29, డిసెంబర్ 2020, మంగళవారం

రజనీకాంత్ – భండారు శ్రీనివాసరావు

 

ఉదాత్తమైన మనిషి. ఇటువంటి మనిషి రాజకీయాల్లో నెగ్గుకు రావడం ఎల్లా అని అనుకున్నవాళ్ళు చాలామంది వున్నారు. అలాంటి వారికి రజనీకాంత్ తీసుకున్న నిర్ణయం ఓ ఊరట.

రజనీ పార్టీ పెట్టాలనే నిర్ణయం ఎప్పుడో  జరిగిపోయింది. ఈనెల  ముప్పయి ముప్పయి ఒకటో తేదీ ముహూర్తం కూడా ఖరారు అయింది. ఇంతలో యాంటీ క్లైమాక్స్ మాదిరిగా మూడు పేజీల ప్రకటన. అదనంగా ఓ ట్వీట్. క్లుప్తంగా చెప్పాలంటే  రాజకీయ రంగ ప్రవేశం విషయంలో రజనీకాంత్ యూ టర్న్.

సరైన సమయంలో కాకపోవచ్చు కానీ సరైన నిర్ణయం. సందేహం లేదు.

నిన్న  కాక మొన్న హైదరాబాదులో సినిమా షూటింగులో  ఆకస్మిక అనారోగ్యానికి గురై ఆఘమేఘాల మీద  అపోలో ఆసుపత్రిలో చేరి, అక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో పూర్తి విశ్రాంతి అవసరమని  వైద్యులు ఇచ్చిన  సలహా కావచ్చు, ‘నువ్వు చేయాల్సింది వేరే వుందని’ ఆయన ఎంతగానో విశ్వసించే ఈశ్వరుడి నుంచి అందుకున్న ఆదేశం కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఒత్తిడి కావచ్చు, షూటింగ్ సమయంలో కొందరు కోవిడ్ బారిన పడడం గమనించి రాజకీయాల్లో చురుకుగా వుంటే ఇంకా మరికొందరు అమాయకులు ఈ వ్యాధికి బలిపశువులు అవుతారేమో అనే భయం కావచ్చు, మొత్తానికి ఏదైతేనేం రజనీకాంత్ తన రాజకీయ అరంగేట్రం నుంచి  తనకు తానుగానే తప్పుకున్నారు.

తమిళనాడులో రజనీకాంత్ అనే వ్యక్తి కేవలం ఓ సినీ నటుడు మాత్రమే కాదు. డబ్బు, సంపాదనవంటి వాటికి అతీతంగా ఆలోచించే మంచి మనసున్న మనిషి అనే అభిప్రాయం ప్రబలంగా వుంది. అందుకే ఆయన మాట అంటే అంత గురి.

1996 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ఒక చిన్న  ప్రకటన చేశారు. అది తమిళనాట రాజకీయాల మీద తీవ్ర ప్రభావం చూపింది.

“ఈసారి జయలలిత నాయకత్వంలోని ఏ.ఐ.డి.ఎం.కె. గెలిచి అధికారంలోకి వస్తే ఇక తమిళనాడు రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడు”

రజనీకాంత్ ఈ డైలాగ్ ని అక్కడి ఓటర్లు ఎంత సీరియస్ గా తీసుకున్నారంటే ఆ ఎన్నికల్లో జయలలితకు ఘోర పరాజయం ఎదురయింది. మొత్తం 234 సీట్లలో  ఆమె పార్టీకి కేవలం నాలుగంటే నాలుగే స్థానాలు లభించాయి. రజని అప్పటికి రాజకీయాల్లో లేరు. అయినా ఆయన మాట జనంలో కరెంటులా పాకిపోయింది. అదీ ఆయనకు వున్న అపరిమితమైన ఆకర్షణ శక్తి.   అయితే సినీ కళాకారులకు అదే ఆదరణ ఎల్లవేళలా ఉంటుందనే గేరంటీ లేదు. అలాగే వాళ్ళు తమ రాజకీయ అభిప్రాయాలపై అలాగే నిలబడుతారని కూడా అనుకోలేం.

ఇందుకు ఉదాహరణ కూడా మళ్ళీ ఆయనే కావడం ఓ విచిత్రం.  మళ్ళీ ఆ తర్వాత జరిగన అసెంబ్లీ ఎన్నికల్లో  జయలలిత గెలిచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఇదే రజనీకాంత్ అన్నమాట ఏమిటో తెలుసా. “జయలలిత సాధించిన ఈ అపూర్వ విజయం తమిళనాడును కాపాడింది”

రాజకీయ రంగ ప్రవేశం చేయరాదని నిర్ణయించుకున్న రజనీకాంత్ ఉదంతం నుంచి నేర్చుకోవాల్సిన నీతి పాఠం ఒకటుంది.

చాలామంది తమతమ రంగాల్లో విశేష కృషి చేసి జనబాహుళ్యంలో అత్యంత ఆదరణ చూరగొన్న తర్వాత రాజకీయాల్లోకి రావడం ఈ మధ్య పరిపాటిగా మారింది.

“మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏమిటి” అని ఎవరైనా అడిగారు అనుకోండి. వాళ్ళ నుంచి తడుముకోకుండా వచ్చే జవాబు ఒక్కటే.

“ప్రజాసేవ చేయాలని పార్టీ పెట్టాను లేదా ప్రజాసేవ చేయడం రాజకీయాల్లోనే సాధ్యం”

నిజంగా ప్రజాసేవ చేయాలి అనే చిత్తశుద్ధి వుంటే రాజకీయాలు ఒక్కటే  గత్యంతరమా!

స్వామి వివేకానంద, మదర్ థెరిస్సా ఏ రాజకీయాలు నడిపారు?

జీవితంలో సాధించాల్సింది, సంపాదించాల్సిందీ అంతా పూర్తి చేసుకుని అప్పటివరకు సంపాదించిన పేరు ప్రఖ్యాతులని పెట్టుబడిగా పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు,  ‘ఏదో పొడిచేస్తారు, ఉద్దరిస్తారు’  అనుకుంటే అలా అనుకున్నవాళ్ళదే పొరబాటు.

ఏమైనా ఒక మంచి మనిషి రాజకీయ కుడుద్ధంలో పడకుండా రజనీ నమ్ముకున్న ఆ ఈశ్వరుడే కాపాడాడు అనుకోవాలి. (29-12-2020)             

    

ఇదో తుత్తి – భండారు శ్రీనివాసరావు

 Bezavada

I received some comments from few stalwarts on my Bezavada article, which I want to share with you.

Shri M.V.S. Prasad, (I.A.S.) Former TTD EO

Srinivasarao garu.

Your article on Bezavada is delightful analysis. Enjoyed it. Reading all those names gladdens my heart no end. However, I had a vague feeling that you had reservations about reckoning some facts. The names you mentioned were leaders in the society of the day. They were ‘educated’ in those days when being educated meant you are civilized . On the top of it, 90% of those stalwarts were born in in a caste which has ‘ahimsa’ ingrained in them. When those circumstances do not exist today, the leadership lacking the sensibility of civilized behaviour is it not beyond expectation. Bygones are bygones.

 

Shri L.V. Subramanyam,  (I.A.S.)  Former Chief Secretary

Thanks for the wonderful piece. Revealing. I will ask concerned fellows to preserve and re-use it. Good Day.

 

Shri R.Seetarama Rao (IPS), Former Chairman, AP Police Housing Corporation

"Excellent. A bird's eye view of Blazevada. Those memories haunt me also. But those are related to my profession and better forgotten."

 

Maha News Former  Editor Shri I. Venkata Rao

Srinivasarao garu! 

You have brought back so many memories to life with your article on Bezavada. For many it is a villain. But you have shown the heroic side of Bezavada. I appreciate it. Thank you.

 

Dr. N.Bhaskara Rao, Chairman, Center For Media Studies (CMS), Delhi.

Adbhutam Srinivasa Rao garu. Thanks for reminding how significant and great Bezavada, has been. It is shame no one has reflected magnificently you have recalled. I share the anguish for I studied there lead student movements there 1956 -57. And I had good fortune there after having association of some stalwarts of Bezavada.

 

Journalist Vikram (Former media adviser to Prajarajyam Party)

As I hailed and brought up in Vijayavada. I always feel proud about it. Bhandaru Srinivasa Rao garu wrote excellently about it’s uniqueness. It is amazing that he even mentioned about PALANI vibhoodi near CVR school. Excellent retaining capacity. Thanks to BS garu for taking me down the memory lane.

 

Addanki Krishna:

బెజవాడ గురించి ఇంత గొప్ప ఆర్టికిల్ నేను ఇంతవరకు చదవలేదు. నిజంగా గ్రేట్. ధన్యవాదాలు.

 

24, డిసెంబర్ 2020, గురువారం

రైల్లో ఫైల్స్ క్లియరెన్స్


1975 లో నేను హైదరాబాదు ఆలిండియా రేడియో వార్తా విలేకరిగా చేరినప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. ఎమర్జెన్సీ టైం ముఖ్యమంత్రి అని పేరు. ఇంటాబయటా (ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో) ఆటుపోట్లు లేని రోజులు కాబట్టి ఆయన పరిపాలన నల్లేరు మీది బండిలా సాగింది.

ఇప్పుడు ముఖ్యమంత్రులను  కలవడం అంటే బ్రహ్మ ప్రళయం అంటుంటే వింటున్నాను. ఆ రోజుల్లో అలా సచివాలయంలో కలయ తిరుగుతూ ముఖ్యమంత్రి ఛాంబర్ వైపు వెడితే ప్రకాశరావు గారు చిరునవ్వుతో పలకరించి సీ ఎం ని కలుస్తారా అని అడిగేవారు. ప్రకాశరావు గారు వెంగళరావు గారి పీ ఎస్.

‘అబ్బే పనేమీ లేదండీ అంటుండగానే ఆయన లోకయ్యా అని పిలిచేవారు. తెల్లటి దుస్తుల్లో వున్న సీ ఎం అటెండర్ లోకయ్య ఛాంబర్ తలుపు తీసి లోపలకు వెళ్ళమనే వారు. వెంగళరావు గారు ఒక్కరే కుర్చీలో కూర్చుని రొటీన్ ఫైల్స్ మీద సంతకాలు చేస్తూ కనిపించేవారు.

‘శ్రీనివాసరావ్! ఏమిటి విశేషాలు అని పలకరిస్తూనే ‘ఇవన్నీ రొటీన్ ఫైల్స్, చిన్న ఇనీషియల్ వేస్తె వీటి పని అయిపోతుంది. ఇలాంటివే రోజూ డజన్ల కొద్దీ వస్తాయి. తీరిక చేసుకుని వీటిని క్లియర్ చేస్తే పెండింగ్ వుండదు. సీరియస్ ఫైల్స్ ని ఎలాగూ జాగ్రత్తగా చదివి పెట్టాలి. వీటిని ఆపకుండా చూస్తే పెండింగ్ ఫైల్స్ చాలా తగ్గిపోతాయి అని ఆయనే చెప్పారు, తను పనిచేసే విధానాన్ని వివరిస్తూనే. ఆయనని చూడడానికి విజిటర్లు వచ్చినప్పుడు కూడా ఓ పక్క వారితో మాట్లాడుతూనే మరోపక్క వెంగళరావు గారు చేసే పని ఇదే అని ఆ రోజుల్లో విలేకరులందరికీ తెలిసిన విషయమే.

ఇక ఆయన తర్వాత అంటే ఎమర్జెన్సీ తర్వాత ముఖ్యమంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి గారిది మరో స్టైల్. ఆ రోజుల్లో ముఖ్యమంత్రులు దౌరా వెళ్ళేటప్పుడు రైళ్ళలోనే ప్రయాణం చేసేవారు. ఇప్పటిలా హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలు ఉండేవి కావు. చెన్నారెడ్డి గారు విశాఖ రైల్లో వెడుతుంటే ఇలాంటి రొటీన్ ఫైల్స్ అన్నీ కట్టగట్టి ఆయన ప్రయాణం చేసే రైల్వే బోగీలోకి చేర్చేవారు. కదిలే రైలు కాబట్టి విజిటర్ల గోల వుండదు. కాజీపీట దగ్గర ఆ జిల్లా అధికారులు ఓ జీపును సిద్ధంగా ఉంచేవారు. అప్పటివరకు క్లియర్ చేసిన ఫైళ్ళని ఆ జీపులో అప్పటికప్పుడే హైదరాబాదు చేర్చేవారు. అలాగే బెజవాడ దగ్గరా అవసరాన్ని బట్టి మరికొన్ని స్టేషన్ల దగ్గరా ఇలాంటి ఏర్పాట్లు ఉండేవి. ముఖ్యమంత్రి రైల్లో సంతకాలు చేసిన ఫైళ్ళన్నీ మర్నాడు ఆఫీసు టైముకల్లా హైదరాబాదు చేరేవి.

జర్నలిస్ట్ డైరీ సతీష్ చేసిన ఈ చిట్టి పొట్టి ఇంటర్వ్యూలో నేను పంచుకున్న చెన్నారెడ్డి గారి సంగతులు ఇవి:         




Senior Journalist Bhandaru Srinivas Rao Full Interview I MNR Talk Show I...

#. అడవి బాటలో ప్రధాని హోదాలో రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ కలసి ఎప్పుడు, ఎందుకు ప్రయాణం చేశారు...
#. ఎన్.టి.రామారావు పార్టీ ప్రకటించినప్పుడు రేడీయోలో బ్రేకింగ్ న్యూస్ ఎలా చెప్పారు...
#. చంద్రబాబుకు తొలిసారి మంత్రి పదవి వచ్చినప్పుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి సంబరాలు చేశారు.
#బయటకి కనిపించే తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. వేరు అతని ఆత్మీయ కోణం వేరు...
#. విపరీతమైన ఆంక్షల మధ్య మాస్కోలో వార్తా ప్రసారాలు ఎలా జరిగేవి....
#. వేల సంఖ్యల్లో రేడీయో స్టేషన్లకు ఉత్తరాలు పంపిన అత్మీయ క్షణాలు...
#.వార్తల కోసం వెతికే రోజుల్లో... పాత్రికేయునికి దక్కే నిజమైన థ్రిల్ ఎలా ఉండేది...
అద్భుతమైన అయిదు దశాబ్దాల పాత్రికేయుని అరుదైన అనుభవాల మాలిక...
MNR Talk Show with Senior Journalist Bandaru Srinivasa rao




22, డిసెంబర్ 2020, మంగళవారం

నా గురించి నేను – భండారు శ్రీనివాసరావు

 

మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు...
నా గురించి నేను అని మొదలు పెట్టి మళ్ళీ ఇదేమిటి ఇలా అనుకోనక్కర లేదు. మా భండారు వారింట ఆయన ప్రసక్తి లేకుండా చెప్పుకోవడానికి ఏమీ వుండదు.
ఆయన చేసినవి చిన్నా చితకా ఉద్యోగాలు కావు. అయిదుగురు ముఖ్యమంత్రులకు (చెన్నా టు అన్నా అంటే చెన్నారెడ్డి,అంజయ్య, భవనం, కోట్ల, ఎన్టీఆర్ ) చీఫ్ పీఆర్వో గా పనిచేశారు, వాళ్లకి మాట రాకుండా, తను మాట పడకుండా.
సమాచార శాఖ డైరెక్టర్ గా, ఆంధ్రా బ్యాంక్ చీఫ్ పీఆర్వో గా, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి 1993లో రిటైర్ అయ్యారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం పెన్షన్ లో మూడింటి రెండు వంతులు ముందుగానే అమ్ముకున్నాడు. బహుశా ఆయన తనకోసం చేసుకున్న పైరవీ ఇదొక్కటేనేమో. సాధారణంగా ఒప్పుకోని రూల్స్ ని పక్కన పెట్టించి పెన్షన్ డబ్బులు తీసేసుకున్నాడు.
అప్పుడు ఆయన ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఉన్నతాధికారి. ఆయన దగ్గరకు వచ్చేది బడా నిర్మాతలు. ఎవరిని చేబదులు అడిగినా ఇంటికి తీసుకువచ్చి చేతిలో పెట్టేవారు. కానీ అలాంటి మనిషే అయితే ఇక్కడ రాయాల్సిన అవసరం ఏముంటుంది?
‘అరకొర పెన్షన్ డబ్బులతో ఈ హైదరాబాదులో జీవనం కష్టం అనుకుని పుట్టపర్తి వెళ్లి ఓ చిన్న గది అద్దెకు తీసుకున్నారు. ఆధ్యాత్మిక గ్రంధ రచనలు చేయడం కొనసాగించారు.
2006వ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీ ఉదయం
తెల్లవారుతుండగానే పుట్టపర్తి నుంచి హైదరాబాదు వచ్చారు. ఆయన మొహంలో ఎన్నడూ కనబడని ఆందోళన. రాత్రంతా నిద్ర లేకుండా బస్సులో. పైగా రిజర్వేషన్ కూడా లేకుండా డెబ్బయ్ ఏళ్ళ పైబడిన వయసులో చాలా దూరం నిలబడే ప్రయాణం. అంచేత అలసట వల్ల అలా వున్నారేమో అనుకున్నాం.
కానీ కారణం అది కాదు. ఆయన ఆందోళనకు కారణం దివాలా తీసిన ఒక ప్రైవేటు సహకార బ్యాంకు తాలూకు లీగల్ నోటీసు.
‘మీరు తీసుకున్న రుణం ఒక్క పైసా కూడా ఇంతవరకు చెల్లింపు చేయలేదు, కావున మీ మీద కోర్టు ద్వారా చర్య తీసుకోబోతున్నాం’ అనేది సారాంశం.
గతంలో ఆయన హైదరాబాదులో వున్నప్పుడు ఉన్న ఇంటి చిరునామా అందులో వుంది. జీవితంలో ఎవరికీ బాకీ పడరాదు అనే సిద్దాంతంతో బతికిన మనిషికి ఇది పెద్ద షాకే.
మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు అందరం కలిసి నాంపల్లిలో సహకార బ్యాంకుల వ్యవహారాలు చూసే అధికారి కార్యాలయానికి వెళ్లాం. ఆఫీసులో సిబ్బంది పెద్దగా లేరు. సంబంధిత అధికారి ఆర్చుకుని తీర్చుకుని వచ్చేసరికి చాలా పొద్దు పోయింది. రాత్రంతా ప్రయాణం చేసి పొద్దున్న ఏదో పేరుకు ఇంత బ్రేక్ ఫాస్ట్ చేసి రావడం వల్ల మా అన్నయ్య మరీ నీరసించి పోయాడు. మొత్తం మీద ఆ అధికారి వచ్చాడు. మేము చెప్పింది విన్నాడు. ‘ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది, మీరేమీ కంగారు పడకండి, మీకు ఈ అప్పుతో ఏమీ సంబంధం లేదు’ అనే ధోరణిలో మాట్లాడాడు. ‘మనలో మన మాట ఈ బ్యాంకులో ఇలాంటివి ఎన్నో జరిగాయి, ఒక్కొక్కటీ మెల్లగా బయట పడుతున్నాయి’ అని కూడా అన్నాడు.
మేమందరం ఊపిరి పీల్చుకున్నాం, ఒక్క మా అన్నయ్య తప్ప. బ్యాంకును మోసం చేశారు అని వచ్చిన తాఖీదే ఆయన్ని ఇంకా కలవరపెడుతున్నట్టుంది. మంచి మనిషికి ఓ మాట చాలు.
ఆ సాయంత్రమే మళ్ళీ పుట్టపర్తి ప్రయాణం. వద్దన్నా వినలేదు. వదిన ఒక్కతే వుంటుంది అన్నాడు. ఇక తప్పదు అనుకుని ఆర్టీసీ పీఆర్వో కి ఫోను చేసి డీలక్స్ బస్సులో సీటు పెట్టించాను. ఆ రాత్రే ఆయన వెళ్ళిపోయాడు. అదే ఆయన్ని ఆఖరుసారి ప్రాణాలతో చూడడం.
సరిగ్గా వారం గడిచింది. ఆగస్టు 21వ తేదీన కబురు వచ్చింది, మాట్లాడుతూ మాట్లాడుతూ దాటిపోయాడని.

మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారికి కూడబెట్టిన ధనం అంటూ ఏమీ లేదు.
కానీ జన్మతః వచ్చిన మానధనం మాత్రం పుష్కలంగా వుంది. (22-12-2020)


(ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయనకు ప్రధాన పౌర సంబంధాల అధికారిగా మా అన్నయ్య భండారు పర్వతాల రావు గారు . మధ్యలో వున్న వ్యక్తి)








21, డిసెంబర్ 2020, సోమవారం

పెద్దగీత ముందు చిన్నగీత – భండారు శ్రీనివాసరావు

 

కోపం వచ్చినప్పుడు, లేదా ఎవరి మీద అయినా అసహనం కలిగినప్పుడు మనసును నిగ్రహించుకోవడానికి ఒకటీ, రెండూ, మూడు అంటూ పది ఒంట్లు  లెక్కపెట్టమనేది మా బామ్మగారు.

సాక్షిలో నా వ్యాసం దరిమిలా రేగిన దుమ్ము సర్దుకున్న తరువాత రాద్దాము అని కొంత  వ్యవధానం తీసుకోవడానికి మా బామ్మ మాటే  కారణం.

ఇలా రాసి అలా క్షణంలో పోస్ట్ చేయడానికి ఫేస్ బుక్ అంత సులభం కాదు వార్తాపత్రికల్లో.

నేను  యాభయ్ ఏళ్ళ క్రితమే  నార్ల వెంకటేశ్వర రావు గారి సంపాదకత్వంలో ఆంధ్ర జ్యోతి దినపత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేసాను. కాబట్టి పత్రికల విషయంలో కొంత అవగాహన వుంది.

రాసే రచయిత ఎంతటి సుప్రసిద్ధుడైనా అతడి రచనను తమ పత్రికలో ప్రచురించే విషయంలో సంపాదక వర్గానికి కొన్ని బాధ్యతలు వుంటాయి. వచ్చిన వ్యాసాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రచురణార్హమని సంపాదకుడు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే అది వెలుగు చూస్తుంది. ఈలోగా ఎన్నో వడపోతలు వుంటాయి. విషయం రాజకీయ సంబంధమైనది అయితే ఈ ప్రక్రియ మరింత కట్టుదిట్టంగా వుంటుంది. పత్రికలో ప్రచురించడానికి, తిరస్కరించడానికి పత్రిక ఎడిటోరియల్ పాలసీ అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. ఎడిటింగ్ అనే కత్తెర వాడేది ఇందుకే. రచయిత ఇష్టపడితే కొన్ని కత్తెర్లు వేసి ప్రచురిస్తారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే.

మిగిలిన దిన పత్రికలను పక్కన పెడదాం. సాక్షిని తీసుకుందాం. ఆ పత్రిక మొదటి పుటలోనే కీర్తిశేషులు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఫోటో వేస్తారు, శషభిషలకు తావు లేకుండా. అంచేత, తమ  విధానానికి తగ్గ రచనలును ప్రచురించే విషయంలో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలను తప్పుపట్టలేము. అందుకు సిద్ధపడే రచయితలు తమ రచనలు పంపాల్సి వుంటుంది.

తమ పాలసీకి విరుద్ధంగా వుండే వ్యాసాలను ఎడిట్  పేజీలో ప్రచురించే పద్దతి గతంలో పత్రికలలో  వుండేది. చాలా పత్రికలు దీనికి ఎప్పుడో భరతవాక్యం పలికాయి. కాబట్టి ఈ విషయంలో ఆ ఒక్క పత్రికను ఒంటరిగా నిలబెట్టి వేలెత్తి చూపే పరిస్థితి ఈనాడు తెలుగునాట లేదు. ఇది చేదునిజం.

ఈ నేపధ్యంలో వైసీపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడిని పరిమితంగానైనా ప్రశంసించే వాక్యాలు సాక్షి పత్రికలో కనబడితే అపూర్వం అనే చెప్పాలి. మొన్న ఆదివారంనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో  నా వ్యాసాన్ని, ఒక్క పదాన్నికూడా  ఎడిట్ చేయకుండా సాక్షి ప్రచురించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సంపాదకులను ఇందుకు అభినందిస్తున్నాను. నా అనుభవాన్ని బట్టి చెబుతున్నాను. గతంలో చంద్రబాబుకు కొంత వ్యతిరేకంగా వున్నాయని  వేరే పత్రికలు నా వ్యాసాలను  తిరస్కరించిన సందర్భాలను గుర్తు చేసుకుంటే సాక్షి సంపాదకులు చూపిన తెగువ ప్రశంసార్హం. ఉదాహరణకు సాక్షి ప్రచురించిన నా వ్యాసంలోని కొన్ని  వాక్యాలు చూడండి. 

“ఒకనాడు జగన్ మోహన రెడ్డి ఎదుర్కున్న కఠిన పరిస్థితులను చంద్రబాబు ఈనాడు ఒక స్థాయిలో ఎదుర్కుంటున్నారు. 2014 నుంచి  2019 వరకు (కొత్త) రాష్ట్రంలో అధికారం ఆయనదే. చంద్రబాబు ఏదో సాధిస్తాడని,  నూతన రాష్ట్రం ఆయన చేతుల్లో పదిలంగా ఉంటుందని జనంలో  అపరిమితమైన  నమ్మకం. ఆయన దక్షత పట్ల, శక్తియుక్తుల పట్ల చదువుకున్న వారిలో,  మేధావి వర్గాలలో సైతం అంతులేని విశ్వాసం. ఆయన ఏం చేసినా   గోరంతను కొండంత చేసి చూపే  మీడియా. కేంద్రంలో చాలా కాలం తన మాటకు ఎదురు చెప్పని మిత్ర ప్రభుత్వం.  నిజానికి ఏ పరిపాలకుడికి అయినా ఇంతకు  మించి ఏం కావాలి? 

“అయిదేళ్ళ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు తన ఆత్మ విశ్వాసం పట్ల ఎనలేని నమ్మకం. నిజానికి నాయకుడు అనేవాడికి ఇది చాలా అవసరం కూడా.  అయితే  ఆత్మ విశ్వాసం పరిధి మించితే వచ్చేది  దుష్ఫలితాలే.

“జగన్ మాదిరిగా నెత్తి మీద కత్తిలా ఆయనకు కోర్టు కేసుల గొడవ  లేదు. గ్రామ స్థాయి కార్యకర్తల బలంతో పోల్చి చూసుకున్నా వైసీపీ కంటే టీడీపీ మెరుగైన స్థితిలోనే వుంది. ఆయన్ని సమర్ధుడైన నాయకుడిగా గుర్తించి, గౌరవించే రాజకీయేతర పెద్ద మనుషులకు కూడా కొదవ లేదు. ఈ రకమైన అభిమానులు చంద్రబాబుకు దేశ విదేశాల్లో అధిక సంఖ్యలో వున్న విషయం రహస్యమేమీ కాదు. ఇక రాజకీయ అనుభవమా! ఈ విషయంలో ఆయనది ఎప్పుడూ అగ్రస్థానమే. 

“ఒక ఎన్నికలో చతికిల పడిన పార్టీ  అంతటితోనే చితికి పోదు, అంతరించిపోదు.  దీనికి టీడీపీనే రుజువు. పార్టీ సంస్థాపక అధ్యక్షుడు జీవించి ఉన్న కాలంలో కూడా ఆ పార్టీకి  ఉత్థానపతనాలు  తప్పలేదు. అలాగే ఒకానొక రోజుల్లో టీడీపీకి ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇదే. 1989లో అధికారంలో ఉన్న ఈ పార్టీ తరువాత ఎన్నికల్లో ఓడిపోయింది. 1994లో అసెంబ్లీలో ఈ పార్టీ బలం కేవలం 26.   అలాంటిది 2004 ఎన్నికల నాటికి  మళ్ళీ తన బలాన్ని 185 కి పెంచుకుంది.

“ప్రస్తుత అసెంబ్లీలో మొత్తం 175 స్థానాల్లో  టీడీపీకి 23  లభించాయి.  మొత్తం 294 స్థానాల్లో 26 గెలుచుకున్న అప్పటి కాంగ్రెస్ పరిస్థితితో పోలిస్తే ఇది మెరుగే. కాంగ్రెస్ మళ్ళీ పుంజుకొని తర్వాత పదేళ్లకు అధికారంలోకి వచ్చింది. మరి ఈసారి ఓటమితో టీడీపీ అంతగా కుంగిపోవడం ఎందుకు? వైఫల్యాల్లో అవకాశాలు వెతుక్కునే సమర్ధత కలిగిన నాయకుడు ప్రజాస్వామ్య బాటలో సాగి మరో విజయానికి ప్రయత్నం చేయకుండా కోర్టులు, కేసులు వంటి పరోక్ష పద్దతిలో కౌటిల్యం చేస్తున్నారనే నిందలు మోయడం ఎందుకు? వెనుకటి రోజుల్లో  అయితే, వీటిని జనంలో చాలామంది తేలిగ్గా తీసుకునేవారేమో కానీ ఇప్పటి సోషల్ మీడియా యుగంలో అలాంటి అవకాశం ఉంటుందా!

“ప్రధాన స్రవంతి మీడియాకు ధీటుగా, మరింత ఎక్కువ ప్రభావం చూపగల సోషల్ మీడియా పురుడుపోసుకున్న ఈ  కాలంలో పాత పద్దతులు పనికిరాకపోవచ్చు. కాలానుగుణంగా అప్ డేట్ కావాల్సిన అవసరాన్ని గురించి టెక్నో సావీ రాజకీయ నాయకుడైన చంద్రబాబుకు ఒకరు చెప్పేది ఏమీ వుండదు.

“ఎన్నికల సమరంలో  చదరంగపు ఎత్తులు, ఎత్తుగడలు అవసరమే. కానీ  సాంఘిక మాధ్యమాలు రాజ్యం చేస్తున్న ప్రస్తుత కాలంలో మరీ ఎక్కువ చాణక్యం మేలుచేయకపోవచ్చు.

“చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నా, ఇప్పుడు కొత్తగా రాష్ట్ర విభజన అనంతరం తీసుకున్నా అత్యంత ఎక్కువ కాలం పాలించిన నాయకుడు.  సందేహం లేదు.  పరిపాలనా వ్యవస్థకు సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి,  వ్యవస్థల నడుమ ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి కారణం అని ఎవరైనా లేశ మాత్రంగా అనుమానించినా కూడా చంద్రబాబు నాయుడికి శోభస్కరం కాదు.

“ఏదో సినిమాలో చెప్పినట్టుయుద్దం గెలవడం అంటే శత్రువును చంపడం కాదు.. ఓడించడం’ 

ఇది హితవచనం మాత్రమే.”

చంద్రబాబు నాయుడికి సలహాల రూపంలో ఇన్ని విషయాలతో కూడిన నా  వ్యాసం సాక్షి పత్రికలో రావడం నాకే విడ్డూరం అనిపించింది. ఎడిట్  పేజీ  వ్యాసాల విషయంలో  తమకు  వీలున్న మేరకు కొంత నిష్పాక్షిక ధోరణి ప్రదర్శించడానికి  కనీసం ఒక పత్రిక అయినా ముందుకు రావడం చూసి అయిదు దశాబ్దాల పాత్రికేయ అనుభవం కలిగిన  ఓ జర్నలిస్టుగా సంతోష పడ్డాను కూడా. పొతే, నా వ్యాసంలో సింహభాగం ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా లేకపోవడం, పైగా ప్రచురించింది సాక్షి పత్రిక కావడం దుమారానికి కారణం అయ్యాయేమో అనిపిస్తోంది.

కాలేజీలో చదువుకునే రోజుల్లో  మాకు ఇంగ్లీష్  నాన్ డీటెయిల్ క్లాసు వుండేది. ఆ లెక్చరర్ ని స్టూడెంట్స్ లెక్కపెట్టే వాళ్ళు కాదు. దానికి ప్రత్యేకమైన పరీక్షల్లో పాసు కావడానికి ఆ మార్కులు అవసరం లేకపోవడం కారణం కావచ్చు. అల్లరిచేసే పిల్లలతో ఆ క్లాసు లెక్చరర్ అంటుండేవారు “ లెస్  నాయిస్  ప్లీజ్!’ అని.

అంటే ‘ఎలాగూ మీరు అల్లరి చేయక మానరు. అంచేత ఆ చేసేదేదో కాస్త తక్కువ గోల చేయండి’ అని టీకా  తాత్పర్యం.

అలాగే ఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో మీడియా యాజమాన్యాలు మరీ మడి కట్టుకుని పత్రికలు, టీవీ ఛానళ్ళు నడపలేరు. అలా ఆశించడం అత్యాశే అవుతుంది.  కాకపోతే వీలు  వున్నంతలో కాస్త నిఖార్సయిన జర్నలిజానికి సాయపడగలిగితే అదే పదివేలు.

రాజకీయాలతో సంబంధం పెట్టుకుంటూనే రాజకీయులతో  అంటకాగకుండా ఉండడాన్ని నేను అభిలషిస్తాను. మీడియా ఒక్కటే నా ప్రధమ ప్రాధాన్యత. ఆ కోణంలోనే నేను ఏది రాసినా.

సరే! అదలా ఉంచితే..  

ఫేస్ బుక్ లో మిడుతల దండు  మాదిరిగా వెలువడ్డ వ్యాఖ్యలు, విమర్శలు, నిందారోపణలు చూసి చాలామంది మితృలు, హితులు చాలా ఖేదపడ్డారు. వారికి  పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపాల్సిన  బాధ్యత నా మీద ఉన్నప్పటికీ, ఈ విషయంలో నా అశక్తతను మన్నించే సహృదయత వారికి పుష్కలంగా వున్నదని నా నమ్మకం.

అసలు వ్యాసంతో సంబంధం లేకుండా  వ్యాఖ్యలు, పై వ్యాఖ్యలు చేస్తూ పోవడం వల్ల అసలు విషయం మరుగున పడి పోయిందేమో అనే శంకతో ఈ వివరణ.

వ్యక్తిత్వ హననం మాదిరి సాగిన ఆరోపణలు, విమర్శల విషయంలో బాధ అంటారా! నిజానికి నేను అలా  బాధ పడివుంటే, నాలో వాళ్ళు చూపించిన లోపం ఏదో నిజంగానే  వుందని నేనే నమ్మాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి బాధ నాకేదీ లేదు.

పొతే, బాధ ప్రసక్తి ఎలాగూ వచ్చింది కనుక  ఒక విషయం చెప్పి ముగిస్తాను.  బాధ అనేది సాపేక్షం. నిరుడు ఆగస్టులో మా ఆవిడను పోగొట్టుకున్న బాధ ముందు నిజానికి ఇవన్నీ ఏపాటి?   

పెద్ద గీత ముందు చిన్న గీత.

నమస్కారం!

 (21-12-2020)

20, డిసెంబర్ 2020, ఆదివారం

చంద్రబాబు నాయుడు జగన్ ను చూసి నేర్చుకోవాలి – భండారు శ్రీనివాసరావు

 (Published in AP edition of SAKSHI on 20-12-2020, SUNDAY today)

ఇదెప్పుడో క్రీస్తుకు పూర్వం చరిత్ర కాదు. యువకుల నుంచి వృద్ధుల వరకు గుర్తున్న గతమే.

ఒకప్పుడు జగన్ మోహన రెడ్డి ఎదుర్కున్నది ఎవరిని ? సాక్షాత్తు తను ఏ పార్తీకి లోకసభలో నాయకత్వం వహిస్తున్నాడో ఆ కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలిని. అప్పటివరకు తన నాన్నగారికి అనుయాయుల్లా, నమ్మిన బంటుల్లా, అనుచరుల్లా వ్యవహరిస్తూ వచ్చిన సొంత పార్టీ ముఖ్యమంత్రులు, మంత్రులు, నాయకులు  అధినాయకురాలికి భయపడిపోయి  తనకు దూరం జరిగినా, తనను దూరం చేసుకున్నా, రాజకీయ ప్రేరేపిత కేసుల్లో చిక్కుకుని పదహారు నెలలు జైల్లో గడిపినా జగన్ మోహన రెడ్డి వీసమెత్తు ఆదరలేదు, బెదరలేదు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తనకు వ్యతిరేకంగా వున్నప్పుడు, మీడియాలో అధిక భాగం తన పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నప్పుడు ఆయన  కాడి కింద పారేయలేదు. అదే ధైర్యం, అదే తెగువ జన సామాన్యంలో అతడ్ని హీరోను చేసాయి. ఆయనపై పడిన మచ్చలను జనం పట్టించుకోలేని విధంగా రక్షణ కవచంలా కాపాడాయి.

ఒకనాడు జగన్ మోహన రెడ్డి ఎదుర్కున్న ఈ కఠిన పరిస్థితులను చంద్రబాబు ఈనాడు ఒక స్థాయిలో ఎదుర్కుంటున్నారు. నిజానికి ఆ రోజుల్లో  జగన్ ఒక్కడూ ఒక పక్క,  మిగిలిన పార్టీలన్నీ మరోపక్క. చంద్రబాబు నాయుడికి ఈ పరిస్థితి లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల వంటి కొన్ని రాజకీయ పక్షాలు ఇంకా ఆయనతో మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాయి. బీజేపీతో ఆయన కొని తెచ్చుకున్న వైరం తప్పిస్తే  వాళ్ళంతట వాళ్ళు చంద్రబాబు చేతిని వదిలేసి పోయింది లేదు. 2014 నుంచి  2019 వరకు రాష్ట్రంలో అధికారం ఆయనదే. చంద్రబాబు ఏదో సాధిస్తాడని,  నూతన రాష్ట్రం ఆయన చేతుల్లో పదిలంగా ఉంటుందని జనంలో  అపరిమితమైన  నమ్మకం. ఆయన దక్షత పట్ల, శక్తియుక్తుల పట్ల చదువుకున్న వారిలో,  మేధావి వర్గాలలో సైతం అంతులేని విశ్వాసం. ఆయన ఏం చేసినా   గోరంతను కొండంత చేసి చూపే  మీడియా. కేంద్రంలో చాలా కాలం తన మాటకు ఎదురు చెప్పని మిత్ర ప్రభుత్వం.  నిజానికి ఏ పరిపాలకుడికి అయినా ఇంతకు  మించి ఏం కావాలి?  అయినా ఆయన తన  అయిదేళ్ళ పుణ్య కాలాన్ని రకరకాల ఆలోచనలు చేస్తూ, ప్రణాళికలు రచిస్తూ గడిపారే కాని వాటిల్లో అధిక భాగం అమలుకు నోచుకోలేదు. కొన్ని చేయగలిగినా వాటికి సంపూర్ణత్వం సిద్ధించలేదు.

అయిదేళ్ళ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు తన ఆత్మ విశ్వాసం పట్ల ఎనలేని నమ్మకం. నిజానికి నాయకుడు అనేవాడికి ఇది చాలా అవసరం కూడా.  అయితే  ఆత్మ విశ్వాసం పరిధి మించితే వచ్చేది  దుష్ఫలితాలే.

జగన్ మాదిరిగా నెత్తి మీద కత్తిలా ఆయనకు కోర్టు కేసుల గొడవ  లేదు. గ్రామ స్థాయి కార్యకర్తల బలంతో పోల్చి చూసుకున్నా వైసీపీ కంటే టీడీపీ మెరుగైన స్థితిలోనే వుంది. ఆయన్ని సమర్ధుడైన నాయకుడిగా గుర్తించి, గౌరవించే రాజకీయేతర పెద్ద మనుషులకు కూడా కొదవ లేదు. ఈ రకమైన అభిమానులు చంద్రబాబుకు దేశ విదేశాల్లో అధిక సంఖ్యలో వున్న విషయం రహస్యమేమీ కాదు. ఇక రాజకీయ అనుభవమా! ఈ విషయంలో ఆయనది ఎప్పుడూ అగ్రస్థానమే.

మరి ఇన్ని సానుకూల పరిస్థితులు వున్న నేపధ్యంలో ఆయన నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ ఎందుకు ముక్కుసూటి రాజకీయాలు కాకుండా వ్యూహ, ప్రతివ్యూహాలతో కూడిన రాజకీయ ఎత్తుగడలను ఆశ్రయిస్తోంది? చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర ప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రిగా పదవీస్వీకారం చేసిన కొత్తల్లోనే కొత్త ప్రభుత్వానికి ఊపిరి పీల్చుకునే వ్యవధానం కూడా ఇవ్వకుండా నరకాసుర సంహారం వంటి బహిరంగ నిరసనలకు దిగిన వైసీపీ వ్యూహం ఎలా దారుణంగా విఫలం అయిందో టీడీపీ వ్యూహకర్తలు మరిచిపోయారా?  

ఒక ఎన్నికలో చతికిల పడిన పార్టీ  అంతటితోనే చితికి పోదు, అంతరించిపోదు.  దీనికి టీడీపీనే రుజువు. పార్టీ సంస్థాపక అధ్యక్షుడు జీవించి ఉన్న కాలంలో కూడా ఆ పార్టీకి  ఉత్థానపతనాలు  తప్పలేదు. అలాగే ఒకానొక రోజుల్లో టీడీపీకి ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇదే. 1989లో అధికారంలో ఉన్న ఈ పార్టీ తరువాత ఎన్నికల్లో ఓడిపోయింది. 1994లో అసెంబ్లీలో ఈ పార్టీ బలం కేవలం 26.   అలాంటిది 2004 ఎన్నికల నాటికి  మళ్ళీ తన బలాన్ని 185 కి పెంచుకుంది.

ప్రస్తుత అసెంబ్లీలో మొత్తం 175 స్థానాల్లో  టీడీపీకి 23  లభించాయి.  మొత్తం 294 స్థానాల్లో 26 గెలుచుకున్న అప్పటి కాంగ్రెస్ పరిస్థితితో పోలిస్తే ఇది మెరుగే. కాంగ్రెస్ మళ్ళీ పుంజుకొని తర్వాత పదేళ్లకు అధికారంలోకి వచ్చింది. మరి ఈసారి ఓటమితో టీడీపీ అంతగా కుంగిపోవడం ఎందుకు? వైఫల్యాల్లో అవకాశాలు వెతుక్కునే సమర్ధత కలిగిన నాయకుడు ప్రజాస్వామ్య బాటలో సాగి మరో విజయానికి ప్రయత్నం చేయకుండా కోర్టులు, కేసులు వంటి పరోక్ష పద్దతిలో కౌటిల్యం చేస్తున్నారనే నిందలు మోయడం ఎందుకు? వెనుకటి రోజుల్లో  అయితే, వీటిని జనంలో చాలామంది తేలిగ్గా తీసుకునేవారేమో కానీ ఇప్పటి సోషల్ మీడియా యుగంలో అలాంటి అవకాశం ఉంటుందా!

ప్రధాన స్రవంతి మీడియాకు ధీటుగా, మరింత ఎక్కువ ప్రభావం చూపగల సోషల్ మీడియా పురుడుపోసుకున్న ఈ  కాలంలో పాత పద్దతులు పనికిరాకపోవచ్చు. కాలానుగుణంగా అప్ డేట్ కావాల్సిన అవసరాన్ని గురించి టెక్నో సావీ రాజకీయ నాయకుడైన చంద్రబాబుకు ఒకరు చెప్పేది ఏమీ వుండదు.

ఎన్నికల సమరంలో  చదరంగపు ఎత్తులు, ఎత్తుగడలు అవసరమే. కానీ  సాంఘిక మాధ్యమాలు రాజ్యం చేస్తున్న ప్రస్తుత కాలంలో మరీ ఎక్కువ చాణక్యం మేలుచేయకపోవచ్చు.

అధికార పక్షానికి న్యాయస్థానాల అక్షింతలు, మొట్టికాయలు అంటూ నిరంతరంగా సాగించిన ప్రచారం మరో రకంగా  జగన్ పట్ల సానుభూతిని పెంచేదిగా తయారు అయ్యే అవకాశాలను గురించి ఆలోచించకపోవడం టీడీపీ  వ్యూహకర్తల మరో వైఫల్యం. దీనికి తోడు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక న్యాయస్థానం ఇచ్చిన  తీర్పుల్లో అధిక భాగం పై కోర్టులో నిలవకపోవడం కూడా టీడీపీ పై వచ్చిన ఆరోపణలకు ఊతం ఇస్తోంది.

చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నా, ఇప్పుడు కొత్తగా రాష్ట్ర విభజన అనంతరం తీసుకున్నా అత్యంత ఎక్కువ కాలం పాలించిన నాయకుడు.  సందేహం లేదు.  పరిపాలనా వ్యవస్థకు సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి,  వ్యవస్థల నడుమ ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి కారణం అని ఎవరైనా లేశ మాత్రంగా అనుమానించినా కూడా చంద్రబాబు నాయుడికి శోభస్కరం కాదు.

ఏదో సినిమాలో చెప్పినట్టుయుద్దం గెలవడం అంటే శత్రువును చంపడం కాదు.. ఓడించడం” 

ఇది హితవచనం మాత్రమే.   (18-12-2020)



  

18, డిసెంబర్ 2020, శుక్రవారం

నిచ్చెన మెట్లు – భండారు శ్రీనివాసరావు

 చాలా కాలం క్రితం ఒకతను, వయసులో నాకంటే చాలా చిన్నవాడు, మా ఇంటికి వచ్చి కలిశాడు. టీవీ చర్చల్లో పాల్గొనాలనే అభిలాష వుందని, ఎవరికైనా చెబుతారా అనేది ఆయన చేసిన అభ్యర్ధన. అందులో తప్పేమీ లేదు. సిఫారసులు పనిచేయక పోవచ్చు,కాబట్టి మీరే మీ ప్రయత్నం చేసుకోవడం మంచిదని సలహా ఇచ్చాను.

ఆయన ఏ ప్రయత్నం చేసుకున్నారో నాకు తెలియదు కానీ ఒకరోజు ఏదో టీవీలో విశ్లేషకుడిగా కనిపించారు. మొదటి ప్రయత్నం అయినప్పటికీ బాగానే మాట్లాడాడు అని నాకు అనిపించింది.
ఆ తర్వాత మధ్య మధ్య ఫోన్ చేస్తూ వివిధ రాజకీయ అంశాల మీద నా అభిప్రాయం అడుగుతూ ఉండేవాడు. క్రమంగా నాలుగయిదు టీవీల వాళ్ళు ఆయనని చర్చలకు పిలిచే పరిస్థితి ఏర్పడింది. సొంత కారులో రావడం టీవీల వాళ్లకి కూడా కలిసొచ్చే అంశం అయివుంటుంది.
ఏడాది తిరక్క ముందే ఒక పార్టీకి అధికార ప్రతినిధి హోదాలో చర్చల్లో పాల్గొనడం మొదలు పెట్టాడు. ప్రతిపక్షంలో వుంటే కొన్ని విషయాల్లో వెసులుబాటు ఉంటుందని ఆయనే ఒక సారి నాతొ అన్నారు. ప్రతి అంశం మీదా ప్రభుత్వాన్ని ఝాడించే అవకాశం ఉంటుందని, తేలిగ్గా గుర్తింపు లభిస్తుందని ఓ సారి నాకు గీతాబోధ కూడా చేశారు. ప్రభుత్వం తరపున మాట్లాడే వాళ్ళు చాలామంది వుంటారు. దానివల్ల టీవీల్లో కనబడే అవకాశాలు అరుదుగా దొరుకుతాయి. అదే ప్రతిపక్షం తరపున అయితే చాలా టీవీల్లో కనిపించవచ్చు అనేది ఆయన థియరీ. సమర్థించే వాదనలు ప్రజలకు నచ్చవు, అదే ఘాటుగా విమర్శలు చేస్తుంటే అభిమానులు పెరుగుతారు. ఇలా ఉండేవి ఆయన అభిప్రాయాలు.
ఆయన అంచనా తప్పలేదు. కొన్నాళ్ళకు అధికార పార్టీ నుంచి పిలుపు వచ్చినట్టుంది. కొన్నేళ్ళు అలా అధికార పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ చర్చలు కొనసాగించిన పిదప, ఆయన సేవలకు సంతోషించిన పార్టీ పెద్దలు ఏదో కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు.
ఆరంభంలో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ స్టూడియోలకి వచ్చిన అతడు, అనతికాలంలోనే అధికారిక వాహనంలో రావడం మొదలు పెట్టాడు. అతడి ఎదుగుదల క్రమం, అతడి పట్టుదల, అతడి ప్రణాళిక చూసి ముచ్చట వేసేది.
నేను స్టూడియోలకు పోక చాలాకాలం అయింది. ఎప్పుడయినా ఏ టీవీలో అయినా కనబడతాడేమో అని చూస్తుంటాను.
బహుశా అతడు నిర్ణయించుకున్న తొలి లక్ష్యం నెరవేరిందేమో తెలియదు. అతడయితే కనబడడం లేదు. ఫోను కూడా చేయడం లేదు. (18-12-2020) టీవీ చర్చలు