1975 లో
నేను హైదరాబాదు ఆలిండియా రేడియో వార్తా విలేకరిగా చేరినప్పుడు ముఖ్యమంత్రి జలగం
వెంగళరావు గారు. ఎమర్జెన్సీ టైం ముఖ్యమంత్రి అని పేరు. ఇంటాబయటా (ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో) ఆటుపోట్లు లేని
రోజులు కాబట్టి ఆయన పరిపాలన నల్లేరు మీది బండిలా సాగింది.
ఇప్పుడు
ముఖ్యమంత్రులను కలవడం అంటే బ్రహ్మ ప్రళయం
అంటుంటే వింటున్నాను. ఆ రోజుల్లో అలా సచివాలయంలో కలయ తిరుగుతూ ముఖ్యమంత్రి ఛాంబర్
వైపు వెడితే ప్రకాశరావు గారు చిరునవ్వుతో పలకరించి సీ ఎం ని కలుస్తారా అని
అడిగేవారు. ప్రకాశరావు గారు వెంగళరావు గారి పీ ఎస్.
‘అబ్బే
పనేమీ లేదండీ’
అంటుండగానే ఆయన లోకయ్యా అని పిలిచేవారు. తెల్లటి దుస్తుల్లో వున్న సీ ఎం అటెండర్
లోకయ్య ఛాంబర్ తలుపు తీసి లోపలకు వెళ్ళమనే వారు. వెంగళరావు గారు ఒక్కరే కుర్చీలో
కూర్చుని రొటీన్ ఫైల్స్ మీద సంతకాలు చేస్తూ కనిపించేవారు.
‘శ్రీనివాసరావ్!
ఏమిటి విశేషాలు’ అని
పలకరిస్తూనే ‘ఇవన్నీ రొటీన్ ఫైల్స్, చిన్న
ఇనీషియల్ వేస్తె వీటి పని అయిపోతుంది. ఇలాంటివే రోజూ డజన్ల కొద్దీ వస్తాయి. తీరిక
చేసుకుని వీటిని క్లియర్ చేస్తే పెండింగ్ వుండదు. సీరియస్ ఫైల్స్ ని ఎలాగూ
జాగ్రత్తగా చదివి పెట్టాలి. వీటిని ఆపకుండా చూస్తే పెండింగ్ ఫైల్స్ చాలా
తగ్గిపోతాయి’ అని
ఆయనే చెప్పారు, తను
పనిచేసే విధానాన్ని వివరిస్తూనే. ఆయనని చూడడానికి విజిటర్లు వచ్చినప్పుడు కూడా ఓ
పక్క వారితో మాట్లాడుతూనే మరోపక్క వెంగళరావు గారు చేసే పని ఇదే అని ఆ రోజుల్లో
విలేకరులందరికీ తెలిసిన విషయమే.
ఇక ఆయన
తర్వాత అంటే ఎమర్జెన్సీ తర్వాత ముఖ్యమంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి గారిది మరో
స్టైల్. ఆ రోజుల్లో ముఖ్యమంత్రులు దౌరా వెళ్ళేటప్పుడు రైళ్ళలోనే ప్రయాణం చేసేవారు.
ఇప్పటిలా హెలికాప్టర్లు,
ప్రత్యేక విమానాలు ఉండేవి కావు. చెన్నారెడ్డి గారు విశాఖ రైల్లో వెడుతుంటే ఇలాంటి
రొటీన్ ఫైల్స్ అన్నీ కట్టగట్టి ఆయన ప్రయాణం చేసే రైల్వే బోగీలోకి చేర్చేవారు.
కదిలే రైలు కాబట్టి విజిటర్ల గోల వుండదు. కాజీపీట దగ్గర ఆ జిల్లా అధికారులు ఓ
జీపును సిద్ధంగా ఉంచేవారు. అప్పటివరకు క్లియర్ చేసిన ఫైళ్ళని ఆ జీపులో
అప్పటికప్పుడే హైదరాబాదు చేర్చేవారు. అలాగే బెజవాడ దగ్గరా అవసరాన్ని బట్టి
మరికొన్ని స్టేషన్ల దగ్గరా ఇలాంటి ఏర్పాట్లు ఉండేవి. ముఖ్యమంత్రి రైల్లో సంతకాలు
చేసిన ఫైళ్ళన్నీ మర్నాడు ఆఫీసు టైముకల్లా హైదరాబాదు చేరేవి.
జర్నలిస్ట్
డైరీ సతీష్ చేసిన ఈ చిట్టి పొట్టి ఇంటర్వ్యూలో నేను పంచుకున్న చెన్నారెడ్డి గారి
సంగతులు ఇవి:
ఇలా మోత దండగ పని ఉండకూడదనే ఇప్పుడు డిజిటైజేషన్ అంటున్నారు. చిన్న టాబ్ లో ఫైల్ చూసి సైన్ చేసినా సీల్ వేసినా సరిపోతుంది.
రిప్లయితొలగించండిNot approved తరవాత Brief case చేరితే e చేర్చి Note approved అయ్యేదట
రిప్లయితొలగించండిNTR time లో BC or SC అడిగేవారట BC=Brief case SC=Same caste