన సాగిస్తున్నప్పుడు, భవదీయుడికి ఒక 'ధర్మ సందేహం' కలిగింది. కరెంటు 'కట్లు' ఏ టైంలో ఎక్కడెక్కడ ఎంతసేపు ఉంటాయో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే తెలియచేసి, తదనుగుణంగా వాటిని అమలు చేసే పని ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. ఏమాటకామాటే చెప్పుకోవాలి. కరెంటు కొరత పుష్కలంగా ఉన్నప్పటికీ, కోతలు మాత్రం ఠంచనుగా టైం ప్రకారం ఆయన హయాములో అమలయ్యేవి. కరెంటు తీయడం, ఇవ్వడం ఒక పధ్ధతి ప్రకారం జరిగేవి. ఇక ఆ కోతల సమయాలు ఒకసారి పరికిస్తే, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఒకే సమయంలో కరెంటు వుండే అవకాశం లేదు. కరెంటు లేకపోతే టీవీలు పనిచెయ్యవు. ఇలాటి సందర్భాలలో కూడా కరెంటు అవసరం లేని రేడియోని పక్కన బెట్టి, కరెంటు లేకుండా పనిచేయని 'టీవీ' లకు ముఖ్యమంత్రిగారు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు. అదీ, నాక్కలిగిన ధర్మ సందేహం. 'వాళ్ళనీ వీళ్ళనీ ఎందుకు నేరుగా ఆయన్నే అడుగుదాం' అనుకుని ఒకోజు విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఆయన తన చాంబర్ కు వెడుతున్నప్పుడు మధ్యలో కలుసుకుని నా మనసులో మాట చెప్పాను. 'మీరు చెప్పేది ప్రజలకు చేరాలని అనుకుంటున్నారా లేక మీరు చెప్పేది మీరే చూడాలనుకుంటున్నారా?' అని. మడత పెట్టి అడిగినా నా ప్రశ్నలోని మర్మం ఇట్టే గ్రహించగలిగినవాడు కనుక సమాధానంగా ఓ నవ్వు నవ్వి, 'సాంబశివరావుగారూ! (నాటి ముఖ్యమంత్రి పేషీలో ఐ.ఏ.ఎస్. అధికారి) శ్రీనివాసరావు ఏదో అంటున్నాడు, కాస్త వినండి' అంటూ విషయం ఆయనకు వొప్పచెప్పి లోపలకు వెళ్ళిపోయారు.
ఆకస్మిక పర్యటనల ఆకర్షణ
ఉమ్మడి రాష్ట్రంలో ఆరోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు ఒక ఆకర్షణ. తన పరిపాలన విభిన్నంగా ఉంటుందని ప్రజలకు తెలియచెప్పడానికి ఆయన ఎంచుకున్న విధానం ఇది. ఒకరోజు పొద్దున్నే విలేకరులు వెంటరాగా ఒక ప్రత్యేక బస్సులో బయలుదేరేవారు. ఒకరోజు వెంగళరావు పార్కు దగ్గర చెత్తపోగు ఒకటి ఆయన కంటపడింది. వెంటనే సంబంధిత మునిసిపల్ అధికారికి ఫోను చేశారు. ఆ అధికారి అప్పటికి నిద్ర లేచి వుండడు. భార్య ఫోను తీసిందేమో!
’నేనమ్మా! చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’ అని ఆయన అనడం పక్కనే వున్న మా అందరికీ వినబడుతూనే వుంది. నిద్రనుంచి లేచి ఫోనులో ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత ఆ అధికారికి మళ్ళీ నిద్రపట్టి వుండదు.
‘నేను నిద్ర పోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనే ఈ తరహా ప్రవృత్తి, ‘ఒకే ఒక్కడురా’ మన ముఖ్యమంత్రి అనే సంతృప్తిని జనంలో కలిగిస్తే, కింద పనిచేసే ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిలించింది. ‘బాస్ అనేవాడు తనకు ఏం కావాలో చెప్పి ఆ విధంగా చేయించుకోవాలి కానీ ఆయనే అన్నింట్లో తలదూరిస్తే యెట్లా?’ అనేది సిబ్బంది వాదనగా వుండేది.
కాకినాడ రేడియో స్టేషన్
ఇది ఏర్పాటు కావడానికి ముందు ఒక చిన్న కధ నడిచింది. రేడియో స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించడానికి ముందు స్థానిక రెవెన్యూ అధికారులు ఒప్పుకోలేదు. ఇప్పుడు రేడియో వినే వాళ్ళు ఎవ్వరు, దానికోసం స్థలమా అని ఎద్దేవాచేసిన వాళ్ళు కూడా వున్నారు. హైదరాబాదులోని ఆకాశవాణి కేంద్రంలో సివిల్ వర్క్స్ చూసే ఇంజినీర్ రాజు పట్టుకుంటే వదిలే రకం కాదు. నన్ను అడిగితే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకు వెళ్లాను. విషయం చెప్పాను. ఆయన ఆ బాధ్యతను తన కార్యాలయంలో పని చేసే ఐఏఎస్ అధికారి సాంబశివరావు గారికి ఒప్పచెప్పారు. ఆ అధికారి వెంటనే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తక్షణం స్థలాన్ని రేడియో అధికారులకు అప్పగించి ఆ విషయం వెంటనే సీఎం పేషీకి తెలియపరచాలని, ఈ విషయంలో ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో వున్నారని చెప్పారు.
అంతే! పెద్ద ఆటంకం ఆ విధంగా చంద్రబాబు చొరవతో తొలగిపోయింది.
చంద్రబాబు నవ్వుతారా!
సీరియస్ గా పనిచేసుకుపోతూ చంద్రబాబు నవ్వుకు దూరం అయ్యారా అని అప్పట్లో విలేకరులకు అనిపించేది. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ పైచిలుకు కాలంలో 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్ రాదని మానేసారేమో తెలియదు. కాని ఆయనా నవ్వుతారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే!
1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వానాలు పంపారు. 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు ప్రాంతీయ వార్తలు సమాప్తం అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు ఎదురుగానే వున్న జూబిలీ హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గరే పోలీసుల హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు. విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. నేనంటే ఎదురుగా వున్నాకనుక వెంటనే వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే అనుకున్నా. ఈ లోపల సీపీఆర్వో విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు. కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, ‘సీఎం బయలుదేరి రావచ్చా’ అని. మొత్తం మీద కొంత కోరం పూర్తయింది. చంద్రబాబు వచ్చేసారు. విలేకరులు పలుచగా వుండడాన్ని ఆయన కూడా గమనించారు.
'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను, నేను కల్పించుకుంటూ. అవేమిటో చెప్పమని అడిగారు చంద్రబాబు.
'నెంబర్ వన్. ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడే అవకాశం వుంది'
'అయితే...'
'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్ వన్ డే మ్యాచ్ వస్తోంది'
'వూ..'
'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక్కడేమి వుంటుంది. మా ఆఫీసు దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'
ఆయనకు అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.
పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు.


(కాలు విరిగి ఆసుపత్రిలో వున్న రచయితకు ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శ)