25, జూన్ 2018, సోమవారం

సిగ్గుతో తలదించుకున్నాను – భండారు శ్రీనివాసరావు


రాజీవ్ గాంధి బాంబు దాడిలో మరణించినప్పుడు నేను మాస్కోలో వున్నాను. ఆ దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకు నేను కుటుంబంతో కలిసి  కాఫీ తాగడానికి ఓ హోటల్ కు వెళ్లాను. అక్కడ మాకు సర్వ్ చేయాల్సిన వెయిట్రెస్ వృద్ధురాలు. అక్కడ వయసుతో పనిలేకుండా ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు వుండేది. మమ్మల్ని చూడగానే భారతీయులమని గుర్తు పట్టింది. అనుమాన నివృత్తికోసం ‘ఇందీస్కీ పజాలుస్తా’ (మీరు ఇండియన్లా) అని అడిగింది. ఔనని చెప్పగానే మా ఆవిడను పిల్లలను దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. రష్యన్ లో ఏమిటో అంటోంది. ఆ భాష కొద్దిగా తెలిసిన మా పిల్లలు చెప్పింది ఏమిటంటే రాజీవ్ గాంధి చనిపోయాడని తెలిసి ఆమె తన దుఃఖాన్ని మాతో పంచుకుంటోంది. పరాయి దేశంలో వనిత మన దేశంలో జరిగిన ఘోరానికి బాధ పడుతోంది. ఆవిడను చూసి మాకే సిగ్గనిపించింది.
కొన్నేళ్ళ తరువాత హైదరాబాదు వచ్చి రేడియోలో మళ్ళీ చేరాను. ఆ రోజు ఎవరో పెద్దాయన చనిపోతే ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఒకాయన మాకు ఫోను చేసి ఈ సెలవు ‘ Negotiable instruments Act’ కిందికి వస్తుందా అని  అడిగాడు. ఆయన ఏదో బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఈ యాక్టు కింద సెలవు ప్రకటించకపోతే అది బ్యాంకులకు వర్తించదు. అదీ సంగతి.
ఆయన ధోరణి  చూసి నాకు సిగ్గనిపించింది. మాస్కో వృత్తాంతం గుర్తుకు వచ్చింది.    

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ప్రభుత్వరంగ ఉద్యోగులుకి పే కమీషన్, డీఏ , ఇంక్రిమెంటు, ప్రమోషన్, బోనస్, అప్పనంగా సెలవులు . రకరకాల అలవెన్సులు ఇవి దొరికితే చాలు. తక్కినవాళ్ళు మట్టికొట్టుకు పోయినా పరవాలేదు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...



అయ్యా, అందులో సిగ్గనిపించవలసినది ఏమీ కనబడడం లేదండి.

బ్యాంక్ వ్యాపారవ్యవహారాలు ప్రాధమికంగా negotiable instruments కు సంబంధించినవి కాబట్టి సంబంధిత న్యాయసూత్రాలు చాలా వరకు మనదేశంలో Negotiable Instruments Act, 1881 లో నిర్వచించబడ్డాయి. ఆ చట్టం లోని Section.25 లో negotiable instruments (ప్రామిసరీ నోట్లు, బిల్ ఆఫ్ ఎక్స్ఛేంజ్ వగైరా; maturity date ఉంటుంది కాబట్టి ఎల్.ఐ.సి పోలసీలకు కూడా వర్తిస్తుంది) యొక్క maturity date దినం (due date for payment) పబ్లిక్ హాలిడే గనక అయితే సదరు maturity date ఏ విధంగా మారుతుంది అని వివరించబడింది. దాని దృష్ట్యా ... ప్రభుత్వం వారు ఏ రోజునైనా పబ్లిక్ సెలవుగా ప్రకటిస్తే ఆ ప్రకటనలో అది NI Act Sec.25 క్రింద కూడా సెలవుదినం అని ప్రత్యేకించి స్పష్టం చెయ్యకపోతే ... పైన మీరన్నట్లుగా ... బ్యాంకులకు ఆ సెలవు వర్తించదు, సెలవుదినం మూలంగా maturity dates గురించి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే ఆ రకమైన స్పష్టత తప్పనిసరి. ఫలానా సెలవుదినం బ్యాంకులకు కూడా వర్తిస్తుంది అని ప్రభుత్వం వారి నిర్ణయం అయినప్పటికీ .. చాలాసార్లు ఒరిజినల్ సెలవుదిన ప్రకటనలో ప్రభుత్వం వారు NI Act అని స్పష్టం చెయ్యడం మరచిపోతుంటారు. దానివల్ల బ్యాంకులకు సందిగ్ధత ఏర్పడుతుంది (సెక్షన్ 25 రూల్ వలన ప్రభావితం అయ్యే లావాదేవీలు ఉంటాయి కాబట్టి). అందువల్ల బ్యాంకుల వారు వివరణ కోరతారు. దాంట్లో బ్యాంక్ ఉద్యోగులను తప్పు పట్టవలసినది ఏమీ లేదండి.

అలాగే, మరణించిన ప్రముఖుడి మీద (సెలవు ప్రకటనకు అది గనక కారణం అయితే) బ్యాంక్ ఉద్యోగులకు ఏమాత్రం గౌరవం లేదనీ, ఎప్పుడూ సెలవల కోసం వెంపర్లాడతారనీ ఆడిపోసుకోవలసిన అవసరమూ లేదండి. మీరిచ్చిన ఉదాహరణలోని రష్యన్ మహిళ ఉద్వేగంగా స్పందించింది ... ఆ బ్యాంక్ పెద్దమనిషి ప్రాక్టికల్ గా ఆలోచించి (బ్యాంక్ వ్యవహారాల దృష్ట్యా) NI Act వివరణ కోసం వెతుక్కున్నాడు. సీత కష్టాలు సీతవి.

Jai Gottimukkala చెప్పారు...

@విన్నకోట నరసింహా రావు:

చక్కటి సమాచారం చెప్పారు, thanks.

ఇప్పటికీ ఇంగ్లాండులో సెలవులను bank holidays అంటారు. మన దేశంలో కూడా వ్యాపార సంస్థలు వార్షిక సెలవు పట్టీ (annual holiday list) తయారు చేసే ముందు బాంకులను అడగడం పరిపాటే.

సూర్య చెప్పారు...

దాందేముంది? తెలంగాణా ఏర్పడినపుడు రష్యన్ మిత్రుడొకరు "hastala vista?" (ఇక హస్తం పార్టీకి గెలుపేనా?) అని అడిగాడు. సంస్కృతం లో సగం మార్కులొచ్చిన మా మిత్రుడేమో "ముక్కస్య ముక్కః" అన్నాడు. అంటే ముక్కు సూటిగా ఉండే వారికే బేలెట్ ముక్కలు పడతాయని. అతను చెప్పిందే జరిగినందుకు ముసిముసిగా నవ్వుకున్నా!

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

భండారు వారూ,
నేను పైన 26-జూన్-2018 వ్యాఖ్యలో వివరించే ప్రయత్నం చేసినది మరోసారి నిన్న జరిగింది చూశారా? మొన్న వాజపాయి గారి మరణం తరువాత ఆ రాత్రి ఒక ప్రభుత్వ ప్రకటన వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్ధలకు మర్నాడు (అంటే నిన్న) సెలవుదినమని ప్రకటించారు. కొన్ని రాష్ట్రప్రభుత్వాలు కూడా సెలవు ప్రకటించాయి. ఎక్కడా NI Act, బ్యాంకుల ఊసు లేదు. బ్యాంక్ లో పని ఉండి నిన్న ఉదయం మా బ్యాంక్ మేనేజర్ కు ఫోన్ చేసి సెలవా పనిదినమా అని అడిగాను. సెలవు ఇవ్వలేదని అన్నాడు. వేరే పని మీద నిన్న సాయంత్రం మరో బ్యాంక్ స్నేహితుడికి ఫోన్ చేశాను. అతను చెప్పాడు ... బ్యాంకులకు కూడా ఒకపూట సెలవని నిన్న మధ్యాహ్నం హడావుడిగా కేంద్రం నుండి బ్యాంకుల హెడాఫీసులకు వర్తమానం వచ్చిందట, అప్పుడు దాన్ని హెడాఫీసుల వారు తమతమ కార్యాలయాలన్నిటికీ తెలియజేశారట. ఇక అప్పుడు ఆఫీసుల నుండి బయల్దేరి ఇళ్ళకు జేరుకున్నామని అన్నాడు నా స్నేహితుడు.

అయ్యా, అదీ సంగతి.