రాత్రి మిత్రుడు భగీరధ ఫోన్ చేసాడు. క్షేమ సమాచారాలు కనుక్కున్నాడు. ఆయనకీ నాకూ ఓ బాదరాయణ సంబంధం వుంది. ఇద్దరమూ ఒకప్పుడు ఆంధ్రజ్యోతి ఉద్యోగులమే. ఆయన సినిమా విలేకరి. నేను అది కాక మిగిలినవి. హైదరాబాదు వచ్చినప్పుడు చిక్కడపల్లిలో దగ్గర దగ్గరలో అద్దెకు వుండేవాళ్ళం. సినిమాలకు సంబంధించి చాలా విషయాలు ఆకళింపు చేసుకున్నవాడు. సహృదయుడు కావడం వల్ల వృత్తిగతంగా ఏర్పడ్డ పరిచయాలను నాలుగు కాలాల పాటు పదిలపరచుకోగలిగాడు. ఆ అనుభవసారంతో అనేక పుస్తకాలు రాశాడు. మనిషి వున్నప్పుడు లేనప్పుడు కూడా ఆమనిషిని గుర్తు చేసేవి ఆ పుస్తకాలే అంటాడు గర్వంగా.
మాటల్లో అడిగాడు మీ రేడియో అనుభవాలను కూడా గ్రంధస్తం చేయొచ్చుకదా అని. ఫేస్ బుక్ మిత్రుల్లో కూడా అనేకమంది నాకు ఈ సలహానే ఇచ్చారు. సినిమాలు చూసేవాడు చూడాలి. సినిమాలు తీయాలని అనుకోకూడదు, అనుకుంటే చేతులు కాల్తాయి అనేది నా రొటీన్ జవాబు.
ఈ జవాబుకు జవాబా అన్నట్టు అమెరికా నుంచి ప్రసిద్ధ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు నాకొక మెసేజ్ పంపారు. ఫేస్ బుక్ లో నా రేడియో రోజుల అనుభవాలు చదివాననీ, వాటిని తాము ఒక పుస్తకంగా తీసుకు వస్తాననీ. ఆయన పనుపున ఓ పెద్ద మనిషి మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. అన్నీ కంప్యూటర్ లో వున్నాయి. ఎవరినైనా అడిగి కాపీలు తీసి పంపిస్తానని చెప్పి పంపించేశాను. ఈలోగా కరోనా లాక్ డౌన్ వచ్చి పడింది. ఆ ప్రతిపాదన ప్రస్తుతానికి అటక మీద పదిలంగా వుంది.
వినాయకుడి పెళ్లి అంటే మాటలా! ఎన్నో కలిసిరావాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి