ఈరోజు సాయంత్రం
చిల్కూరు లోని బాలాజీ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుంటే సీనియర్ జర్నలిష్ట్ శ్రీ
గారపాటి ఉపేంద్ర బాబు గారు ఇకలేరంటూ మితృలు శ్రీ పారుపల్లి శ్రీధర్ మెసేజ్
పెట్టారు. ఆ వార్త తెలియగానే చాలా బాధ కలిగింది. ఉపేంద్రబాబు గారితో నా పరిచయం
సుదీర్ఘమైనది ఏమీ కాదు. కేవలం నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే. కానీ అది వంద
సంవత్సరాలు గుర్తుంచుకోవాల్సిన పరిచయం.
వెనక్కి
వెడితే.
పందొమ్మిది వందల డెబ్బయి ఒకటి, ఆగష్టు నెల, ఇరవయ్యవ తేది. విజయవాడ, లబ్బీపేటలోని ' ఆంధ్రజ్యోతి' కార్యాలయం.
అందులో అడుగు పెట్టి, కింద ఛాంబర్ లో కూర్చుని పనిచేసుకుంటున్న ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని
కలుసుకున్నాను.
ఆయన ఎగాదిగా నావైపు చూసి, నా పరిచయం కనుక్కుని, 'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా! పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను
పంపానని చెప్పు' అన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.
అదే నా తొట్టతొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.
ఉపేంద్రగారిని కలిసాను. కూర్చోమని సైగ చేసారు. పీ.టీ.ఐ., యు.ఎన్.ఐ. వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు.
ఆ విధంగా మొదలయింది నా జర్నలిస్టు జీవితం. ఆ విధంగా ఉపేంద్రబాబు జర్నలిజంలో నా మొదటి గురువు.
జర్నలిజంలో చమత్కారం ఏమిటంటే గురువులతో స్నేహం చేయవచ్చు. ఆ క్రమంలో నేనే కాదు, ఆయనతో పనిచేసేవాళ్ళం అందరం ఆయనకు
స్నేహపాత్రులం కాగలిగాం. నేను మరికొంత దగ్గరగా. అప్పటివరకు శరత్ నవలలు చదివి బాబు అనే పేరుపై మక్కువ పెంచుకున్నాను. (శరత్
బాబు ‘భారతి’ నవలలో కథానాయకుడి పేరు అపూర్వబాబు)
ఆఫీసులోని మొదటి అంతస్తులో గుర్రపునాడా ఆకారంలో ఒక పొడవాటి బల్ల వుండేది. సబ్ ఎడిటర్లు అందరూ, అందరూ అంటే ఎందరో అనుకునేరు, ఆరుగురు అంటే ఆరుగురు వుండేవారు. మళ్ళీ అందులో ఒక న్యూస్ ఎడిటర్,
వీరభద్రరావు గారు నడి మధ్యలో. ఆయనకు అటూ ఇటూ సబ్ ఎడిటర్లం అందరం పరివేష్టితులమై
పనిచేసుకుంటూ వుండేవాళ్ళం.
ఆ రోజుల్లో జర్నలిష్టుల జీతాలు మరీ నాసిరకంగా
ఉండేవి. ఈ రోజుల్లో మరీ బాగా వున్నాయని కాదు. జీతాలకి, జీవితాలకి పొంతన లేని రోజులు అవి. నెలలో మొదటి వారానికే డబ్బు అవసరాలు
వచ్చి పడేవి. ప్యూన్ నాగేశ్వరరావుతో ఒకరికొకరం చీటీలు పంపుకునే వాళ్ళం. “ఒక పాతిక సర్దుతారా, ఇరవైన అడ్వాన్స్ తీసుకోగానే ఇచ్చేస్తాను” అనే అభ్యర్ధనలు వాటిల్లో ఉండేవి.
అంతమాత్రం డబ్బు ఎవరి దగ్గరా ఉండదని తెలుసు. అయినా అడక్కతప్పని అవసరాలు.
అందరిదీ ఒకే అవసరం కనుక ఒకరంటే మరొకరికి జాలి.
అందుకని, ‘లేదు’ అనకుండా మరో చీటీ మీద “ఓ యాభయ్ సర్దుతారా”
అని రాసి, దాన్ని సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్ర బాబుకు పంపేవాళ్ళం. ఆయన ఆ చీటీలోనే
యాభయ్ రూపాయలు వుంచి తిరిగి పంపేవారు. అందులో సగం వుంచేసుకుని మిగిలిన పాతిక ముందు
అడిగిన వాడికి సర్దుబాటు చేసేవాళ్ళం. ఈ చేబదులు చక్రభ్రమణం ప్రతినెలా సాగేది.
ఇదిగో! ఈ ‘లేని’ తనమే మా స్నేహాన్నిమరింత గట్టిగా నిలిపి వుంచేది. అందరం అదే బాపతు కనుక
ఇక అసూయలకు ఆస్కారమే వుండేది కాదు. అలా అందరికీ ఉపేంద్రబాబు అనే పెద్దమనిషి, ఏటీఎంలు
లేని ఆ రోజుల్లోనే ఏటీఎం మాదిరిగా, పెద్దమనసుతో అప్పటికప్పుడు డబ్బు సర్దుబాటు చేసేవారు. అదీ ఆయనతో మొదటి పరిచయం.
లబ్బీపేటలో మా ఇద్దరి ఇళ్ళు కూడా దగ్గరదగ్గరలో
ఉండేవి. మా ఇంట్లో వంట గ్యాస్ అయిపోతే సిలిండరు వెంటనే తెప్పించుకోగల పరపతి
ఉద్యోగం ధర్మమా అని వుండేది. కానీ సిలిండర్ ధర ఇరవై మూడు రూపాయలు ఎవరివ్వాలి? ఎవరిస్తారు ఒక్క ఉపేంద్ర బాబు గారు తప్ప. ఆ రోజుల్లో కాల్ గ్యాస్ కనెక్షన్
తేలిగ్గానే దొరికేది. సిలిండర్లు కూడా. కానీ
డబ్బులో. దానికి ఉపేంద్ర బాబే గతి.
అంచేత నిశ్చింతగా వుండేవాళ్ళం. అడగగానే చేబదులు ఇచ్చేవారు. గ్యాస్ కోసం ఎందుకు చింత? ఉపేంద్ర ఉండగా మీ చెంత అని పాడుకునే వాళ్ళం. ఇంటా బయటా కూడా మంచి మనిషి
అనిపించుకోవడం మాకష్టం. కానీ ఉపేంద్రబాబు ఆ విషయంలో గొప్ప మినహాయింపు.
జ్యోతిలో నేను ఆయనతో కలిసి పనిచేసింది కేవలం
నాలుగున్నర సంవత్సరాలే. తోటి ఉద్యోగులను సాటి మనుషుల మాదిరిగా చూసే మంచితనం ఆయనది.
మరికొన్ని సంవత్సరాలు కలిసి పనిచేసి వుంటే మరికొంత మంచితనం నా సొంతం అయ్యేదేమో.
నిన్న రాత్రి 86వ ఏట మరణించిన ఉపేంద్ర బాబు గారికి నా అశ్రునివాళి!
తోకటపా:
మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహా రావు గారి
వర్ధంతి సందర్భంలో, ఆంధ్రజ్యోతిలో నా వ్యాసం ఒకటి ప్రచురితం అయింది. అది చదివి
శ్రీ ఉపేంద్ర నాకు ఒక మెసేజ్ పెట్టారు. అదే ఇది.
“ఓసారి బెజవాడ
నుంచి శాతవాహనలో హైదరాబాదు వస్తున్నాను. ఖమ్మంలో ఇద్దరు స్వతంత్ర సమరయోధులు
రైలెక్కారు. హైదరాబాదు చేరిందాకా వాళ్ళిద్దరూ పీవీ ముచ్చట్లతోనే గడిపారు. పీవీ
గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకున్నారు. కలం, కాగితాలు తెచ్చుకుని వుంటే
బాగుండేదే అని బాధ పడ్డాను” – ఉపేంద్ర బాబు, సీనియర్
జర్నలిస్ట్, విజయవాడ.”
(05-07-2024)
3 కామెంట్లు:
🙏
ఉపేంద్ర బాబు గారు కూడా జర్నలిస్టేగా. అయినా ఇతరులకు చేబదులు ఇచ్చేటంత ఆర్ధిక స్తోమతు ఉండేదా వారికి?
Unfortunate. off late, your blog has become an obituary column.
@విన్నకోట నరసింహా రావు
ఆర్ధిక స్తోమత ఉండడం ముఖ్యం కాదేమోనండి. సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యం, సహాయం చెయ్యగలగడం గొప్ప అని శ్రీనివాసరావుగారి అభిప్రాయం అయ్యుండొచ్చు 🙏.
కామెంట్‌ను పోస్ట్ చేయండి