5, ఏప్రిల్ 2016, మంగళవారం

బంగారు తెలంగాణాకు ఐటీ తాపడం

సూటిగా.....సుతిమెత్తగా....... 




   హైదరాబాదు నగరంలో మధ్యాన్నం నలభయ్ మూడు డిగ్రీల ఎండ ఎడాపెడా పేల్చివేస్తున్న వేళ, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో తెలంగాణా  నూతన ఐటీ విధాన ఆవిష్కరణ నవనవోన్మేషంగా జరిగింది.  ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్  వ్యవస్థాపకులు  నారాయణ మూర్తితో సహా ఐటీ రంగంలో మేటి అనిపించుకుంటున్న అనేక సంస్థల అధిపతులు ఈ కార్యక్రమానికి హాజరై  నూతన తెలంగాణా రాష్ట్రంలో ఈ రంగం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని క్లుప్తంగా చేసిన తమ ప్రసంగాలలో హామీలు ఇచ్చారు.  ఐటీ రంగ అభివృద్ధికి అనేక విలువైన సూచనలు కూడా చేశారు. వారికంటే కూడా సంక్షిప్తంగా ప్రసంగించిన తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు,  ‘ఇబ్బందులు లేని, ఇబ్బందులు పెట్టని, ఎలాటి బాదరబందీ లేని  ఐటీ విధానాన్ని’ రూపొందించినట్టు చెప్పారు. ‘పారిశ్రామికవేత్తలకి కాలయాపన జరగకుండా సింగిల్  విండో ద్వారా అన్ని అనుమతులు సకాలంలో  మంజూరు చేస్తామని చెబుతూ, తనదయిన శైలిలో, ఈ విండో ‘ఊచలు లేని కిటికీ’ అంటూ చమత్కరించారు. నిరుడు ప్రవేశపెట్టిన ‘పదిహేను రోజుల్లోనే అనుమతులు’ అనే తమ నూతన పారిశ్రామిక  విధానం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని చెబుతూ, ఇప్పటివరకు 1691 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా వాటిల్లో  883 పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.    
తెలంగాణా ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆయన సారధ్యంలో పనిచేసిన ఐటీ మంత్రిత్వ శాఖ  బృందం, ఈ  కార్యక్రమ నిర్వహణలో  కొత్త పుంతలు తొక్కింది. తెలంగాణా ప్రాంతంలో తయారయిన  ఎల్ ఈ డీ బల్బులు  విరజిమ్మిన వెలుగులతో  అలరారిన రాష్ట్ర పఠoతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని పూర్తిచేయడం, అలాగే ఐటీ పారిశ్రామిక విధానానికి సంబంధించిన బ్రోచర్ ను స్థానికంగా రూపొందించిన రోబో ద్వారా వేదికమీద వున్న గవర్నర్ కూ, ముఖ్యమంత్రికి అందచేయడం, ఇవన్నీ కొత్త రాష్ట్రాన్ని ఐటీ మెరుగులతో ప్రకాశింప చేయాలనే ప్రభుత్వ ధ్యేయానికి అద్దం పడుతున్నాయి.
ప్రధాన విధాన ప్రకటనకు అనుబంధంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా పది అంశాల ఎజెండాని కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా విడుదల చేసింది. ప్రపంచ ఐటీ పఠంలో ప్రస్తుతం హైదరాబాదుకు వున్న స్థానాన్ని మొత్తం తెలంగాణకు విస్తరించాలన్న ధ్యేయం కొనియాడదగ్గది. యావత్  కేంద్రీకరణ హైదరాబాదు కేంద్రంగా గతంలో జరగడం వల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు అభివృద్ధి పధంలో పోటీపడలేకపోయిన వాస్తవం మరవతగ్గది కాదు. తెలంగాణా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన  చేస్తుండడం  ముదావహం. తద్వారా గ్రామీణ ప్రాంతాలలోని యువజనులకు సరికొత్త అవకాశాలు లభిస్తాయి, ఉపాధిపరంగానే కాదు, ప్రతిభను ప్రదర్శించుకోవడానికి కూడా.  
ఈ కొత్త విధానంలో అనేక లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.  రానున్న అయిదేళ్ళ కాలంలో ఏటా ఇరవై అయిదు వేల మంది చొప్పున మొత్తం లక్ష మంది ఐటీ నిపుణులను సిద్ధం చేయడం, తెలంగాణా కాలేజీల నుంచి ఐటీ కంపెనీలు కొత్తగా  ఉద్యోగాల్లోకి తీసుకునేవాళ్ళలో ఇరవై మందికి వేతనాల విషయంలో ఆర్ధిక సాయం అందించడం, ఐటీ హబ్ లను ద్యితీయ శ్రేణి నగరాలకు విస్తరించడం ఇలాటివి వాటిల్లో వున్నాయి.
ఈ కార్యక్రమంలోనే 28 కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇవి కార్యరూపం దాలిస్తే రెండువేల ఏడువందల కోట్లు పెట్టుబడుల రూపంలో రావడమే కాకుండా కొత్తగా పాతిక వేల మందికి ఉద్యొగాలు లభించే అవకాశం వుంది. ఇదొక శుభపరిణామం.
విధాన రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు, మరెంతో  కసరత్తు చేసినట్టు ఆ పత్రాలను ఓసారి  తిరగేస్తే తేలిగ్గా  అర్ధం అవుతుంది. కార్యక్రమానికి హాజరయిన  గవర్నర్ నరసింహన్, ఇతర ఐటీ రంగ ప్రముఖులు  సభావేదిక నుంచి చేసిన మెప్పుకోళ్ళు కూడా ఇందుకు రుజువు.
అసందర్భం  అనిపించవచ్చు కానీ ఈ సందర్భంగా ఓ మాట చెప్పుకోవాలి.
ఐటీ అనగానే గుర్తు వచ్చే పేరు చంద్రబాబునాయుడు. ఆయనకా పేరు స్థిరపడి పోయింది. ఆ  ఖ్యాతిని తన ఖాతాలో వేసుకోవడానికి కేసీఆర్ ఇలా ఐటీకి పెద్దపీట వేస్తున్నారని సోషల్ మీడియాలో కొన్ని చౌకబారు వ్యాఖ్యానాలు వస్తున్నాయి.  వీటికి ఆధారం లేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా  విడిపోగానే హైదరాబాదు చుట్టుపక్కల వెలసిన ఐటీకంపెనీలన్నీ పెట్టీ బేడా సర్దుకుని బిచాణా ఎత్తివేస్తాయని ఆరోజుల్లో చెలరేగిన ఊహాగానాలన్నీ ఉట్టివే అని తేలిపోయింది.  ఒక్కటంటే ఒక్క  పరిశ్రమ కూడా తెలంగాణా సరిహద్దులు దాటి బయటకు వెళ్ళలేదు. కాకపొతే,  కొత్తవాటిని ఆకర్షించడానికి తెలంగాణా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ విధాన ప్రకటనను అర్ధం చేసుకుంటే  బాగుంటుందేమో. మొన్నటికి మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పవర్ పాయింటు  ప్రెజెంటేషన్, మళ్ళీ రోజులు తిరక్కుండానే అట్టహాసంగా చేసిన ఈ ఐటీ విధాన ప్రకటన ఈ వదంతులకు కారణం అయివుంటాయి.
అయితే ఒక విషయం. యువకుడు, సమర్దుడు అయిన  కే.తారక రామారావు ఈ శాఖకు మంత్రిగా వున్నారు. సంభాళించుకుని రాగల అధికారులు, సిబ్బంది ఆయనకు తోడుగా  వున్నారు. విధాన రూపకల్పనలో వారు  పడిన శ్రమ  అభినదనీయం. కానీ, వాళ్ళు నిర్వర్తించాల్సిన బాధ్యత మరొకటి వుంది.
ఐటీ  అనగానే  ఇదేదో సంపన్నుల వ్యవహారం అనే అపోహ వుంది. ల్యాప్ టాపులు తగిలించుకుని, టిప్ టాపుగా తిరిగే వాళ్ళు, వాళ్ళు సంపాదించే లక్షల వేతనాలు,  ఆ డబ్బును ఖర్చు చేయడానికి  పబ్బులూ, క్లబ్బులూ, విలాసవంతమైన మాళ్ళూ, మల్టీ ప్లెక్స్  సినిమా హాళ్ళూ – ఇలా ఐటీ మొత్తం కలవారి జాగీర్దారీ  అనే అపప్రధ కూడా వుంది. నిజానికి ఐటీ వల్ల మేలు జరిగేది సామాన్యులకే. ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పని లేకుండా ఐటీ సాయంతో ప్రభుత్వాలు  చేయగలిగితే అంతకంటే కావాల్సింది ఏమీ వుండదు. సామాన్యులు, రైతులు, రైతు కూలీలు ఎదుర్కుంటున్న రోజువారీ సమస్యలకు ఐటీ ద్వారా పరిష్కార మార్గాలు కనుగొనగలిగితే ఈ విధానం  సంపూర్ణంగా సార్ధకం అవుతుంది. చిన్న చిన్నగా కనపడే చిన్న చిన్న స్టార్ట్ అప్  కంపెనీలే  ఈ పరిష్కారాలను సమర్ధవంతంగా చూపగలుగుతాయి. ఆ కోణంలో మంత్రి బృందం దృష్టి పెట్టాలి. ఇందుకోసం పెద్ద శ్రమ అక్కరలేదు. సమస్యను చెబుతూ పరిష్కారం చూపమని కోరుతూ సలహాలు సూచనలు స్వీకరించి, వాటిని  పరిశీలించేందుకు నెలకో రెండు రోజులు క్వాలిటీ టైం కేటాయించగలిగితే ఆ చిన్ని కంపెనీలకి ప్రయోజనం, ప్రభుత్వానికి పరమార్ధం రెండూ సిద్ధిస్తాయి.    
పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద కార్యాలయాలు తెరవడం వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేమాట నిజమే. వారికి కూడా పెద్ద పెద్ద జీతాలు వచ్చే మాటా నిజమే. కానీ ఆ పెద్ద  కంపెనీలకు  హైదరాబాదు వంటి పెద్ద నగరమే కావాలి. చిన్న ఊళ్ళు వాటి కంటికి ఆనవు. ఎంతో పెద్ద అర్హతలు వుంటే కానీ ఆ కంపెనీల్లో కొలువులు దొరకవు. అభిరుచి వుండి, మంచి ఆలోచనలు వుండి, సిబ్బందికి పెద్ద జీతాలు ఇచ్చుకోలేని చిన్న చిన్న స్టార్ట్ అప్  కంపెనీలు  పెద్ద వాటితో  పోటీకి తట్టు కోలేక బోర్డులు తిప్పేస్తున్నాయి. వీటిని స్థాపించేవారికి సరికొత్త ఆలోచనలు వుంటాయి. ఐటీని ఎలా వాడుకుంటే సామాన్యుల జీవితం సజావుగా సాగుతుందో వారు ఆలోచిస్తుంటారు. వారివద్ద  ఐడియాలు వుంటాయి కానీ తగిన పెట్టుబడీ వుండదు, అవసరమైన మార్కెటింగు అవకాశాలు వుండవు. ప్రపంచ ప్రసిద్ధ  ఐటీ దిగ్గజం ‘గూగుల్’ పుట్టుక కూడా ఒక కారు షెడ్డులో  అన్న సంగతి గమనార్హం.
ఇటువంటి చిన్న కంపెనీల వారి ఉత్పత్తులకు   వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అవకాశాలు కల్పించి  ప్రోత్సహించగలిగితే  బ్రహ్మాండమయిన ఫలితాలు వస్తాయి. ప్రతి చిన్న పట్టణంలో ఎన్నోకొన్ని  చిన్న చిన్న స్టార్ట్ అప్ ఐటీ కంపెనీలు వస్తే,  స్థానికంగా చిరు నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. పాతిక ఇరవై మంది సిబ్బందితో నడిచే కంపెనీల వల్ల చిన్న చిన్న ఊళ్ళ స్వరూపం కూడా అద్యతన కాలంలో గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. హైదరాబాదులో ప్రభుత్వ రాయితీలతో నెలకొల్పే పెద్ద పెద్ద కంపెనీలను, ఈ చిన్న వాటిని దత్తతకు తీసుకునేలా ఒప్పించగలిగితే వాటి మనుగడకు తిరుగుండదు.  జీవన వ్యయం హైదరాబాదుతో పోల్చుకుంటే తక్కువ కాబట్టి పెద్ద జీతాలు ఇవ్వాల్సిన అవసరం వుండదు. అయితే అదే సమయంలో ఇటువంటి చిరుద్యోగులు పెరగడం వల్ల చిన్న ఊళ్ళల్లో సైతం డబ్బు చెలామణీ పెరుగుతుంది. వారి అవసరాలకు తగ్గట్టుగా వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆర్ధికంగా ఆ ప్రాంతాలు బలపడతాయి. అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా అవకాశాలు అన్ని ప్రాంతాల వారికీ దక్కుతాయి. పురోభివృద్ధి సమతుల్యంగా సాగుతుంది.  తెలంగాణాలో అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయి. వాటి ఆర్ధిక పరిపుష్టి పెరుగుతుంది.  తెలంగాణలో ఒక్క హైదరాబాదే కాదు అటువంటివి అనేకం వున్నాయి అని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది. బంగారు తెలంగాణాకు ఐటీ తాపడం అంటే ఇదే!
అయితే, ఇలా చేయగలిగిన సత్తా ఒక్క ఏలికల చేతుల్లోనే వుంది. (05-04-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595