ప్రజాప్రతినిధులు, వారికి ఇవ్వాల్సిన
మర్యాదలు (ప్రోటోకాల్) గురించి చర్చ జరుగుతోంది. పేరుకు ముందు గౌరవనీయులు అనే పదం
విధిగా తగిలించాల్సిన వారిలో కొందరి దురుసు ప్రవర్తన కూడా పతాక శీర్షికలకు
ఎక్కుతోంది. ఈ నేపధ్యంలో ఓ ముప్పయ్యేళ్ళ నాటి జ్ఞాపకం మనసులో కదలాడింది.
అప్పుడు నేను మాస్కోలో రేడియో మాస్కోలో
పనిచేస్తూ ఉండేవాడిని. ప్రతి ఫ్లోర్ లో ఉద్యోగులకోసం క్యాంటీన్లు ఉండేవి. ప్రతి
ఒక్కరూ క్యూలో నిలబడి తమకు కావల్సినవి తెచ్చుకోవాలి. తెలుగు విభాగంలో గీర్మన్,
విక్టర్ అని ఇద్దరు సహాయకులు వుండేవాళ్ళు. ఒకరోజు క్యాంటీన్ కు వెళ్లి క్యూలో వున్నప్పుడు నావెనుక ఒకాయన
నిలబడ్డారు. ఆయన సోవియట్ ప్రభుత్వంలో రేడియో టెలివిజన్ వ్యవహారాలు చూసే శాఖకు
మంత్రి. నేను తప్పుకుని ఆయనను ముందుకు రమ్మని మర్యాదకోసం కోరితే ఆయన మృదువుగా
తిరస్కరించారు. మా లాగే మా మంత్రి కూడా క్యూలో నిలబడి డబ్బులు చెల్లించి కాఫీ తాగి
వెళ్ళిన వైనం నాకు చాలా చిత్రంగా
అనిపించింది. అలాగే, మంత్రులు, సీనియర్
అధికారులు ప్రభుత్వం సమకూర్చిన వాహనాల్లో
వచ్చేవాళ్ళు. అయితే, ఆఫీసు గేటు ముందు తనిఖీ సిబ్బందికి తమ గుర్తింపు పత్రాలు
చూపించిన తరువాతనే లోపలకు రావడం నేను
ఎన్నో సార్లు గమనించాను.
అంటే ఏమిటి? వారు తమ విధులను సక్రమంగా
నిర్వర్తించడం కోసం కొన్ని సదుపాయాలు కల్పించారు. మిగిలిన విషయాల్లో వాళ్ళు కూడా నలుగురితో
సమానమే.
ప్రత్యేక సదుపాయాలు, ప్రత్యేక హక్కులు వీటి నడుమ సన్నటి
గీత వుంటుంది. మన దురదృష్టం. మన దేశంలో ఈ విభజన రేఖ కనబడకుండా చేశారు.
3 కామెంట్లు:
1980లలో స్వీడన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒలాఫ్ పామె (Olof Palme) తరచూ బాడీగార్డులు లేకుండానే తిరిగేవాడట. మన దేశంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు పార్లమెంట్ కు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళేవారట. ఇప్పుడో - షో చెయ్యడం, దర్పం ఒలకబోయడం మామూలైపోయింది. అందుకే కాబోలు మునిసిపల్ కార్పొరేటర్ కూడా తన కారుకు "కార్పొరేటర్" అని బోర్డ్ తగిలిస్తాడు 😕.
ప్రజాప్రతినిధి అన్న పదానికి నిర్వచనం మారినట్టుంది. ప్రజలను సేవించువాడు నుంచి ప్రజలచే సేవించబడువాడు అని.
చిన్న సవరణ
' ప్రజా ధనాన్ని సేవించు వాడు ' - అని .
కామెంట్‌ను పోస్ట్ చేయండి