కలర్ బ్లైండ్ నెస్ – దీన్ని తెలుగులో ఏమంటారో తెలవదు. రంగులు సరిగా గుర్తుపట్టలేకపోవడం అని విన్నాను. ఈ కంటి జబ్బు నాకు లేదు. అయినా చప్పున కలర్లు గుర్తుంచుకోలేను. అంటే నిన్న కలిసిన మనిషి ఏ రంగు చొక్కా వేసుకున్నాడు అని మర్నాడు అడిగితే నేను చప్పున జవాబు చెప్పలేను.
ఇక
విషయానికి వస్తే నిన్ననో మొన్ననో ఒక ఛానల్ లో ఈ రంగులు గురించి ఒక వింతైన విషయం
విన్నాను, పోనీ
చూశాను. రవికాంచనిచో కవిగాంచును అన్నట్టు కొన్ని చిన్న విషయాలు కూడా జర్నలిస్టుల
దృష్టిని దాటిపోలేవని అనిపించింది.
ఏపీ
ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి తిరుమల తిరుపతి
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు
ముందు ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి నుదుటిమీద తిరునామాలు దిద్ది ఆయన తలకు పరివట్టం
(పట్టు వస్త్రంతో తలపాగా) చుట్టి శేష వస్త్రాన్ని మెడపై ధరింప చేశారు. సరే ఈ
విశేషాలన్నీ టీవీల్లో ప్రసారమయ్యాయి. అయితే ఆ టీవీ జర్నలిస్టు తలపాగా రంగును
పసికట్టి అది అధికార వైసీపీ రంగును పోలి వుందని పాయింటు తీశారు. అంతటితో ఆగకుండా
గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పసుపు రంగు పరివట్టం చుట్టారని గుర్తు చేస్తూ, టీటీడీ అధికారులు కూడా ఏ
ఎండకాగొడుగు మాదిరిగా పాలక పక్షాలను బట్టి తలపాగా రంగులు మారుస్తున్నారా అంటూ ఓ పాయింటు లేవదీశారు. ముందే
చెప్పినట్టు నాకు రంగులు గుర్తుండవు కనుక నేనేమీ చెప్పలేను.
అయితే ఈ
సందర్భంలో నాకు ఓ సొంత అనుభవం గుర్తుకు వచ్చింది.
చంద్రబాబునాయుడు
దాదాపు పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి దిగిపోయిన తర్వాత వై.ఎస్. రాజశేఖరరెడ్డి
నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను అప్పుడు దూరదర్సన్ కరస్పాండెంటుగా పనిచేస్తున్నాను.
ముఖ్యమంత్రిగారి స్వాతంత్ర దినోత్సవం సందేశం కాబోలు రికార్డు చేయాలి. షరా మామూలుగా ఆ సందేశం
స్క్రిప్ట్ కాపీ ఓ ప్లాస్టిక్ ఫోల్డర్ లో
పెట్టుకుని సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిగారి ముఖ్య పౌర సంబంధాల అధికారికి
అందచేసాను. ఆయన దాన్ని అందుకుంటూ మందహాసం చేస్తూ ‘ఏమండీ రాష్ట్రంలో ప్రభుత్వం
మారిన సంగతి మీరింకా గుర్తించినట్టులేదు’ అన్నారు సరదాగా.
ఏమిటా
అని చూస్తే ఆ ప్లాస్టిక్ ఫోల్డర్ రంగు పసుపు. ఆయన రెడీ విట్ కి నాకూ నవ్వు
వచ్చింది.
ఇది
ఎందుకు చెబుతున్నాను అంటే ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రుల కొలువుల్లో పనిచేసేవారికి అంతటి నిశిత పరిశీలన
వుండాలి. దాన్ని మనం తప్పుపట్టలేము కూడా. (25-09-2020)
5 కామెంట్లు:
ఇంకా నయం. తెలుగుదేశం దిగిపోయింది కాబట్టి ఎక్కడా పసుపురంగే కనబడకూడదా భూమ్మీద. ఫోల్డర్ ఏరంగైతే నేమండీ. పొరపాటున ఆనాడు పసుపురంగు చొక్కా వేసుకోను దుకు మీరు అదృష్టవంతులు అనుకోవాలి.
అన్నా కాంటీన్లు ప్రజా మరుగు దొడ్లు పసుపు రంగు లో ఉండేవి. అప్పుడు ఓకే.ఇప్పుడు గ్రామ పంచాయతీలకు నీలి రంగు నాట్ ఓకే.
ప్రభుత్వాలు మారితే రంగు పడుద్ది.
భలేవారు శ్రీనివాసరావు గారు, నేనయితే నేను నిన్న వేసుకున్మ చొక్కా ఏమిటో నేనే చెప్పలేను 😁.
కలర్ బ్లైండ్-నెస్ అంటే “వర్ణాంధత” అని నిఘంటువు చెబుతోంది.
శ్యామలరావు గారు, లెస్స పలికితిరి 👏.
ఆంధ్రాలో చాలా ఇళ్ళకు, ఇతర భవనాలకు పసుపు పచ్చ రంగు వేయించుకోవటం చాలా చాలా మామూలు విషయం. టిడిపి పుట్టక ముందు నుండే ఉన్న అలవాటు, నా చిన్నతనం నుండీ కూడా చూసిన అలవాటు . దాన్ని గోపీచందనం / గోపీచంద్ రంగు అనేవారు. కట్టడాలకు ఆ రంగు వేయించడానికీ ఏదో రాజకీయ పార్టీకు సంబంధం అంటగట్టలేం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి