9, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఎంతెంత కాలం? ఇంకెంత కాలం??




ఏకఛత్రాదిపత్యంగా పాలించిన మహా మహా చక్రవర్తులు సయితం ఒక వయసు రాగానే కొడుకులకు రాజ్యభారం అప్పగించి వానప్రస్తాశ్రమానికి వెడతారని పురాణ కధలు చెబుతాయి.
మరి భారత ప్రజాస్వామ్యంలో అలాంటి వీలు ఎందుకు లేదని కొందరి ఘోష.
ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికెవ్వరికీ రిటైర్ మెంటు లేదు. కొన్ని నియంతృత్వ దేశాలు, కమ్యూనిష్ట్ దేశాలను మినహాయిస్తే గొప్ప గొప్ప ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా ఒకే వ్యక్తి సుదీర్ఘ కాలం అధికారపీఠంపై కొనసాగిన దాఖలాలు లేవు. అమెరికా విషయమే తీసుకుందాం. ఆ దేశ అధ్యక్షుడిగా ఎవరయినా సరే రెండు దఫాలు, అంటే ఎనిమిదేళ్ళకు మించి ఏ ఒక్కరూ వైట్ హౌస్ ను అంటిపెట్టుకుని ఉండరు. ఒక పార్టీ అధికారంలో దీర్ఘ కాలం అధికారంలో ఉండవచ్చు కానీ, ఒకే వ్యక్తి, అతడు ఎంతటి ప్రజ్ఞాధురీణుడైనా సరే అధ్యక్షుడిగా నియమిత కాలాన్ని మించి పదవిలో వుండడం కుదరదు. అమెరికా అధ్యక్షుడిగా గతంలో పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్న వాళ్ళు అయిదుగురు వున్నారు. ఎవరికి వారు తమ ప్రవృత్తికి తగిన వ్యాపకాన్ని ఎంచుకుని శేష జీవితం గడుపుతున్నారు. అధ్యక్షుడిగా ఉన్నకాలంలో వారందరూ తమ తమ తెలివితేటలకు తగినట్టుగా పాలనా వ్యవహారాలను చక్కదిద్దారు. ప్రపంచ రాజకీయాలను శాసించారు. అయితే ప్రతిదానికీ ఒక ముగింపు వుంటుంది. వైట్ హౌస్ లో వుండగా దుర్నిరీక్షంగా పాలించిన వారందరూ ఇప్పుడు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఈ అయిదుగురు మాజీ అధ్యక్షులు, బారక్ ఒబామా, (డెమోక్రాటిక్ పార్టీ- 2009), జార్జ్ డబ్ల్యూ. బుష్, జూనియర్, (రిపబ్లికన్ పార్టీ-2001) బిల్ క్లింటన్,(డెమోక్రాటిక్ పార్టీ- 1993), జార్జ్ హెచ్. డబ్ల్యూ. బుష్ సీనియర్, (1981-89),రిపబ్లికన్ పార్టీ, జిమ్మీ కార్టర్ (1977-81) డెమోక్రాటిక్ పార్టీ. వేర్వేరు పార్టీలకు చెందినవారు అయినప్పటికీ అప్పుడప్పుడూ కలిసి అరమరికలు లేకుండా మాట్లాడుకుంటారు.
జిమ్మీ కార్టర్ వయసు ఇప్పుడు 94 సంవత్సరాలు. కొన్ని వందల గదులతో అలరారే శ్వేత భవనం (వైట్ హౌస్) లో అధ్యక్షుడిగా సకల సదుపాయాలతో జీవించిన ఈ వృద్ధ రాజకీయ నాయకుడు ఎప్పుడో 1961లో కట్టుకున్న ఒక సాదా సీదా రెండు పడక గదుల ఇంట్లో తన భార్యతో కలిసి శేష జీవితం గడుపుతున్నారు. వారాంతపు రోజుల్లో ఇరుగు పొరుగు వారితో కలిసి పేపర్ ప్లేట్లలో భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటారు. ఈ విందుల కోసం వృద్ధురాలయిన కార్టర్ భార్య స్వయంగా యోగర్త్ తయారుచేసి వడ్డిస్తుంది. అప్పుడప్పుడూ బయటకు వెళ్లి చౌకగా వస్తువులు దొరికే డాలర్ స్టోర్ లో షాపింగ్ చేస్తుంటారు. ఒకప్పుడు ఎయిర్ ఫోర్స్ వన్ వంటి ప్రెసిడెంట్ ప్రత్యేక విమానంలో దర్జాగా తిరిగిన కార్టర్ దంపతులు ఇప్పుడు అవసరం పడ్డప్పుడు సాధారణ కమ్మర్షియల్ విమానాల్లో ప్రయాణిస్తుంటారు అంటే ఒక పట్టాన నమ్మలేం.
జార్జ్ హెచ్. డబ్ల్యూ. బుష్.
జీవించి వున్న అమెరికన్ అధ్యక్షులు అందరిలోకి పెద్దవాడు. శ్వేత సౌధంలో అధ్యక్షుడిగా వున్నది నాలుగేళ్లయినా దాన్ని వదిలి పెట్టి వెళ్ళే నాటికి సొంత నివాసం అంటూ లేదు. పదవీ విరమణ చేసి వైట్ హౌస్ నుంచి బయటకు రాగానే బుష్ తాత్కాలికంగా కొంతకాలం తన స్నేహితుడి ఇంట్లో వున్నారు. తరువాత ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయారు. విచిత్రం ఏమిటంటే ఈ సీనియర్ బుష్ కుమారుడు జార్జ్ బుష్ కూడా తదనంతర కాలంలో అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. ఇలా తండ్రీ కొడుకులు అమెరికా అధ్యక్షులు కావడం అన్నది ఇది రెండో సారి. గతంలో జాన్ ఆడమ్స్, ఆయన కుమారుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ కూడా అధ్యక్షులుగా శ్వేత సౌధంలో పనిచేసారు.
ఏళ్ళు మీద పడ్డా సీనియర్ బుష్ మానసికంగా చాలా చురుకు. తన తొంభయ్యవ జన్మదినం నాడు హెలికాప్టర్ లో ఆకాశం లోకి వెళ్లి, అక్కడనుంచి పేరాచ్యూట్ సాయంతో స్కై డైవింగ్ చేశారంటే బుష్ మహాశయుల ధైర్యసాహసాలు ఎలాంటివో అర్ధం చేసుకోవచ్చు.

Image may contain: 4 people, people smiling, people standing and suit

Photo Courtesy: Image Owner

8, సెప్టెంబర్ 2018, శనివారం

తప్పు చేయనివాడు లేడు, తప్పని చెప్పేవాడు లేడు

పూర్వం రాజులు శత్రురాజ్యంపై దండెత్తాలనుకున్నప్పుడు ముందుగానే చతురంగ
బలాలను సమాయత్తం చేసుకునే వారు. యుద్ధ భేరీ మోగించడానికి మునుపే సమస్త
సంభారాలను సమకూర్చుకునే వారు. కోట ముట్టడికి గురైతే కొన్ని నెలలపాటు
అవసరం అయ్యే నిత్యావసర వస్తువులను సిద్ధం చేసి పెట్టుకునే వారు. ఏదైనా
అనుకోనిది జరిగి రాణీ వాసంతో సహా శత్రువుల చేతికి చిక్కకుండా బయటపడి
ప్రాణాలు దక్కించు కోవడానికి రహస్య సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకునే
వారు. యుద్ధ రంగంలో పోరాడే సైనికుల కుటుంబాల ఆలనా పాలనా చూసేవారు.
యుద్ధంలో లభించేది విజయమో, వీర స్వర్గమో అనే ఫలితంతో నిమిత్తం లేకుండా
యుద్ధసన్నద్ధత ప్రదర్శించేవారు. అవసరమైతే మిత్ర రాజ్యాల సాయం
అర్ధించేవారు. విజయ లక్ష్మిని వరించడానికి అవసరం అనుకుంటే కొన్ని కుటిల
ప్రయత్నాలు చేసేవాళ్ళు. శత్రు శిబిరంలో చీలికలు కల్పించడం, వాళ్ళు
ఏమరుపాటున వున్నప్పుడు మెరుపుదాడి చేసి వారిని వధించి సింహాసనం స్వాధీనం
చేసుకోవడం ఇలా సాగేవి వారి ఆలోచనలు.
ఇదంతా పురాతన కాలం నాటి ముచ్చట్లు.
ఇప్పుడు ప్రజాస్వామ్య యుగంలో జరిగే ఎన్నికల సమరాల్లో రాజకీయ పార్టీలు
సయితం అలనాటి రాజులు, చక్రవర్తుల మాదిరిగానే రకరకాల యుద్ధ తంత్రాలను
ప్రయోగిస్తున్నారు. విజయమే ప్రధానం అనుకున్నప్పుడు విలువల విషయం ఎవరికీ
పట్టదు. పదవే ప్రధానం, పవరే ముఖ్యం అనుకునే రోజుల్లో ఏ రాజకీయ పార్టీ
మాత్రం విలువలు, సిద్ధాంతాలు, సూత్రాలు వల్లె వేసుకుంటూ బతికి బట్టకట్ట
కలుగుతుంది?
అందుకే ఆనాటి యుద్ధతంత్రాలే ఈనాడు రూపం మార్చుకుని, ఎత్తులు, పొత్తులు, జిత్తులుగా రకరకాల అనైతిక రాజకీయ
విన్యాసాలు చేస్తున్నాయి.ఇది తప్పు అని చెప్పగలవాడు లేడు, ఎందుకంటే అందరూ
అదే తప్పు చేస్తున్నారు కనుక.

31, ఆగస్టు 2018, శుక్రవారం

నాన్నకి ప్రేమతో....



క్యాబ్ డ్రైవర్లలో కొందరు హుషారు మనుషులు వుంటారు. కార్లో ప్రయాణం చేస్తున్నంత సేపూ ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు. రాత్రి వచ్చిన టీవీ ఛానల్ కారు డ్రైవర్ ఈ మాదిరే. కారు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం గురించి చెబుతూ ఆయన వెనక్కి తిరిగి నీళ్ళ బాటిల్ అందుకోబోయే సమయంలో రెప్పపాటులో ప్రమాదం జరిగిందని అంటూ ఆ సీను రిప్లే చేసే ప్రయత్నం చేస్తుంటే ఆపి, ‘అసలు మీ కుటుంబం ఏమిటి, సంపాదన సరిపోతుందా’ అనే ప్రశ్నలు వేస్తూ సంభాషణను జయప్రదంగా దారి మళ్ళించాను. కానీ అతడు చెప్పిన సంగతులు వింటే ఏ తండ్రికి అయినా ఇలాంటి కొడుకు వుంటే బాగుంటుందనిపించింది.
పేద కుటుంబంలో పుట్టాడు. ఒక్కడే కొడుకు. చదువు సరిగా అబ్బక పోవడంతో సంసారం నడపడానికి స్టీరింగ్ చేతబట్టాడు. తండ్రికి వేరే సంపాదన లేదు. టాక్సీ నడిపిన రోజుల్లో బాగానే గిట్టుబాటయ్యేది. ఒక్కోసారి రోజువారీ ఆదాయం వేలల్లో వుండేదిట. సంసారం కాస్త తెరిపిన పడింది. దేశంలో తిరగని ఊళ్ళు లేవు.
రోజులు ఎప్పుడూ ఒకలా వుండవు. తండ్రికి జబ్బు చేసింది. ఏ క్షణాన ఆసుపత్రికి తీసుకువెళ్ళాలో తెలవదు. దేశం పట్టుకుని తిరుగుతూవుంటే సంపాదన బాగా ఉండొచ్చు కానీ, ఇంట్లో ఏదైనా అవసరం పడితే చప్పున రావడం కష్టం. అందుకని రాబడి తగ్గినా పరవాలేదనుకుని హైదరాబాదులోనే ఉండేలా ట్రావెల్స్ లో చేరాడుట.
‘నాకు మా నాన్న ఆరోగ్యం ముఖ్యం. సంపాదన కానీ, ఏదైనా కానీ దాని తర్వాతే’ అన్నాడు నెమ్మదిగా.
వెనక సీట్లో కూర్చోవడం వల్ల అతడి మొహం నాకూ, నా మొహం అతడికీ కనబడే వీలు లేదు.


కానీ నాకు మల్లేనే అతడి కళ్ళు చెమ్మగిల్లి వుంటాయి.

నిజం లాంటి అబద్ధం – భండారు శ్రీనివాసరావు



‘ఓ నిజం చెప్పనా?’ అంది నిజం.
నిజమే స్వయంగా ఓ నిజం చెబుతున్నప్పుడు దాన్ని నమ్మనివాళ్ళు ఎవరుంటారు.
‘నన్నూ ఓ నిజం చెప్పమంటారా?, నేనూ, నిజమూ మా చిన్నప్పటి నుంచీ దోస్తులం”
అంది పక్కనే వున్న అబద్ధం, అది శుద్ధ అబద్ధమని తెలిసికూడా.
కానీ అబద్ధం చెప్పిన మాట నిజమని నమ్మేసింది, నిజం  అమాయకంగా.
అప్పట్నించి నిజం అబద్ధంతో స్నేహం చేయడం మొదలెట్టింది.
అలా కొన్నాళ్ళు గడిచాయి.
నిజం తనను నిజంగా నమ్ముతోందని ధ్రువపరచుకున్న తర్వాత  అబద్ధం ఓరోజు నిజాన్ని అడిగింది ‘అలా సరదాగా అడవిలో   షికారుకు  వెళ్లివద్దామా’ అని.
సరే అని నిజం అబద్ధం వెంట అడవికి వెళ్ళింది.  చాలా దూరం వెళ్ళిన తర్వాత వారికి ఓ సరస్సు కనిపించింది. అందులోకి దిగితే తిరిగి ప్రాణాలతో బయటకి రాలేరు. ఈ నిజం అబద్ధానికి తెలుసు. అయినా ఆ విషయం నిజానికి చెప్పకుండా దాచింది.
ఇద్దరూ స్నానం చెయ్యడానికి దుస్తులు విప్పి ఒడ్డున పెట్టారు. నిజం ముందుగా నీళ్ళల్లోకి దిగింది.
అబద్ధం తెలివిగా ఒడ్డున వదిలేసిన నిజం దుస్తులు తాను ధరించి సరస్సులోకి దిగకుండా వెనక్కి  వచ్చేసింది. నిజం ఆసరస్సులోనే వుండిపోయింది.
అప్పటినుంచి అబద్ధం తాను  వేసుకున్న నిజం దుస్తులతో తానే నిజాన్నని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం మొదలు పెట్టింది. ఆ విధంగా కొన్నాళ్ళకు  అబద్ధమే నిజంగా చెలామణిలోకి వచ్చింది.
అంటే ఈ రోజు మనకు కనిపించే, వినిపించే నిజం, నిజానికి  నిజం కాదు, అబద్ధం చెప్పే నిజం మాత్రమే.  
(ఒక ఇంగ్లీష్ కధనానికి స్వేచ్చానువాదం )    

25, ఆగస్టు 2018, శనివారం

సరదాకు మాత్రమే! – భండారు శ్రీనివాసరావు


ఒక రకంగా బాగానే వుందనిపించింది
ఈరోజు ఒక టీవీలో చర్చాకార్యక్రమం నిర్వాహకుడు చర్చలో పాల్గొంటున్న ఒకరిని ఇలా సంబోధించారు.
“ఒకప్పటి టీడీపీ నాయకుడిగా, ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడిగా ఈ అంశంపై మీ అభిప్రాయం చెప్పండి”
సరదాగా చేసిన ఈ పరిచయ వాక్యం అందర్నీ నవ్వించింది. నిజానికి సీరియస్ చర్చల్లో అప్పుడప్పుడూ ఇలాంటి చమక్కులు అవసరం కూడా.
అయితే, ఇలాటి పరిచయాలు చేయాల్సివస్తే పాల్గొనే వాళ్లకి కొంత ఇబ్బందే. ఉదాహరణకు:


“ఒకప్పుడు మీరు కాంగ్రెస్. తరువాత టీడీపీలో చేరారు. కొంతకాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. కొద్దిరోజులకే ఎన్నికలు రావడం, మీరు టీఆర్ఎస్ లో చేరడం జరిగిపోయాయి. రాష్ట్రం విడిపోవడంతో వైసీపీలో చేరి గెలిచిన తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు ముందు మరో కొత్త పార్టీ జనసేనలోనో, లేదా మరింత తాజాగా పెట్టిన పేరుపెట్టని మరో పార్తీలోనో చేరుతారనే వార్తలు వినవస్తున్నాయి. ఈ అనుభవ నేపధ్యంలో ఈ అంశంపై మీరు యేమని అనుకుంటున్నారు”

21, ఆగస్టు 2018, మంగళవారం

టీవీ చర్చలు అవగాహన కలిగించేలా వుండాలి – భండారు శ్రీనివాసరావు



రాత్రి ఒక టీవీ అమరావతి బాండ్లు గురించిన చక్కటి అంశాన్ని చర్చకు తీసుకుంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ముగ్గురూ ఘనాపాటీలే. విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళే. ఎవరి వాదాన్ని వాళ్ళు వినిపించడమో, తమకు తెలిసిన దాన్ని వివరించడమో చేస్తే బాగుండేది. ఎంతసేపటికీ ఎదుటివాళ్ళ వాదాన్ని పూర్వపక్షం చేయడానికే సమయాన్ని వినియోగించుకున్నట్టు అనిపించింది. టీవీలు చూసేవారిలో ఆయా పార్టీల అభిమానులకు వారి భాషణలు ఆనందం కలిగించి ఉండవచ్చు. కానీ విషయం పట్ల అవగాహన పెంచుకోవడానికి కొంతమందయినా టీవీ చర్చలు చూస్తారు. వారికి మాత్రం నిరాశ మిగిలిందనే చెప్పాలి. చర్చకు ముందు మనసులో మెదిలిన సందేహాలు మరిన్ని పెరిగాయి కానీ నివృత్తి కాలేదని గట్టిగా చెప్పొచ్చు.  

19, ఆగస్టు 2018, ఆదివారం

కధకు ప్రాణం పోసి కధగా మిగిలిన వేదగిరి రాంబాబు – భండారు శ్రీనివాసరావు


ఇంకా ఎందరో వుండి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి ముగ్గురే ముగ్గురు నా తరం వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నేను కలిసి పనిచేసిన వాళ్ళు. ఈ మువ్వురూ ఏనాడూ ఎవరి దగ్గరా నెల జీతం తీసుకుని ఉద్యోగం చేసి ఎరుగరు. ఒకరు సురమౌళి, రెండో వారు గుడిపూడి శ్రీహరి, మూడో వ్యక్తి వేదగిరి రాంబాబు. మొదటి ఇద్దరూ తమ రచనావ్యాసంగంతో పాటు రేడియోలో అప్పుడప్పుడూ ప్రాంతీయ వార్తలు చదివేవాళ్ళు. ఇక రాంబాబు. రేడియోలో పనిచేసే ఉద్యోగులన్నా రాకపోవచ్చు కానీ వేదగిరి రాంబాబు మాత్రం సదా రేడియో ఆవరణలోనే కనిపించేవాడు. రేడియోకి సంబంధించిన ఏ విభాగానికి ఏ రచన అవసరమైనా రాంబాబు తక్షణం ఆ అవసరం తీర్చేవాడు. కాంట్రాక్టు ఉందా లేదా, డబ్బులు ఇస్తారా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా ఎవరికి ఏది అవసరం అయినా రాంబాబు తన ఆపన్న హస్తం అందించేవాడు.
ఇక తెలుగు కధ అంటే చాలు ముందుగా జ్ఞాపకం వచ్చే పేరు వేదగిరి రాంబాబు. ఎవరయినా తాము రాసినదానిని ఎవరికో ఒకరికి అంకితం ఇస్తారు. రాంబాబు మాత్రం కధల మీది వ్యామోహంతో మొత్తం తన జీవితాన్నే కధకు అంకితం చేసాడు. ఈ క్రమంలో ఏం సుఖపడ్డాడో తెలియదు కానీ అనేక కష్టాలు పడిఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకే కాబోలు తనవంతుగా ‘తెలుగు కధ’ కన్నీరుమున్నీరవుతోంది రాంబాబు ఇక లేడని తెలిసి.