26, మార్చి 2021, శుక్రవారం
ఇందిరాగాంధి పొట్టలో చుక్క – భండారు శ్రీనివాసరావు
Y2K
1998, 1999 ప్రాంతాల్లో ఈ Y2K అనే పదం చాలా పాపులర్. ఈ పేరుతొ హైదరాబాదులో కొన్ని బార్లు, రెస్టారెంట్లు కూడా వెలిశాయి.
డిసెంబరు 31 తర్వాత జనవరి ఒకటి రావాలి. ఇదేమంత వింత విషయం
కాదు. కానీ ఆ రోజుల్లో ఇదొక వింత విషయమే కాదు చాలా పెద్ద విషయమే అయికూర్చుంది.
అప్పటివరకు 1998 తర్వాత
1999 ఇలా ఆటోమేటిక్
గా గడియారాల్లో,
కంప్యూటర్లలో తేదీలు మారిపోయేవి. మరి 1999 31 తర్వాత 2000
వస్తుందా రాదా అనేది కంప్యూటర్ వర్గాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇదేదో ఒక్క
దేశానికి సంబంధించింది, ఏదో ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. ఇప్పటి కరోనా లాగా
అప్పుడు ఈ Y2K కొరకరాని
కొయ్యగా తయారైంది. ఇందుకోసం చాలా సంస్థలు రాత్రికి రాత్రి పుట్టుకొచ్చాయి. అమీర్
పేట పేరు ప్రఖ్యాతులు విశ్వవ్యాప్తం కావడానికి Y2K ఒక కారణం అని చెప్పుకునేవారు. 1999 31 తర్వాత
2000 అంకె
రావడానికి వీలుగా చాలా పరిశోధనలు జరిగాయని చెప్పుకునేవారు. మొత్తం మీద ఆ సమస్య
పూర్తిగా పరిష్కారం అయిందనుకోండి.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే నా బ్లాగులో వీక్షకుల
సంఖ్య తొమ్మిది లక్షలు దాటింది. మరో ముప్పయి రెండు వేలు అయితే అది పది లక్షల
మార్కు చేరుకుంటుంది. అక్కడ ఉన్నవేమో ఆరు గళ్ళు. 10,00000 కనపడాలంటే మరో గడి అవసరం అవుతుంది.
అంత పెద్ద Y2K సమస్యే పరిష్కారం అయినప్పుడు ఇంత చిన్న విషయం
గురించి మధనపడే అవసరం ఏముంటుంది?
(26-03-2021)
ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం! - భండారు శ్రీనివాసరావు
దృశ్యం ఒక్కటే.
చూసేవారికి రెండు రకాలుగా
కనిపిస్తుంది.
వైద్య పరిభాషలో ఈ జబ్బుని ఏమంటారో
జనాలకు తెలవదు.
కానీ, ఒకే
వార్త వివిధ పత్రికల్లో వేర్వేరు రూపాల్లో వస్తే మాత్రం – అందుకు కారణాలేమిటో ఇప్పుడు ప్రజలు అర్ధం చేసుకోగలుగుతున్నారు.
ఒక సభ కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి, ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా
విలేకరుల సమావేశం కానివ్వండి – వేర్వేరు పత్రికలు వేర్వేరు కోణాల్లో - వార్తలు వండి వారుస్తున్న తీరు ఇటీవలి కాలంలో
ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే మీడియా. యే ఛానల్ మార్చి చూసినా ఇదే వరస.
తాము చదివే పత్రిక, తాము చూసే ఛానల్ వైవిధ్య భరితంగా వుండాలని ఎవరయినా కోరుకుంటారు. అందుకే, ప్రభుత్వ ఆజమాయిషీ లోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేట్ ఛానల్ల శకం
ప్రారంభమయినప్పుడు జనం ఆ మార్పుని సాదరంగా ఆహ్వానించారు. కానీ కోరుకున్న మార్పు
కోరిన విధంగా కాకుండా గాడి తప్పుతున్నదేమో అన్న పరిణామాన్ని వారు జీర్ణం
చేసుకోలేకపోతున్నారు.
ఇరవై నాలుగ్గంటల వార్తా ఛానళ్ళ పుణ్యమా
అని ఈనాడు సమాచారం టన్నుల లెక్కల్లో జనాలకు చేరుతోంది. ఇందులో అవసరమయినదెంత? అన్నది ప్రశ్నార్ధకమే! ఇంతంత సమాచారాన్ని మనిషి మెదడు యే మేరకు
హరాయించుకోగలదన్నది ఛానళ్ళ వాళ్ళే చెప్పాలి. ఎన్ని విన్నా మెదడు తనకు
చేతనయినంతవరకే తనలో నిక్షిప్తం చేసుకుని మిగిలినవి వొదిలేస్తుందని అంటారు. ఇదే
నిజమయితే – టీవీ ఛానళ్ళ ద్వారా ప్రజలకు చేరుతున్న సమాచారంలో సింహభాగం వృధా
అవుతున్నదనే అనుకోవాలి. విన్నదానికంటే చదివిందీ, చదివినదానికంటే
రాసిందీ, రాసిన దానికంటే చూసిందీ ఎక్కువకాలం
గుర్తు వుంటుందని ఓ సూత్రం. కానీ ఈ సిద్ధాంతానికి సయితం ఈ సమాచార విస్పోటనం
చిల్లులు పొడుస్తోంది. ‘పీపుల్స్ మెమోరి షార్ట్’ – అంటే ప్రజలకు చిరకాలం ఏదీ గుర్తు
వుండదు అనే ధీమాతోనే రాజకీయనాయకులు స్వవచన ఘాతానికి
పూనుకుంటూ వుంటారు. బహుశా ఈ సూత్రాన్నే ఛానల్స్ పాటిస్తున్నాయని అనుకోవాలి.
ఇంతకీ విషయం ఏమిటంటే- సృష్టికర్త
జనాలకు ‘మరపు’ అనే అద్భుతమైన వరాన్ని ప్రసాదించి ఎంతో మేలు చేసాడు. లేకపోతె, ఒకే రోజు ఒకే వార్తను భిన్న కోణాల్లో చదివి చదివి – ఒకే ప్రకటనలోని
సారాంశాన్ని వేర్వేరు రకాలుగా చూసి చూసి – ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతుండేవారు.
వెనుకటి రోజుల్లో పత్రికల్లో ‘ఘాటుగా
విమర్శించారు’ అని రాస్తే అక్కడికి అదే గొప్ప. ఇక ఇప్పుడో- ‘నిలదీశారు. నిప్పులు
చెరిగారు. మండిపడ్డారు’ ఇలాటి విశేషణాలు కోకొల్లలు.
పోతే, టీవీ
చర్చల్లో పాల్గొనే వారిని పరిచయం చేయగానే వారు ఏం మాట్లాడబోతున్నారో ఇట్టే
తెలిసిపోవడం మరో దౌర్భాగ్యం. ఒక అంశాన్నివిశ్లేషించాల్సివచ్చినప్పుడు అందులోని
వివిధ పార్శ్వాలను ప్రస్తావించడం సహజం. కానీ సంబంధలేని విషయాలను ఎత్తుకుంటూ, చర్చను పక్క దోవ పట్టించేవారిని కట్టడి చేయలేకపోవడాన్నే వీక్షకులు
ప్రశ్నిస్తున్నారు.
వీటికి జవాబు దొరకదు. అయితే, ఇష్టం లేకపోతే ‘కట్’ చేయడానికి ‘ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం’ అనే పడికట్టు
పదం మాత్రం సదా సిద్ధం.
25, మార్చి 2021, గురువారం
జగన్ సుప్రీం కు రాసిన లేఖ పరిణామాలు ఇప్పుడెలా వుంటాయి?
జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే.....
‘మృత్యుక్రిమి’ కరోనాకు ఏడాది – భండారు శ్రీనివాసరావు
సమస్త
మానవాళినీ కలవరపరుస్తున్నది కరోనా అనే మూడక్షరాల పదం. ఏడాది గడిచిన తర్వాత
తగ్గుముఖం పడుతోంది,
వాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చిందని
సంబరపడుతున్న సందర్భంలో మరోసారి ఈ వ్యాధి కోరలుసాచి
విస్తరించబోతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
సాధారణంగా, ఈగలు, దోమలు, లేదా
ఇతర క్రిమికీటకాల ద్వారా అంటువ్యాధులు వ్యాపిస్తాయి. ఈ కరోనా అనే మాయరోగం మాత్రం
మనుషుల నుంచి మనుషులకు పాకుతుంది. ఈ విలక్షణ తత్వమే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపట్ల
ప్రజల భయాందోళనలు ఒక స్థాయికి మించి ప్రబలడానికి కారణమయింది.
‘పనిచేసే
ప్రభుత్వం కావాలని అందరం కోరుకుంటాం. అయితే ప్రభుత్వం నిశ్శబ్దంగా పనిచేస్తోంద’ని
ఎవరైనా అంటే ఓ పట్టాన నమ్మం. ఇది మానవ మనస్తత్వం.
‘ఈ
వ్యాధి మహమ్మారిలా చుట్టుముడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది’ అనేది ఇలాంటి
సందర్భాలలో సాధారణంగా వినబడే మాట.
ఈ మాటలు
అనేవాళ్ళు ముందు అర్ధం చేసుకోవాల్సింది ఒక్కటే. ఎవరూ ఈ వ్యాధి రావాలని కోరుకోలేదు.
ఎక్కడో చైనాలో పుట్టి చుట్టుపక్కల దేశాలకు పాకి, రోజుల వ్యవధిలోనే ప్రపంచమంతటా
విస్తరించింది. ప్రభుత్వాల అలసత్వం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో ఈ కరోనా వ్యాధి
మనదేశంలో పురుడు పోసుకోలేదు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఈ వ్యాధి మన
దేశంలో కాలుమోపింది.
ఈ కరోనా
అనేది సరికొత్త అంటు వ్యాధి. దీనిని గురించి ఎవరికీ తెలియదు. ఎలా వస్తుందో
తెలియదు. ఎలా పోతుందో తెలవదు. విరుగుడు ఏమిటో అసలే తెలియదు. కలరా
మొదలైన అంటు వ్యాధులకు రోగ నిరోధక టీకాలు వున్నాయి. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ కరోనా వ్యాధిని
అరికట్టడానికి ఆ అవకాశమూ లేదు. (ఏడాది
క్రితం వరకు)
ఇతరేతర
వ్యాధులు ప్రబలినప్పుడు ఆ వ్యాధి పీడితులకు బాసటగా వారి బంధుమిత్రులు వుంటారు.
చికిత్సచేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అనేకం అందుబాటులో వుంటాయి.
ఇవ్వడానికి వాక్సిన్లు, వాడడానికి మందులు వుంటాయి. కానీ కరోనా విషయం పూర్తిగా విభిన్నం. ఈ వ్యాధి సోకిన లేదా
సోకినట్టు అనుమానం ఉన్న రోగిని బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా, కుటుంబ
సభ్యులను కూడా ముట్టుకోనివ్వకుండా వారిని ఐసొలేషన్ గదుల్లో ఉంచాలి. చికిత్స
పెద్ద ఖరీదైనది కాకపోవచ్చుకానీ ఇన్ని రకాల ఏర్పాట్లు చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం
కాదు. మొదటి రెండు దశల్లో వ్యాధిని గుర్తించి చికిత్స చేయగలిగితే ప్రాణహానికి
ఆస్కారం వుండదు. కానీ మూడో దశకు చేరుకుంటే ఇక ఆ రోగిని కాపాడడం కష్టం అంటున్నారు
వైద్యులు.
మిగిలిన
వ్యాధులు వ్యాపించినప్పుడు బాహ్య ప్రపంచం అంతా మామూలుగానే వుంటుంది. ఆఫీసులు పనిచేస్తాయి.
దుకాణాలు, మార్కెట్లు తెరుస్తారు. రైళ్ళు, బస్సులు, కార్లు విమానాలతో
సహా అన్నీ మామూలుగా రాకపోకలు సాగిస్తాయి. ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం అతి స్వల్పంగా
వుంటుంది. అదే కరోనా విషయం తీసుకుంటే పరిస్తితి వేరు. మనిషి నుంచి మనిషికి ఈ
వ్యాధి సోకే ప్రమాదం కారణంగా ఈ వైరస్ అతి త్వరితంగా ఒకరి నుంచి ఒకరికి
వ్యాపిస్తుంది. అంచేత ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే స్వచ్చంద స్వీయ గృహ
నిర్బంధం మినహా మరో దారి లేదు.
అందుకే, ఆర్ధిక
వ్యవస్థ కుప్పకూలిపోయే పెను ముప్పు ఓ పక్క పొంచి ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు
సాహసం చేసి లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రజలు
గుంపులుగా తిరుగుతూ, వారికి తెలియకుండానే ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధిని సంక్రమింప
చేసే ప్రమాదం ఉన్నందున, కర్ఫ్యూ వంటి తీవ్రమైన చర్యలను అమలు చేయాల్సిన పరిస్తితి కూడా దాపురించింది.
మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ రోగం శరీరంలో ప్రవేశించిన రెండు వారాల వరకు ఆ
విషయం గుర్తించడం సాధ్యం కాదు. ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారాన్ని బట్టి విదేశాల
నుంచి వచ్చిన వారివల్లనే ఈ వ్యాధి వ్యాపిస్తోందని తెలుస్తోంది. విదేశాల్లో బయలు
దేరినప్పుడు వ్యాధి సోకినా ఆ విషయం వారికి తెలియదు. స్వదేశం చేరిన తర్వాత
అలాంటివాళ్ళు ఎంతో మందిని కలిసి వుంటారు. అలాంటివారినందరినీ ఇప్పుడు వెతికి
పట్టుకుని పరీక్షలు చేయాల్సిన బృహత్తర కార్యక్రమం ప్రభుత్వ భుజస్కంధాలపై పడింది.
ఇది సాధారణ విషయం కాదు. సముద్రపు ఒడ్డున ఇసుకలో పడిపోయిన సూదిని వెతకడం వంటిది.
అయినా ప్రభుత్వం వెనుకాడడం లేదు.
ఈ
సందర్భంలో కొన్ని పాత సంగతులు ప్రస్తావించుకోవాలి.
వ్యాధి
ప్రబలంగా ఉన్న తొలి రోజుల్లో శాంతా బయోటిక్ వ్యవస్థాపకులు శ్రీ వరప్రసాదరెడ్డి ఒక
టీవీ ఇంటర్వ్యూ లో చెప్పారు. వారి అమ్మాయి ఆ మధ్య కేరళ రాష్ట్రము నుంచి హైదరాబాదు
వచ్చారు. తర్వాత ఒక వైద్య బృందం వారి ఇంటికి వెళ్లి ఆవిడ ఆరోగ్యం గురించి
విచారించి తగిన పరీక్షలు చేసి, కరోనా వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించుకు వెళ్ళారు. ప్రభుత్వం
తీసుకుంటున్న ఈ జాగ్రత్తలు చూసి ఆయన ఆశ్చర్యపోయారట. అలాగే
హైదరాబాదు నగరంలోని హఫీజ్ పేటలో వున్న ఒక కాలనీకి అధికారుల బృందం వెళ్ళింది. పలానా
పేరు కలిగిన వ్యక్తులు పలానా రోజున పలానా దేశం నుంచి వచ్చి మీ కాలనీలో వుంటున్నారు, వారికి
తక్షణం పరీక్షలు చేయాలని కాలనీ అధ్యక్ష, కార్యదర్శులను అడిగితే వాళ్ళు నివ్వెర
పోయారట. విదేశాలనుంచి ఎవరు వచ్చారో అప్పటిదాకా వారికే తెలియదు. వెళ్లి చూస్తే అది
నిజమని తేలింది. వెంటనే ఆ వ్యక్తులకు పరీక్షలు చేసి వారిని స్వీయ గృహనిర్బంధంలో
వుండాలని చెప్పారట. అప్పటి నుంచి ప్రతిరోజూ ఫోనులో వారిని సంప్రదించి వారి ఆరోగ్య
పరిస్తితి గురించి వాకబు చేస్తున్నారట. ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రతిరోజూ అలా
కనుక్కుంటూ వుండడం చూసి విదేశాలనుంచి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట.
వివిధ
దేశాలనుంచి వేలమంది హైదరాబాదు వచ్చి వుంటారు. అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం
వుండడం ఒక కారణం కావచ్చు. అలా వచ్చిన వాళ్ళు కార్లలోనో, బస్సుల్లోనో, రైళ్ళలోనో
తమ గమ్యస్థానాలకు వెళ్లి వుంటారు. ఈ క్రమంలో వారిలో ఎవరికయినా ఈ వ్యాధి సోకి వుంటే
అది ఇతరులకు అంటుకునే ప్రమాదం వుంది. కానీ ఆ ‘ఇతరులు’ ఎవరని గాలింఛి కనిపెట్టడం సామాన్యమైన
విషయం కాదు. నగరాలూ, పట్టణాలు, గ్రామాలు ఇలా అన్నిచోట్లా ప్రభుత్వ యంత్రాంగం అలా వచ్చిన వారికోసం జల్లెడ
పట్టి గాలిస్తోంది.
కాబట్టి
ప్రభుత్వం ఏం చేస్తోంది అని మెటికలు విరిచేవాళ్ళు ఈ విషయాలను గమనంలో వుంచుకోవాలి. సమస్త
ప్రజానీకం సహకరించినప్పుడే ఈ వ్యాధికి
ముకుతాడు వేయడం సాధ్యం అవుతుంది.
అదే ప్రభుత్వాలు చెబుతున్నాయి.
అనవసరంగా
రోడ్లమీద తిరగ వద్దంటున్నారు. ఇంటిపట్టునే వుండమంటున్నారు. బయటకు
వెళ్ళినప్పుడు మాస్క్ దరించమంటున్నారు. సామాజిక దూరం పాటిస్తూ నిత్య వ్యవహారాలు
సాగించమంటున్నారు. ఇవన్నీ అసాధ్యం అయిన పనులు కావు. సులభంగా పెద్ద ఖర్చు లేకుండా
చేసేవే.
ఈ మంచి మాటలు వినడం మనందరి ధర్మం! ఎందుకంటే ఈ
మహమ్మారిని అరికట్టగలిగిన సులువు మన చేతుల్లోనే వుంది. మన చేతల్లోనే వుంది.
ప్రజలు, ప్రభుత్వాలు కళ్ళల్లో
వత్తులు వేసుకుని ఎదురు చూసిన వాక్సిన్
అందుబాటులోకి వచ్చింది. మొదటి డోసు వేసుకున్నవారి సంఖ్య గణనీయంగానే వుంది. సమస్త
ప్రజానీకానికీ వాక్సిన్ వేయాలి అంటే కొంత వ్యవధానం
పడుతుంది. ఈలోగా వాక్సిన్ వేయించుకున్నవాళ్ళు, వేయించుకోని వాళ్ళు మునుపటి మాదిరిగానే జాగ్రత్తలు పాటించాలి.
లాక్
డౌన్ సడలించగానే ఏమి జరిగిందో అందరికీ తెలుసు.
(25-03-2021)