4, అక్టోబర్ 2015, ఆదివారం

తండ్రికి తనయ నివాళి


మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు పుట్టపర్తిలో వుండగా అనేక రచనలు చేస్తూ పోయారు. వాటిల్లో ఒకటి దశావతారాలు. వారి చిన్నమ్మాయి వాణి వెల్దుర్తి, ఆ రాతప్రతిని చిన్ని పొత్తంగా తయారు చేసి, కుటుంబ సభ్యులకు స్వయంగా ఇంటింటికీ వెళ్లి పంచి పెట్టింది. ఈ విషయంలో వయస్సులో చిన్నదయినా తను పడ్డ శ్రమదమాదులు ప్రసంశనీయం. ‘మళ్ళీ మనమధ్యకు నాన్న వచ్చారంటూ’  చిరంజీవి వాణి తన ముందు మాటగా నుడివిన మాటలు:
“చిన్నప్పుడు తాతయ్య తద్దినానికి కంభంపాడు వెళ్ళినప్పుడు నాన్న వరండాలో కూర్చుని మాట్లాడుతుంటే వూళ్ళో ఎంతో మంది వినడానికి వచ్చేవారు. నాన్న ఎవరి అభిరుచికి తగ్గట్టు అ అంశం వారితో ముచ్చటి పెడుతుంటే వినేవాళ్ళు అయస్కాంతంలా అతుక్కుపోయి వింటూ వుండేవాళ్ళు. నాన్న మాట్లాడే మాటల్లో రెండు విషయాలు చోటు చేసుకునేవి కావు. అవే: ఆత్మస్తుతి, పరనింద.
“ఆదర్శాల నయాగరాల కన్నా, ఆచరణల హిమబిందువు మిన్న అని నమ్మిన మరువలేని, మరపురాని వ్యక్తి నాన్న. ఆ నాన్న ‘దశావతారాలు’ పుస్తకంతో మళ్ళీ మన మధ్యకు వచ్చాడు.”




ఈ చిన్ని పొత్తానికి ముఖచిత్ర అలంకరణ చేసింది ‘రాంపా’         

2 కామెంట్‌లు:

Arun చెప్పారు...

మీరు కంభంపాడు గురించి రాసినప్పుడల్లా నాకు నా చిన్నతనం గుర్తుకొస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ పాతిల్లు, కొత్త డాబా ఇల్లు, కజిన్స్ తో ఆడుకున్న ఆటలు, గొడవలు నిన్నమొన్న అయినట్లే గుర్తున్నాయి. మా అమ్మమ్మ వాళ్ళ పాత ఇల్లు శివారెడ్డి గారి రైస్ మిల్లు వెనక (రోశమ్మ గారి ఇంటికి ముందు) ఉండేది. మా తాతయ్య గారి తమ్ముదు గోపాలక్రిష్ణయ్య గారి ఇల్లు కూడా అక్కడే. తరువాత, అంటే, 1990 తర్వాత అనుకుంటా మా మామయ్యలకి ఒక ఏడాది పంట బాగా పండిందని వత్సవాయి రోడ్ లో డాబా కట్టించారు, ఆ తర్వాత అప్పులపాలయి ఇల్లమ్ముకొని అమ్మమ్మ, తాతయ్యలను కొత్తగూడెం తీసుకెళ్ళారు. మా అమ్మమ్మ, తాతయ్యలను చూశాక అర్ధం అయింది, వయసు వచ్చాక కొడుకుల మీద ఆధారపడకూడదని, మన బతుకుతెరువు మనమే చూసుకోవాలని. సొంత ఊర్లో దర్జాగా బతికిన మా తాతయ్య, చివరి రోజుల్లొ తన వాళ్ళెవరు (తమ్ముళ్ళు, చెల్లెళ్ళు) దగ్గర లేకుండానే పోయారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@- మీ చిన్నతనం గురించి రాసినప్పుడు నా చిన్నతనం మరోసారి గుర్తుకొస్తోంది. ధన్యవాదాలు. ఇది నా ఈ మెయిల్: bhandarusr@gmail.com మీరు టెస్ట్ మెయిల్ పంపితే నేను మీతో మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను.- భండారు శ్రీనివాసరావు