(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 29-10-2015, THURSDAY)
సూటిగా .....సుతిమెత్తగా .....
సూటిగా .....సుతిమెత్తగా .....
దుష్ట శక్తుల
పీడలు సోకకుండా వుండడానికి కొందరు తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు.
ఇప్పుడు రాజకీయం అలాటి
రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే
చట్టాలు, నియమ
నిబంధనలు, రాజకీయ
నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు, సాధారణ ప్రజలనే కాదు, ఇంట్లో, వొంట్లో పుష్కలంగా వున్న ఖామందులు, శ్రీమంతులు, నటులు, కళాకారులు, చివరాఖరుకు జర్నలిస్టులు
అందరూ వున్నారు. వీరిలో కొందరికి వారి వారి తాహతునుబట్టి కొన్ని కొన్ని ప్రత్యేక సదుపాయాలూ, సామాజిక గౌరవాలూ లభిస్తూ
వున్నప్పటికీ, రాజకీయ నాయకులతో పోలిస్తే
తక్కువే.
లక్షల్లో అభిమానులూ, కోట్లల్లో డబ్బులూ వున్న
సినీ నటులు కూడా రాజకీయ రంగు పూసుకోవడం కోసం వెంపర్లాడేది
అందుకే. కోట్లకు పడగెత్తిన శ్రీమంతులు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న బడాబాబులూ తాము
సంపాదించుకున్నదాన్ని కాపాడుకోవాలంటే రాజకీయం అనే రక్షరేకు తమకు వుండి
తీరాలి అనే నిర్ధారణకు వస్తున్నారు. రాజకీయం, ప్రజాసేవ అనేవి అసలు పొసగని
వాళ్లు కూడా డబ్బు వెదజల్లయినా ఏదో ఒక నామినేటేడ్ పదవిలోకి
దూరిపోవాలని
దూరాలోచనలు చేసేది అందుకే.
ఒక సినీ నటుడు వుంటాడు.
ఏవిధంగా చూసినా కొదవలేని జీవితం. సంఘంలో గౌరవం, ఎక్కడకు వెళ్ళినా పరపతి, ఒక్కసారి పలకరించినా చాలు పులకరించిపోయే జనాలు. కానీ ఏం లాభం ? ఆదాయపుపన్ను శాఖకు చెందిన
చిరుద్యోగి ఇంటికి వచ్చాడంటే చాలు, ఎన్ని ఎయిర్
కండిషన్లు వున్నా కూడా చిరుచెమటలు
పట్టాల్సిందే.
ఒక వ్యాపారవేత్త వుంటాడు.
నేల నాలుగు చెరగులా విస్తరించిన వ్యాపారాలు. ఎక్జిక్యూటివ్ తరగతిలో విమాన
ప్రయాణాలు, స్టార్
హోటళ్ళలో బసలు, నెలకు
లక్షల్లో జీతాలు తీసుకునే సిబ్బంది. ఏం సుఖం? పనిమీద సచివాలయానికో, ప్రభుత్వ కార్యాలయానికో
వెడితే పదివేల ఉద్యోగికి కూడా తీసికట్టే.
ఒక స్మగ్లర్ వుంటాడు.
ప్రాణానికి వెరవని వందల గూండాలు వెంట వుంటారు. కుక్కని కొట్ట కుండానే డబ్బు
రాశులు రాసులుగా రాలిపడుతుంది.
ప్రపంచంలోని సుఖాలన్నీ కాళ్ల చెంత వుంటాయి. ఏం ప్రయోజనం? రోడ్డు మీద పోలీసు కనబడితే
భయపడే పరిస్తితి.
మరొకడు వుంటాడు. అతడు
కళాకారుడు కాదు. విద్యావంతుడు కాదు. డబ్బున్నవాడు కాదు. పేరున్నవాడు కాదు. కానీ, అన్ని ప్రభుత్వ
కార్యాలయాలకే కాదు ముఖ్యమంత్రి ఆఫీసుకే కాదు ఆఖరుకు సాధారణ జనాలు గడప తొక్కడానికి
సందేహించే పోలీసు ఠాణాలకు సైతం వేళాపాళా లేకుండా వెళ్ళగలడు. కింది స్తాయి నుంచి పై
స్తాయి అధికారివరకు తలుపులు తోసుకుని వెళ్ళగలడు. పనిచేసి తీరాలని పట్టుపట్టగలడు.
ఒక్క మనిషికి కూడా అధికారిక ప్రవేశం లేని చోట్లకు పదిమందిని
వెంటేసుకు వెళ్ళగలడు. అతడే రాజకీయ నాయకుడు.
చట్టం తనపని తాను
చేసుకుపోతుందనేది పడికట్టుమాట. చట్టం ఎవరిపట్ల యెలా తన పని చేయాలో నిర్దేశించే మీట
మాత్రం రాజకీయనాయకుల చేతిలో వుంటుంది. అతడు బిగువు వొదిలితే
చట్టం పనిచేసే వేగం కుందేలు పరుగులా పెరుగుతుంది. పగ్గం బిగిస్తే చట్టం వడి తాబేలు
నడకలా మందగిస్తుంది. అదీ రాజకీయానికి వున్న పవర్. ఎందుకని అడిగేవాడు లేడు.
చట్టం చేతులు చాలా పొడుగు
అనే పొడుగాటి డైలాగులు రాజకీయ నాయకులకు వర్తించవు. వారి జోలికి వెళ్ళడానికి
పోలీసులు జంకుతారు. మామూలుమనిషిని అరెస్టు చేయడానికి, పోలీసు స్టేషనుకు
రప్పించడానికి వుండే నియమాలు, నిబంధనలు, ఖాకీ
దర్పం రాజకీయ నాయకుల విషయంలో హాం ఫట్, హుష్ కాకీ. అధవా గత్యంతరం
లేక అరెస్టు చేయాల్సిన పరిస్తితే వస్తే
వారికి ఆకస్మిక అనారోగ్యం ఎక్కడినుంచో వూడిపడుతుంది. మామూలు మనిషయితే ‘బాగు
చేయిస్తాం రా’ అని స్టేషనుకు లాక్కెళ్లి మక్కెలు విరగబొడుస్తారు. నాయకుల విషయం
వచ్చేసరికి నిబంధనలన్నీ కట్టగట్టుకుని గాలికి
ఎగిరిపోతాయి.
రాజకీయం అనే రక్షరేకు వల్ల
ఇన్ని లాభాలు వుండడం వల్లనే సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు పొలోమని ఆ దారులవెంట
పరుగులు తీస్తున్నారు. ఏదో ఒక పార్టీ గొడుగు కింద వుంటే
చాలు ఏవీ లేకపోయినా అన్నీ వున్నట్టే లెక్క. అలా అని హోల్ మొత్తంగా రాజకీయ
నాయకులందరూ ఇలాగే ఉంటారా, వాళ్ళల్లో మంచివాళ్ళు లేరా అంటే ఎందుకు లేరు? గతంలో
వున్నారు. ఇప్పుడూ వున్నారు. ఇకముందూ
వుంటారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అలాటి వారి సంఖ్య క్రమంగా
పలచపడిపోతోంది.
అన్ని రంగాల్లో మాదిరిగానే, ఇప్పుడు
రాజకీయాల్లోకి యువరక్తం చేరుతోంది. రిజర్వేషన్ల పుణ్యమా అని శాసన సభల్లో బడుగు
బలహీన వర్గాల ప్రాతినిధ్యం పెరుగుతోంది. చదువుకున్న వారు, మంచి
విద్యార్హతలు వుండి కూడా వేరే ఉద్యోగ వ్యాపకాల్లో చేరకుండా రాజకీయ రంగం పట్ల
ఆసక్తి పెంచుకునే విద్యాధికుల సంఖ్య గణనీయంగానే ఉంటోంది. నిజానికివన్నీ ఆహ్వానించ
తగ్గ పరిణామాలు. అసలు ఈనేపధ్యంలోనే ముందు పేర్కొన్న రాజకీయ అవలక్షణాలను అంతగా
ఉదహరించింది. ఎందుకంటే ఈ విపరీత ధోరణులను కొత్తగా రాజకీయ రంగప్రవేశం చేస్తున్న
యువకులు, విద్యాధికులు, మహిళలు గుర్తించి వాటికి దూరంగా మసలుకోవడం
అలవరచుకోవాలి. లేని పక్షంలో ఇటువంటి నిందలను వాళ్ళు కూడా మోయాల్సివస్తుంది.
దేశంలో స్వార్ధ రాజకీయ శక్తులకు కొదవలేదు. అయినా కానీ, మన ప్రజాస్వామ్య వ్యవస్థ చెక్కుచెదరకుండా వుంది.
పడ్డ పునాదులు అంత బలిష్టంగా, పటిష్టంగా ఉన్నాయనుకోవాలి. అది ప్రజలు చేసుకున్న
అదృష్టం.
రాజకీయ వ్యవస్థకు చెదలు పట్టనంత
కాలం ప్రజల భద్రతకు ధోకా వుండదు. ఆ వ్యవస్థను కాపాడుకోవడం అందరి బాధ్యత. అయితే
ఇందులో సింహ భాగం రాజకీయులదే అనడంలో సందేహం లేదు.
రాజకీయం అనేది దేశానికి
రక్షరేఖగా వుండాలి కాని, ఎవ్వరో కొందరు రాజకీయ నాయకులకి కాదు. (28-10-2015)
3 కామెంట్లు:
పునర్ముద్రితంలా ఉంది.
సూపర్ :)
రాజకీయం అనేది దేశానికి రక్షరేఖగా వుండాలి కాని, ఎవ్వరో కొందరు రాజకీయ నాయకులకి కాదు.
చీర్స్
జిలేబి
@విన్నకోట నరసింహారావు - Second Release
కామెంట్‌ను పోస్ట్ చేయండి