18, నవంబర్ 2016, శుక్రవారం

యాభయ్ రోజుల పరీక్షా కాలం


‘ఇంటాబయటా క్యూలే’ అన్నాడొక వ్యాఖ్యానకారుడు.
‘ఇంట్లో కూచుని టీవీ పెడితే  క్యూ లైను దృశ్యాలు. కాలు బయట పెడితే, ఏ.టి.ఎం.లు, బ్యాంకుల దగ్గరా క్యూలైన్లు’ అనేది ఆయన కవి హృదయం. యావత్ దేశం క్యూ లైన్లలోనే వుందిపొమ్మన్నాడు మరో ఉత్ప్రేక్షాలంకారుడు. కాకపోతే కాసింత అతిశయోక్తి వుందనిపించడం సహజం.
కూసింత ఆలస్యంగా తీసుకున్న ఉపశమన చర్యల పుణ్యమా అని కాసిన్ని కరెన్సీ నోట్లు జనం జేబుల్లోకి చేరడంతో బోసిపోయిన నగరం మళ్ళీ లక్ష్మీ కళ సంతరించుకుంటోంది.
‘చూసింది ఇంతే!చూడాల్సింది ఎంతో వుంది’అని భయపెడుతున్నారు నిరాశావాదులు. రానున్న కొద్ది రోజుల్లో వందేళ్ళు వెనక్కి పోతామన్నది హెచ్చరికతో కూడిన వారి వాదం.  
‘బాగుపడుతుంది, సర్దుకుంటుంది’ అంటున్నారు ఆశావాదులు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని భావయుక్తంగా భరోసా ఇస్తున్నారు. ‘యెంత?  యాభయ్ రోజులేగా! వేచి చూస్తే పోలా!’ అనేది వారి ఉచిత సలహా.
నచ్చినా నచ్చకపోయినా చేసేది ఏమీ లేదు సామాన్యులకు. వారు పుట్టడమే పుట్టెడు కష్టాలతో పుట్టారు. వాటి మధ్యే పెరిగారు. క్యూలు కొత్తకాదు, కష్టాలు కొత్తకాదు. కాకపోతే తమ కష్టార్జితం తమ ఖాతాలో వేసుకోవడానికి ఇన్ని ఇబ్బందులు పడాలా అనేదే వారి ఆక్రోశం.       

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

What is your opinion sir.

Zilebi చెప్పారు...



భాండాగారము బయటకొచ్చిందని చెప్పండి :)

జిలేబి