(రైతులకు వచ్చే ఏడాది నుంచి ఎరువులు ఉచితంగా అందివ్వాలని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని మనసారా అభినందిస్తూ, ఈ అంశంపై రెండేళ్ళ నాడు రాసిన ఈ చిన్ని వ్యాసాన్ని మరోమారు పాఠకుల దృష్టికి తీసుకువస్తున్నాను)
వారి వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఈనాడు ప్రతి రాజకీయ పార్టీ రైతుల గురించే మాట్లాడుతున్నది. వాళ్ళు విడిగా అయినా కలివిడిగా అయినా ఆలోచించుకోవాల్సింది ఒక్కటే. ఇంతవరకు ఏం చేసాము, ఏం చేయలేదు అన్నది కాదు ప్రశ్న. ఎవరి హయాములో ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నది కాదు సమస్య. వందలు, వేలూ కాదు ఇకనుంచి ఒక్కరంటే ఒక్క రైతు కూడా వ్యవసాయంలో నష్టాలు వచ్చి ప్రాణాలు తీసుకోకుండా ఏం చెయ్యాలి అన్నదే ప్రధానం అన్న ధోరణిలో ఆలోచించాలి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్నం పెట్టె రైతుకు కూడు పెట్టవు.
ఒకటి మాత్రం నిర్వివాదాంశం. ఇన్నాళ్ళ అనుభవం తెలియచెప్పేది ఒక్కటే. ఏ పార్టీ అయిన అధికారంలోకి వచ్చేంతవరకు రైతు జపం చేస్తాయి. ఒక్కసారి గద్దె ఎక్కగానే, దుష్యంతుడికి శకుంతల మరపున పడ్డట్టు రైతులనే వాళ్ళు వారికి చివరి ప్రాధాన్యతగా మిగులుతారు. అప్పటివరకు రైతులు, రుణాలు, గిట్టుబాటు ధరలంటూ మాట్లాడిన వాళ్ళు, అవే నాలుకలతో కార్పొరేట్లు, ఉద్యోగాలు, భూసేకరణలు, భూమి పందారాలు, మిషన్లు, గ్రోత్ కారిడార్లు అంటూ సామాన్యులకు అర్ధం కాని పద ప్రయోగాలు చేస్తుంటారు. ఈ విషయంలో కాస్త పేరున్న ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అధికారం, అధికారం లేకపోవడం అన్న రెండు విషయాలే ఈ రెండు నాలుకల ధోరణికి కారణం. దీన్ని అర్ధం చేసుకోవడానికి చరిత్రలోని కొన్ని తాజా పుటలు తిరగేస్తే చాలు.
ఆరుగాలం కష్టపడే రైతుకు, ఆ మాటకు వస్తే జనాలకు మొదటి ముద్ద పెట్టి, తాను చివరి ముద్ద తినే రైతుకు కావాల్సినవి యేవో కనుక్కుని ప్రభుత్వాలు సకాలంలో వాళ్లకు అందిస్తే, అంతకు రెట్టింపు ప్రతిఫలం రైతు ఈ సమాజానికి అందిస్తాడు. అతడికి అవసరమైంది మన్ను పదును చెడకముందే అదునులో దున్ని పైరు వేసుకోవడానికి మంచి విత్తనాలు, ఎరువులు. పంట చేతికి వచ్చిన తరువాత కాసింత గిట్టుబాటు ధర. ఇంతకు మించి ఏ రైతూ ఆశించడు. ఈ మాత్రం సాయం కూడా సకాలంలో చేయలేక పోవడం వల్లనే రైతులు నిండు ప్రాణాలు నిలువునా తీసుకుంటున్నారు. అలాటి కుటుంబాలను ఓదార్చడం తప్పుకాకపోవచ్చు. కానీ అసలు ఆత్మహత్య చేసుకోకుండా ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయన్నదే సమాధానం లేని ప్రశ్న.
ఉపశ్రుతి : ఆధునిక జాతక కధలో బుద్దుడు ఓ గ్రామానికి వెడతాడు. చనిపోయిన తన పిల్లవాడికి ప్రాణదానం చేయమని ఓ తల్లి గౌతముడ్ని వేడుకుంటుంది. ఆయన సరే అని చెప్పి, 'పరిశ్రమలకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తీర్చలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం పట్రా మీ అబ్బాయిని బతికిస్తా' అంటాడు. ఆ తల్లి ఆశతో ఎన్ని వూళ్ళో తిరుగుతుంది. యెంత తిరిగినా అటువంటి వారి జాడ కనబడక నిరాశగా తిరిగొస్తుంది. ఇందులో నీతి ఏమిటన్నది వేరుగా చెప్పక్కరలేదేమో!
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
(16-05-2015)
5 కామెంట్లు:
రైతులకి కూడ MLC స్థానాలు కేటాయించండి.
ఇప్పుడున్న ప్రజాప్రతినిధులందరూ సభలలో రైతుల గురించి కంటితుడుపుగా మాట్లాడతారు కాని, సమస్యలు మాత్రం ఎప్పటికీ పరిష్కరించరు. రైతుల సమస్యలు వాళ్ళకి రాజకీయాలు చెయ్యటానికి చక్కటి అవకాశాలుగా మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అలా కాకుండా రైతుల సమస్యలు రైతులే చట్ట సభలలో చర్చించి ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు, పరిష్కారాలు చూపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటే, రైతులకి చట్ట సభలలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలి.
అందుకోసం కనీసం జిల్లాకి ఒకరైనా రైతు MLC ఉండేలా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. నిజంగా వ్యవసాయం చేసేవాళ్ళకి మాత్రమే అవకాశం లభించేలా జాగ్రత్తలు కూడ తీసుకోవాలి. రైతు నియోజకవర్గాల్లో ఓడిపోతే తమ ప్రభుత్వానికి రైతుల మద్దతు లేదన్న విమర్శ వస్తుందన్న భయంతోనైనా అధికారంలో ఉన్నవాళ్ళు రైతు సమస్యలపై దృష్టి సారిస్తారు.
"అమ్మకి కోపం వస్తే అన్నం వండదు. కాని రైతుకి కోపం వస్తే అన్నమే ఉండదు."
@bonagiri: "అమ్మకి కోపం వస్తే అన్నం వండదు. కాని రైతుకి కోపం వస్తే అన్నమే ఉండదు." మంచి మాట చెప్పారు. కాకపొతే ఈ ఇద్దరూ స్వతహాగా అమృత స్వభావులు. వీరికి కోపం రాదు. అందుకే ఈ ఆలుసు.
"రైతులకి కూడ MLC స్థానాలు కేటాయించండి" అన్న బోనగిరి గారి సూచనకు నా పూర్తి మద్దతు. అయితే బోనగిరి గారు కరక్ట్ గా అన్నట్లు ఆ పదవులు మోతుబరుల,, కామందుల చేతుల్లోకి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి చట్టం తయారు చేసేటప్పుడే.
MLC స్థానాలిచ్చినా అసలైన రైతుకు చేరవుగాని, రైతు సమస్యలు తీరిస్తే చాలు, గత డెభ్భై ఏళ్ళనుంచి అదే కనపట్టం లేదు.
శర్మ గారూ,
డెబ్బయి ఏళ్లలో ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే రాయితీలు పెరిగాయి తప్ప తగ్గలేదు. అదే సమయంలో రైతుల పరిస్థితి మెరుగు పడలేదు సరికదా అధోగతికి చేరింది.
ఈ విచిత్ర పోకడకు కారణం ఏమిటి? ఇది లోతుగా ఆలోచిస్తే తప్ప ఆట్టే అర్ధం కాదు.
కుదిరితే భారత సంప్రదాయ వ్యవసాయ పద్దతుల గురించి ఆల్బర్ట్ హోవార్డ్ పుస్తకం చదవండి, లేదా గోరెటి వెంకన్న "పల్లే కన్నీరు పెడుతోంది" పాట వినండి. ప్రస్తుత భారత గ్రామీణ సంక్షోభం మూలాలు అర్ధం అవుతాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి