2, జూన్ 2020, మంగళవారం

సప్తపది బాటలో బంగారు తెలంగాణా – భండారు శ్రీనివాసరావు


(ఈరోజు 02-06-2020 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)

నాకు లీలగా గుర్తు. ఉద్యమం మాంచి ఊపులో వున్నప్పుడు కేసీఆర్ ఇలా అన్నారు.
“తెలంగాణా వచ్చిన తరువాత, దాన్ని మనం కోరుకుంటున్నట్టు అభివృద్ధి చేసుకోవడానికి రోజుకు  ఇరవై నాలుగు  గంటలు కూడా  సరిపోవు”.
నిజమే. ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలంటే ఎన్నో కావాలి. మొక్కవోని దీక్ష, సడలని పట్టుదల, అనుకున్నవి అనుకున్నట్టుగా అనుకున్నసమయంలో అమలుచేసే యంత్రాంగం, సమయ పాలన. ఇన్ని కావాలి ఒక లక్ష్యాన్ని సాధించడానికి. ఇవన్నీ కలగలుపుని కేసీఆర్  సాధించిన  ఘన విజయమే కాళేశ్వరం ప్రాజెక్టు.
జూన్  రెండో తేదీన తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు పూర్తయి ఏడోఏట అడుగుపెడుతోంది. ఈ ఏడాది తెలంగాణా  రాష్ట్ర అవతరణ దినోత్సవాలు అయిదు రోజులముందే మొదలయ్యాయి. మే ఇరవై తొమ్మిదో తేదీనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్న సాగరం కాళేశ్వరం ప్రాజెక్టు తుది అంకం ఆవిష్కృతం కావడంతో ఈ సంబురాలు ప్రారంభం అయ్యాయని అనుకోవచ్చు. అలనాటి భగీరధుడు గంగమ్మను ఆకాశం నుంచి భూమికి రప్పిస్తే, ఈనాటి అపరభగీరధుడు కేసీఆర్ కాళేశ్వరం గోదావరి జలాలను సముద్రమట్టానికి ఆరువందల మీటర్ల పైకి  తీసుకువచ్చి ‘నీరు పల్లమెరుగు’ అనే నానుడిని నీరుకార్చి కొండ పోచమ్మ ప్రాజెక్టును నీటితో నింపుతున్నారు. దీనితో, భారతదేశ సాగునీటి చరిత్రలోనే అతి గొప్ప ఇంజినీరింగ్ విన్యాసం సాధించిన రాష్ట్రంగా తెలంగాణా చరిత్రపుటలకు ఎక్కింది. ఈ ఒక్క ప్రాజెక్టు చాలు కేసీఆర్ పట్టుదలకు, మొక్కవోని దీక్షకు నిలువెత్తు నిదర్శనం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకే గోదావరి నీళ్ళను కొండ పోచమ్మ ప్రాజెక్టులోకి తోడి పోస్తున్నప్పుడు స్వప్నం సాకారమైందన్న సంతోషం, సంతృప్తి ఆయన కళ్ళల్లో కనిపించాయి.
కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో  తెలియదు కాని బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం లేదు.
ఆయన మదిలో మెదిలే  ఆలోచనలకు అంతే లేదు. ఇంత చిన్న మనిషి అన్నన్ని పెద్ద ఆలోచనలు ఎలా చేస్తున్నారా అనే విస్మయం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు కేసీఆర్ వాటిని గురించి చెబుతుంటే.
గత ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన మరో ఘన విజయం ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా. ఉమ్మడి రాష్ట్రము విడివడితే తెలంగాణా  అంధకారబంధురం అయిపోతుందని నాడు వినవచ్చిన విమర్శలను తిప్పికొట్టాలని అనుకున్నారేమో తెలవదు కానీ ఈ విషయంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు అనిపిస్తుంది.
గత ఆరేళ్లుగా జంట నగరాల్లో కరెంటు కోతలు లేకుండాపోయాయి. రాష్ట్రంలో మిగిలిన చోట్ల కూడా ఇదే పరిస్తితి. దేవులపల్లి ప్రభాకరరావు గారి సారధ్యంలో జెన్కో, ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది కలసికట్టుగా సాగించిన నిర్విరామ కృషి ఇందుకు ప్రధాన కారణం.   
తెలంగాణా ప్రజలు కోరుకున్న రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడి కూడా ఆరేళ్ళు గడిచాయి. అనుకున్నవి అనుకున్నట్టు సాగుతున్నాయని కొందరు అనుకుంటూ వుంటే, ఏదీ, ఎక్కడ అని సన్నాయి నొక్కులు నొక్కేవారు కూడా లేకపోలేదు.
అన్నం వుడికే దాకా వుడికినట్టు తెలవదు, కుతకుత శబ్దం తప్పిస్తే.
ఎవరి పరిపాలనలో అయితే పాలకులతో అవసరం లేకుండా పాలితులకు జీవితం హాయిగా  గడిచిపోతుందో ఆ పరిపాలనను సుపరిపాలనగా చాణక్యుడు అభివర్ణించారు.
ప్రస్తుతం కేసీఆర్ పాలన ఆ రీతిలో సాగుతోందని పొగడ్తలు తగవు కానీ, ‘నేనున్నాను’ అనే భరోసా మాత్రం  ప్రభుత్వం నుంచి పాలితులకు లభిస్తోందని నేను నిశ్చయంగా చెప్పగలను. (EOM)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కె సి ఆర్ ఆరేళ్ల పాలనలో సాధించిన విజయాలు, తెలంగాణా కోసం పూర్తి చేసిన పథకాలు ఉమది రాష్ట్రంలో గానీ లేక కాంగ్రెస్ పాలన తెలంగాణాలో ఉన్నా గానీ 70 ఏళ్ళైనా చేయలేరు.

He is a visionary. అసలు ఉమ్మడి రాష్ట్రానికి కే సి ఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుండేది.

ఆంధ్రలో కుల పిచ్చి పార్టీ కుల పిచ్చి మీడియా దౌర్భాగ్యం.

Jai Gottimukkala చెప్పారు...

జంధ్యాల పాపయ్య శాస్త్రి అనే అతను "తెలంగాణము దక్షిణ పాకిస్థానము" అంటూ చిల్లర రాతలు రాసి తన అక్కసు వెళ్లగట్టాడు. వలసాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా కరెంటు కోతలతో చీకటి కొట్టం అవుతుందని శాపనార్ధాలు పెట్టాడు. ఇంకా ఎందరెందరో ఆంధ్రులను నడిరోడ్డు మీద నరుక్కుతింటారని, నక్సలైట్లు పెట్రేగి పోతారని, మతకల్లోలాలతో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని, దేశం మూడు వందల ముక్కలుగా విచ్చిన్నం అవుతుందని, పెట్టుబడులు వెనుతిరిగి హైదరాబాదు నగరం అడుక్కు తింటుందని, ఇట్లా అనేకానేక వికృత ఊహాగానాలు & రకరకాల చెత్తజోస్యాలతో విషం కక్కుకున్నారు.

శత్రువుల ఛీత్కారాలు, ఎకసెక్కాలు, వేళాకోళాలు, కుట్రలు, కుతంత్రాలు వేటినీ లెక్క చేయకుండా ప్రజాస్వామ్య పోరాటం ద్వారా దశాబ్దాల కలను సాకారం చేసుకోవడమే కాక యావత్ భారత దేశానికే తలమానిక దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణా జనతా జనార్దనులు అందరికీ రాష్ట్ర ఆవిర్భావ మహోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర నలు మూలల్లో ఉన్న బంధుజనం అంతా ఈ శుభ తరుణంలో అమర వీరుల బలిదానాల స్ఫూర్తిగా, మహోన్నత తెలంగాణా ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు పునరంకితం కావాలి.