31, అక్టోబర్ 2015, శనివారం

అన్నీ చెప్పేస్తున్నా.....

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 01-11-2015, SUNDAY)

సూటిగా......సుతిమెత్తగా ......
ఒక సీనియర్ ఐ.పీ.ఎస్. అధికారి, పదవీవిరమణ అనంతరం ఒక రాజకీయ పార్టీలో చేరిన వ్యక్తి, ‘అన్నీ చెప్పేస్తున్నా...’ అంటూ ఓ పుస్తకం రాస్తే అందులో ఏముందో, ఏమేమి చెప్పారో అనే ఆసక్తి కలగడం సహజం. ఈ పుస్తక రచయిత శ్రీ రావులపాటి సీతారామారావు కేవలం, పోలీసు అధికారి, ఓ రాజకీయ పార్టీ నాయకుడు మాత్రమే కాదు. చదువుకునే రోజులనుంచీ చేయి తిరిగిన రచయిత అనే పేరు సంపాదించుకున్నారు. కలం పట్టిన చేత్తో లాఠీ పట్టుకున్నా కలాన్ని మాత్రం ఒదిలిపెట్టలేదు. ఈ పుస్తకం చివర్లో ఒక చమత్కార పూరితమైన ఒక వాక్యం వుంది. ఉద్యోగ పర్వంలో తన పేరును అంటిపెట్టుకుని వున్న ఐ.పీ.ఎస్. (ఇండియన్ పోలీసు సర్వీసు) అనే మూడు ఇంగ్లీష్ పొడి అక్షరాలు, రాజకీయ రంగ ప్రవేశం దరిమిలా ‘ఇండియన్ పొలిటికల్ సర్వీసు’గా  తనతోనే సహచర్యం చేస్తున్నాయని ఒక చమత్కార బాణం సంధించారు. అంతేకాదు ఈ రెండో ఉద్యోగానికి రిటైర్ మెంటు లేదని కూడా అంటూ, తన రాజకీయ ప్రయాణం సుదీర్ఘమైనదన్న సంకేతాన్ని కూడా ఇచ్చారు. ప్రభుత్వ సర్వీసులో ఉన్నత పదవులను నిర్వహించి తదనంతరం రాజకీయాల్లో చేరి రాణించిన వాళ్ళు ఎంతో మందివున్నారు. కాకపోతే అటు ఉద్యోగపర్వంలోను, అటు పిదప రాజకీయ రంగంలోనూ తమ ప్రస్థానం కొనసాగే రోజుల్లో వృత్తి ధర్మంగా పలువురు రాజకీయ ప్రముఖులతో అత్యంత సన్నిహితంగా మెలిగే సావకాశం బాగా వున్న రావులపాటి వంటివారు, ఏదైనా పుస్తకం రాస్తే, అందులోనూ, ‘అన్నీ చెప్పేస్తున్నా’ అనే పేరు పెట్టి పుస్తకం రాస్తే ఇక అందులో ఏం రాశారో, ఏం చెప్పారో అన్న ఆసక్తి సర్వత్రా కలగడంలో విడ్డూరం ఏమీ లేదు. పోలీసు ఇంటలిజెన్స్ విభాగంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కాలంలో శ్రీ రావులపాటి సీతారామారావుకు తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తి శేషులు ఎన్టీ రామారావు తోనూ, అలాగే తరువాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన శ్రీ చంద్రబాబునాయుడుతోనూ ఆయనకు అతి సన్నిహితంగా మెలగగలిగే వీలూసాలూ  వృత్తిరీత్యా లభించింది. ఎన్నెన్నో ఆంతరంగిక విషయాలకు, బయటకు పొక్కని సందర్భాలకు, సన్నివేశాలకు ప్రత్యక్ష సాక్షిగా వుండే వెసులుబాటు శ్రీ రావులపాటికి కలిగింది. అంచేత వారిరువురికీ సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు ఈ పుస్తకంలో చోటుచేసుకోవడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అయితే ఆ విషయాల్లో రచయిత పాటించిన సంయమనం ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. సంచలనం కోసం కూడా తనకు తెలిసిన నిజాలను, తనకు మాత్రమే తెలియగల వాస్తవాలను, ప్రత్యేకించి  కించపరిచే సంచలన అంశాలను ఒదిలిపెట్టి పుస్తకం రాసిన తీరు మెచ్చతగింది. ఈ పుస్తకంపైన తన అభిప్రాయం రాస్తూ ప్రసిద్ధ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ అదే అన్నారు.
“గతంలో ఆత్మకధలు అనేకం వచ్చాయి. అయితే ఈ పుస్తకంలో కనబడే విశిష్టత రచయిత నిజాయితీ. పుస్తకం కమ్మర్షియల్ గా సక్సెస్ అవడం కోసం పేరున్నవారిని తిట్టడం, వారి బలహీనతల్ని భూతద్దంలో చూపడం మొదలైనవి ఇందులో కనబడవు’ అంటూ, రావులపాటి వారు  ఎన్నో చెబుతారని కొందరు పెట్టుకునే ఆశలపై ముందస్తుగానే ఇన్ని నీళ్ళు చల్లేశారు.
మరి ఇంత నిజాయితీతో, నిబద్ధతతో రాసే పుస్తకంలో చదివించే అంశాలు ఏమీ లేవా అంటే వున్నాయి. అందులో ముందుగా చెప్పాల్సింది రాసిన తీరు.  ఎంతో సరళంగా, గందరగోళాలు లేకుండా హాయిగా ఏకబిగువున చదువుకునే విధంగా వుంది  రచయిత శైలి. ఆయన స్వయానా రచయిత కావడం వల్ల, ఆత్మకధ అనండి, లేదా ఆయనే చెప్పుకున్నట్టు పోలీసు పొలిటీషియన్ స్వ’గతం’ అనండి – చదివించే గుణం ఈ పుస్తకంలో పుష్కలంగా వుంది. అనేక దశాబ్దాలపాటు ప్రభుత్వ సర్వీసులో వుండి తాను గమనించిన విషయాలను సమగ్రంగా, సందేహాలకు తావులేకుండా, రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా, ముందు వెనుకల సన్నివేశాలను ఒక క్రమపద్ధతిలో ఏర్చి కూర్చి, ఒక పుస్తకంగా రాయడం అనేది అంత సులభమైన విషయం కాదు. పైగా జీవించి వున్న వ్యక్తులను, వారి వ్యక్తిత్వాలను అంచనా వేస్తూ రచన చేయడం అనేది నిజంగా కత్తి మీద సామే. ఈ విషయంలో రావులపాటి పూర్తిగా కృతకృత్యులయ్యారు అనడానికి యండమూరివారి కితాబే సాక్షి.
వారం వారం సమకాలీన రాజకీయ అంశాలపై రాసే శీర్షికలో ఈ పుస్తక సమీక్ష ఏమిటన్న అనుమానం చదువరులకు కలగొచ్చు. నిజానికి ఈ పుస్తకం మొదటి నుంచి చివరి వరకు ఒక రాజకీయ గ్రంధమే. రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి ఉన్నవారికి ఒక పాఠ్యాంశంగా ఈ పుస్తకం నిలిచిపోతుందని యండమూరి వీరేంద్రనాథ్ అన్న మాట ఏదో మెచ్చుకోలు కోసం చెప్పింది కాదని పుస్తకం చదివిన వారికి ఇట్టే తెలిసిపోతుంది.
సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసి అటు సమర్దుడయిన అధికారిగా, ఇటు ఆహ్లాద రచయితగా మంచి పేరు తెచ్చుకున్న రావులపాటి సీతారామారావు అనే వ్యక్తి, ఉద్యోగ విరమణ అనంతరం, అంత మంచి పేరు లేని  రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించడం ఇంటా బయటా ఎంతో ఉద్వేగాన్ని కలిగించింది. సరే! రాజకీయాల్లో చేరాలంటే ఏదో ఒక పార్టీలో చేరక తప్పదు. మరి ఆ పార్టీ ఏమిటి ? ఈ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన్ని బాగా తెలిసిన వారందరికీ మరింత ఆశ్చర్యం కలిగించింది. తెలుగు దేశంలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. అదేమీ అంటరాని పార్టీ కాదుకదా! పైగా ఆ రోజుల్లో ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలో వుంది. పైపెచ్చు టీడీపీ అధినేత కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్న రోజులాయే! మరి ఆశ్చర్యాలు, అభ్యంతరాలు ఎందుకోసం?
ఎందుకంటే, రావుల పాటి వారి ఇలాకా అంతా కాంగ్రెస్ మయం. వాళ్ళ స్వగ్రామాలు ఒకనాటి కమ్యూనిష్టుల కంచుకోట ఖమ్మం  జిల్లాలో వున్నప్పటికీ, వారి నరనరాన కాంగ్రెస్ సంస్కృతి జీర్ణించుకుని వుంది. సీతారామారావు గారి నాన్నగారు రావులపాటి సత్యనారాయణ రావుగారు ప్రముఖ కాంగ్రెస్ వాది. పాలేరు సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక బంధుగణం అంతా కాంగ్రెస్ పార్టీ మనుషులే. రక్తపరీక్ష చేస్తే కాంగ్రెస్ రక్తం కనబడుతుందని హాస్యోక్తిగా చెప్పుకునే వారు. అలాంటిది ఒక పోలీసు ఆఫీసరుగా పనిచేసి రాజకీయాల్లో చేరాలని అనుకోవడమే ఒక సంచలనం అయితే, చేరేది తెలుగుదేశం పార్టీ కావడం చుట్టపక్కాల్లో  పెనుసంచలనం అయింది. అయినా టీడీపీ పడవ ఎక్కాలనే నిర్ణయానికి రావులపాటి వారిని ప్రొద్బల పరచిన అంశం ఒక్కటే. చంద్రబాబునాయుడు అనే ఒకే ఒక వ్యక్తికి మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సమర్ధత వుందని ఆయన మనసా వాచా నమ్మడమే. అందుకే ఆ పార్టీ అధికారంలో వున్నప్పుడు అందులో చేరి, దరిమిలా ఒక దశాబ్దంపాటు ఆ పార్టీ అధికారానికి దూరంగా జరిగినా ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీని ఒదిలిపెట్టలేదు. ఆ పార్టీని, దాని నాయకుడిని నమ్ముకునే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. నడుమలో తమ వైపు రమ్మని వై.ఎస్.ఆర్. వైపు  నుంచి పరోక్ష సంకేతాలు వచ్చినప్పటికీ ఆయన మాత్రం టీడీపీ ని వదలలేదు. రాజకీయాల్లో విలువలు వుండి తీరాలని, లేకపోతే వాటికి ఏమాత్రం విలువ వుండదన్నది  తన నమ్మకం అని ఆయన రాసుకున్నారు. “పార్టీ మారాలనే ఆలోచన చేయకపోవడానికి కారణం బహుశా నేను ఏ అధికార పదవిని అంతవరకూ చవిచూడకపోవడం కూడా ఒక బలమైన కారణం కావచ్చు. ఆ రుచి నాకు తెలియకపోవడం వల్లనే నేను ఈ నడవడికకు కట్టుబడి వుండొచ్చు” అని రాసుకోవడంలో వున్న నిజాయితీయే యండమూరిని ఆకర్షించిందేమో! 
1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ  పరాజయం తరువాత,  కాంగ్రెస్ విజయ యాత్రలో పాల్గొన్న వారిలో కొందరు అతి ఉత్సాహానికి పోయి ఆబిడ్స్ లోని రామారావు నివాసం వెలుపల ‘ముఖ్యమంత్రి’ అని రాసి వున్న నేమ్ ప్లేటును తీసి కింద పారేశారు. అప్పుడు ఆ  ఏరియా పోలీసు అధికారి సీతారామారావు. ఒక జూనియర్ అధికారి  నేమ్ ప్లేట్ విషయాన్ని  ఎన్టీఆర్ కి నొచ్చుకుంటూ చెప్పబోతే,  ‘నేమ్ ప్లేట్ దేముంది బ్రదర్, పదవే పోయిన తరువాత’ అని ఆయనే సర్దిచెప్పిన తీరు తనని కదిలించి వేసిందని రాసుకున్నారు.
పోలీసు అధికారిగా రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించారని మంచి పేరు తెచ్చుకున్న సీతారామారావు, చంద్రబాబు విషయంలో భావోద్వేగాన్ని దాచుకోలేకపోయారు. అది ఆయన మాటల్లోనే: 
మే, 2014.
“పోటాపోటీగా ఆంద్ర ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆ క్రితం రాత్రి సరిగా నిద్రపట్టలేదు. ఫోన్లలో వచ్చే రకరకాల మెసేజ్ లు చాలా చీకాకు పెట్టాయి. కొందరు ఫారిన్ నుంచి కూడా ఫోను చేసారు. ‘ఏమవుతుంది? జగన్ గెలుస్తాడా? ఏదో సర్వే చెప్పిందట కదా!’ మరికొందరు భయం భయంగా చంద్రబాబు రావాలి సార్, రాకపోతే యెట్లా?’ ఇలాటి పలకరింపులు ఆందోళనను మరింత పెంచాయి. అర్ధరాత్రి దాటిన  తరువాత మరో ఫోను. ఇంటలిజెన్స్ లో పనిచేసిన ఓ అధికారి. ‘ఇంత రాత్రివేళా’ అన్నాను. ‘ఇప్పుడే చాలా నమ్మకంగా తెలిసింది. తెలంగాణాలో భారీ మెజారిటీతో టీఆర్ ఎస్, ఆంధ్రాలో కొద్ది తేడాతో జగన్ గెలుస్తారని”
“అయినా మనసు మూలల్లో ఏదో నమ్మకం, అలా జరగదనీ, చంద్రబాబు గెలుస్తారనీ.
“ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు ఇంట్లో వున్నాం. ఫలితాలు వస్తున్నాయి. ఒక్కో సీటు గెలుస్తుంటే ఉత్సాహం, కేకలు. తొంభయ్ సీట్లు రాగానే చంద్రబాబునాయుడు దగ్గరకు వెళ్లి అభినందనలు చెప్పబోయాం. ‘వంద రానివ్వండి అప్పుడు చెబుదురు కాని’ అన్నారు ఆయన నిబ్బరంగా. రాత్రంతా పడ్డ ఆందోళన దూదిపింజలా యెగిరి పోయింది.”
తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీ రావులపాటి సీతారామరావు, ఈ పుస్తకంలో రాసిన ఓ ఆసక్తికర విషయంతో దీన్ని ముగిస్తాను.
“ మా నాన్న తొంభయ్ సంవత్సరాల వృద్ధుడు. తెలంగాణా రాష్ట్రాన్ని డిక్లేర్ చేసిన సందర్భంగా హైదరాబాదు అంతా పండుగ వాతావరణంలో మునిగి తేలుతోంది. మా తమ్ముడి కూతురు ‘జై తెలంగాణా’ అంటూ ఆయన మంచం దగ్గరికి వెళ్లి, ‘తాతయ్యా! తెలంగాణా వచ్చింది. జై తెలంగాణా అను’ అని ఆయన చేయి అతికష్టం మీద పైకెత్తింది. అప్పటికే ఆయన చాలా అస్వతతతో వున్నారు. అయినా అయన తన చేతిని బలవంతంగా ఎత్తి పెట్టుకుని ‘జై విశాలాంధ్ర’ అని కళ్ళు మూసుకున్నారు. ఈ చిన్న పిల్లకు అర్ధం కాలేదు. ఆ మాట కొత్తగా విన్నది. విశాలాంధ్ర కోసం శ్రమించిన వ్యక్తి ఆయన. విలువలను మార్చుకోలేని ఆశక్తుడు’.


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com,  మొబైల్: 98491 30595                                          


2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

చివరిపేరా ఆ పెద్దాయన నిజాయితీకి, నమ్మినదానికి కట్టుబడుండటానికి చక్కటి నిదర్శనం. విలువలు పతనమయిపొయిన ఈ సమాజంలో మీరన్నట్లు ఆయన నిజంగా "విలువలను మార్చుకోలేని ఆశక్తుడు".

Unknown చెప్పారు...

Spice andhra ఒక్క గొప్ప online తెలుగు న్యూస్ పొర్తల్ ఇక్కడ మీరు కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవచ్చ.