15, నవంబర్ 2013, శుక్రవారం
హే రాం!
లేబుళ్లు:
భద్రాచలం భవిష్యత్తు
12, నవంబర్ 2013, మంగళవారం
బ్రాడ్ కాస్టింగ్ డే
జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గురించి చెప్పాల్సిన
పని లేదు. అలాగే రేడియో గురించి తెలియని వాళ్లు లేరు.
ఈరోజు అంతర్జాతీయ ప్రసార దినోత్సవం (బ్రాడ్ కాస్టింగ్ డే).
‘ఏదీ రేడియో!’ అంటూ తనదయిన శైలిలో చురకలు అంటిస్తూ అలనాటి పాత రోజుల్ని రీవైండ్
చేస్తూ టీవీ -9 లో నిరుడు ఇదే రోజు అందించిన రేడియో కధ ఇది. మరీ
పెద్దదేమీ కాదు. రేడియో వార్తల మాదిరిగా
అయిదే అయిదు నిమిషాల్లో హాయిగా వినేయొచ్చు. రేడియో ప్రియులందరికీ నచ్చుతుందని నా
హామీ. వింటారు కదూ. సారీ కంటారు కదూ. (టీవీ కదా!) - భండారు శ్రీనివాసరావు (12-11-2013)
లేబుళ్లు:
బ్రాడ్ కాస్టింగ్ డే
11, నవంబర్ 2013, సోమవారం
‘నోటా’ లు నోళ్ళు తెరవాలి! – భండారు శ్రీనివాసరావు
తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్టు వాదం ముదిరితే పిడివాదం అవుతుంది.
రాష్ట్రంలో ఈనాడు నెలకొనివున్న పరిస్థితులు గమనిస్తున్న
‘మౌన వీక్షకులు’ నోరు తెరవలేని దుస్తితిలో వుండడానికి కారణం ఈ పిడివాదులే.
రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని కోరేవారు,
విభజించాలని కోరేవారు ఇరుప్రాంతాల్లో అధిక సంఖ్యలో వున్నారు. అలాగే కలసివుంటే పోలా
అనుకునేవాళ్ళు ఇటు తెలంగాణలో, విడిపోతే పోలా అనుకునేవాళ్ళు అటు సీమాంధ్ర లోనూ
వున్నారు. కాకపొతే వీరు అల్పసంఖ్యాకులు. వీరే ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్న ‘నోటా’
(NONE OF THE ABOVE) కేటగిరీ వాళ్లు. విభజన వద్దూ, సమైక్యం వద్దూ అనే వారన్న
మాట. వీరికి కావాల్సింది ప్రత్యేక రాష్ట్రమూ కాదు, కలసి వుండడమూ కాదు. బతుకులు వెళ్ళదీసుకోవడం.
ప్రత్యేక తెలంగాణావాదం తాటి ప్రమాణంలో వున్న రోజుల్లో
కూడా వీరున్నారు. సీమాంధ్రలో ఈ మధ్య సమైక్య ఉద్యమం వువ్వెత్తున ఎగసిన రోజుల్లో కూడా వీరు ఆ
ప్రాంతంలో కూడా వున్నారు. కానీ వీరు కనబడరు. వీరి గోడు ఎవ్వరికీ వినపడదు.
ప్రత్యేక రాష్ట్రం
కోరుకోవడాన్ని ఎవ్వరూ ఆక్షేపించరు. అలాగే సమైక్యంగా వుండాలని అనుకోవడం కూడా
ఆక్షేపణీయం కాదు. కానీ ఈ నినాదాలను అడ్డు పెట్టుకుని పిడివాదం చేసేవాళ్ళతోటే అసలు
తంటా.
సమస్య ఏదో కొలిక్కి
వస్తోందని అనుకుంటే, సమస్యను తీర్చేవాళ్ళూ, సమస్యలో భాగం అయినవాళ్ళూ రాజకీయం
తప్పితే రాష్ట్ర ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తున్నట్టులేదు.
రాష్ట్ర విభజన దిశగా కేంద్రం
త్వరితగతిన అడుగులు వేస్తుంటే, అదీ రాజకీయమే సందేహం లేదు, సీమాంధ్ర పిడివాదులు ‘యెలా
జరుగుతుందో చూస్తాం, ప్రాణాలు పోయినా వొప్పుకోం’ అంటారు. ‘హైదరాబాదు సంగతి
తేల్చకుండా యెలా’ అంటారు. హైదరాబాదు విషయం రాగానే ‘అది లేని తెలంగాణా మాకెందుకు
మేం వొప్పుకోం’ అంటారు వేర్పాటు పిడివాదులు.
అసలు ఈ ఇరుపక్షాలు వొప్పుకోవడం,
వొప్పుకోకపోవడం అనే ప్రాతిపదికపైన పరిణామాలు ఈ దశ వరకూ రాలేదన్న సంగతి ఇరువురికీ
తెలుసు. అయినా మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూనే వుంటారు.
హైదరాబాదును అభివృద్ధి చేసింది మేమే అని చంకలు కొట్టుకునే
సీమాంధ్ర పిడివాదులు అలాటి మరో రాజధాని నగరాన్ని అధ్బుతంగా నిర్మించుకోగల
సామర్ధ్యం లేనివాళ్ళు అనుకోలేము కదా.
అలాగే, ప్రజాభీష్టానికి
వ్యతిరేకంగా రాష్ట్రాన్ని నిలువునా విభజిస్తున్నారన్న ఆగ్రహంతో కాంగ్రెస్
అధినేత్రికి సీమాంధ్రలో ‘సమాధి’ కట్టినప్పుడు కోపంతో వూగిపోయిన తెలంగాణా
పిడివాదులు, రేపు ఖర్మం కాలి హైదరాబాదును సరిహద్దులు పెంచి ఉమ్మడి గవర్నర్ పాలన
కిందకు తీసుకువచ్చే ప్రతిపాదన తీసుకువస్తే మళ్ళీ అలాటి అనాగరిక చర్యకు పూనుకోబోమని ఏమైనా హామీ ఇవ్వగలరా? అందుకే అనేది ఈ విధేయతలు, వినయాలు అన్నీ నిర్ణయాలు తమకు
అనుకూలంగా వున్నప్పుడు మాత్రమే.
రాష్ట్రాన్ని రెండుగా
చేస్తారో, కలిపి వుంచుతారో తెలియదు కాని కాంగ్రెస్ తో సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్ని
నిప్పుల కొలిమిలోకి నెట్టి, వినోదం చూస్తున్నాయి. బహుశా ఇటువంటి వికృత, పైశాచిక
రాజకీయ క్రీడ ఒక్క మన దేశంలోనే సాధ్యమేమో!
అందుకే - ‘నోటా’ లు నోళ్ళు తెరవాలి.
(11-11-2013)
లేబుళ్లు:
NOTA (NONE OF THE ABOVE) - నోటా
రారండోయ్ రారండోయ్ రేడియో విందాం రారండోయ్ - 4
రెండేళ్ళ తరువాత అంటే 1935 లో డెక్కన్ రేడియో కేంద్రాన్ని
నిజాం స్వాధీనం చేసుకున్నారు. నిజాం సంస్థానంలోని వైర్ లెస్ విభాగం కింద
డెక్కన్ రేడియో పనిచేయడం మొదలు పెట్టింది. నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఆధ్వర్యంలో
డెక్కన్ రేడియో కేంద్రానికి మరిన్ని హంగులు సమకూరాయి. ఇంగ్లాండ్ లోని
మార్కొనీ కంపెనీ తయారు చేసిన శక్తివంతమైన రెండువందల వాట్ల రేడియో ట్రాన్స్ మిటర్
ను దిగుమతి చేసుకున్నారు. రేడియో కేంద్రాన్ని చిరాగ్ ఆలీ లేన్ నుంచి ఖైరతా బాద్
లోని యావర్ మంజిల్ అనే భవనంలోకి మార్చారు. కొత్త రికార్డింగ్ స్టుడియోలను
నిర్మించారు. నగర పొలిమేరల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పెద్ద యాంటీనా
నెలకొల్పారు. దానిమీద వున్న యెర్ర విద్యుత్ దీపాలు నగరంలో సుదూరంగా వుండే అనేక
ప్రాంతాలకు కనబడేవని చెప్పుకునే వారు. డెక్కన్ రేడియోలో పనిచేసే ఒక ఉద్యోగిని
లండన్ పంపించి బీబీసీ లో శిక్షణ ఇప్పించారంటే డెక్కన్ రేడియో పట్ల నవాబ్ ఆలీ యవార్
జంగ్ ఎంతటి శ్రద్ధ తీసుకున్నదీ అర్ధం అవుతుంది.
(డెక్కన్ రేడియో
స్టూడియోలో అలనాటి సంగీతకారులు)
తరువాతి రోజుల్లో డెక్కన్ రేడియో సంగీత కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాటికి శ్రోతల నుంచి విశేషమైన ఆదరణ లభించడం అందుకు కారణం. ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్, ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్, హీరా బాయ్ బరడేకర్, ఆవిడ సోదరి సరస్వతీ రాణే
వంటి సుప్రసిద్ధ
సంగీతకారులు డెక్కన్ రేడియో కళాకారుల జాబితాలో వుండేవారు. మరో ప్రసిద్ధ సంగీత
కారుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ రెండు పర్యాయాలు హైదరాబాదు వచ్చి డెక్కన్
రేడియోలో ప్రోగ్రాములు ఇచ్చారు.
డెక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడం, మరాఠీ భాషల్లో కూడా కొన్ని కార్యక్రమాలు
ప్రసారం అయ్యేవి కాని వాటి వ్యవధి చాలా పరిమితం.
10, నవంబర్ 2013, ఆదివారం
కొత్త బంగారులోకం
పొద్దున్నే పెడితే టీవీ లేదు. కరెంటు వుంది. ఈ
కేబుల్ వాడికి చెప్పాలి. సెట్ అప్ బాక్స్ గుడ్డూ అంటూ వేలకువేలు పట్టుకుపోయాడు
కాని టీవీ ఎప్పుడూ అంతే. ఇరవై నాలుగ్గంటలు వెధవ చాకిరీ వెధవ చాకిరీ అనుకుంటున్నదేమో
తెలియదు. ఒక ఛానల్ వస్తే ఇంకో ఛానల్
గుర్రు బర్రు. పిక్చర్ ట్యూబ్ పగిలిపోతున్నట్టు ఒకటే చప్పుళ్ళు. డిజిటల్ క్వాలిటీ
ప్రసారాలు అంటూ చేసిన ప్రచారాలు అంతటితోనే సరి. ఎవడో ఈ బాక్సులు తయారుచేసేవాడు బాగుపడివుంటాడు.
డిజిటల్ సంగతి సరే వెనకే బాగావుండేదని అంతా అనేవారే కాని అడిగేవాడు లేడు. అదే
సర్కారు ధైర్యం.
టీవీ లేకపోతే పోయింది. ఈ సెల్ ఫోనుకేమొచ్చింది.
వూరికే చెవికోసిన మేకలా అరుస్తుండేది. ఇవ్వాళ ఏమిటి ఇలా మూగనోము పట్టింది. చార్జ్ అయిపోయిందా అంటే అదీ లేదు. ఏవైందబ్బా!
సెల్ ఫోను సరే అసలు నాకేమైంది. చుట్టూ ప్రపంచం
చిత్రంగా మారిపోతోంది. రేడియోలో వెంకటేశ్వర సుప్రభాతం కమ్మగా వినబడుతోంది. హాల్లో
ఓ మూల బల్లపై, వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్ లాగా ఇన్నాళ్ళు మౌనంగా పడున్న లాండ్ లైన్ ఫోను గణ గణా మోగుతోంది. వరండాలోకి
వెళ్ళి చూస్తే అందరి ఇళ్ళ పైకప్పుల మీద దొండ పాదుల పందిళ్ళ మాదిరిగా దూరదర్శన్ యాంటీనాలు
దర్శనమిచ్చాయి. వెళ్ళి టీవీ పెడితే, పాలూ చేలూ పెరుగూ పేడా గురించి ఎవరో చెబితే ‘మా స్టుడియోకి వచ్చి ఎన్నో మంచి విషయాలు
చెప్పారం’టూ యాంఖరమ్మ వయ్యారాలు పోతూ అంటోంది.
రోజూ పొద్దున్నే ఇంటి గుమ్మం ముందు పడివుండే
పేపరు మధ్యాహ్నానికి కానీ మొహం చూపించలేదు. అప్పుడు కానీ ‘ఈ చిత్రం భళారే విచిత్రం’
కారణం అర్ధం కాలేదు. అంతరిక్షంలో ఎక్కడినుంచో దారితప్పి భూమి వైపు అమిత వేగంతో దూసుకువస్తున్న ఓ గ్రహశకలం
మరోసారి దారితప్పి రోదసిలో వున్న మన సమాచార కృత్రిమ ఉపగ్రహాన్ని డీకొన్నదట. దాంతో
దేశంలో సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలిందట.
ఈ ‘ట’ వార్తలు ఇంకా పూర్తి కాకముందే మెలకువ
వచ్చేసింది. కల చెదిరింది. అన్ని గదుల్లో టీవీలు, అందరి చేతుల్లో సెల్ ఫోన్లు తెగ మోగిపోతున్నాయి.
అయ్యో ఇది కలా !
కల నిజమైతే యెంత బాగుంటుంది.
(10-11-2013)
9, నవంబర్ 2013, శనివారం
రారండోయ్ రారండోయ్ రేడియో విందాం రారండోయ్ - 3
దేశానికి
స్వాతంత్ర్యం రావడానికి ఓ పుష్కర కాలం కంటే చాలా ముందుగానే,
అప్పటి నిజాం
సంస్థానంలో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. 1933 లో రెండువందల వాట్ల ట్రాన్స్మిషన్
శక్తితో, ‘డెక్కన్ రేడియో’ అనే పేరుతో
ఒక ప్రైవేటు
రేడియో స్టేషన్ ను హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఆ రేడియో ట్రాన్స్ మిటర్ ను
స్తానికంగా రూపొందించడం విశేషం. వాస్తవానికి ఈ రేడియో కేంద్రం ఒక కుటుంబం ఆధ్వర్యంలో ఏర్పాటయింది. ఆ కుటుంబసభ్యులే కేంద్రం నిర్వహణ బాధ్యత
చూసుకునేవారు. చిరాగ్ ఆలీ లేన్ లోని ఆజం మంజిల్ భవనంలో ఈ రేడియో కేంద్రం
పనిచేసేది.
ఉర్దూలో
వార్తలతో పాటు గజల్స్, ఖవ్వాలీలు,
పాటలు ప్రసారం అయ్యేవి. ఆ రోజుల్లో సినిమా పాటల రికార్డులు అంత సులభంగా
దొరికేవి కావు. దానితో స్థానిక సంగీత కళాకారులు రేడియో కేంద్రానికి వచ్చి తమ
కార్యక్రమాలను రికార్డ్ చేసేవారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు రోషన్ ఆలీ డెక్కన్
రేడియోలో మొదటి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ఎం ఏ రవూఫ్ డెక్కన్
రేడియోలో స్టుడియో ఎక్జిక్యూటివ్ గా చేరారు. ఆయన పేరు పొందిన గజల్ గాయకుడు. తదనంతర
కాలంలో రవూఫ్ ఈ కేంద్రానికి డైరెక్టర్ అయ్యారు.
మొహరం మాసంలో
రేడియో కేంద్రానికి సెలవు ప్రకటించేవారు. ప్రసారాలు వుండేవి కావు.
ఆ తరువాత
కొన్ని మార్పులు చేశారు. మొదటి పదమూడు రోజులు ప్రసారాలు నిలిపివేసేవాళ్ళు. మిగిలిన
రోజుల్లో కూడా సంగీత కార్యక్రమాలు వుండేవి కావు. స్థానిక వార్తాపత్రికల్లో
వెలువడిన వార్తల ఆధారంగా న్యూస్ బులెటిన్లు తయారయ్యేవి. రాష్ట్రానికి సంబంధించిన
సమాచారమే వార్తల్లో చోటుచేసుకునేది.
ఇదో చిత్రం
తెలతెల్లారుతున్నప్పుడు, కంటున్న కలలకు తెరపడుతున్నప్పుడు, కళ్ళు తెరవాలంటే తగని బద్ధకం. ఇంకాసేపు అలాగే పడుకోవాలని, నిద్ర పోవాలని తెగ అనిపిస్తుంది. ఇక
మధ్యాహ్నం భోజనం చేసీ చేయగానే ఓ కునుకు తీయాలని
చావుకోరిక పుడుతుంది. కాని అదేవిటో చిత్రం,
రాత్రి వేళ మాత్రం అర్ధరాత్రి బాగా పొద్దుపోయిన తరువాత కూడా నిద్రపట్టి చావదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)



