ఈరోజు రాజ్యసభకు ఎన్నికయిన శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ చాలా సౌమ్యులు. రేడియో విలేకరిగా నాకు కొంత పరిచయం వుంది. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన రోజుల్లో కూడా ఆయన నిరాడంబరంగా వుండడం నాకు తెలుసు. వై.ఎస్.ఆర్.కు, ఆయన కుటుంబానికి బాగా కావాల్సిన వారు. గతంలో జగన్ మోహన రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరిపోయారు.
రాజ్యసభకు ఎన్నిక అయిన అనంతరం సుభాష్ చంద్ర బోస్ మాట్లాడిన విషయాలు విన్నప్పుడు తనని రాజకీయాల్లో ప్రోత్సహించిన వారిని ఆయన ఎలా గుర్తుంచుకున్నదీ తెలిసి ఆశ్చర్యం వేసింది. ఇలాంటి సందర్భాలలో ఎవరయినా సరే, ముందు తమ పార్టీ నాయకుడిని పొగడ్తలతో ముంచెత్తిన తర్వాతనే ఇతరులను తలుచుకుంటారు.
ఆయన ఈరోజు ముందుగా తలచుకున్న రాయవరం మునసబు ఎవరన్నది ఈ తరం వారికి తెలియదు. ఆయనే తనకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పించారన్నారు. ఒకానొక కాలంలో రాయవరం మునసబు అంటే జిల్లామొత్తానికి తెలిసిన పేరు. ఆయన జిల్లా దాటి రాజకీయాలు చేసింది లేదు. కానీ రాష్ట్ర రాజధానివరకు ఆయన ఎవరో తెలుసు.
తర్వాత తలచుకున్న పేరు వై.ఎస్. ఆయన తనను రాజకీయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ని చేశారని సుభాష్ చంద్ర బోస్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ పిదప వై.ఎస్. జగన్ వల్లనే తనకు ఇన్ని రాజకీయ పదవులు వచ్చాయని చెప్పుకొచ్చారు.
పదవిని అనుభవించిన రోజుల్లో నాయకుడే తమ అధినాయకుడని ప్రస్తుతించి పదవి పోగానే అతడెవరో తెలియనట్టుగా ప్రవర్తించే రాజకీయ నాయకులు కోకొల్లలుగా ఉన్న నేటి రాజకీయాలు మాత్రమే తెలిసిన ఈనాటి తరానికి ఈ రకం నాయకులు నిజంగా కొత్తే.
ఈ విధేయతలు అనేవి పార్టీ వ్యవహారాలు. అవి పక్కన పెడదాం. మరి ఆయన నిరాడంబరత్వం. దాన్ని గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి.
గతంలో పిల్లి సుభాష్ చంద్ర బోస్ మంత్రిగా వున్నప్పుడు మా అన్నయ్య భండారు రామచంద్రరావు గారు మా వదినె గారితో కలిసి వైజాగ్ నుంచి హైదరాబాదు రైల్లో వస్తున్నారు. ఇద్దరికీ ఏసీ సెకండ్ క్లాసులో అప్పర్ బెర్తులు దొరికాయి. కింద బెర్తులు ఖాళీగా వుంటే టీసీని అడిగారు. రాజమండ్రిలో ఒక మంత్రి గారి కోసం రిజర్వ్ అయ్యాయి, లాభం లేదు అన్నాడాయన. మంత్రి గారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వుంటుంది కదా, ఈ సెకండ్ ఏసీ ఎందుకు అనేది మా అన్నయ్య అనుమానం.
రాజమండ్రి వచ్చేసరికి తొమ్మిది దాటింది. మంత్రిగారు భార్యతో కలిసి బోగీలోకి వచ్చారు. సామాన్లు సర్దుకున్న తరువాత ఆయన మా అన్నయ్యని అడిగారట. మీ మిసెస్ పైకి ఎక్కి పడుకోవడం కష్టం, ఆవిడ, మా ఆవిడ కింద బెర్తుల్లో పడుకుంటారు, మనం పైన సర్డుకుందాం అన్నారట ఆ మంత్రిగారు. ఇది విని మా అన్నయ్య ఎంతో ఆశ్చర్యపోయారు.
ఆయన ఎవరో కాదు, ఈరోజు రాజ్యసభ సభ్యులు అయిన పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారు.
“మంత్రిగారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వున్న మాట నిజమే. కానీ మా మేడం గారు ఆయనతో ప్రయాణం చేస్తే మాత్రం సెకండ్ ఏసీ బుక్ చేయమంటారు”
మర్నాడు ఉదయం సికిందరాబాదులో రైలు దిగిన తర్వాత మంత్రిగారి పియ్యే మా అన్నగారి అనుమానం తీర్చారు.
(19-06-2020)
3 కామెంట్లు:
రాజకీయాల్లో కృతజ్ఞత, విధేయత అంటే నేతిబీరకాయలో నెయ్యి లాంటిదేమో శ్రీనివాసరావు గారూ? పిల్లి సుభాష్ చంద్ర బోసు గారు ఓ మినహాయింపులా అనిపిస్తున్నారు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే.
రైలు ప్రయాణం ఉదాహరణకొస్తే అటువంటి అనుభవం నాకూ జరిగింది. చాలా యేళ్ల క్రితం ఒకసారి మా ఆవిడ నేనూ రైల్లో హైదరాబాదు తిరిగి వస్తున్నాం ....మామూలు స్లీపర్ బోగీలో. ఇంకా రైలు కదలలేదు. ఈ లోగా ఒకావిడ వచ్చి మా ఎదురు బెర్తులో కూర్చున్నారు. ఆవిడతో పాటు ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ కూడా వచ్చి, సామాను సర్ది, ఒక పక్కన నిలబడ్డారు. ఏమిటి హడావుడి అని అవిడనే అడిగాను. మా ఆయన ఫస్టు క్లాసులో ఉన్నారు, నాకు ఈ టికెట్ బుక్ చేశారు అన్నారావిడ. అప్పుడు ఒక కానిస్టేబుల్ .... మా దొరగారు చాలా స్ట్రిక్ట్, దొరగారు ఆఫీసు పని మీద హైదరాబాదు వెడుతున్నారు, అందుకని ఫస్టు క్లాసులో వెడుతున్నారు, మేడం గారు బంధువులను చూడడానికి వెడుతున్నారు, పర్సనల్ పని కాబట్టి ఫస్టు క్లాసులో బుక్ చెయ్యలేదు ..... అని వివరించాడు. ఔరా అనుకున్నాను. ప్రిన్సిపుల్స్ బాగానే ఉన్నాయి గానీ, తనతో పాటు ప్రయాణం చెయ్యడానికై తన భార్య కోసం స్వంత డబ్బులతో ఆ మాత్రం ఓ ఫస్టు క్లాసు టికెట్ కొనలేకపోయాడా అంతటి IPS ఆఫీసరు గారు అని కూడా అనుకున్నాను.
మీరు చెప్పిన మంత్రి గారు భార్యతో కలిసి తను కూడా లోయర్ క్లాసులోనే ప్రయాణించారన్నమాట. బాగుంది.
రాజకీయాలు వేరు, వ్యక్తిగతమైన మంచిచెడులు వేరుగా ఉండవచ్చును. నిబధ్ధత కలిగిన రాజకీయులు మొన్నమొన్నటి వరకూ కూడా అరుదుగా నైనా, కనిపిస్తూనే ఉండే వారన్నది నిర్వివాదం. ఒకసారి ఆఫీసుపని మీద డిల్లీ వెళ్ళాను. ఏదో మీటింగుకు వెళ్ళాలి. నేనూ, మరొక సహోద్యోగీ ఆటోలో వెళ్తుండగా, కాలచోదితుడై ఆ ఆటోవాడు కాస్తా ఆటోని, రోడ్డు వారగా ఆగి ఉన్న బస్సు వెనుక గుద్దించాడు. సహోద్యోగికి ఏమీ కాలేదు కాని నా ఎడమ ముంజేయి విరిగింది. తమాషాగా అక్కడే రోడ్డుకు ఆవలి వైపున హాస్పిటల్ ఉంది. అక్కడ నా చేతికి కట్టు కట్టటమూ - మీటింగ్ కాన్సిల్ కావటమూ జరిగాయి ఆ రాత్రికి నాకు అత్యవసరంగా కావాలంటే రిటర్ను ఫ్లైట్ దొరికింది - అక్కడ కొంచెంవేరే కథ ఉంది లెండి. విమానంలో నాకు ఒంటిచేతితో అవస్థ అయ్యింది. అది గమనించి ప్రక్క సీటులోని ఒకాయన సహాయం చేసాడు. విమానం ఆగిన చోటినుండి మిత్రులు నన్ను రిసీవ్ చేసుకొన్న హాల్ వరకూ ఆయనే నా సూట్కేసుకు, చేతిసంచీని మోసుకొని వచ్చారు. తరువాత మా మిత్రుల ద్వారా తెలిసింది. ఆయన ఒక పార్లమెంటు సభ్యుడని!
వై ఎస్ ఆర్ అంటే అదే మరి. అటువంటి అభిమానం విధేయత కలిగిన వారు బాబు కు ఒక్కరైనా ఉన్నారా. అవకాశం లేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి