17, మే 2015, ఆదివారం

బుక్ షెల్ఫ్ - 7 ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు


మళ్ళీ కాసిన్ని చాదర్ ఘాట్ స్కూలు కబుర్లు. ముళ్ళపూడి వారి 'కోతి కొమ్మచ్చి' మాదిరిగా కాస్త ముందుకూ, కాస్త వెనక్కూ.
(శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రచించిన 'హైదరాబాదు - నాడు, నేడు' నుంచి)
"మా ఇంగ్లీష్ టీచరు పబ్బరాజు సుబ్బారావు గారు ఓ రోజు ఇంగ్లీష్ పాఠం తీసి పైకి చదవమన్నారు. చాలా కుంట్లు పడుతూ చదివాను. అంతవరకూ నాది తెలుగు మీడియం. ఇంగ్లీష్ సరిగ్గా చూచి చదవలేని పరిస్తితి.. నా మీద నాకే సిగ్గేసింది.
"ఐదో ఫారంలో మా క్లాసు టీచరు జుల్ఫ్ కార్ ఆలీఖాన్. మంచీ ఒడ్డూ పొడుగూ, సినిమా స్టార్ లా ఉండేవాడు. కేంబ్రిడ్జ్ లో ఇంటర్ మీడియట్ చదివి వచ్చాడు. అదే ఆయన యోగ్యత. ఆయన తప్పుల్ని పిల్లలు దిద్దుతుండేవారు.

"మా క్లాసు పిల్లలు నిజంగా సిసింద్రీలు. వాళ్ళ ఇంగ్లీష్ ఇప్పటి ఎం.ఏ. వారికన్నా బాగుండేది. ముఖ్యంగా నరసింహన్   అయ్యంగార్, రామచంద్రారెడ్డి, అబ్దుల్ అజీజ్, ఆజ్మల్ ఖాన్, రాఘవన్ - వీళ్ళు  ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎంతో గొప్పగా వుండేది. రాఘవన్ బేబీ ఆస్టిన్ కార్లో స్కూలుకు వచ్చేవాడు. లెక్కల టీచరు  అబీద్ ఆలీ గారు. ఆయనకు పల్చటి గడ్డం వుండేది. అంచేత ఆయనకు కొత్తిమీర్ కట్ట అని కొంటే పేరు పెట్టారు పిల్లలు.  ఫిజిక్స్  మహమ్మద్ ఆలీ గారు చెప్పేవారు.ఆయనకు దుబ్బుగా పొడవాటి గడ్డం. అందుకని ఝాడుకట్ట అని పేరు.  హిస్టరీ జాగ్రఫీలు వామన్ రావు చెప్పేవారు. టీచర్లకు పేర్లు పెట్టె విషయంలో బందరు పిల్లలు కూడా ఏమీ తక్కువ తినలేదు. 'కాంతా వల్లభరాజులుంగారు' అనబడే మునిమాణిక్యం నరసింహారావు గారు  మా క్లాసు టీచరు. ఆయనకు కళ్ళు పుసులు కారే జబ్బు. ఆయన్ని  చిమ్మెట్ట గారని ఆట పట్టించేవారు. సైన్సు టీచరు సోమజాజులు గారికి మెడ పొడవు.  బీకరు అనేవారు. అనంత శర్మగారికి మెడ పొట్టి. మనిషి లావు. ఆయన్ని మెట్ట  వంకాయ్ అని పిలిచేవాళ్ళు. హెడ్ మాస్టర్ వెంకట రామయ్య గారు 'పాండు రంగడు'. పెద్ద పెద్ద మీసాలు వున్న తాళ్ళూరి నారాయణ రావు గార్ని బొద్దింక మాస్టారు అనే వాళ్ళు. ఆయన తండ్రి చనిపోయిన కారణంగా కర్మకాండలో మీసాలు తీసేశారు. ఇక బొద్దింక గొడవ ఉండదని ఆయన అనుకున్నారు. మీసాలు లేని ఆయన్ని చూసి బోడి బొద్దింక వచ్చిందిరా అనడంతో ఆయన చిన్నబుచ్చుకునేవారు. అలా ఉండేవి చిన్నతనంలో సరదాలు"


 (ఇంకా వుంది)       

16, మే 2015, శనివారం

బుక్ షెల్ఫ్ - 6 ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు


(శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రచించిన 'హైదరాబాదు - నాడు, నేడు' నుంచి)
"పరీక్షలు అయిన తరువాత ఇంటికి వెళ్లాను, గుడ్లవల్లేరు. రిజల్ట్ వచ్చిన సంగతి ఆలస్యంగా తెలిసింది. హైసెకండ్ క్లాసులో పాసయ్యాను. హైదరాబాదు వెళ్లి నిజాం కాలేజీలో అడ్మిషన్ కోసం అప్లికేషన్ ఇచ్చాను. టర్నర్ అనే ఆయన ప్రిన్సిపాల్. ఆయన వేసవి సెలవులకు ఇంగ్లండు వెళ్ళాడు. మహమ్మద్ సిద్దికీ అని ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఆయన్ని తాత్కాలికంగా ప్రిన్సిపాల్ గా వేసారు. టర్నర్ వుంటే నా మార్కులు చూసి సీటు  ఇచ్చేవాడే. మహమ్మద్ సిద్దికీ గారు 'నువ్వు ఆలస్యంగా వచ్చావు. సీట్లు నిండి పోయినై. నువ్వు మద్రాసు ప్రెసిడన్సీ వాడివి. అయినా మంచి మార్కులు వచ్చాయి కనుక ముల్కీ సర్టిఫికేట్ తెస్తే సీటు ఇస్తాన'ని అన్నారు. ముల్కీ సర్టిఫికేట్ అంటే నిజాం రాజ్యంలో పుట్టయినా వుండాలి. లేదా పన్నెండేండ్లు నివాసం అయినా వుండాలి. మాకు నైజాంలో భూములు వున్నాయి కాని అవి పరాధీనంలో వున్నాయి. నైజాంలో పుట్టినట్టు సర్టిఫికేట్ కావాలంటే సాక్ష్యం వుండాలి. ఆరోజుల్లో నైజాంలో పుట్టుకల గిట్టుకల రిజిష్టర్  వుండేది కాదు. అంచేత అనేకమంది దొంగ సర్టిఫికేట్లతో చేరేవారు.  మా బావ స్నేహితుడి తండ్రి  ఆబ్కారీ శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయినాడు.  ఆయన సాక్ష్యం  ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మర్నాడు ఇద్దరం అప్లికేషన్ తో తాలూక్ దార్ ఆఫీసుకు వెళ్ళాము. 'ఇతను  మీకెలా తెలుసు అని తాలూక్ దార్ అడిగితె, ఆబ్కారీ డిపార్టుమెంటులో పనిచేస్తూ వాళ్ళ  వూరు వెళ్ళేవాడిని, అల్లా పరిచయం' అనిచెబుతాను. నువ్వూ  అట్లాగే చెప్పు' అని నాతొ అన్నాడాయన. ఫారం లోపలి పోయింది. మాకన్నా ముందు వచ్చిన ఒకాయన తప్పుడు సాక్ష్యం చెప్పాడని మజరద్ గార్ నిర్ణయించి రెండువందలు ఫైను వేసాడు. అది చూసి సాక్ష్యం ఇవ్వడానికి నాతొ పాటు వచ్చిన పెద్దమనిషి భయపడి పోయాడు. ఐనా నేను లోపలకు వెళ్లి మజరాద్ గారిని  కలిసాను. చిన్నవాడు. మంచి  మనిషిలా కనిపించాడు. 'నీకు నిజాం కాలేజీలో సీటు వచ్చింది చేరడానికి ముల్కీ కావాలి. ఎవర్నన్నా సాక్ష్యం తీసుకురా ఇస్తాన'ని చెప్పాడు. నాకు సాక్ష్యం  ఎవ్వరూ లేరు. ముల్కీ రాలేదు. సీటూ  రాలేదు. అందుకే  ఇంటికి వెళ్ళిపోయాను.  తరువాత బందరులో హిందూ కాలేజీలో నాలుగేళ్ళు చదివాను. 



(ఇంకా వుంది)

రాజకీయ చక్రబంధంలో రైతాంగం

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 17-05-2015, SUNDAY)

ఏ.ఐ.సీ.సీ. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిసాన్ సందేశ్ యాత్ర పేరుతొ ఆదిలాబాదు జిల్లాలో పదిహేను కిలోమీటర్లు మండుటెండలో పాదయాత్ర చేసి వెళ్ళారు. ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజక్టుల వద్ద పడక పేరుతొ వూళ్లపట్టునే ఎక్కువ సమయం గడుపుతున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్వచ్చ నగరం పేరుతొ హైదరాబాదులో గల్లీ గల్లీ తిరిగే కార్యక్రమం పెట్టుకున్నారు. వై.ఎస్.ఆర్.సీ.పీ. అధినాయకుడు రైతు భరోసా పేరుతొ ఊళ్లకు ఊళ్ళు చుట్టబెడుతున్నారు.


కనుచూపు మేరలో ఎన్నికలు లేవు. అయినా నాయకులు ఏదో ఒక పేరు పెట్టుకుని జనం మధ్యనే గడపాలని అనుకుంటున్నారు. ఈ మార్పుకు కారణం ఒక్కటే, వెనుకటికీ ఇప్పటికీ రాజకీయ వ్యూహాల్లో వచ్చిన తేడానే!    
కొన్ని దశాబ్దాల క్రితం విద్యార్ధులు పరీక్షల తరుణంలోనే పుస్తకాలు చేతపట్టి రాత్రీ పగలూ అనకుండా కష్టపడి చదివి గట్టెక్కాలని ప్రయత్నం చేసేవారు. మిగిన రోజుల్లో ఆటాపాటలతో కాలక్షేపం చేసేవారు.  విద్యారంగంలో కార్పొరేట్ సంస్కృతి ప్రబలిన తరువాత విద్యార్ధులకు అనునిత్యం పరీక్షలే. ప్రతిక్షణం పరీక్షాకాలమే.
ఇప్పుడీ సంస్కృతి  రాజకీయ రంగంలో కూడా ప్రవేశించినట్టు వుంది. పూర్వం ఎన్నికల సమయంలో మాత్రమె కానవచ్చే హడావిడి ఇప్పుడు ఏడాది పొడుగునా కళ్ళకు కడుతోంది. నిత్యం జనాలతో అనుబంధం పెంచుకుంటూ ఆత్మ స్తుతి, పరనిందలతో పొద్దుపుచ్చుతున్నారు. అందుకే, రాజకీయ కోయిలలు ముందే కూస్తున్నాయి. ఎన్నికల ఘడియ దగ్గరలో లేకపోయినా నాయకులు కాళ్ళకు బలపాలు కట్టుకుని జనాలమధ్యనే తిరుగుతున్నారు.   
అరవయ్యో దశకంలో ఒక రాజకీయ నాయకుడు సుదీర్ఘ కాలం లోకసభ సభ్యుడిగా పనిచేశారు. ఎన్నికలప్పుడు  జనాలకు చూపించిన మొహం మళ్ళీ ఎన్నికల వరకు చూపించేవారు కాదు. అయినా వరసగా అయిదు సార్లు ప్రజలు ఆయన్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. గెలిచిన  తరువాత ఢిల్లీలోనో, హైదరాబాదులోనో హాయిగా కాలక్షేపం చేసేవారు కాని నియోజకవర్గం వైపు తొంగి చూసేవారు కాదు. అయినా ఆ రోజుల్లో అలా నడిచిపోయింది.
ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత కొంత పరిస్తితి మారింది. జనాల్లో తిరగకుండా జనాలమీద పెత్తనం చేయడం కష్టం అన్న ఎరుక రాజకీయ నాయకుల్లో మొదలయింది. అయితే ఎన్టీఆర్ తరహా కూడా అదో మాదిరి. ఎన్నికలు దగ్గర పడ్డప్పుడు, కనీసం ఏసీ సౌకర్యం కూడా లేని   చైతన్య రధం మీద బయలుదేరి, ఎండావానల్ని  లెక్కచేయకుండా, ఆకలిదప్పులు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని చుట్టబెడుతూ  రాత్రింబగళ్ళు ప్రజల మధ్యనే తిరిగేవారు. ఆ ఎండలకు  అంతటి అందగాడి మొహం కూడా  నల్లకప్పు వేసిపోయేది. ఒక్కసారి విజయం సాధించి, అధికార పీఠం ఎక్కడం తరువాయి, అంతే! ఎంతో ముఖ్యమైన రాచకార్యం వుంటే తప్ప రాజధానిని ఒదిలిపెట్టి అడుగు బయట పెట్టేవారు  కాదు. జిల్లాల  పర్యటనలు ఎక్కువగా పెట్టుకునేవారు కాదు. చంద్రబాబునాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్తితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన గురించిన  కబురు చెవిలో పడడం ఆలస్యం  కాళ్ళకు రెక్కలు కట్టుకుని  గాల్లో ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళేవారు.  కొన్ని సందర్బాలలో స్థానిక అధికారుల కంటే ముందే అక్కడ వాలిపోవడం, లేదా  ముఖ్యమంత్రి హైదరాబాదు నుంచి ఆ విషయం గురించి వారిని  వాకబు చేయడం ఇలాటివన్నీ ఆ రోజుల్లో తమాషాగా చెప్పుకునేవారు. కొండొకచో సంచలనాత్మకంగా, కొండొకచో విమర్శనాత్మకంగా ఉండేవి అవి.
దరిమిలా  ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిది కూడా ఓ రకంగా ఇదే తరహా. పర్యటనల్లో వున్నా, రాజధానిలో వున్నా జనం మధ్య గడపడానికే ఆసక్తి చూపేవారు. ప్రతిపక్షం నుంచి అధికారపక్షంలోకి మారడానికి ఆయన చాలా కాలం పాటు చేసిన నిరీక్షణ ఫలించడానికి కారణం ఆయన చేసిన పాదయాత్రే అనడంలో సందేహం లేదు. తదాదిగా అధికారం చేజిక్కించుకోవాలంటే పాదయాత్రలు చక్కని రాజమార్గం అన్న నమ్మకం రాజకీయ నాయకుల్లో కుదిరిపోయింది. చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర అనంతరమే తొమ్మిదేళ్ళ పైచిలుకు సాగిన ప్రతిపక్ష అజ్ఞాత వాసం  నుంచి బయట పడి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలిగారు.
ఇక సొంత పార్టీ పెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా జనం మీదనే ఆధారపడ్డారు. జనం అండ ఉంటుందనే నమ్మకంతో రాజకీయ ఎత్తుగడల్లో చూపించాల్సిన పట్టు విడుపుల్ని ప్రదర్శించకుండా ఓ మేరకు నష్టపోయారని కూడా ఆయన్ని గురించి చెప్పుకుంటారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయనది అదే తీరు. తన సొంత పార్టీ నాయకులతో కంటే జనాల మధ్యనే ఎక్కువ సమయం గడుపుతారనే పేరు ఆయన ఖాతాలో వుంది కూడా.      
పొతే, రాజకీయ నాయకుల పాదయాత్రలు, కిసాన్ యాత్రలు, రైతు భరోసా యాత్రలు, ఇంకా ఇలాటి అనేకానేక యాత్రలు, పర్యటనలు, ప్రదర్శనలు, ర్యాలీలు  ప్రజలకు చేసే మేలు ఏమిటోకాని  ఆయా పార్టీలకు మాత్రం పెద్ద మేళ్ళే చేస్తున్నాయని వాటి గత అనుభవాలు చెబుతున్నాయి. అందుకే ఇబ్బందులు వున్నా, కష్టాలు వున్నా, బాగా డబ్బు ఖర్చుతో కూడిన వ్యవహారం అయినా  నాయకులు వెనుకడుగు వేయకుండా పాదయాత్రలతో ముందడుగు వేస్తున్నారు.
సరే! 'యాత్రాఫల సిద్ధిరస్తు' అని జనం వారిని  ఆశీర్వదిస్తారో లేదో తెలియడానికి ఇంకా చాలా వ్యవధానం వుంది. 'ప్రజలు గమనిస్తున్నారు సుమా!' అని ఎదుటివారికి హెచ్చరికలు చేసే నాయకులు, తమను కూడా అవే జనాలు గమనిస్తున్నారని మరచిపోతుంటారు. సామాన్య రైతుల  కడగండ్లు తీర్చడం ఒక్కటే తమ ప్రధమ ప్రాధాన్యత అని జబ్బలు చరుచుకుంటూ, అసలా కష్టాలకన్నింటికీ ఆవలి పక్షం వారే కారణం అంటూ ఆరోపిస్తూ అధికారంలో వున్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తూ, అధికారం చేజారగానే అంతవరకూ ప్రతిపక్షాలు ఆలపిస్తూ వచ్చిన పాత పల్లవినే ఎత్తుకుంటూ  పరస్పరం దుమ్మెత్తి పోసుకునేందుకు ఇలాటి ఈ వేదికలు ఉపయోగపడడం నిజంగా దారుణం అనిపిస్తుంది. రైతుల ఆత్మహత్యలు ఎదుటి పక్షం హయాములో ఎన్ని జరిగాయో, తమ పాలనలో ఎలా తగ్గుముఖం పట్టాయో గణాంకాలతో సహా వివరిస్తుంటారు. ఎదుటి వారిది  రైతు వ్యతిరేక విధానం అనే వారు, తమది రైతు అనుకూల విధానం అని జనంచేత నమ్మించడానికి తాముచేసిన ఘన కార్యాల జాబితాలను జనాల మీదకు  ఒదులుతుంటారు. మరి ఇందరు, విడివిడిగా అయినా సరే,   ఇలా రైతుల సంక్షేమం కోసమే అహర్నిశలు చెమటలు కారుస్తున్నప్పుడు వ్యవసాయం గిట్టుబాటు కాక, ఆర్ధిక సమస్యలతో  ఉసురు తీసుకునే వారి సంఖ్య ఎందుకిలా పెరిగిపోతోంది? అంటే వీరందరూ చెబుతున్న రైతు సంక్షేమ పధకాలన్నీ నీరు కారిపోతున్నట్టే కదా!  వారు చెబుతున్న మాటలన్నీ నీటిమూటలే కదా! నీటి మీద రాతలే కదా! నేతిబీరకాయ చందమే కదా!
వారి వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఈనాడు ప్రతి రాజకీయ పార్టీ రైతుల గురించే మాట్లాడుతున్నది. వాళ్ళు విడిగా అయినా కలివిడిగా అయినా ఆలోచించుకోవాల్సింది ఒక్కటే. ఇంతవరకు ఏం చేసాము, ఏం చేయలేదు అన్నది కాదు ప్రశ్న. ఎవరి హయాములో ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నది కాదు సమస్య. వందలు, వేలూ కాదు ఇకనుంచి ఒక్కరంటే ఒక్క రైతు కూడా వ్యవసాయంలో నష్టాలు వచ్చి ప్రాణాలు తీసుకోకుండా ఏం చెయ్యాలి అన్నదే ప్రధానం అన్న ధోరణిలో ఆలోచించాలి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్నం పెట్టె రైతుకు కూడు పెట్టవు.
ఒకటి మాత్రం నిర్వివాదాంశం. ఇన్నాళ్ళ అనుభవం తెలియచెప్పేది ఒక్కటే. ఏ పార్టీ అయిన అధికారంలోకి వచ్చేంతవరకు రైతు జపం చేస్తాయి. ఒక్కసారి గద్దె ఎక్కగానే, దుష్యంతుడికి శకుంతల మరపున పడ్డట్టు రైతులనే వాళ్ళు వారికి చివరి ప్రాధాన్యతగా మిగులుతారు. అప్పటివరకు రైతులు, రుణాలు, గిట్టుబాటు ధరలంటూ మాట్లాడిన వాళ్ళు, అవే నాలుకలతో  కార్పొరేట్లు, ఉద్యోగాలు,  భూసేకరణలు, భూమి పందారాలు, మిషన్లు, గ్రోత్ కారిడార్లు అంటూ సామాన్యులకు అర్ధం కాని పద ప్రయోగాలు చేస్తుంటారు. ఈ విషయంలో కాస్త పేరున్న ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అధికారం, అధికారం లేకపోవడం అన్న రెండు విషయాలే ఈ రెండు నాలుకల ధోరణికి కారణం.  దీన్ని అర్ధం చేసుకోవడానికి చరిత్రలోని కొన్ని తాజా పుటలు తిరగేస్తే చాలు.
ఆరుగాలం కష్టపడే రైతుకు, జనాలకు మొదటి ముద్ద పెట్టి, తాను చివరి ముద్ద తినే రైతుకు కావాల్సింది ప్రభుత్వాలు  సకాలంలో  ఇస్తే, అంతకు రెట్టింపు ప్రతిఫలం రైతు  ఈ సమాజానికి అందిస్తాడు. అతడికి అవసరమైంది మన్ను పదును చెడకముందే  అదునులో దున్ని పైరు వేసుకోవడానికి మంచి విత్తనాలు, ఎరువులు. పంట చేతికి వచ్చిన తరువాత కాసింత గిట్టుబాటు ధర. ఇంతకు  మించి ఏ రైతూ ఆశించడు. ఈ మాత్రం సకాలంలో చేయలేక పోవడం వల్లనే రైతులు నిండు ప్రాణాలు నిలువునా తీసుకుంటున్నారు. అలాటి కుటుంబాలను ఓదార్చడం తప్పుకాకపోవచ్చు. కానీ అసలు ఆత్మహత్య చేసుకోకుండా ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు  ఏం చేస్తున్నాయన్నదే సమాధానం లేని ప్రశ్న.
ఉపశ్రుతి : ఆధునిక జాతక కధలో బుద్దుడు ఓ గ్రామానికి  వెడతాడు. చనిపోయిన తన పిల్లవాడికి ప్రాణదానం చేయమని ఓ తల్లి గౌతముడ్ని వేడుకుంటుంది. ఆయన సరే అని చెప్పి, 'పరిశ్రమలకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తీర్చలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం పట్రా మీ అబ్బాయిని బతికిస్తా' అంటాడు. ఆ తల్లి ఆశతో ఎన్ని వూళ్ళో తిరుగుతుంది. యెంత  తిరిగినా అటువంటి వారి జాడ కనబడక నిరాశగా  తిరిగొస్తుంది. ఇందులో నీతి ఏమిటన్నది వేరుగా చెప్పక్కరలేదేమో!
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595

(16-05-2015)

NOTE: Courtesy Cartoonist 

ఐ నో పీఎం ఐ నో సీఎం

'హలో నమస్కారం'
'నమస్కారం. చెప్పండి '
'మనం కలవక చాలా రోజులయింది'
'అవునండీ'
'ఈ సాయంత్రం ఎలా వున్నారు? వీలుంటే  బంజారా హోటల్లో  కలుద్దామా!'
'ఎందుకండీ అంత ఖర్చు.  హాయిగా మంకు ప్రెస్ క్లబ్ వుంది కదా'
'ప్రైవసీ వుండదేమో'
'హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి ప్రైవసీ ఎందుకండీ?'
'అదీ నిజమే  అనుకోండి'
క్లబ్బులో రెండు మూడు గంటలు గడిపిన  తరువాత.....
'నేను వస్తానండీ'
'అప్పుడేనా?'
చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడయితే ఏదో ఒక ఆటో దొరుకుతుంది. ఆలస్యం అయిన కొద్దీ  వాళ్ళతో తంటా. రోజూ వుండే తద్దినమే అయినా  పైగా పొద్దున్నే వార్తల టయిముకి ఆఫీసుకి చేరాలి'
'వుండండి నా కారులో దింపేసి వెడతాను'
'భలే వాళ్ళే!  మీరు వుండేది ఉత్తరం,  నేను ఉండేది దక్షిణం. బోలెడు దూరం తిరిగెలి వద్దు లెండి'  
'నేనేమన్నా మిమ్మల్ని మోసుకుంటూడతానా? కారే కదా. పైగా డ్రైవర్ కూడా వున్నాడు, పదండి'
'సరే పదండి'
ఇంటి దగ్గర దిగే ముందు -
'నేను చెప్పింది కాస్త గుర్తు పెట్టుకోండి. నాకు ఇది ప్రిస్టేజ్ ఇష్యూ'
ఏళ్ళు గడిచిపోయాయి.
అప్పటి జర్నలిష్టు  ఇప్పుడు మాజీ జర్నలిష్టు.
ప్రెస్ క్లబ్  లో మళ్ళీ కలిశారు అదే ఇద్దరు.
'ఏమండీ బాగున్నారా?'
'మీరెలా వున్నారు?'
బాగానే వున్నాను. కంపెనీ టర్నోవర్ అయిదు కోట్లయింది. పని బాగా పెరిగిపోయింది. మునపటిలా ఎవర్నీ తీరిగ్గా కలవలేకపోతున్నాను. కాసేపు మాట్లాడుకుందాం రండి'
'కాదండీ. ఇప్పటికే చాలా సేపు అయింది. మీకు తెలుసు కదా కాదు చాలా దూరం వెళ్ళాలి. పైగా ఆటో సమస్య'
'మరే. నేను అదే అనుకుంటున్నాను. ఈరోజు వేరే ఫ్రెండ్స్ వస్తామన్నారు. మరో రోజు తీరిగ్గా కులుద్దాం లెండి. గుడ్ నైట్ అండీ'
'గుడ్ నైట్'


(NOTE : COURTESY IMAGE OWNER)

15, మే 2015, శుక్రవారం

బుక్ షెల్ఫ్ - 5 ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు


(శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రచించిన 'హైదరాబాదు - నాడు, నేడు' నుంచి)
"నిజాము గారికి మనుమడు పుట్టాడు. మొజంజాహి అని పేరు పెట్టారు. మనుమడి పేరుతొ నగరంలో ఒక మార్కెట్ నిర్మించారు కూడా.
నిజాము రాజ్యంలో ప్రజలు దొంగతనాలు ఎరుగరు. పోట్లాటలు ఎరుగరు. నిజాము దగ్గర రెవెన్యూ, పోలీసు విభాగాలు పర్యవేక్షించిన రాజా బహదూర్ సర్ కిషన్ ప్రసాద్, కొత్వాల్ వెంకట్రామరెడ్డి ఇందుకు ప్రధాన కారకులు.  
"ఆబిడ్స్ లోని జమ్రుద్ మహల్ సినిమాహాల్లో దేవకీ రాణి కధా నాయికగా నటించిన  'జవానీకి హవా ' అనే సినిమా చూడడానికి నిజాము ముచ్చటపడి వెళ్ళారు.
"ఆ రోజుల్లో జమ్రుద్ మహల్ పెద్ద సినిమాహాలు. అప్పుడప్పుడు అందులో పాట కచ్చేరీలు కూడా జరుగుతూ ఉండేవి. నేను ముసునూరి సుబ్రహ్మణ్యం గారి కచేరీ అక్కడే విన్నాను.
"ఆబిడ్స్ కార్నర్ లో ప్యాలెస్ అనే కొత్త టాకీసు కట్టారు. సుల్తాన్ బజారులో మోతీ మహల్, రాయల్ టాకీసు అనే రెండు థియేటర్లు ఉండేవి. మోతీ మహల్లో చార్లీ చాప్లిన్ మోడరన్ టైమ్స్, సైగల్ దేవదాసు చూసాను. కొన్నాళ్ళ తరువాత అగ్ని ప్రమాదంలో మోతీ మహల్ పూర్తిగా తగులబడి పోయింది. అప్పుడందులో లేడీ డాక్టర్ సినిమా ఆడుతోంది. సులోచన హీరోయిన్. మంటల నుంచి తప్పించుకోలేక అనేకమంది స్త్రీలూ, పిల్లలూ చనిపోయారు. తర్వాత చూస్తె నాలుగయిదు నెలల చంటి పిల్ల పైన పల్లకీ బొంగు మాదిరి వంగిన తల్లి శవం కనిపించింది. చావులో కూడా తల్లికి పిల్ల మీద యెంత ప్రేమో. ఆ పసిబిడ్డ మాత్రం ప్రాణాలతోనే వుంది. తల్లి ప్రేమ తల్లి ప్రేమే.
"గౌలీగూడాలో ఒక మూకీ హాలు వుండేది. దానికి తెర లేదు. తెల్లని గోడ మీదే సినిమా బొమ్మలు నడిచేవి. స్టంట్ సీన్లు వచ్చినప్పుడు హాలు యజమానులు మనుషుల్ని పెట్టి డప్పులు వాయించేవారు.



(ఇంకా వుంది)     

బుక్ షెల్ఫ్ - 4 - కప్పు చాయ్ మూడు పైసలు



శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారి 'హైదరాబాదు - నాడూ నేడూ' నుంచి .....


"స్కూలుకు వెళ్ళడానికి తలకు టోపీ, కాళ్ళకు చెప్పులు, ఒంటికి కొటూ ముఖ్యం. నాకీ మూడూ లేవు. మా అక్కయ్య ఇంటికి దగ్గరలో వున్న చెన్నాప్రగడ రామచంద్ర రావు గారి అబ్బాయి సుధాకర్ కోటు నాకు సరిపోయింది. ఆ బ్లేజర్ కోటు వేసుకుని మిగతా పిల్లలతో పాటు స్కూలుకు బయలుదేరాను. మలక్ పేట రైల్వే బ్రిడ్జ్ (డబీర్ పురా వైపు) కింద నుంచి వెళ్లి చాదర్ ఘాట్ వంతెన వస్తుంది. మూసీ నది మీద ఎంతో అందంగా కట్టారు. మధ్యలో కొంచెం ఎత్తు, ఆ పక్కా  ఈ పక్కా కొంచెం పల్లం. చక్కని తారు రోడ్డు. మధ్యలో కాలి దారి పక్కన కూర్చుని ఓ బక్క పకీరు కమ్మని స్వరంతో 'అల్లా రహం కరదే, మౌలా హుకుం దే' అంటూ భిక్ష  అడుగుతుంటే ఓ పాట పాడుతున్నట్టుగా అనిపించింది. బ్రిడ్జ్ దాటిన  తరువాత విక్టరీ ప్లే గ్రౌండ్. ఇసామియా బజారు, పెద్ద వేప చెట్టు, కింద చిన్న హనుమంతుడి గుడి. త్రూప్ బజారు నిజానికి ట్రూప్ బజారు, కానీ ట్రూప్ బజారనీ, తూర్పు బజారనీ అనేవాళ్ళు. ఇప్పుడది బ్యాంకు స్ట్రీట్. కుడివైపున విశాలమైన ఆవరణలో రెండు మూడు బంగళాలు. అంతకన్నా విశాలమైన స్థలంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జిందా తిలిస్మాత్ దుకాణం తరువాత రామ్ కోటీ సందు. సాగర్ టాకీసు, ఆబిద్ సర్కిల్.  ఆబిద్ రోడ్డులో ఫర్లాంగు దూరంలో ఎడమ వైపు సందులో మా చాదర్ ఘాట్ స్కూలు.           
"ట్రూప్ బజారు ఎడమవైపున రెండు ఇనుప కటకటాలున్న పెద్ద ఆవరణలు. ధన రాజ్ గిర్జీ, ప్రతాప్ గిర్జీలవి. ప్రతాప్ గిర్జీ మార్వాడీల గురువు. ఏటా వారి పుట్టిన రోజున మార్వాడీలు  వారి ఎత్తు బంగారం తూచి కానుకగా ఇచ్చేవారట. నిజాం కన్నా వీరే ధనవంతులని చెప్పుకునే వాళ్ళు. నిజాం ఒక రోల్స్ రాయిస్ కారు  కొంటే వీళ్ళు రెండు  కొనేవారట.
"ఆబిద్ రోడ్డులో కెఫే కరాచీ హోటలు వుండేది. అమృతప్రాయమైన చాయ్ మూడు హాలీ పైసలు. మలైవాలా చాయ్ (మీగడ వేసిన) చాయ్ ఒక అణా.                        

(ఇంకా వుంది)

14, మే 2015, గురువారం

ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు




(నిన్నటి మాటో మొన్నటి ముచ్చటో కాదు చాలా చాలా  పాతకాలం కబుర్లు. నేను పుట్టడానికి పదేళ్ళ ముందు, శిష్ట్లా లక్ష్మీ పతి శాస్త్రిగారు అనే ఓ పెద్ద మనిషి, 1935 లోనే  కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు నుంచి చదువుకోసం హైదరాబాదు చేరారు. ఏళ్ళతరబడి హైదరాబాదు నగరంతో తాను  పెంచి పోషించుకున్న అనుబంధాన్ని తన అనుభవాలతో రంగరించి ఆ పెద్దాయన, 'హైదరాబాదు, నాడు - నేడు' అనే పేరుతొ తొంభయ్ పేజీల  పుస్తకం రాసారు. 2008 లో అది ముద్రణకు నోచుకుంది. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారికి అందులో ఎన్నో విషయాలు అచ్చెరువు గొలిపేలా వున్నాయి. చిన్న పుస్తకం. కానీ అందరూ చదవదగ్గ గొప్ప పుస్తకం. ప్రతులకు, విశాలాంధ్ర బుక్ హౌస్ అని అందులో రాసారు. వెల యాభయ్ రూపాయలు. అందులోని విషయాలు యెంత ఆసక్తికరంగా ఉన్నాయంటే, ఏది ఒదలాలో, ఏది చేర్చాలో తెలియనంత అయోమయంలో పడిపోయాను. పుస్తకంలో అన్నీ మెరుపులే. కానీ బ్లాగు పరిమితుల దృష్ట్యా కుదించి రాయాల్సి వస్తోంది. లక్ష్మీ పతి శాస్త్రి గారి మూల భావానికి న్యాయం చేయడానికే చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. అయినా ఏదో లోపం చేసానేమో అన్న అనుమానం   నన్ను బాధిస్తూనే వుంది.  వారికి క్షమాపణలతో కూడిన ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు)
ఇక ఇక్కడి నుంచి మాటా పలుకూ అన్నీ శాస్త్రిగారివే:





"అది జూన్ నెల ఇరవయ్యవ తారీఖు, 1935 వ సంవత్సరం. గుడ్లవల్లేరులో వున్న మా ఇంటికి హైదరాబాదులో వున్న మా బావగారి నుంచి టెలిగ్రాం వచ్చింది.
"23వ తేదీతో స్కూళ్ళలో ఎడ్మిషన్లు అయిపోతవి. చిక్కాయిని వెంటనే పంపండి"
"చిక్కాయి నా ముద్దు పేరు.
'చిక్కడు సిరి కౌగిటిలో, చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, చిక్కడు శృతి లతికావలి, చిక్కెనతడు తల్లి చేతన్ రోలన్' అనే పోతన పద్యంతో మా అమ్మ నన్ను అలరిస్తూ వుండేది.
"మా నాన్నగారు కోర్టు పనిమీద మద్రాసు వెళ్ళారు. మా అమ్మ దగ్గర దమ్మిడీ లేదు. మర్నాడు రైలు ఎక్కితేకాని హైదరాబాదు చేరలేను. అమ్మ అప్పుచేసి అయిదు రూపాయలు చేతిలో పెట్టింది. పప్పులూ, ఊరగాయలు, పాత్ర సామానులు వున్న రెండు పెద్ద మూటలు కూడా ఒప్పచెప్పింది. రైల్లో ఆ రాత్రి బెజవాడ చేరి మర్నాడు ఉదయం నైజాం బండి ఎక్కాను. సికింద్రాబాదుకు రైలు టిక్కెట్టు మూడు రూపాయల పదమూడు అణాలు.
"కాసేపట్లో ఎర్రుపాలెం వచ్చింది. ఆ రోజుల్లో పద్నాలుగు ఏళ్ళు దాటని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయకూడదని శారదా యాక్టు వుండేది. నైజాంలో అది చెల్లదు. అంచేత పిల్ల పెద్దమనిషి కాకపూర్వమే వివాహం చేయాలనుకునే పూర్వాచారం వారు 'ఎర్రుపాలెం శరణంభవ' అనుకుంటూ అక్కడ ఆ తంతు పూర్తికానిచ్చేవాళ్ళు.
"మహబూబాబాదులో ఎవరో ఒకాయన (ముస్లిం లు ధరించే) ఎర్ర కుచ్చు టోపీతో రైలెక్కాడు. నుదుట రూపాయి కాసంత బొట్టుతో లక్ష్మీ దేవిని తలపిస్తూ పక్కన  ఓ ముత్తైదువ. ఇదేమిటబ్బా అని ఆశ్చర్యపోతుండగా ఆ పెద్దమనిషి టోపీ తీసి పక్కనబెట్టాడు. పిలకున్న బ్రాహ్మణుడాయన.  నిజాం ప్రభుత్వోద్యోగులందరూ ఏదో ఒక  టోపీ ధరించాలి. 'సర్ పే లాల్ టోపీ'
"వరంగల్ స్టేషన్ లో ఆగినప్పుడు దిగి కాణీ పెట్టి  ఓ చక్కిలం కొనుక్కున్నాను. అణా ఇస్తే చిల్లర ఒక కాణీతో పాటు యేవో గీతల మాదిరి అక్షరాలు వున్న రాగి నాణెం ఇచ్చాడు. అది హాలీ అర్ధణా. హాలీ అంటే నిజాం సిక్కా. అక్కడ బ్రిటిష్ సర్కారు సిక్కా, నిజాం సిక్కా రెండూ చెల్లుతాయట. సర్కారు నూరు రూపాయలకు హాలీ నూట పదహారు రూపాయలు. అదీ లెక్క.    
"సికిందరాబాదు చేరిన తరువాత నానా ప్రయాసపడి ఎట్టకేలకు మలక్ పేట లోని మా అక్కయ్య ఇంటికి చేరాను. హైదరాబాదు నగరంతో నా సుదీర్ఘ అనుబంధం నాటి నుంచి,  నా పన్నెండేళ్ళ వయస్సులో మొదలయింది"

(ఇంకా వుంది)