26, జులై 2016, మంగళవారం

రేడియో భేరి - 4

రేడియో శైలి

తొలి ప్రసారాలనుబట్టి – మద్రాసు కేంద్రం వివిధ ప్రక్రియలలో ప్రసారం చేసేదని తెలుస్తోంది. సాహిత్య విషయాలను గురించే కాకుండా ఇతర అంశాలను గురించి సరళమైన భాషలో ప్రసారాలు మొదలు పెట్టింది. ప్రసంగాలనే కాక నాటకాలను, గేయాలను వినిపించింది. ఏకొందరో తప్ప చాలామంది సరళమైన భాషలోనే ప్రసంగాలు చేసేవారు. రేడియో ప్రసంగం కానీ, నాటకం కానీ వినగానే మొదటిసారే అర్ధం కావాలి. అంటే కఠినమైన, అన్వయం కల పొడుగుపాటి వాక్యాలు పనికిరావు. భాష సమాస భూయిష్టం కాకుండా తేలికగా వుండాలి. ‘మయ నాగరికత గురించి మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రసంగం రేడియో పద్ధతిలో రాసినట్టు కనిపిస్తుంది. తేట తెలుగులో రాసిన ఆ ప్రసంగం నుంచి కొన్ని వాక్యాలు. ‘ఈ యుగం యెంత చిత్ర మైనదో. ఇదంతా పరిశోధన యుగం. వైజ్ఞానిక యుగం. ప్రతి విషయంలోను పరిశోధనే.! నిప్పూ నీరూ, గాలీ ధూళీ .... ఇంతెందుకు.. మన....పంచేంద్రియాల ద్వారా గ్రహించే ప్రతి విషయమూ అఖండ పరిశోధనల పాలపడుతున్నది. నిప్పును శోధిస్తున్నారు. నీటిని గాలిస్తున్నారు. గాలిని చీలుస్తున్నారు. రాతిని పగులగొడుతున్నారు. భూమిని తవ్వి పోగులు పెడుతున్నారు.’
1939 నాటికి గేయాల ప్రసారం ఓ దారిలో పడింది. ఆ ఏడాది మల్లవరపు విశ్వేశ్వరరావు రాసిన ‘బిల్హణీయం’ సంగీత నాటకం ప్రసారం అయింది. సూరి నారాయణమూర్తి రూపొందించిన ఈ సంగీత నాటకానికి బీ.వీ. నరసింహారావు సంగీతం సమకూర్చడం మాత్రమే కాకుండా నాయక పాత్ర పోషించారు.
లలిత సంగీతం అన్న పేరు ప్రాచుర్యంలోకి రాని ఆ రోజుల్లో ‘గీతావళి’ పేరుతొ భావగీతాలు ప్రసారం చేసేవారు. ఈ కార్యక్రమంలో గాయనీ గాయకులు పాడడానికి కొత్త గీతాలు కావలసి వచ్చాయి. పండుగలు వస్తే ప్రత్యేకంగా పాటలు రాయించి పాడించేవారు.
రేడియోకు మాత్రమే ప్రత్యేకమైన ప్రక్రియ ‘రూపకం’. (ఆంగ్లంలో దాన్ని ఫీచర్ - FEATURE- అంటారు.) రేడియోకి ప్రత్యేకమైనవి కనుక రూపకాల రచన, రూపకల్పన విలక్షణంగా వుంటాయి. తెలుగులో ప్రసారం అయిన తొలి రూపకం ‘కృష్ణదేవరాయ వైభవం’. 1941 జనవరి 15 నాడు ప్రసారమైన ఈ రూపకం మౌలిక రచన చేసిన వారు ఆకొండి వేంకటేశ్వరరావు. రేడియోకు అనువుగా రూపక రచన చేసి దానికి ప్రాణం పోసిన వారు ఆచంట జానకీరాం. చరిత్రను రసవత్తరంగా వినిపించడానికి చేసిన ఆ ప్రయత్నం ఎందరినో ఆకర్షించింది. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ సౌజన్యంతో)

25, జులై 2016, సోమవారం

రేడియో భేరి - 3


తొలి తెలుగు రేడియో నాటకం ‘అనార్కలి’

1938 జూన్ 18 నాడు రామమూర్తి పంతులు ‘సజీవమైన తెలుగు’ అనే విషయం గురించీ, 1938 జూన్ 21 నాడు ‘మన ఇళ్లు – వాని అందము చందము’ గురించి కోలవెన్ను కోటేశ్వర రావు, 1938 జూన్ 23 నాడు ‘రవీంద్రుడు’ శీర్షికన బెజవాడ గోపాలరెడ్డి ప్రసంగించారు. (ప్రసార వ్యవధి 15 నిమిషాలు. ప్రసార సమయం రాత్రి 8 గంటల 15 నిమిషాలు.)
తెలుగులో ప్రసారం అయిన తొలి రేడియో నాటకం ‘అనార్కలి’. ముద్దుకృష్ణ రాసిన ఈ నాటకాన్ని ఆచంట జానకీరాం రూపొందించారు. నాయిక పాత్రను రేడియో భానుమతిగా ప్రసిద్దురాలయిన పున్నావజ్జల భానుమతి పోషించారు. నాయకుడు సలీం (జహంగీర్)పాత్రను దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి, అక్బర్ పాత్రను డాక్టర్ అయ్యగారి వీరభద్ర రావు పోషించారు. ఈ నాటకం 1938 జూన్ 24 తేదీ రాత్రి ఎనిమిదిన్నరనుంచి ప్రసారం అయింది.
జానపద సంగీతం కూడా వినిపించాలనే ఉద్దేశ్యంతో అడపా దడపా ‘పల్లె పాటలు’ (మొదట ప్రసారం 1938 జూన్ 25 రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ) ప్రసారం చేసేవారు. అయితే ఈ పల్లెపాటలు పాడిన వారు నాగరీకులే కావడం విశేషం. వారు జానపద కళాకారులు కాదు. శాస్త్రీయ సంగీతంలో కాస్త లలితమైనవిగా భావించే పదాలను. జావళీలను ప్రత్యేకంగా వినిపించేవారు. అట్లా వినిపించినప్పుడు తెలుగు రచనలతో పాటు తమిళ రచనలను కూడా ప్రసారం చేసేవారు.
మద్రాసు రేడియో కేంద్రం నుంచి తమిళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ ప్రసారాలు జరుగుతున్నాయనే ప్రచారం ఒకటి ఆ రోజుల్లో కొనసాగుతూ వుండేది. 1939లో తిరుచినాపల్లిలో రేడియో కేంద్రం ఏర్పడి దక్షిణ తమిళ జిల్లాలపై దృష్టి నిలిపింది.
రేడియో కార్యక్రమాల గురించి శ్రోతలకు తెలపడానికి మద్రాసు కేంద్రం 1938 జూన్ నుంచి తెలుగులో ‘వాణి’, తమిళంలో ‘వానొలి’ పక్ష పత్రికలను ప్రారంభించింది. కొన్ని సంచికల తరువాత వాణి ప్రచురణ నిలిచిపోయింది. 1948లో విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభం అయిన తరువాత తిరిగి వాణి ప్రచురణ మొదలయింది. క్రమంగా ఆదరణ కరువై 1980 ప్రాంతాలలో ఆగిపోయింది. ‘వాణి’లో వివిధ రేడియో కేంద్రాల నుంచి ప్రసారం అయిన ప్రసంగాలు, కవితలు, గోష్టులు, సంగీత పాఠాలవంటివి ఎన్నో వెలువడుతూ వుండేవి. తొలి సంచికలో విజయవాడ రేడియో కేంద్రం లక్ష్యాలను వివరిస్తూ, ‘ఈ కేంద్రం రాష్ట్రం లోని జనులందరికీ ఉపయోగకరంగా వుండగలదు. ఈ స్టేషనులో గ్రామస్తుల వినోదార్ధం ఒక గంట ప్రత్యేకించబడ్డది. ఇంతే కాకుండా తక్కిన విషయాలను కూడా ప్రజలలోకి వివిధ తరగతులవారికి అనుకూలముగానుండేటట్లుగా ఏర్పరుపబడ్డది’ అని పేర్కొన్నారు. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ సౌజన్యంతో)

24, జులై 2016, ఆదివారం

రేడియో భేరి - 2

రేడియోకి ఆకాశవాణి అనే పేరు పెట్టింది ఎవరు?
1935లో హైదరాబాదు, ఆ తరువాత సెప్టెంబర్ 10 నాడు మైసూరులో ఒక రేడియో కేంద్రం ఏర్పాటు చేశారు. మైసూరు విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్ర ఆచార్యులుగా వున్న డాక్టర్ ఎం.వీ. గోపాలస్వామి ఆ కేంద్ర సంస్థాపకులు. దానికి ఆయన ‘ఆకాశవాణి’ అని పేరు పెట్టారు. ఆ పేరును రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు సూచించారని చెబుతారు. 1937 సెప్టెంబర్ 30 నాడు తిరువాన్కూర్ సంస్థానం ఒక రేడియో కేంద్రాన్ని నెలకొల్పింది.
హైదరాబాదు నుంచీ, మద్రాసు నగర పాలక సంస్థ రేడియో నుంచి ప్రసారమైన తెలుగు రేడియో కార్యక్రమాల వివరాలు లభ్యం కావడం లేదు. కనుక రేడియోలో తెలుగు ప్రసారాల ప్రస్తావన గురించి తెలుసుకోవడానికి 1938 జూన్ 16 నాడు మొదలయిన మద్రాసు రేడియో కేంద్రం చరిత్రను పరిశీలించాలి. ఆ నాడు ఆ కేంద్రాన్ని అప్పటి మద్రాసు గవర్నర్ ఎర్స్కిన్ ప్రభువు ( Lord Erskine) రాష్ట్ర ప్రధాన మంత్రి (ఇప్పటి మాటల్లో చెప్పాలంటే ముఖ్యమంత్రి) చక్రవర్తుల రాజగోపాలాచారి ప్రారంభించారు. అప్పటికే ఆల్ ఇండియా రేడియో అనే పేరుతొ ప్రభుత్వ వ్యవస్థలో ఏర్పాటుచేసిన ఆ సంస్థను వ్యవహరిస్తూ వస్తున్నప్పటికీ, రాజాజీ మాత్రం ఆంగ్లంలో చేసిన తన ప్రారంభోపన్యాసంలో ‘హిందూస్తాన్ ఆకాశవాణి’ అనే ప్రస్తావించారు.
ఆ కేంద్రం ఆ సాయంకాలం ఐదున్నరకు సౌరాష్ట్ర రాగంలో శ్రీ త్యాగరాజ స్వామి వారు రచించిన ‘శ్రీ గణపతిని సేవింప రారే’ అనే తెలుగు కృతిని తిరువెణ్ కాడు సుబ్రహ్మణ్య పిళ్ళై అనే విద్వాంసులు నాదస్వరంపై వాయిస్తుండగా మొదలయింది. రాజాజీ ప్రారంభోపన్యాసం తరువాత సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ గాత్ర కచేరీ, తిరిగి సుబ్రహ్మణ్యపిళ్ళై గారి నాదస్వర సభ ప్రసారం అయ్యాయి. ఆ వెంటనే రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ‘భారత దేశము - రేడియో’ అనే విషయం గురించి, సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు తెలుగులో ప్రసంగించారు. (జస్టిస్ పార్టీ నాయకులలో ఒకరయిన నాయుడు గారు 1939 ఏప్రిల్ ఒకటి నుంచి 14 దాకా ఉమ్మడి మద్రాసు ప్రధానిగా పనిచేశారు) మద్రాసు రేడియో కేంద్రం నుంచి తొలి ప్రసంగం చేసిన ఖ్యాతి కూడా ఆయన ఖాతాలో చేరింది. ఆయన అప్పుడు చేసిన ప్రసంగం లోని మొదటి వాక్యాలు ” నేనిప్పుడు చెన్నపట్నం నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడ నుంచి వినుచున్నారో చెప్పజాలను. కానీ అనేక స్థలములయందు వుండి వినుచున్నారని తలచుచున్నాను. నేనీ రోజున చెప్పవలసినది ఏమనగా ఆకాశవాణి యొక్క ఉపయోగములే. దీన్నే ఇంగ్లీష్ లో రేడియో అనెదరు.”
రేడియోకు తెలుగు పర్యాయ పదంగా ‘ఆకాశవాణి’ వాడిన సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు గారు తమ ప్రసంగం ముగింపులో చెప్పిన అంశాలు నేటికీ ప్రసార సాధనాలకు వర్తిస్తాయి. ఆయన ఇలా చెప్పారు.”యెంత మంచి వస్తువయిననూ మంచిదే కాక చెడునకు కూడా ఉపయోగింపనగును. కొన్ని దేశములందు వివిధ రాజకీయ పక్షములవారు తమ పక్షముల గొప్ప చెప్పుకొనుటకు, వైరులను (విపక్షాలను) తక్కువచేసి చెప్పుకొనుటకు ఉపయోగింతురు. ప్రస్తుతము మన దేశము నందు అన్నింటికంటే విద్యావ్యాప్తి చాలా ముఖ్యము. కనుక, ఆకాశ వాణిని సర్వజనోపయోగకరమైన విషయములందును, ఆనందము కలుగచేయు పనుల యందును స్వచ్ఛ మనసుతో ఉపయోగింపవలెనని నా హెచ్చరిక” (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ సౌజన్యంతో)

23, జులై 2016, శనివారం

రేడియో భేరి -1

రారండోయ్ రారండోయ్  రేడియో చరిత్ర  వినరండోయ్ !
ఇది ఆకాశవాణి  సమగ్ర చరిత్ర అని చెప్పలేను కానీ, ఈ వివరాలు ఇవ్వడంలో సహకరించిన ఆకాశవాణి పూర్వ సంచాలకులు, రచయిత డాక్టర్ పీ.ఎస్. గోపాల కృష్ణ రేడియోకి సంబంధించి ఒక అధారిటీ అని ఘంటాపథంగా చెప్పగలను. ఆయన రాసినవీ, చెప్పినవీ కలబోస్తే ఈ రూపం వచ్చింది. చిత్తగించగలరు.

ఆకాశవాణి
దక్షిణ భారత దేశంలో రేడియో ప్రసారాలు ప్రారంభం కావడానికి కారకులు ఓ తెలుగు వ్యక్తి అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే. తెలుగువారయిన రావు బహదూర్ సీ వీ కృష్ణ స్వామి సెట్టి, మద్రాసులోనూ, మాంచెస్టర్ లోను విద్యాభ్యాసం చేసి 1914 లో మద్రాసు నగర పాలక సంస్థలో ఎలక్త్రికల్ ఇంజినీర్ గా చేరారు. ఆ నగర వీధులలో మొదటిసారి విద్యుత్ దీపాలు ఏర్పాటుచేసిన ఘనత కూడా వారిదే. 1910లో విమాన ప్రయాణం చేసిన తొలి భారతీయులలో ఆయన కూడా ఒకరు. 1924లో మద్రాసు రేడియో క్లబ్ ద్వారా ఆయన రేడియో ప్రసారాలు మొదలుపెట్టారు. ఈ రేడియో క్లబ్ లో పుర ప్రముఖులు ఎందరో సభ్యులుగా వున్నప్పటికీ, ఆ సంస్థ కార్యదర్శిగా వున్న కృష్ణ స్వామి సెట్టి పాత్ర ప్రధానమైనది. రేడియో క్లబ్ నెలకొల్పాలని ప్రతిపాదించి, ఆ క్లబ్ ద్వారా ప్రసారాలు జరగడానికి ఆయన ఎంతో కృషి చేశారు. 1924 మే 16 న ఏర్పడిన ఈ మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్, 1924 జులై 31 నాడు ప్రసారాలు మొదలు పెట్టింది. అయితే ఆ ప్రసారాలలో సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం వుండేది. 1927 అక్టోబర్ లో మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ మూతపడింది. కానీ, కృష్ణ స్వామి సెట్టి గారి పూనికతో 1930 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి మద్రాసు నగర పాలక సంస్థ రేడియో ప్రసారాలు ప్రారంభించింది. కాని ఆ ప్రసారాలు కూడా పరిమితమైనవే. ఈ ప్రసారాలలో తెలుగు పాటలు విన్పించినా తెలుగు నాటకాలు వంటివి ప్రసారం అయిన ఆధారాలు లేవు. పోలీసువారి ప్రకటనలు, ఆరోగ్య విశేషాలు కొన్ని ప్రసారం చేసేవారు. బడి పిల్లలకోసం కొన్ని కార్యక్రమాలు వినిపించేవారు. ఈ ప్రసారాలు చిత్తూరు, వేంకటగిరి మొదలయిన చోట్ల వినిపించేవి. వాతావరణం అనుకూలించినప్పుడు బంగాళాఖాతం తీరం వెంబడి వున్న వూళ్ళల్లో విశాఖపట్నం దాకా వినిపించేవని అప్పటి వార్తల వల్ల తెలుస్తున్నది.
1923లో మహబూబ్ ఆలీ అనే తపాలాశాఖ ఉద్యోగి హైదరాబాదులో చిరాగ్ ఆలీ సందులో 200 వాట్ల శక్తి కలిగిన రేడియో కేంద్రం నెలకొల్పాడు. 1935 ఫిబ్రవరి 3 నుంచి అది నిజాం అధీనంలోకి వచ్చింది. ఆ రేడియో కేంద్రంలో ప్రసార భాష ఉర్దూ. ప్రసార శక్తి చాలా తక్కువ కావడం వల్ల ప్రసారాలు చాలా పరిమితమైన దూరాలకే వినిపించేవి.
1939 జులైలో అయిదు కిలోవాట్ల శక్తి కలిగిన రేడియో రిలే కేంద్రాన్ని (ప్రసారిణి) సరూర్ నగర్ ఓ ఏర్పాటు చేసి డెక్కన్ రేడియో పేరిట ప్రసారాలు మొదలు పెట్టారు. ఉర్దూతో పాటు తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో ప్రసారాలు చేసేవారు. అయితే ఉర్దూతో పోలిస్తే తక్కిన భాషల ప్రసారాలు పరిమితంగా వుండేవి. మొహర్రం మాసంలో ప్రసారాలు వుండేవి కావట. కొన్నాళ్ళకు స్టూడియోను సరూర్ నగర్ నుంచి నగరంలోని ఖైరతాబాదులోవున్న యావర్ మంజిల్ కు మార్చారు. రిలే స్టేషన్ (ప్రసారిణి) మాత్రం సరూర్ నగర్ లో వుండేది. తెలుగులో ప్రసారాలు మొదట తక్కువ వ్యవధిలో ఇచ్చేవాళ్ళు. కాలక్రమేణా రోజుకు గంట సేపు ప్రసారాలు చేసేవారు. ఈ కేంద్రం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా, సాయంకాలం అయిదున్నర నుంచి రాత్రి పదిన్నర దాకా ప్రసారాలు చేసేది. హిందూస్తానీ సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. చాలా ఏళ్ళ తరువాత కర్నాటక సంగీతానికి కొంత సమయం కేటాయించసాగారు. ముస్లిం వనితలకోసం పరదా పధ్ధతి, వారికోసం విడిగా వాకిలి ఏర్పాటుచేశారు. వసీంఖాన్ అనే ఆయన తెలుగు కార్యక్రమాల అధికారిగా పనిచేశారు. రాయప్రోలు రాజశేఖర్ సహాయ దర్శకులుగా, భాస్కరభట్ల కృష్ణారావు, దుర్గా చలం కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసేవారు. కురుగంటి సీతారామయ్య, మహారధి సంభాషణలు, వార్తలు వంటివి రాసేవారు. కే.ఎల్. నరసింహారావు గ్రామీణ కార్యక్రమాలు నిర్వహించేవారు. లలిత, వెంకటేశ్వర్లు అనేవాళ్ళు వార్తలు చదివేవాళ్ళు. మల్లి పాటలు, ఎల్లి పాటలు మొదలయిన శీర్షికలతో జానపద గీతాలు ప్రసారం అయ్యేవి.
1936లో అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం – భారత దేశంలో రేడియో వ్యాప్తిని గురించి పరిశీలించడానికి నిపుణులను నియమించింది. అప్పుడు మద్రాసు రాజధానిలో తమిళ జిల్లాలతో పాటు కొన్ని తెలుగు, కన్నడ, మళయాళ జిల్లాలు కూడా కలిసివుండేవి. మద్రాసునుంచి నాలుగు భాషల్లో ప్రసారాలు చేయాలనీ, విజయవాడ నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ తెలుగు ప్రసారాలు చేయాలని మొదట్లో అనుకున్నారు. కానీ చివరకు తెలుగు కార్యక్రమాలను కూడా మద్రాసు నుంచే ప్రసారం చేయాలని నిర్ణయించారు. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ సౌజన్యంతో)

లయ తప్పుతోన్న ‘ప్రత్యేక’ రాగం

సూటిగా......సుతిమెత్తగా.......భండారు శ్రీనివాసరావు

ఎన్నాళ్ళో వేచిన శుక్రవారం రానూ వచ్చింది, పోనూ పోయింది. ఏమీ జరగకుండానే చక్కాపోయింది.
నడుమ మాత్రం శుక్రవారం ఏం జరుగుతుంది అనే విషయంలో మీడియాలో చర్చలు తీవ్రాతి తీవ్రంగా సాగాయి.
అందరి నోటా మాట వినబడ్డప్పుడు, గతంలో ఒకసారి శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక నేపధ్యంలో, డిసెంబరు 31 తరువాత ఏం జరుగుతుంది అని ఢిల్లీలో విలేకరులు అడిగిన ప్రశ్నకు గవర్నర్ నరసింహన్ జవాబిస్తూ, ‘ఏం జరుగుతుంది, జనవరి ఒకటి వస్తుంది అని చెప్పడం గుర్తుకు వచ్చింది.
అలాగే ఇప్పుడు జరిగింది. శుక్రవారం తరువాత శనివారం వస్తుంది. అంతే. అంతకంటే ఏమీ కాదు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో శుక్రవారం రాజ్యసభలో ఏదో ఒకటి తేలబోతోంది అని కొందరు పెట్టుకున్న భ్రమలు అలాగే తేలిపోయాయి. కొత్తగా ఏర్పడ్డ ఒక రాష్ట్రానికి ఆయువుపట్టు అని అన్ని పార్టీలు ఒప్పుకున్న ప్రత్యేక ప్రతిపత్తి అనే అంశంపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుకు ఒక ఆప్ సభ్యుడి నిర్వాకం అడ్డం తగిలి అతి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ వ్యవహారం అడుక్కి వెళ్లిపోయింది. ఏమీ తేల్చకుండానే రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.
హరికధా భాగవతార్  హరికధతో పాటు శ్రోతల్ని ఆకట్టుకోవడానికి కొన్ని పిట్టకధలు కూడా చెబుతారు. కానీ అవి ప్రధాన కధను ఆటంక పరచకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
రాజ్యసభలో అలా జరగలేదు. ప్రైవేటు బిల్లులను శుక్రవారం నాడే చేపట్టడం చట్టసభల్లో ఆనవాయితీ. (చట్ట సభల్లో ప్రైవేటు బిల్లులు వీగిపోవడానికి అదొక కారణం అని గిట్టని వాళ్ళు చెబుతుంటారు. ఎందుకంటే వారాంతపు సెలవుల్లో, రైళ్ళూ విమానాలు పట్టుకుని   తమతమ నియోజక వర్గాలకు చేరుకునే ప్రయాణ సన్నాహాల్లో సభ్యులు వుండే  అవకాశం హెచ్చు కనుక ఆ రోజు సభల్లో హాజరు పలచగా వుంటుందని వారి అంచనా).
ఆ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి కేవీపీ ప్రతిపాదించిన బిల్లు మొన్న  శుక్రవారం నాడు ఎజెండాలో వుంది. వాయిదాలు పడుతూ వచ్చిన సభ మధ్యాన్నం రెండున్నరకు సమావేశమైనప్పుడు  ఈ బిల్లును తక్షణమే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలు కోరాయి. అదే సమయంలో అధికార  బీజేపీ సభ్యులు ఆమ్ ఆద్మీ పార్టీ లోకసభ సభ్యుడు భగవంత  మాన్ అంశాన్ని ప్రస్తావించి సభాకార్యక్రమానికి అడ్డు తగిలాయి. ఈ మాన్ మహాశయుల వ్యవహారమే ప్రధాన కధలో పిట్టకధ. అయితే  ఈ పిట్టకధ అసలు కధకు మోసం తెచ్చింది. క్యుములో నింబస్ మేఘాల మాదిరిగా కమ్ముకుని కధ పతాకస్థాయికి చేరకమునుపే దాన్ని పదిలంగా కంచికి చేర్చింది.
నిజానికి కొత్తగా పార్లమెంటుకు ఎన్నికయిన ఆమ్ ఆద్మీ సభ్యుడు భగవంత  మాన్ చేసిన నిర్వాకం కూడా క్షంతవ్యం కాదు. ఆయన పార్లమెంటు భవనం గుట్టుమట్టుల్ని తన ఫోన్ కెమెరాలో బంధించి ఆ వీడియోని సాంఘిక మాధ్యమాల్లో పోస్ట్  చేయడం పెను సంచలనం కలిగించింది. అప్పటివరకు  ఈయన ఎవరో దేశానికి తెలవదు. తరువాత దేశంలో ఈయనను  తెలియని వాళ్ళు లేరు. ఆస్థాయిలో మీడియా ప్రచారం లభించిన  ఈ వ్యవహారం, లోక్ సభ వాయిదా పడేవరకు ముదిరిపోయింది. దాని క్రీనీడలు సహజంగానే రాజ్యసభపై కూడా పడ్డాయి. ఆమ్ ఆద్మీ సభ్యుడిపై తక్షణం చర్యలు చేపట్టాలని కోరుతూ బీజేపీ సభ్యులు సభాధ్యక్షుడి స్థానాన్ని చుట్టూ ముట్టి నినాదాలు ప్రారంభించారు. పదిహేను నిమిషాల గందరగోళం తరువాత రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. పిట్టకధ ముందు అసలు హరి కధ వెనక్కి తప్పుకుంది.        
కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లు వ్యవహారం ఎలా జరగాలో అలా జరిగిందని చెప్పేవీలులేదు. కానీ ఎలా జరగాలని కోరుకున్నారో అలాగే జరిగింది. నిజానికి ఏమీ జరగలేదు కూడా. పదిహేను నిమిషాలు హడావిడి, గందరగోళం, సోమవారానికి వాయిదా పడడం, అంతే జరిగింది.
సభాప్రాంగణం తలుపులు మూయలేదు. ప్రత్యక్ష ప్రసారాలు నిలుపుచేయలేదు. కానీ సభ ఒక పద్దతిగా జరిగిందని మాత్రం చెప్పలేరు. ప్రజాస్వామ్య దేశంలో చట్ట సభలు ఎవరు అధికారంలో వున్నా అవి సాగే తీరులో మాత్రం మార్పు వుండదు.
కారణం రాజకీయం. రాజకీయుల రంగూ రుచీ మారుతుందేమో కానీ రాజకీయం రంగు మాత్రం ఎన్నటికీ వెలవదు.
మళ్ళీ బిల్లుకు మోక్షం ఎప్పుడంటే ఎవరూ చెప్పలేని పరిస్తితి. చిలక ప్రశ్న అడగాల్సిందే.
సందర్భం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సంగతి కొంత ముచ్చటించుకోవడం అప్రస్తుతమేమీ కాదు.
రామాయణంలో ప్రధాన పాత్రలు రాముడు, రావణుడు  అయినప్పటికీ  ఆ  పురాణ గాధకు మూల కారణం దశరధ మహారాజు  కదన రంగంలో విల్లంబులు చేబూని తనకు సాయపడిన భార్య కైకేయికి ఇచ్చిన రెండు వరాలు. అవి లేకపోతే రామాయణమే లేదు. ఇచ్చిన మాటకు రాజు కట్టుబడడం వల్లా, లేదా ఆయన మాట నిలబెట్టడానికి రాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళడం వల్లా రామాయణ గాధ నేటికీ మానవులకు ఉత్కృష్టమైన నీతిని బోధించే ఇతిహాసంగా వర్ధిల్లుతోంది.
ఈ నేపధ్యం గమనంలో పెట్టుకుంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన  బాధ్యత నేటి రాజకీయులది. ఆ మాట వల్ల ప్రయోజనాలు శూన్యం అనే నమ్మకం వాటికి వున్న పక్షంలో అసలా మాట ఇవ్వనే కూడదు. ఇచ్చేముందే అన్ని విషయాలు సాకల్యంగా ఆలోచించుకుని వుండాల్సింది. అసలు సిసలు రాజకీయ నాయకుల నుంచి ప్రజలు ఆశించేది ఇదే.
లేదా బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు మరో పని కూడా చేయవచ్చు. ప్రజల్ని విశ్వాసం లోకి తీసుకుని మారిన పరిస్తితుల్లో మార్చుకున్న నిర్ణయం ఏదైనా వుంటే దాన్ని నిర్భయంగా, నిస్సంకోచంగా ప్రజల ముందు పెట్టాలి. అందుకు చట్ట సభలని మించిన వేదిక మరొకటి వుండదు.
ఇప్పటికయినా పాలకపక్షాలు ఈ విషయంలో తమ విధానాలను నిజాయితీగా స్పష్టం చేయాలి. రాజకీయ ప్రత్యర్ధులతో ఆడే క్రీడల్ని, ఎత్తులు పైఎత్తుల్ని, వ్యూహ ప్రతివ్యూహాలను  ఏదో విధంగా సరిపెట్టుకోవచ్చు, కానీ తమని నమ్మి గద్దె ఎక్కించిన ప్రజలతో దాగుడు మూతలు మాత్రం  క్షంతవ్యం కాదు. అసలు సిసలు రాజనీతిజ్ఞులు నడుచుకోవాల్సిన తీరు ఇదే.
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి అంశంలో కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు, టీడీపీ, వై. ఎస్.ఆర్.సి.పీ. వంటి ప్రాంతీయ పార్టీలకి ప్రధాన బాధ్యత వుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, వాటిని ఒక జాబితా రూపంలో ఇస్తే ఆ వరుస క్రమంలో మొదటి రెండు స్థానాల్లో వుండాల్సినవి ప్రస్తుతం పాలక పక్షాలు అయిన బీజేపీ, టీడీపీ. ఎవరయినా ఆ తరువాతే. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోగల వెసులుబాటు వీటికి ఉన్నట్టుగా వేరే రాజకీయ పార్టీలకి లేదు.
2014 ఏప్రిల్ 20, (ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం జరిగిన తీరు)  2016 జులై  22. (ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తి కోసం ప్రైవేటు బిల్లుకు పట్టిన గతి) ఈ రెంటినీ, ఆయా తేదీల్లో రాజ్యసభలో ఏం జరిగింది అనేదాన్ని ఆసాంతం  ఆంధ్ర ప్రజానీకం ఇళ్ళల్లో కూర్చుని టీవీల్లో చూశారు. వాళ్ళు ఒక అభిప్రాయానికి రావడానికి అవి చాలు.
శుక్రవారం రాజ్యసభలో కేవీపీ బిల్లు ఏదో సాధిస్తుందని రాజకీయాల పట్ల కనీస అవగాహన వున్నవారెవ్వరూ ఆశ పెట్టుకోలేదు. అయితే ఒక్కటి మాత్రం ఖాయం. ఫలితం రాకపోయినా, లేకపోయినా ఆయన బిల్లు రగిలించిన వేడి ఇంతా అంతా కాదు.  
కురుపాండవ యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు సంధికోసం కౌరవుల వద్దకు వెడతాడు. సంధి పొసిగే సంగతి కాదని కృష్ణుడికి ముందే తెలుసు. అంతేకాదు, యుద్ధం జరగాలని కోరుకున్నదీ ఆయనే, జరిగి తీరుతుందనీ తెలిసిందీ ఆయనకే. ఫలితం వుండదని తెలిసి చేసిన ప్రయత్నం అది. ఫలితం ఎలా వుంటుందో తెలిసి చేసిన యత్నం కూడా అది. సంధి పట్ల, యుద్ధం పట్ల సంబంధం వున్న అన్ని పక్షాల లేదా వ్యక్తుల వైఖరులు, అభిప్రాయాలు బయట పెట్టడానికి చేసిన రాజకీయం అనుకోవాలి.
ఫలితం రాకపోయినా, ఫలితం లేకపోయినా ప్రయత్నం మాత్రం వృధా కాదు. ఎవరు ఏమిటనేది అనేది, ఎవరి మనసులో ఏముందనేది జనాలకు తెలిసొచ్చేలా చేయగలిగితే ఆ ప్రయత్నం ఓ మేరకు విజయవంతం అయినట్టే. ఆ రకంగాచూస్తే ఈ బిల్లు పోషించింది నాటి భారతంలో కృష్ణుడి పాత్ర. Top of Form
ఉపశృతి:      
ఆకలి వేసిన బిడ్డ అమ్మా!అని ఒకలా అరుస్తాడు. నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా! అని ఒకలా అరుస్తాడు. ప్రతీ శబ్దానికి ఒక ప్రత్యేకమైన శృతి ఉంది, నాదం ఉంది. శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి గారి ఉవాచ.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో అన్ని పార్టీల రాగం ఒకటే అయినా ఎవరి శృతి వారిది. ఎవరి నాదం వారిది. అందుకే లయ తప్పుతోంది.
(రచయిత జంధ్యాలకు, సంగీతాభిమానులకు క్షమాపణలతో)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595