మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు...
నా గురించి నేను అని మొదలు పెట్టి మళ్ళీ ఇదేమిటి ఇలా అనుకోనక్కర లేదు. మా భండారు వారింట ఆయన ప్రసక్తి లేకుండా చెప్పుకోవడానికి ఏమీ వుండదు.
ఆయన చేసినవి చిన్నా చితకా ఉద్యోగాలు కావు. అయిదుగురు ముఖ్యమంత్రులకు (చెన్నా టు అన్నా అంటే చెన్నారెడ్డి,అంజయ్య, భవనం, కోట్ల, ఎన్టీఆర్ ) చీఫ్ పీఆర్వో గా పనిచేశారు, వాళ్లకి మాట రాకుండా, తను మాట పడకుండా.
సమాచార శాఖ డైరెక్టర్ గా, ఆంధ్రా బ్యాంక్ చీఫ్ పీఆర్వో గా, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి 1993లో రిటైర్ అయ్యారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం పెన్షన్ లో మూడింటి రెండు వంతులు ముందుగానే అమ్ముకున్నాడు. బహుశా ఆయన తనకోసం చేసుకున్న పైరవీ ఇదొక్కటేనేమో. సాధారణంగా ఒప్పుకోని రూల్స్ ని పక్కన పెట్టించి పెన్షన్ డబ్బులు తీసేసుకున్నాడు.
అప్పుడు ఆయన ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఉన్నతాధికారి. ఆయన దగ్గరకు వచ్చేది బడా నిర్మాతలు. ఎవరిని చేబదులు అడిగినా ఇంటికి తీసుకువచ్చి చేతిలో పెట్టేవారు. కానీ అలాంటి మనిషే అయితే ఇక్కడ రాయాల్సిన అవసరం ఏముంటుంది?
‘అరకొర పెన్షన్ డబ్బులతో ఈ హైదరాబాదులో జీవనం కష్టం అనుకుని పుట్టపర్తి వెళ్లి ఓ చిన్న గది అద్దెకు తీసుకున్నారు. ఆధ్యాత్మిక గ్రంధ రచనలు చేయడం కొనసాగించారు.
2006వ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీ ఉదయం
తెల్లవారుతుండగానే పుట్టపర్తి నుంచి హైదరాబాదు వచ్చారు. ఆయన మొహంలో ఎన్నడూ కనబడని ఆందోళన. రాత్రంతా నిద్ర లేకుండా బస్సులో. పైగా రిజర్వేషన్ కూడా లేకుండా డెబ్బయ్ ఏళ్ళ పైబడిన వయసులో చాలా దూరం నిలబడే ప్రయాణం. అంచేత అలసట వల్ల అలా వున్నారేమో అనుకున్నాం.
కానీ కారణం అది కాదు. ఆయన ఆందోళనకు కారణం దివాలా తీసిన ఒక ప్రైవేటు సహకార బ్యాంకు తాలూకు లీగల్ నోటీసు.
‘మీరు తీసుకున్న రుణం ఒక్క పైసా కూడా ఇంతవరకు చెల్లింపు చేయలేదు, కావున మీ మీద కోర్టు ద్వారా చర్య తీసుకోబోతున్నాం’ అనేది సారాంశం.
గతంలో ఆయన హైదరాబాదులో వున్నప్పుడు ఉన్న ఇంటి చిరునామా అందులో వుంది. జీవితంలో ఎవరికీ బాకీ పడరాదు అనే సిద్దాంతంతో బతికిన మనిషికి ఇది పెద్ద షాకే.
మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు అందరం కలిసి నాంపల్లిలో సహకార బ్యాంకుల వ్యవహారాలు చూసే అధికారి కార్యాలయానికి వెళ్లాం. ఆఫీసులో సిబ్బంది పెద్దగా లేరు. సంబంధిత అధికారి ఆర్చుకుని తీర్చుకుని వచ్చేసరికి చాలా పొద్దు పోయింది. రాత్రంతా ప్రయాణం చేసి పొద్దున్న ఏదో పేరుకు ఇంత బ్రేక్ ఫాస్ట్ చేసి రావడం వల్ల మా అన్నయ్య మరీ నీరసించి పోయాడు. మొత్తం మీద ఆ అధికారి వచ్చాడు. మేము చెప్పింది విన్నాడు. ‘ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది, మీరేమీ కంగారు పడకండి, మీకు ఈ అప్పుతో ఏమీ సంబంధం లేదు’ అనే ధోరణిలో మాట్లాడాడు. ‘మనలో మన మాట ఈ బ్యాంకులో ఇలాంటివి ఎన్నో జరిగాయి, ఒక్కొక్కటీ మెల్లగా బయట పడుతున్నాయి’ అని కూడా అన్నాడు.
మేమందరం ఊపిరి పీల్చుకున్నాం, ఒక్క మా అన్నయ్య తప్ప. బ్యాంకును మోసం చేశారు అని వచ్చిన తాఖీదే ఆయన్ని ఇంకా కలవరపెడుతున్నట్టుంది. మంచి మనిషికి ఓ మాట చాలు.
ఆ సాయంత్రమే మళ్ళీ పుట్టపర్తి ప్రయాణం. వద్దన్నా వినలేదు. వదిన ఒక్కతే వుంటుంది అన్నాడు. ఇక తప్పదు అనుకుని ఆర్టీసీ పీఆర్వో కి ఫోను చేసి డీలక్స్ బస్సులో సీటు పెట్టించాను. ఆ రాత్రే ఆయన వెళ్ళిపోయాడు. అదే ఆయన్ని ఆఖరుసారి ప్రాణాలతో చూడడం.
సరిగ్గా వారం గడిచింది. ఆగస్టు 21వ తేదీన కబురు వచ్చింది, మాట్లాడుతూ మాట్లాడుతూ దాటిపోయాడని.
మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారికి కూడబెట్టిన ధనం అంటూ ఏమీ లేదు.
కానీ జన్మతః వచ్చిన మానధనం మాత్రం పుష్కలంగా వుంది. (22-12-2020)
(ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయనకు ప్రధాన పౌర సంబంధాల అధికారిగా మా అన్నయ్య భండారు పర్వతాల రావు గారు . మధ్యలో వున్న వ్యక్తి)
🙏
రిప్లయితొలగించండిఅరుదైన వ్యక్తులు. ఆంగ్లంలో rare personalities అంటారు 🙏.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి>> మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారెకి కూడబెట్టిన ధనం అంటూ ఏమీ లేదు.
రిప్లయితొలగించండికం. లేదా కీర్తిధనం బది
కాదా అసలైన ధనము ఘనమైనదియున్
మేదిని సత్కీర్తియుతుల్
పేదలు కారివల నవల పెన్నిధి యశమే
కం. జ్ఞానధనము కలవా రభి
మానధనులు స్వజనుల యభిమానధనంబున్
మానుగ గలవారును ధన
హీనులు కా రిండ్లు నగలు నెఱుగక యున్నన్.
మీ యన్నగారు ఆదర్శచరిత్రులు, గొప్పవారు.
మా అన్నయ్య అన్న టైటిల్ బావుండేదేమో
రిప్లయితొలగించండి