2014 లో జగన్ మోహన రెడ్డి అధికారానికి అడుగు
దూరంలో ఆగితే, 2019 లో చంద్రబాబు నాయుడు అధికార పీఠానికి
ఆమడ దూరంలో ఆగిపోవడం ప్రజాస్వామ్యంలో ఉన్న చమత్కారం అనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90 లక్షల పైచిలుకు పొదుపు సంఘాల మహిళలకు, సుమారు 46 లక్షల మంది రైతులకు తెలుగు దేశం ప్రభుత్వం ఎన్నికలకు కొద్ది
రోజులముందే కోట్లాది రూపాయలు నగదు బదిలీ చేసింది.
‘పసుపు కుంకుమ పేరుతొ లక్షలాది మంది ఆ మహిళలకు ఒక్కొక్కరికి పదేసి వేల రూపాయల చొప్పున
రాష్ట్ర ప్రభుత్వం వారి వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే అన్ని లక్షలమంది రైతులకు
మొదటి విడతగా ‘అన్నదాతా సుఖీభవ’ పధకం కింద
ఒక్కొక్కరికి నాలుగువేల రూపాయల చొప్పున విడుదల చేసి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో
వేసింది.
ఈ మొత్తమూ తక్కువది కాదు, ఆ సంఖ్యా
తక్కువ కాదు. పైగా వారందరూ ఓటర్లు.
అంచేత వారందరిలో కనీసం మెజారిటీ
మహిళలు, రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞత కింద ఓట్లు వేస్తే తమ విజయానికి ధోకా ఉండదని టీడీపీ అధినాయకత్వం యోచన.
ఆ పార్టీ భావించినట్టుగానే ఏప్రిల్
పదకొండు పోలింగు రోజున అధిక సంఖ్యలో పోలింగు కేంద్రాలకు తరలి వచ్చారు. కొన్ని
చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఇళ్ళకు మళ్ళారు. ఆ తరుణంలో ఓటుహక్కు వినియోగించుకోండి
అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీవీల ద్వారా పలుమార్లు విజ్ఞప్తి చేసారు.
తిరిగొచ్చిన మహిళలు అర్ధరాత్రి వరకు ఓపికగా వేచి వుండి ఓట్లు వేసి మరీ వెళ్ళారు. ఈ
పరిణామం సహజంగానే తెలుగు దేశం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. చేజారిపోతున్నది అని
మొదట సందేహించిన విజయం మళ్ళీ తమ వొడిలో పడుతోంది అనే నమ్మకాన్ని కలిగించింది. కానీ
వారికి కానీ, వేరే ఎవ్వరికీ అంటే సర్వే సంస్థలకు కానీ తెలియని విషయం ఒకటుంది. అదేమిటంటే ప్రజలు
అప్పటికే అంటే ప్రభుత్వ తాయిలాలు తమ చేతిలో పడక ముందే ఓటు ఎవరికి వేయాలి అనే
విషయంలో ఒక గట్టి నిర్ధారణకు వచ్చారన్న సంగతి. మండలం పాటు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం
మే ఇరవై మూడో తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత కానీ జనాల తత్వం పాలక పక్షానికి
బోధపడలేదు. ప్రతిపక్షం వైసీపీకి ఏకపక్షంగా అఖండ విజయాన్ని అందివ్వాలని వారు
ఎంతోకాలంగా కోరుకుంటున్నారు అనే వాస్తవం ఎరుక కాలేదు. జగన్ మోహన రెడ్డికి ఒక
అవకాశం ఇవ్వాలని ముందుగానే ప్రజలు ఒక దృఢ నిర్ణయానికి రాబట్టే ఈ తాయిలాలవల్ల అధిక
ప్రయోజనంపొందిన ప్రాంతాల్లో కూడా పాలక పార్టీ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారు. 2014 తో పోలిస్తే ఈసారి మహిళల ఓటింగు శాతం గణనీయంగా పెరిగిన పది
నియోజకవర్గాల్లో సయితం వైసీపీ విజయం సాధించడం ఇందుకు దృష్టాంతం. నిజానికి ఓటర్లను
ఈ విషయంలో మెచ్చుకోవాలి. ప్రభుత్వ ఖజానా నుంచి వేల కోట్ల రూపాయల తాయిలాలు ఉచితంగా పంఛి, బదులుగా వారి నుంచి ఓట్లని ఆశించే ఈ రకమైన క్విడ్ ప్రోఖో పద్దతిని ప్రజలు
అన్నివేళలా హర్షించరని రాజకీయ పార్టీలు తెలుసుకుంటే అది సమాజానికి మంచిది.
సహజంగానే పరాజయానికి పలు కారణాలు
వుంటాయి. కారణాలు ఏమైనా ఇందుకు ప్రధాన బాధ్యత పార్టీ అధినాయకుడిదే అవుతుంది. 2014 లో ప్రజలు ఇచ్చిన అధికారానికి కారణం చంద్రబాబే అన్నది జగమెరిగిన
సత్యం. విడిపోయిన రాష్ట్రానికి ఆయన వంటి సమర్ధుడు, అనుభవం ఉన్న నాయకుడు అవసరమని
భావించి ప్రజలు పట్టం కట్టారు. ఆ విజయానికి ఆయన కారణం అయినప్పుడు ఇప్పటి ఈ
అపజయానికి కూడా ఆయనే బాధ్యత వహించడం హేతుబద్ధంగా వుంటుంది. గతంలో జయాపజయాలకు తనదే
బాధ్యత అని కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి
చెప్పిన విషయం గమనార్హం.
అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార
దర్పం, నిధుల దుర్వినియోగం వంటి అనేక
ఇతరేతర కారణాలు వున్నా చంద్రబాబు వ్యవహార శైలి పట్ల కూడా ప్రజల్లో ఒకరకమైన ఏవగింపు
కలగడం ప్రస్తుత టీడీపీ ఘోర పరాజయానికి మరో ప్రధాన కారణం. అతి ముఖ్యమైన అంశాలపై తరచుగా
విధానాలు, వైఖరులు మార్చుకుంటూ వాటిని ప్రజలు కూడా ఆమోదించాలని, సమర్దించాలని
కోరుకోవడం జనంలో అధిక సంఖ్యాకులకు నచ్చలేదు. ప్రధానంగా ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యేక
హోదా, ప్రత్యేక ప్యాకేజి వంటి కీలక అంశాలలో ఆయన అనుసరించిన రెండు నాలుకల ధోరణిని జనం
హరాయించుకోలేక పోయారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ముఖ్యంగా ప్రధాన మంత్రి
నరేంద్ర మోడీతో ఆయన గిల్లికజ్జాలకు దిగి, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ పేరుతొ ఎన్డీయే
కూటమి నుంచి వైదొలగడం తొందరపాటు చర్య కాగలదని అప్పట్లో చంద్రబాబు అనుకుని వుండరు. ‘మీరు
జగన్ మోహన రెడ్డి ట్రాపులో (వలలో) పడుతున్నారంటూ ఆ నాడు ప్రధాని మోడీ అన్నమాట ఇక్కడ ప్రస్తావించడం
సముచితంగా వుంటుంది.
ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత
తనకున్న సుదీర్ఘ అనుభవంతో, రాజకీయ పరిచయాలతో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని చంద్రబాబు
తలపోయడం మరో పొరబాటు. మోడీ వ్యతిరేక కూటమిని కూడగట్టే క్రమంలో పార్టీ ఆవిర్భావం
నుంచి టీడీపీకి ప్రబల రాజకీయ శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీతో జత కట్టడం అనేది
రాజకీయంగా వేసిన మరో తప్పటడుగు. ఈ మార్పు ఆ పార్టీలోనే చాలా మందికి నచ్చలేదు.
అయినా అధినాయకుడి నిర్ణయాన్ని శిరసావహించారు. ఈ ప్రయోగం తెలంగాణా అసెంబ్లీ
ఎన్నికల్లో ఘోరంగా విఫలం అయిన తర్వాత కూడా చంద్రబాబు తన వైఖరి, విధానం
మార్చుకోలేదు. మోడీ వ్యతిరేక కూటమిని దేశ వ్యాప్తంగా కూడగట్టేందుకు చంద్రబాబు
చేయని ప్రయత్నం లేదు. ఇది సహజంగానే బీజేపీ అగ్రనాయకులకు రుచించలేదు. ఎన్డీయేలో మోడీ
నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా లేక మోడీ లేని బీజేపీని ఆయన
సమర్ధిస్తున్నారా అనే విషయంలో తీవ్రమైన
అయోమయం నెలకొన్న మాట నిజం.
ప్రాంతీయ పార్టీల అధినేతలను కట్టడి
చేయడానికి అతులిత అధికారాలు, దేశ వ్యాప్తంగా క్షేత్ర స్థాయి కార్యకర్తల బలం, ప్రత్యర్ధులను
నిలువరించడానికి ఎదురులేని వ్యూహ ప్రతి
వ్యూహాలు పన్నగల నైపుణ్యం పుష్కలంగా కలిగిన బీజేపీ అధినాయకత్వాన్ని ఎదురించే క్రమంలో రాష్ట్రంలోని వాస్తవ రాజకీయ స్తితిగతులను పక్కనబెట్టి వ్యవహరించడం టీడీపీ
ప్రధమ వైఫల్యంగా పరిగణించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత బలీయమైన రాజకీయ శక్తిగా ఉన్న వైసీపీని
విస్మరించి, చాలా బలహీనమైన స్తితిలో ఉన్న బీజేపీని
లక్ష్యంగా చేసుకుని యావత్ శక్తియుక్తులను కేంద్రీకరించడం ఈ ఎన్నికల్లో టీడీపీ పరాజయానికి కారణమైందని చెప్పుకోవచ్చు. కేంద్రంలో
అధికారంలో వున్న నరేంద్ర మోడీ 2019 ఎన్నికల నాటికి బలహీన పడతారనే తప్పుడు
అంచనాలతో, రాష్ట్రానికి ప్రత్యేకహోదా
విషయంలో అప్పటికే నిర్విరామ పోరాటం చేస్తున్న వైసీపీకి ఆ రాజకీయ ప్రయోజనం
లభించకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుని, ప్రత్యేక హోదా
ఉద్యమానికి తానే నాయకుడిని అని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు ముమ్మరం చేయడం టీడీపీ వేసిన
తప్పటడుగు.
అయితే, మోడీపై చంద్రబాబు నిర్విరామంగా
సాగించిన పోరాటం యావత్ భారత దృష్టిని ఆకర్షించింది అనడంలో సందేహం లేదు. మీడియా మిత్రుడిగా పేరున్న చంద్రబాబుకు ఈ
ప్రచారం విస్తృతంగా లభించడంలో ఆశ్చర్యం లేదు.
సీపీఐ నాయకుడు నారాయణ అన్నట్టు ‘జగన్ నేల
మీద నిలబడి పోరాటం సాగిస్తే చంద్రబాబు నేలవిడిచి సాము చేశారు’. ఫలితాల్లో ఇది
ప్రస్పుటమైంది.
వివిధ కారణాల వల్ల ఎంతటి మంచి పరిపాలనలో
కూడా జనాలు ఎంతోకొంత అసంతృప్తికి గురవుతుంటారు. ప్రజల్లో ప్రబలె ఈ అసంతృప్తి
అసహనంగా మారి, అసహనం ఆగ్రహంగా పెచ్చరిల్లి, ఆగ్రహం అవధులు ఎరుగని కసిగా రూపొందినప్పుడు
ఎంతటి ప్రభుత్వాలయినా పేకమేడల్లా కుప్ప కూలుతాయి.
ప్రభుత్వ స్థాయిలో అంటే బడా బడా
కాంట్రాక్టర్ల నుంచి బడా నాయకులకు అందే
ముడుపుల విషయంలో కంటే, ప్రభుత్వ కార్యాలయాలలో
ప్రతి చిన్న పనికి తాము అంతోఇంతో చెల్లించుకోవాల్సిన ఆమ్యామ్యాల గురించే ప్రజలు
ఎక్కువగా ఆందోళన చెందుతారు. అలాగే, ఇన్నాళ్ళుగా తమ మధ్యనే ఉంటూ ఏదో ఒక పార్టీ
కార్యకర్తగా కాలినడకన తమ మధ్యనే తిరుగుతూ,
హఠాత్తుగా ఓ రోజు ఖరీదైన కార్లలో తిరిగే
వారిని చూసినప్పుడే సామాన్యులకు అసంతృప్తి కలుగుతుంది. అది ప్రభుత్వాలపై అసహనంగా
మారుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అదే జరిగింది.
ప్రభుత్వంపై కసి పెంచుకున్న ప్రజలు దాన్ని తమ ఓటు ద్వారా తిరస్కరించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు తమ
వ్యవహార శైలి కారణంగా అధికారానికి దూరం అయిన సందర్భాలు అనేకం వున్నాయి. అనుభవశాలులు
సయితం ఈ విషయంలో పప్పులో కాలేస్తూ వుంటారు.
‘ప్రజలు గమనిస్తున్నారు’ అని రాజకీయ
నాయకులు తరచుగా చెబుతుంటారు కానీ ఆ విషయాన్ని తామే మరచిపోతుంటారు. పరిపాలన ఎలా వున్నా
నాయకుల వ్యవహార శైలిని మాత్రం సాధారణ ఓటర్లు పరిశీలిస్తూనే వుంటారు.అహాన్ని,
అహంకారాన్ని ఒక మేరకు మాత్రమే వాళ్ళు సరిపెట్టుకుంటారు. శృతి మించిందని అనుకుంటే
తమ దగ్గర సిద్ధంగా వుండే ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగిస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో
నాటి టీడీపీ అధినేత ఎన్టీరామారావు ప్రజోపకరమైన అనేక పధకాలను ప్రవేశ పెట్టారు.
రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించారు. అయినా కానీ
ఎన్నికల్లో ప్రజలు ఆయన పార్టీని తిరస్కరించడమే కాకుండా కల్వకుర్తి నియోజకవర్గంలో
ఏకంగా ఆయన్నే ఓడించారు. అంతకు ముందు ఏదో చిన్న కారణం చూపి మొత్తం మంత్రివర్గ
సభ్యులను తొలగించి, కొత్త మంత్రులను నియమించకుండా, పరిపాలనను గాలికి వదిలి ఢిల్లీ వెళ్లి అక్కడ రోజుల తరబడి మకాం చేసారు.
ఇలాంటి కొన్ని అహంభావ చర్యలను ప్రజలు హరాయించుకోలేక పోయారు. ఫలితం తదుపరి ఎన్నికల్లో
టీడీపీ ఘోర పరాజయం.
అయితే ఒకటి నిజం.
గెలుపు ఆఖరిది కాదు, ఓటమి మొదటిదీ
కాదు. విజయం తర్వాత మళ్ళీ అపజయం ఎదురుకావచ్చు. ఓటమి అనంతరం తిరిగి విజయం ఒళ్లో
పడొచ్చు.
విజేత న్యాయం (Victor’s Justice) అని ఇంగ్లీషులో అంటుంటారు. యుద్ధానంతరం విజేతలు, పరాజితులకు చెప్పే
న్యాయంలో కొన్ని హెచ్చు తగ్గులు వుంటాయి. యుద్ధ కాలంలో విజేత చేసిన ఆకృత్యాలకు తక్కువ శిక్ష విధిస్తూ,
అదే నేరాలకు పరాజితులకు భారీ శిక్షలు విధిస్తూ చెప్పే తీర్పు లాంటిది అనుకోవచ్చు.
ప్రస్తుతం ఎన్నికల యుద్ధంలో విజేతలు,
పరాజితుల విషయంలో చేసే అభివ్యక్తీకరణలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. సహజంగానే
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వెలువడే సమీక్షల్లో కూడా ఈ మాదిరి అవ్యాజ
అనురాగాలు విజేతలపట్ల తొంగిచూడడం సహజమే.
ఎందుకంటే, విజయం అన్నింటినీ మరిపిస్తుంది.
ఎనిమిది ఎంపీ, ముప్పయి ఒకటి ఎమ్మెల్యే
స్థానాల్లో టీడీపీ ఓడిపోవడానికి కారణం పవన్ అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఆ
సీట్లలో వైసీపీకి వచ్చిన మెజారిటీల కంటే జనసేన పార్టీకి పడ్డ ఓట్ల సంఖ్య ఎక్కువ కాబట్టి టీడీపీ ఓటమికి జనసేన కూడా
దోహదపడ్డదని వారి వివరణ. ఒకవేళ అది నిజమే అనుకున్నా, వైసీపీ గెలిచిన 151 స్థానాల్లో
నుంచి ఈ 31
సీట్లను మినహాయించి చూసినా 120 స్థానాలతో జగన్
పార్టీ విజయం తధ్యమని కొందరు ఆ వాదాన్ని పూర్వ పక్షం చేస్తున్నారు. అసలు ఈ ఎన్నికలలోనే
కాదు, మొత్తం ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఆదినుంచీ వివాదాస్పదంగాను,
అనుమానాస్పదంగానూ ఉంటూ వచ్చింది. మార్పుకోసం రాజకీయ రంగంలోకి దిగిన అద్భుత ఆకర్షణ
శక్తి కలిగిన ఆ యువ నటుడు తాను తొలిసారి పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయం పాలుకావడం
విషాదం. భవిష్యత్తులో ఇలా ఇతర రంగాల నుంచి కేవలం తమ వ్యక్తిగత ఆకర్షణను
పెట్టుబడిగా పెట్టుకుని రాజకీయాల్లో దిగేవారికి జనసేన ప్రయోగం ఒక హెచ్చరిక
లాంటిది.
ఒక స్థిరమైన రాజకీయ వైఖరి లేకుండా రాజకీయాల్లో
ప్రవేశిస్తే ప్రజలు ఆదరించరని పవన్ కళ్యాణ్ ఉదంతం మరోసారి స్పష్టం చేస్తోంది.
ఆంధ్రా ఆక్టోపస్ గా ప్రసిద్ధి చెందిన
లగడపాటి రాజగోపాల్ ఇకపై తాను ఎన్నికల ఫలితాలపై సర్వేలు చేయబోనని ప్రకటించారు.
కొద్ది మాసాల క్రితం తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలప్పుడు, తిరిగి తాజాగా ఏపీ ఎన్నికల
సమయంలోను తన సర్వే ఫలితాలు పూర్తిగా తప్పయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన
పేర్కొన్నారు. దీనివల్ల రాజకీయ పార్టీలు ఏమో కానీ బెట్టింగుల కారణంగా అమాయకులయిన
ప్రజలు నష్టపోయి, సంసారాలు వీధిన పడే ప్రమాదం ఓ మేరకు తగ్గుతుంది.
పొతే, ఈ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి
సాధించిన ఘన విజయాన్ని అంచనా వేయడానికి ఏ కొలమానాలు సరిపోవు. ఎన్ని ఒత్తిళ్ళు
ఎదురయినా, మరిన్ని ఒడిదొడుకులు ఇబ్బంది పెట్టినా, పరిస్తితులు ప్రతికూలించినా,
నలువైపుల నుంచి అన్ని రాజకీయ పార్టీలు కలసి, కలసికట్టుగా తనను, తన పార్టీని ఇబ్బందుల
పలు చేయాలని చూసినా, మీడియాలో సింహభాగం
కట్టు కధలతో, ఊహాగానాలతో ఊదరగొడుతూ ముప్పేట దాడిచేసినా జగన్ మోహనరెడ్డి మాత్రం
ఏమాత్రం చెక్కుచెదరలేదు. పదేళ్ళకు పైగా తాను
సాగిస్తున్న రాజకీయ పోరునుంచి వెనుతిరగలేదు. వెన్ను చూపలేదు. తండ్రి నుంచి
వారసత్వంగా పొందిన ‘మాట తప్పడు, మడమ తిప్పడు’
అనే సూత్రాన్ని అత్యంత నిబద్ధతతో పాటిస్తూ, పాదయాత్రల పేరుతొ వేలాది కిలోమీటర్లు
కాలినడకన తిరిగి, ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల సమస్యలను అనుక్షణం గమనిస్తూ,
అధికారంలోకి వస్తే వాటి పరిష్కారానికి ఏమి చేస్తే బాగుంటుందో ఆలోచిస్తూ దృఢ సంకల్పంతో,
మొక్కవోని స్థైర్యంతో సాహసానికి మారుపేరులా ఓ శిఖరంలా నిలబడ్డ ఆ ధీరోదాత్తుడికి
ప్రజలు సముచిత రీతిన కృతజ్ఞతలు తెలిపారు. నూతన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ఘన
విజయాన్ని గుదిగుచ్చి జగన్ మెడలో హారంగా వేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 151 సీట్లను వైసీపీ పార్టీకి కట్టబెట్టారు. ఎలాంటి
ప్రలోభాలు, ఏస్థాయి హామీలు కూడా తమ స్థిర సంకల్పాన్ని
చెదరగొట్టలేవని లోకానికి చాటి చెప్పారు. ఆ విధంగా ప్రజలు చేయాల్సింది
చిత్తశుద్ధితో చేసి చూపారు.
ఇక ఇప్పుడు బంతి జగన్ మోహన రెడ్డి
కోర్టులో వుంది.
గత అయిదేళ్ళ కాలంలో చంద్రబాబు చేసిన
పొరబాట్లు, తప్పిదాలు చేయకుండా వున్నా, లేదా వాటిని జాగ్రత్తగా సరిచేయగలిగినా, ఘన విజయం సిద్ధించిన వెంటనే
విలేకరులతో మాట్లాడుతూ వాగ్దానం చేసినట్టుగా జగన్ మోహనరెడ్డి ఆరు మాసాలలోపే మంచి
ముఖ్యమంత్రి అని ప్రజలచేత అనిపించుకుంటారు.
విజయం వినయాన్ని, అపజయం ఆత్మస్థయిర్యాన్ని పెంచాలని
పెద్దలు చెబుతారు.
జగన్, చంద్రబాబు ఇర్వురూ పెద్దలు
చెప్పిన ఈ మాట చెవినపెడతారని ఆశిద్దాం.
5 కామెంట్లు:
బాబు ఎంత దిగజారిపోయాడు. కోడికత్తి పార్టీ అని అవహేళన చేశాడు. ఈవిఎంలు అని దేశమంతా తిరిగి లొల్లి పెట్టాడు. ప్రధాని అన్న గౌరవం లేకుండా పచ్చ అనుకులమీడియాతో కలిసి విషయం కక్కాడు. కోడెల చింతమనేని బోండా .. ఇలాంటి దుర్మార్గుల్ని పెంచి పోషించాడు. అవినీతి కులపిచ్చి పచ్చమూకలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.
జగన్ పది సంవత్సరాలు ఒంటరిపోరాటం చేసి చరిత్రలో నిలిచిపోయేలా అద్భుత విజయాన్ని సాధించాడు.
వెన్నుపోటు యు టర్న్ బాబు కు ప్రజలు తగిన శాస్తి చేశారు.
బంతి జగన్ గారి చేతిలో ఉంది అంటున్నారు. నిజానికి బంతి కేసీఆర్ చేతిలో ఉంది. దాన్ని ఎప్పుడు ఎలా విసరాలీ అన్నది చెప్పే వాడు మోదీ. జగన్ కేవలం నిమిత్తమాత్రుడు. బంతిని తానే విసిరినట్లు నటించటం మాత్రమే అతని పని. అంధేరాప్రదేశ్ అనే ఆటస్థలంలో జరిగే ఈ పంచవార్షిక వినోద కార్యక్రమాన్ని యావద్భారతమే కాదు యావత్తు ప్రపంచమూ తిలకించి పులకరించ వలసిందే!
"ఉమ్మడి రాష్ట్రంలో నాటి టీడీపీ అధినేత ఎన్టీరామారావు ప్రజోపకరమైన అనేక పధకాలను ప్రవేశ పెట్టారు. రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించారు"
మీరు ఆ సమయంలో మాస్కోలో ఉన్నారేమో?
రామారావు పాలన ఇప్పటి చంద్రబాబు హయాము కంటే కూడా ఘోరమయిన పీడకల. అర్ధరాత్రి విచిత్రవేషగాడి తరహాలో వికృతచర్యలు, స్థాయి దిగజారి తైతెక్కలు, రోడ్డు మీద పడుకోవడాలు లాంటి వ్యక్తిగత విషయాలను ఇప్పటికి వదిలేద్దాం. అల్లుళ్ళ అవినీతి పరాకాష్ట, అస్తవస్త్యమయిన పరిపాలన, కారంచేడు వగైరా దమనకాండలు, ఉద్యోగులపై దాష్టీకం, క్షామంతో కుదేలయిన గ్రామీణ వ్యవస్థ, మత/కుల కల్లోలాలు, నల్లపురెడ్డి లాంటి మహనీయునికి అవమానం ఇంకా ఎన్నెన్నో ఘోరాలు జరిగాయి.
"సహజంగానే పరాజయానికి పలు కారణాలు వుంటాయి. కారణాలు ఏమైనా ఇందుకు ప్రధాన బాధ్యత పార్టీ అధినాయకుడిదే అవుతుంది"
"అధినేత ఆలోచనలను తీసుకెళ్లలేకపోయాం": తెదేపా ఎమ్మెల్సీ డొక్కా
https://www.eenadu.net/newsdetails/16/2019/05/27/104147/TDP-MLC-Dokka-Pressmeet
ఈ యవ్వారం చూస్తే ఆ నమ్మకం కలుగుతుందా?
వేమూరి రాధాకృష్ణ వారాంతపు "చెత్త పలుకు"లో చంద్రబాబు పాలన అద్భుతం, అతగాడు పార్టీ నాయకుడిగా మాత్రమే వైఫల్యం చెందాడని వాపోయాడు.
తటస్థ "మేధావి" ముసుగులో తిరిగే ఇంకో రహస్య అసమదీయుడు లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ్ పచ్చపార్టీ ఓటమి పాపమంతా జన్మభూమి కమిటీలదే అంటూ కితాబులు ఇచ్చాడు.
మొఖం మీదున్న మరక అద్దాన్ని తుడుపేస్తే పోదన్న ఘాలిబ్ సూత్రం వీళ్లకు ఎప్పుడు అర్ధం కావాలి?
అప్పట్లో మోడీ చంకనెక్కి పవన్ కళ్యాణ్ ఊకదంపుడుతో బొటాబొటీగా గెలిస్తే అంతా బాబోరి ఘనత అంటూ టాంటాం చేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల రణరంగంలో చావుదెబ్బలు తిన్నా ఇందులో అయ్యగారి తప్పేమీ లేదనీ, మోడీ/కెసిఆర్/పవన్/ఎన్నికల సంఘం/విశాఖ స్వామి వగైరాల చలువని వంధిమాగధులతో చాటిస్తున్నాడు.
వచ్చే ఏడాది మళ్ళీ "హిల్లరీ క్లింటన్ ప్రమాణస్వీకారానికి నిప్పు గారి ప్రయాణం" లేదా "హిల్లరీ గెలుపుకు ముఖ్యకారణం బాబోరే" అంటూ నిస్సిగ్గుగా కులమీడియాతో రాయించుకున్నా ఆశ్చర్యం లేదు.
మహాభారతం లో కురుపాండవ విద్యా ప్రదర్శన ఘట్టం చూసి ఇంటికి వెళ్తున్న ప్రజల్లో కొందరు అర్జునుడినీ కొందరు దుర్యోధనుడినీ కొందరు కర్ణుడినీ ఇలా ఎవరికి నచ్చినవారిని వారు పొగుడుకుంటూ వెళ్ళారట. లోకులు పలు కాకులు అని వ్యాసులవారు ఆనాడే చెప్పారు.
అలాగే ఇప్పుడు ఆంధ్రలో జరిగింది ఒకే ఘటన. అది అధికార మార్పిడి.
తెదేపా వీరాభిమానులకు ఈ సంఘటన "బాహుబలిని చంపి భళ్ళాలదేవుడు రాజ్యం హస్తగతం చేసుకున్నట్లు" కనిపిస్తుంది.
వైకాపా వీరాభిమానులకు మాత్రం "భళ్ళాల దేవుడిని తుదముట్టించి మహేంద్రుడు రాజ్యం గెలుచుకున్నట్లు" కనిపిస్తుంది.
జరిదింగి కేవలం ఒకే సంఘటన. చూసే విధానమే వేరు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి