12, జనవరి 2012, గురువారం

‘కొలవెరి కొలవెరి కొలవెరి ది’


 ‘కొలవెరి కొలవెరి కొలవెరి ది’ - ఆర్వీవీ  కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు 

‘వై దిస్ కొలవెరి కొలవెరి  కొలవెరి ది’ అంటూ తమిళ నటుడు ధనుష్ సృష్టించిన ‘కొలవెరి పాట’ పుట్టించిన  ప్రభంజనంతో  జనం ఓ పక్క  ఊగిపోతూ వుంటే,  'సా పా సా' లు ఎవరికి  కావాలోయ్!”  అనే వాళ్లకు ‘మద్రాస్ సంగీతోత్సవం’ ఓ  చక్కటి జవాబు.
రాయపేటలోని మ్యూజిక్ అకాడెమి హాలు   పొద్దున్నుంచి  రాత్రి దాకా సంగీత అభిమానులతో నిండిపోతూ వుండేది. పక్కనే వున్నమరో చిన్న ఆడిటోరియం ‘కస్తూరి శ్రీనివాస బిల్డింగ్’ లో  ఎల్సీడీ స్క్రీన్ పెట్టి కచేరీలు లైవ్ ఇస్తుంటే  ఆ హాలు  కూడా ఖాళీ లేకుండా నిండిపోయేది.  ఇవన్నీ ఫ్రీ  కాదు. టిక్కెట్టు  పైనే.  పదిహేను రోజుల సీజను టిక్కెట్టు  అక్షరాలా తొమ్మిదివేల రూపాయలు. అన్నీ   ముందే అయిపోయాయి.  ఇక రోజువారీ టిక్కెట్టు  మూడు వందల రూపాయలు.  పైన  బాల్కనీ వెనక రోలో సీటు వంద రూపాయలు. ఏ కచేరీకి  ఆ కచేరీ టిక్కెట్లు కచేరీ ప్రారంభం కావడానికి ముందు ఏ రోజుకారోజు  ముందే అమ్ముతారు. దానికి  పెద్ద క్యూ.  ఎల్సీడీ  స్క్రీన్ మీద చూసే హాలులో వేశ రుసుము యాభయ్ రూపాయలు. అలాగే, ఆడిటోరియం క్యాంటీన్ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. వెనక అయిదారు రూపాయలకు దొరికే కాఫీ ఇప్పడు ఇరవై. భోజనం ఏకంగా నూట పాతిక పైమాటే. సంగీతం అంటే చెవికోసుకునే అభిమానులు  టిక్కెట్టు ధరను  లెక్కపెట్టక పోవచ్చు. పైగా సంగీతాన్ని ప్రోత్సహించే తత్వం అక్కడి వారిది. కాకపొతే, సహజంగా భోజన ప్రియులయిన తమిళ సోదరులు క్యాంటీన్ ధరలను హరాయించుకోలేకపోతున్నారేమోనన్న భావన కలిగింది.  
అయితే, ఈ సంగీతోత్సవాల నిర్వహణను కొన్నేళ్లుగా గమనిస్తూ వస్తున్నవారికి గతానికీ ఇప్పటికీ ఎంతో మార్పు కనపడుతోంది. టాప్ కార్పోరేట్  సంస్థలతోపాటు మీడియం, స్మాల్ స్కేల్  కంపెనీలు కూడా ఇప్పుడు వీటికి స్పాన్సర్లే. కాంపౌండ్ మొత్తం  అంగుళం ఖాళీ లేకుండా బ్యానర్లు  కట్టేశారు.  టయోటా కంపెనీ  వాళ్ళయితే ఏకంగా ఓ  పడవలాంటి లేటెస్ట్ మోడల్ కారుని డిస్ ప్లే కి పెట్టారు. సంగీతాన్ని మహా  గొప్పగా మార్కెట్ చేసేసారు. ఇక సీడీలు,మ్యూజిక్ వాయిద్యాల  అమ్మకాలు సరేసరి.  అంతా డిజిటల్ అయిపొయింది కదా. శ్రుతి కోసం తంబురా చేతితో మీటడం పోయింది. ఎలక్ట్రానిక్ శ్రుతి బాక్సులు వచ్చేసాయి. తోడుగా   ఇప్పుడు ఎలక్ట్రానిక్ వీణ కూడా వచ్చింది.  ఏ పాట కావాలంటే అది అలవోకగా వాయించేయొచ్చేమో. ఇక లోపల ప్రేక్షకుల్లో   కూడా చాలా మార్పు వచ్చింది. మొన్నటి దాకా సంగీతం వినడానికి తలనెరిసిన వాళ్ళు, పెద్ద వయస్సు వాళ్ళు ఎక్కువగా వచ్చే వారు.  హాలులో  మూడు వంతులు వీళ్ళు వుంటే మిగిలిన ఒక వంతు  యువతరం వారన్న మాట. కానీ ఇప్పుడు సీను పూర్తిగా  మారిపోయింది. వినే వాళ్ళలో మూడొంతుల మంది ముప్ఫయ్ ఏళ్ల లోపు వాళ్ళే.  అలాగే స్టేజి మీద విద్వాంసులు కూడా. ఇన్నాళ్ళు సాయంకాలం స్లాట్లు సీనియర్ విద్వాంసులకు కేటాయించి, ఉదయం మధ్యాహ్నం కచేరీలు జూనియర్లకు ఇచ్చే వారు. సాయంత్రం హాలు కిటకిటలాడితే ప్రొద్దుట, మధ్యాహ్నం కాస్త పలచగా వుండేది. ఇప్పుడలా కాదు. సాయంకాలం పాడేవాళ్ళంతా యువతరం ప్రతినిధులే.  ఎంతో అలవోకగా కచేరీలు చేసేస్తున్నారు.  ముప్ఫయ్యేళ్ల వయస్సులో ముప్ఫయ్యేళ్ల అనుభవాన్ని రంగరించి చూపుతున్నారు. ఎన్నెన్నో అపురూప కీర్తనలు చక్కగా వినిపిస్తున్నారు. శాస్త్రీయ  సంగీతం యువతరానికి దూరం అయిపోతున్నదేమో అన్న సందేహం ఇక ఏ  మాత్రం అక్కర్లేదు. అన్ని రంగాల్లో మాదిరిగా  సంగీతంలో కూడా ఈనాటి యువతరం ప్రదర్శిస్తున్న చొరవకు, అనురక్తికి   జోహార్లు. మరో విషయం.  ఇది వరకు సంగీతం నేర్చుకొంటే చదువు అబ్బదు అనేవారు. ఇప్పటి పరిస్థితి వేరు.  ఈనాడు సంగీతాన్ని వృత్తిగా  చేపట్టిన వాళ్ళంతా పెద్ద పెద్ద చదువులు చదివినవారే. చాలా మంది ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎం.లలో పట్టభద్రులు.  అందుకేనేమో గతంలో ఇరవై ఏళ్ళు సాధన చేస్తే కాని రాని విద్వత్తు ఇప్పుడు చాలా త్వరగా వంటపడుతోంది.   అలాగే సంగీతం చాలా ఖరీదయిన వ్యవహారంగా మారిపోయింది కూడా.   వీళ్ళు డిమాండ్ చేస్తున్న పారితోషికం కూడా చాలా ఎక్కువే. లక్షల్లో వుంటోంది. బహుశః ఇతర రంగాల్లో వున్న వాళ్ళ సహాధ్యాయులకు తీసిపోకుండా తాము కూడా సంపాదించాలన్న కుతూహలం కావచ్చు. సీనియర్ విద్వాంసుల నుంచి నేర్చుకోవాలన్న తపన కూడా వీరిలో కనపడడం మరో మంచి విషయం.
మొన్నటి మ్యూజిక్ ఫెస్టివల్లో  ఎమ్మెస్ గోపాలకృష్ణన్, టీకే మూర్తి,  ఉమయాల్పురం శివరామన్. ఆర్కే శ్రీకంఠన్, వి. కమలాకరరావు, లాల్గుడి జయరామన్  వంటి వారు యువతరంతో డీ కొనవలసివచ్చింది.  రెండు తరాల మధ్య   గమనించ తగ్గ తేడా వొకటి వుంది.  సరే! యువతరం విద్వాంసులు అద్భుతంగా  కచేరీలు చేస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో సీనియర్లను కూడా మరిపిస్తున్నారు. బానే వుంది.  మన ( కర్ణాటక ) సంగీతానికి ఇతర సంగీతరీతులకు ఒక మౌలికమైన తేడా వుంది.   మనది ఆధ్యాత్మికతోకూడినది. భౌతికమైన అనుభూతి ఒక్కటే ప్రధానం   కాదు. సీనియర్లు  పాడినప్పుడు కలిగే భక్తిభావం యువతరం పాడినప్పుడు కొరవడుతున్నదనే చెప్పాలి. కాకపొతే ఇది అందరికీ వర్తించకపోవచ్చు సుమా.  (12-01-2012)    

5, జనవరి 2012, గురువారం

సంగీతం మధుర సంగీతం



సంగీతం మధుర సంగీతం – ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు

'సంగీతము చేత బేరసారములుడిగెన్'

చిన్నప్పుడు సంగీతం నేర్చుకొందామనుకొనే  వారందరికీ  కాషన్ గా ఈ సామెత చెప్పేవారు.  అయితే కొంతమంది పెళ్ళిచూపుల్లో అదనపు అర్హత కోసం చిన్నప్పుడు ఆడపిల్లలకి ఇళ్ళల్లో నాలుగయిదేళ్లపాటు  సంగీతం చెప్పించేవారు.  దొంగరాముడు సినిమాలో  వీరభద్రయ్య {రేలంగి} తన కూతురుకి ఇలాగే పెళ్లి సంగీతం చెప్పిస్తాడు.  పెళ్లి చూపుల్లో 'జార చోరా భజన చేసితిరా' అని 'దారిని తెలుసుకొంటి' అనే త్యాగరాజ కీర్తనలో  ఓ  చరణాన్ని పెళ్లి కూతురు చేత  పాడిస్తారు దర్శకుడు కేవీ రెడ్డి గారు.

అదలా వుంచితే,

తెలుగునాట  ద్వారం వెంకటస్వామి నాయుడు, చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్లే, దాలిపర్తి పిచ్చిహరి, హరి నాగభూషణం, తూమాడ సంగమేశ్వర శాస్త్రి, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, మహావాది వెంకటప్పయ్య  వంటి పాటా తరానికి చెందిన సంగీత విద్వాంసులు ప్రసిద్ధిచెందారు. పోతే, సుసర్ల దక్షిణా మూర్తి గారు త్యాగరాజు శిష్య పరంపరలోని వారు.  ఈ మహా విద్వాంసుల శిష్యకోటిలో తెలుగు వారికి అఖండ ఖ్యాతి తెచ్చిపెట్టిన వారు మంగళంపల్లి బాలమురళి కృష్ణ, శ్రీపాద పినాకపాణి, నేదునూరి కృష్ణ మూర్తి, వోలేటి వెంకటేశ్వర్లు, షేక్ చిన్న మౌలా, ఈమని శంకర శాస్త్రి .  ఇంకా ఎందరో  విద్వాంసులు కర్నాటక సంగీతంలో  అగ్రశ్రేణిలో నిలిచారు.  ఈ విషయంలో మనం ఎంత గొప్పవాళ్ళ మైనా  తమిళులు కర్నాటక సంగీతం వాళ్లదేనని అనుకొంటారు. కొంత వాస్తవం కూడా. కర్నాటక సంగీతానికి  తమిళనాట ఉన్నంత ఆదరణ మన ప్రాంతంలో లేదు. మద్రాసులో కచేరి చేసి అక్కడి వాళ్ళ చేత ‘సెహభాష్’ అనిపించుకొంటేనే ఇక్కడ కూడా గౌరవం. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అన్న సూత్రం ఇక్కడ పని చెయ్యదు.  సంగీతంలో మాత్రం రచ్చ  గెలిస్తేనే  ఇంట్లో గౌరవిస్తాం.
  ఫిడేలు నాయుడు గారి నుంచి ఈతరం మాండొలిన్ శ్రీనివాస్ దాకా ఇదే వరస, ఇదే బాణీ.



  
ఈ మధ్య  ముగిసిన చెన్నై  మ్యూజిక్ సీజనులో ఈ వాస్తవం మరోమారు బోధపడింది.  మార్గశిర మాసం వచ్చిందంటే చెన్నై వాసులకు  ఓ పండగ. డిసెంబర్ పదిహేనో తారీకు నుంచి జనవరి ఒకటో  తారీకు దాక చెన్నైలో సంగీతం తప్పితే ఏమీ వుండదు.  నగరంలో నలుమూలలా కనీసం ఓ  పది పదిహేను ప్రాంతాల్లో ప్రతి  రోజూ హీనపక్షం  అయిదారు సంగీత  కచేరీలయినా  జరుగుతూ వుంటాయి. ఎక్కడ చూసినా హడావుడే. ఎక్కడెక్కడినుంచో  కర్నాటక సంగీత అభిమానులు చెన్నై చేరుకుంటారు.  ప్రొద్దుట తొమ్మిది నుంచి రాత్రి పది దాకా కచ్చేరీలు  వినడమే వారి పని. చెవుల తుప్పు వొదిలిపోతుంది. మరో ఏడాదికి సరిపడా ఆనందాన్ని మనస్సులో నింపుకుని సంగీతాభిమానులు తిరుగుమొగం పడతారు.

ఇక చెన్నైలో  మ్యూజిక్ అకాడమీది  ఓ ప్రత్యేకత. మొన్న ముగిసిన డిసెంబరులోనే ఈ అకాడమీ  85 వ సంగీతోత్సవం  జరుపుకొంది. నిజానికి పాశ్చాత్య ధోరణులు అన్ని రంగాలను ముప్పేటలా ముసురుకుంటున్న ఈ రోజుల్లో ఇది  ఎంతో గొప్ప విషయం అనే చెప్పుకోవాలి.


 అకాడమీలో కచేరి చెయ్యడం అంటే ఆర్టిస్టులకు  అంతకంటే  గొప్ప గౌరవం ఇంకోటి  వుండదు. అలాగే సంగీత అభిమానులకు అకాడమీలో  కచేరి వినడం.  అంత కంటే గొప్ప అనుభవం వుండదు.  జీవితంలో వొక్కసారైనా అకాడమీలో  కచ్చేరి వినాలన్నది వారి నరనరాల్లో జీర్ణించుకుపోయే కోరిక. మంచి సంగీతం వినాలనుకునే వారికి   మ్యూజిక్ అకాడమీ హాలు ఒక వరప్రసాదం లాటిది. ఎందుకంటె అక్కడి ఏర్పాట్లు అలాటివి. ఎక్కడ కూర్చున్నా కూడా  చక్కగా, శ్రావ్యంగా వినిపించే సౌండ్ సిస్టం.  మన రవీంద్ర భారతి అధికారులు ఓ సారి వెళ్లి చూడాలి.  ఆ సీటింగ్ ఆరెంజిమెంటు,  సౌండ్ సిస్టం దేనికదే ప్రత్యేకం.  వాళ్ళను పొగడడం, మన వాళ్ళను కించబరచడం అని  కాదు.  మనకు కూడా ఇక్కడ అటువంటి చక్కటి  అనుభూతి కలగాలని మాత్రమె.

అకాడమీ  టీటీకె ఆడిటోరియంలో అడుగు పెట్టగానే ‘హాల్ అఫ్ ఫేం’ లో అకాడమీ  వార్షిక ఉత్సవాలకు అద్యక్షత  వహించిన విద్వాంసుల ఫోటోలు.  అలా అద్యక్షత వహించినవారికే ఆ ఏడాది ‘సంగీత కళానిధి’ బిరుదు  ఇస్తారు. నిజమయిన సంగీత కళాకారులకు దీన్ని మించిన సత్కారం వుండదు. కళానిధి బిరుదును మించిన పురస్కారం వుండదు. పద్మ విభూషణ, పద్మ భూషణ, పద్మశ్రీ  పురస్కారాలు కూడా  సంగీత కళానిధికి సాటిరావని భావించే సంగీత విద్వాంసులు వున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ 85  ఏళ్లలో సంగీత కళానిధిపొందిన తెలుగు వారు చాలా తక్కువ.  ద్వారం వెంకట స్వామి నాయుడు, చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్లే, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ , (ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు  మృణాలిని  మాతామహులు),  మంగళంపల్లి బాల మురళి కృష్ణశ్రీపాద పినాక పాణి, నేదునూరి కృష్ణ మూర్తి, షేక్ చిన్న మౌలా మాత్రమే  ఈ అరుదయిన సంగీత  పురస్కారం పొందిన కొద్దిమంది తెలుగువారిలో వున్నారు. సంగీత చక్రవర్తులుగా పేరొందిన ఎందరో  మహామహుల సరసన   వీళ్ళ ఫోటోలు చూస్తూ వుంటే తెలుగువాళ్లకు  వొళ్ళు పులకరించడం ఖాయం.

ఈ స్తాయి కలిగిన మరికొందరు సంగీత కళాకారులు తెలుగునాట లేకపోలేదు. కారణం తెలియదు కాని వారికి ఈ మహత్తర గౌరవం దక్కలేదు. పారుపల్లి,  పిచ్చి హరి,  ఈమని శంకర శాస్త్రి, చిట్టిబాబు ఈ గౌరవం అందుకోకుండానే అందరాని తీరాలకు తరలిపోయారు. ఇక సంగీత  కురువృద్ధుడు  నూకల చిన్న సత్యనారాయణ ఇప్పటికీ అంత వయస్సులో కూడా కచ్చేరీలు చేస్తూ అభిమానులను అలరిస్తూనే వున్నారు. మల్లాది బ్రదర్స్, హైదరాబాదు సిస్టర్స్, మాండొలిన్ శ్రీనివాస్ ఎప్పుడో ఒకనాడు చెన్నై  మ్యూజిక్ అకాడమీలో తెలుగు బావుటా ఎగురవెయ్యకపోరు. అదే సంగీతాభిమానుల ప్రగాఢ అభిలాష.

చెన్నై సంగీతోత్సవం వివరాలు మరోసారి. (05-01-2012)

31, డిసెంబర్ 2011, శనివారం

HAPPY NEW YEAR – 2012 - నూతన సంవత్సర శుభాకాంక్షలు


HAPPY NEW YEAR – 2012 - నూతన సంవత్సర శుభాకాంక్షలు- 2012



చలచల్లగా  తీయతీయగా 



                                       


వొత్తిలా వెలగండి
కత్తిలా మెరవండి
కొత్త ఏడాదిలో
ఎత్తుగా ఎదగండి                           
                                                             అత్తరువు గంధమై
                                                             చిత్తరువు చందమై
                                                             కొత్త ఏడాది
                                                             మిము హత్తుకోవాలి!
                 
      నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు, హైదరాబాదు  
             NIRMALADEVI,   BHANDARU   SRINIVASA  RAO

30, డిసెంబర్ 2011, శుక్రవారం

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు



ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు

తమ శ్వాస,ధ్యాస కళామతల్లి మాత్రమేనని,  తుది శ్వాస వొదిలేవరకు  వరకు నటిస్తూనే వుంటామని  చెప్పుకునే వారు చాలామంది కనిపిస్తారు. కాని అలాటి అరుదయిన కోవలో చేర్చాల్సిన మహా నటులు కూడా తెలుగు నాటకరంగంలో  వున్నారు.
వల్లూరు వెంకట్రామయ్య చౌదరి బాలనాగమ్మ నాటకం ఆయన పోయే వరకు బాగా నడిచింది.  మాయల ఫకీరుగా ఆయన నటన గొప్పగా వుండేది అనే వారు. ఓ నాటకంలో నటిస్తూనే   స్టేజీ  మీదే చనిపోయారు. అలాగే రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయుడి పాత్ర ధరించే   బేతా వెంకటరావు గారు కూడా వేషం మీదే చనిపోయారు. మహానుభావులు. కళామతల్లి సేవచేస్తూనే కన్నుమూశారు. వెంకటరావు గారి అబ్బాయి  బేతా రామచంద్రరావు తండ్రి కళను పుణికిపుచ్చుకున్నాడు. అతడు కూడా ఆంజనేయుడి వేషం వేసేవాడు.
నెల్లూరుకు  చెందిన పొన్నాల రామసుబ్బారెడ్డి మరో ప్రసిద్ధి చెందిన నటుడు.  హరిశ్చంద్ర పాత్రకు పెట్టింది పేరు. మందపాటి రామలింగేశ్వర రావు  విశ్వామిత్రుడుగా  వేసేవారు. గూడూరి సావిత్రి అనే ఆవిడ ఈయన టీంలో చంద్రమతి గా పేరు పొందారు. సావిత్రి ప్రస్తావన వచ్చింది కాబట్టి కొందరు మహిళా నటీమణులను సంస్మరించుకుని ఈ వ్యాసపరంపరకు భరతవాక్యం పలుకుదాం.   

ద్రౌపదిగా పూర్ణిమ వేసేవారు ఎక్కువగా. కొంచెము లావుగా వున్నా ఆవిడ నటన, పద్యం పాడే విధానం నచ్చిన ప్రేక్షకులు అవేవీ   పట్టించుకోకుండా అభిమానించేవారు. పువ్వుల అనసూయపీసపాటి సత్య వతి కూడా ద్రౌపది వేసే వారు.

(తెలుగు నాటక రంగానికి సేవ చేసిన మహామహులను గుర్తున్నంతవరకు మాత్రమే కాకుండా గుర్తు తెచ్చుకుని


 కూడా మరోమారు  సంస్మరించుకోవడానికి  చేసిన చిరు ప్రయత్నం ఇది. ఈ క్రమంలో ఎవరినయినా పొరబాటున

 మర్చిపోతే ఆ తప్పిదాన్ని మన్నించాలని మనవి. – ఆర్వీవీ కృష్ణారావు,భండారు శ్రీనివాసరావు) 

29, డిసెంబర్ 2011, గురువారం

మరపురాని మరికొందరు మహానటులు


మరపురాని మరికొందరు మహానటులు 
-ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు

నాటకాలు ఆడేవారిలో సూరిబాబు,రాజేశ్వరి నిజజీవితంలో భార్యాభర్తలు. సూరిబాబు కంఠం అదోరకంగా వుంటుంది. కంచు కంఠం  అనేవారు. చాలా సినిమాల్లో వేషాలు వేసారు. ఎక్కువగా నారదుడిగా.  స్టేజి మీద  ఆయన ధర్మరాజు వేసేవారు. 

పాచికలు ఆడే సీనులో  తమ్ములనుద్రౌపదిని వొక్కొక్కరినీ పణంగా  పెట్టి వోడిపోతున్న ఘట్టంలో  పద్యాలు గొప్పగా ఉండేవి.  రాజేశ్వరితో కలసి తారాశశాంకం’ ఆడేవారు.
బెజవాడలో శరభయ్య గుళ్ళకు ఎదురుగా  రైలు పట్టాలకు ఆవతలి వయిపు  ‘రాజేశ్వరి మేడ వుండేది. కందుకూరి చిరంజీవి రావు మరో ధర్మరాజు.  రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్ గా వుండేవారు. పద్యంతో పాటు నటనకు ప్రాధాన్యం ఇచ్చేవారు.

సి.డి. కృష్ణమూర్తి అనే ఆయన కూడా ధర్మరాజుకృష్ణుడు వేషాలు  వేస్తూ వుండేవారు. జైహింద్ టాకీసు లక్ష్మీ టాకీసుల మధ్య సోమిదేవమ్మ గారింట్లో వెనుక పోర్షన్ లో అద్దెకు వుండేవారు.  పుట్టుకతో అరవ వాడు అయినా తెలుగులో సుస్వరంతో రాగయుక్తంగా పద్యాలు పాడేవారు. కిరీటం వెనుక గుండ్రటి వెలుగు ప్రసరిసున్నట్టుగా కృష్ణుడి వేషంలో ట్రిక్ ఫోతోగ్రఫీతో తీయించుకున్న అనేక  ఫోటోలు సీడీ కృష్ణమూర్తి గారింట్లో గోడలమీద దర్శనమిచ్చేవి.

దుర్యోధనుడుగా ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి పేరు  అందరికీ  తెలిసిందే. నాటకాల్లో ప్రారంభించి సినిమాలకు వెళ్లి అడపా తడపా మళ్ళీ నాటకాలు వేస్తూ వుండేవారు. చివరగా అవసాన దశలో  గుంటూరులో వో పెద్ద ఆంజనేయ స్వామి గుడి కట్టించి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ రాముల వారిలో ఐక్యం  పొందారు.
ఎన్. వి. ఎల్. నరసింహాచార్యులు, తుర్లపాటి రాధాకృష్ణమూర్తి , వెంట్రప్రగడ నారాయణరావుదుర్యోధన వేషాలకు ఖ్యాతి గడించారు. కురుక్షేత్రంలో భీముడిదో మంచి పాత్ర.  వేమవరపు శ్రీధరరావు గారు భీముడి పాత్రకి  మరోపేరుగా  నిలిచారు. ఈయనకూడా రేడియో స్టేషన్ లో స్టాఫ్ ఆర్టిస్ట్  గా వుండేవారు. టి. శేషా రావువిన్నకోట సాంబయ్య  భీముడిగా గుర్తుండిపోయే పేర్లు. అబ్బూరి ఆదినారాయణ శర్మ,  అబ్బూరి వర ప్రసాద రావు తమ్ముడు. ఈయన కర్ణుడిగా వేసేవారు.  అలాగే అబ్బూరి వెంకటప్పయ్య. హెచ్. ఎం. వి. వారి గ్రామఫోను   రికార్డుల్లో  అబ్బూరితో కలసి పాడారు.

వల్లూరు వెంకట్రామయ్య చౌదరి బాలనాగమ్మ నాటకం ఆయన పోయే వరకు బాగా నడిచింది.  మాయల ఫకీరుగా ఆయన నటన గొప్పగా వుండేది అనే వారు. ఓ నాటకంలో నటిస్తూనే   స్టేజీ  మీదే చనిపోయారు. అలాగే రామాంజనేయ యుద్ధం’ లో ఆంజనేయుడి పాత్ర ధరించే   బేతా వెంకటరావు గారు కూడా వేషం మీదే చనిపోయారు. మహానుభావులు. కళామతల్లి సేవచేస్తూనే కన్నుమూశారు. వెంకటరావు గారి అబ్బాయి  బేతా రామచంద్రరావు తండ్రి కళను పుణికిపుచ్చుకున్నాడు. అతడు కూడా ఆంజనేయుడి వేషం వేసేవాడు.
కుందేరు కృష్ణ శర్మ అని విజయవాడలో కనక దుర్గ కళాసమితి గుమస్తాగా వుండే వారు. చాలా నాటకాల్లో వేసేవారు.  కృష్ణుడు దగ్గర్నుంచి సహదేవుడి దాకా.  ప్రతి నాటకంలోను ఆయన తప్పని సరిగా కనపడే వారు. ఎంతో సహృదయులు. చాలా మంది నటులు అవసాన దశలో కష్టాలు పడుతుంటే చూడలేక  వాళ్ళకోసం వో నాటకం పెట్టి ఇంటింటికీ  వెళ్లి టికెట్లు అమ్మి డబ్బు పోగు చేసి ఇచ్చేవారు. కర్రి అబ్బులు, ద్వారపూడి సూర్యారావు, కే. హరి ప్రసాద రావు, అయ్యదేవర పురుషోత్తమరావు కూడా కృష్ణుడి  వేషం వేసి  పేరు తెచ్చుకున్నవారే.  
హరిశ్చంద్ర పాత్రకు డి. వి. సుబ్బారావు గారని బందరు  వాస్తవ్యులు వుండే వారు.  వింధ్యారాణి ఫేంఅని చెప్పుకొనేవారు.  మల్లాది సూర్యనారాయణ గారు కూడా హరిశ్చంద్ర  వేసే వారు.  తర్వాత వేటపాలెం నుంచి  మరో డి. వి. సుబ్బారావు వచ్చారు.  హరిశ్చంద్ర వొకటి  ఆడేవారు. ఐదో  తరగతి కూడా చదివి వుండరు కానీ  ఆయన వేసిన   టికెట్ డ్రామా అంటే చాలు డబ్బులు బాగా  వచ్చేవి. నెల్లూరుకు  చెందిన పొన్నాల రామసుబ్బారెడ్డి మరో ప్రసిద్ధి చెందిన నటుడు.  హరిశ్చంద్ర పాత్రకు పెట్టింది పేరు.  గూడూరి సావిత్రి అనే ఆవిడ ఈయన టీంలో చంద్రమతి గా పేరు పొందారు. మందపాటి రామలింగేశ్వర రావు  విశ్వామిత్రుడుగా  వేసేవారు.  

(29-12-2011)