3, సెప్టెంబర్ 2011, శనివారం

నండూరివారు ఇక లేరు – భండారు శ్రీనివాసరావు

నండూరివారు ఇక లేరు – భండారు శ్రీనివాసరావు


కీర్తిశేషులు నండూరి రామమోహనరావు గారు


పందొమ్మిదివందల డెబ్భయ్ ఒకటి ఆగస్టులో నేను విజయవాడ ఆంధ్ర జ్యోతి దినపత్రికలో చేరిన కొత్తల్లోనే ఎడిటర్ నార్ల వేంకటేశ్వర రావు గారు తమ మకాంని హైదరాబాదుకు మార్చుకోవడంతో ఆయన బాధ్యతలు చాలావరకు నండూరి రామమోహన రావు గారిపై పడ్డాయి. జర్నలిజం లో నాకు అక్షరాభ్యాసం చేసిన తొలి గురువు ఆయనే. పేరులో వున్న ‘రామ’ శబ్దానికి తగినట్టుగా ఆయన గారి మాట మహా మృదువు. కోపం వచ్చిన సందర్భాలలో కూడా అది ఆయన కళ్ళలో కానీ, నోటిమాటల్లో కానీ ఎంతమాత్రం కానవచ్చేది కాదు. కఠినంగా చెప్పాల్సివచ్చినా మాటలో మృదుత్వం తొంగి చూసేది. ఈ విషయంలో నాకొక అనుభవం వుంది. ఆ రోజుల్లో సబ్ ఎడిటర్లం రాసిన వార్తలు అచ్చుకు పోయేముందు ఎస్ గ్యాలీ రూపంలో మళ్ళీ మా దగ్గరకే వచ్చేవి. చివరిసారిగా సరిచూసి తిరిగి కంపోజింగ్ సెక్షన్ కు పంపేవాళ్ళం. ఎస్ గ్యాలీ కాపీ ఒకటి నండూరి వారి టేబుల్ మీదకు కూడా వెళ్ళేది. ఒకసారి ఓ వార్తను అనువదిస్తూ ‘బాధ’ కు ‘భాద’ అని రాశాను. అది ఆయన దృష్టిలో పడింది. ఎస్ గ్యాలీ పట్టుకు వచ్చిన అటెండర్ నాగేశ్వరరావు - రామ్మోహన్ రావు గారు పిలుస్తున్నారని నాకు కబురు మోసుకొచ్చాడు. తీరా వెడితే, ఆయన నేను రాసిన ‘భాద’ అనే పదాన్ని చూపించి - ‘ఎంత బాధ అయితే మాత్రం ఇంత ‘భాద’ ఏమిటండీ!’ అని ‘వొత్తు’ ఎక్కడ పెట్టాలో నేను మనసు కష్టపెట్టుకోకుండా చెప్పారు. తప్పును ఎత్తి చూపడంలో కూడా నండూరి రామమోహనరావు గారి తరహానే వేరు. అందుకే ఈ ఉదంతం ఇన్నేళ్ళ తరవాత కూడా నా మనసు మడతల్లో భద్రంగా వుండిపోయింది.

అటువంటి ఆ మహా మనీషికి నా అశ్రు నివాళి!

(02-09-2011 – 10-30 PM)

8 కామెంట్‌లు:

Kalpana Rentala చెప్పారు...

శ్రీనివాసరావు గారు,

మీరు చెప్పింది నిజం. ఆయన చాలా మృదుభాషి. మాట లోనూ, రాత లోనూ కూడా ఆవేశం, కోపం ధ్వనించకుండా చూసుకోగలరు. ఆయన శిష్యరికం లో జర్నలిజం లో ఓనమాలు దిద్దిన అనేక మంది ఇప్పుడు మీడియా లో అనేక పెద్ద పదవుల్లో వుండటం సంతోషదాయకం. కాకపోతే అంత పెద్ద మేధావి చనిపోతే ఒక్క ఆంధ్రజ్యోతి లో తప్ప మిగతా ఏ పత్రికలో కూడా కనీసం ఎడిట్ పేజీ ఆర్టికల్స్ కూడా ప్రచురించకపోవటం శోచనీయం.

innaiah చెప్పారు...

Why did you not place his picture, preferably with you, if available.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Kalpana Rentala -నూటికి నూరుపాళ్ళు అందరు ఏకీభవించే నిజం చెప్పారు. ఎదిగివచ్చిన చోటుని, పాదు చేసి పెంచిన వ్యక్తుల్ని తేలిగ్గా మరచిపోవడమనే మహమ్మారి మనస్తత్వం జర్నలిజం రంగాన్ని సైతం పట్టి పీడిస్తోంది.- భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@innaiah - అలాటి పెద్దవాళ్ళతో కలసిపనిచేయగల అదృష్టం లభించిందని మురిసిపోయామే కానీ ఫోటోలు దిగి దాచుకోవాలన్న ఆశలు ఏకోశానా లేని రోజులవి. మీకు తెలియనిదేముంది.ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటున్నప్పుడు ఆ లోటు స్పుటంగా తెలిసివస్తోంది.గూగుల్ ఇమేజెస్ లో కూడా నండూరి వారి ఫోటో లేదంటే ఇక ఏం చెప్పాలి? -భండారు శ్రీనివాసరావు

సుజాత వేల్పూరి చెప్పారు...

నండూరి గారి గురించి ఆంధ్ర జ్యోతి తప్ప ఇంకెవరూ ఎడిట్ పేజీలో వ్యాసాలు ప్రచురించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాను. జర్నలిజం రంగానికి ఆయన చేసిన సేవల్ని ఎవరూ గుర్తుంచుకోరా? ఒక గొప్ప సీనియర్ పాత్రికేయుడు,గొప్ప రచయిత కూడా అయినా ఆయన మరణ వార్తని కేవలం ఒక "వార్త"గా లోపలి పేజీల్లో వేసి ఊరుకోడం ఉదాశీనత అనుకోవాలా? వార్తకు కమర్షియల్ వాల్యూ లేదనుకోవాలా? లేక మనవాళ్లకు గొప్ప వారిని గౌరవం లేదనుకోవాలా?

అన్నట్టు గూగుల్ ఇమేజెస్ లో ఆయన ఫొటో ఉందండీ! నేను అక్కడి నుంచే తీసుకున్నాను

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సుజాత - గూగుల్ ఇమేజెస్ లో నేను ప్రయత్నించాను. దయచేసి నాకు పంపగలరా సుజాత గారు - భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సుజాత - ధన్యవాదాలు - గూగుల్ లోనే నండూరి వారి ఫోటో దొరికింది. - భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

ఎస్.రాజేస్వర రావ్ గారి పాటలు చాల వుండేవి ఆయన దగ్గర."చల్ల గాలిలొ యమునా తటి పై" అయన టెప్ లొంచి నెను రికార్డ్ చెసుకున్నా.