21, డిసెంబర్ 2020, సోమవారం

పెద్దగీత ముందు చిన్నగీత – భండారు శ్రీనివాసరావు

 

కోపం వచ్చినప్పుడు, లేదా ఎవరి మీద అయినా అసహనం కలిగినప్పుడు మనసును నిగ్రహించుకోవడానికి ఒకటీ, రెండూ, మూడు అంటూ పది ఒంట్లు  లెక్కపెట్టమనేది మా బామ్మగారు.

సాక్షిలో నా వ్యాసం దరిమిలా రేగిన దుమ్ము సర్దుకున్న తరువాత రాద్దాము అని కొంత  వ్యవధానం తీసుకోవడానికి మా బామ్మ మాటే  కారణం.

ఇలా రాసి అలా క్షణంలో పోస్ట్ చేయడానికి ఫేస్ బుక్ అంత సులభం కాదు వార్తాపత్రికల్లో.

నేను  యాభయ్ ఏళ్ళ క్రితమే  నార్ల వెంకటేశ్వర రావు గారి సంపాదకత్వంలో ఆంధ్ర జ్యోతి దినపత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేసాను. కాబట్టి పత్రికల విషయంలో కొంత అవగాహన వుంది.

రాసే రచయిత ఎంతటి సుప్రసిద్ధుడైనా అతడి రచనను తమ పత్రికలో ప్రచురించే విషయంలో సంపాదక వర్గానికి కొన్ని బాధ్యతలు వుంటాయి. వచ్చిన వ్యాసాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రచురణార్హమని సంపాదకుడు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే అది వెలుగు చూస్తుంది. ఈలోగా ఎన్నో వడపోతలు వుంటాయి. విషయం రాజకీయ సంబంధమైనది అయితే ఈ ప్రక్రియ మరింత కట్టుదిట్టంగా వుంటుంది. పత్రికలో ప్రచురించడానికి, తిరస్కరించడానికి పత్రిక ఎడిటోరియల్ పాలసీ అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. ఎడిటింగ్ అనే కత్తెర వాడేది ఇందుకే. రచయిత ఇష్టపడితే కొన్ని కత్తెర్లు వేసి ప్రచురిస్తారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే.

మిగిలిన దిన పత్రికలను పక్కన పెడదాం. సాక్షిని తీసుకుందాం. ఆ పత్రిక మొదటి పుటలోనే కీర్తిశేషులు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఫోటో వేస్తారు, శషభిషలకు తావు లేకుండా. అంచేత, తమ  విధానానికి తగ్గ రచనలును ప్రచురించే విషయంలో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలను తప్పుపట్టలేము. అందుకు సిద్ధపడే రచయితలు తమ రచనలు పంపాల్సి వుంటుంది.

తమ పాలసీకి విరుద్ధంగా వుండే వ్యాసాలను ఎడిట్  పేజీలో ప్రచురించే పద్దతి గతంలో పత్రికలలో  వుండేది. చాలా పత్రికలు దీనికి ఎప్పుడో భరతవాక్యం పలికాయి. కాబట్టి ఈ విషయంలో ఆ ఒక్క పత్రికను ఒంటరిగా నిలబెట్టి వేలెత్తి చూపే పరిస్థితి ఈనాడు తెలుగునాట లేదు. ఇది చేదునిజం.

ఈ నేపధ్యంలో వైసీపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడిని పరిమితంగానైనా ప్రశంసించే వాక్యాలు సాక్షి పత్రికలో కనబడితే అపూర్వం అనే చెప్పాలి. మొన్న ఆదివారంనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో  నా వ్యాసాన్ని, ఒక్క పదాన్నికూడా  ఎడిట్ చేయకుండా సాక్షి ప్రచురించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సంపాదకులను ఇందుకు అభినందిస్తున్నాను. నా అనుభవాన్ని బట్టి చెబుతున్నాను. గతంలో చంద్రబాబుకు కొంత వ్యతిరేకంగా వున్నాయని  వేరే పత్రికలు నా వ్యాసాలను  తిరస్కరించిన సందర్భాలను గుర్తు చేసుకుంటే సాక్షి సంపాదకులు చూపిన తెగువ ప్రశంసార్హం. ఉదాహరణకు సాక్షి ప్రచురించిన నా వ్యాసంలోని కొన్ని  వాక్యాలు చూడండి. 

“ఒకనాడు జగన్ మోహన రెడ్డి ఎదుర్కున్న కఠిన పరిస్థితులను చంద్రబాబు ఈనాడు ఒక స్థాయిలో ఎదుర్కుంటున్నారు. 2014 నుంచి  2019 వరకు (కొత్త) రాష్ట్రంలో అధికారం ఆయనదే. చంద్రబాబు ఏదో సాధిస్తాడని,  నూతన రాష్ట్రం ఆయన చేతుల్లో పదిలంగా ఉంటుందని జనంలో  అపరిమితమైన  నమ్మకం. ఆయన దక్షత పట్ల, శక్తియుక్తుల పట్ల చదువుకున్న వారిలో,  మేధావి వర్గాలలో సైతం అంతులేని విశ్వాసం. ఆయన ఏం చేసినా   గోరంతను కొండంత చేసి చూపే  మీడియా. కేంద్రంలో చాలా కాలం తన మాటకు ఎదురు చెప్పని మిత్ర ప్రభుత్వం.  నిజానికి ఏ పరిపాలకుడికి అయినా ఇంతకు  మించి ఏం కావాలి? 

“అయిదేళ్ళ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు తన ఆత్మ విశ్వాసం పట్ల ఎనలేని నమ్మకం. నిజానికి నాయకుడు అనేవాడికి ఇది చాలా అవసరం కూడా.  అయితే  ఆత్మ విశ్వాసం పరిధి మించితే వచ్చేది  దుష్ఫలితాలే.

“జగన్ మాదిరిగా నెత్తి మీద కత్తిలా ఆయనకు కోర్టు కేసుల గొడవ  లేదు. గ్రామ స్థాయి కార్యకర్తల బలంతో పోల్చి చూసుకున్నా వైసీపీ కంటే టీడీపీ మెరుగైన స్థితిలోనే వుంది. ఆయన్ని సమర్ధుడైన నాయకుడిగా గుర్తించి, గౌరవించే రాజకీయేతర పెద్ద మనుషులకు కూడా కొదవ లేదు. ఈ రకమైన అభిమానులు చంద్రబాబుకు దేశ విదేశాల్లో అధిక సంఖ్యలో వున్న విషయం రహస్యమేమీ కాదు. ఇక రాజకీయ అనుభవమా! ఈ విషయంలో ఆయనది ఎప్పుడూ అగ్రస్థానమే. 

“ఒక ఎన్నికలో చతికిల పడిన పార్టీ  అంతటితోనే చితికి పోదు, అంతరించిపోదు.  దీనికి టీడీపీనే రుజువు. పార్టీ సంస్థాపక అధ్యక్షుడు జీవించి ఉన్న కాలంలో కూడా ఆ పార్టీకి  ఉత్థానపతనాలు  తప్పలేదు. అలాగే ఒకానొక రోజుల్లో టీడీపీకి ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇదే. 1989లో అధికారంలో ఉన్న ఈ పార్టీ తరువాత ఎన్నికల్లో ఓడిపోయింది. 1994లో అసెంబ్లీలో ఈ పార్టీ బలం కేవలం 26.   అలాంటిది 2004 ఎన్నికల నాటికి  మళ్ళీ తన బలాన్ని 185 కి పెంచుకుంది.

“ప్రస్తుత అసెంబ్లీలో మొత్తం 175 స్థానాల్లో  టీడీపీకి 23  లభించాయి.  మొత్తం 294 స్థానాల్లో 26 గెలుచుకున్న అప్పటి కాంగ్రెస్ పరిస్థితితో పోలిస్తే ఇది మెరుగే. కాంగ్రెస్ మళ్ళీ పుంజుకొని తర్వాత పదేళ్లకు అధికారంలోకి వచ్చింది. మరి ఈసారి ఓటమితో టీడీపీ అంతగా కుంగిపోవడం ఎందుకు? వైఫల్యాల్లో అవకాశాలు వెతుక్కునే సమర్ధత కలిగిన నాయకుడు ప్రజాస్వామ్య బాటలో సాగి మరో విజయానికి ప్రయత్నం చేయకుండా కోర్టులు, కేసులు వంటి పరోక్ష పద్దతిలో కౌటిల్యం చేస్తున్నారనే నిందలు మోయడం ఎందుకు? వెనుకటి రోజుల్లో  అయితే, వీటిని జనంలో చాలామంది తేలిగ్గా తీసుకునేవారేమో కానీ ఇప్పటి సోషల్ మీడియా యుగంలో అలాంటి అవకాశం ఉంటుందా!

“ప్రధాన స్రవంతి మీడియాకు ధీటుగా, మరింత ఎక్కువ ప్రభావం చూపగల సోషల్ మీడియా పురుడుపోసుకున్న ఈ  కాలంలో పాత పద్దతులు పనికిరాకపోవచ్చు. కాలానుగుణంగా అప్ డేట్ కావాల్సిన అవసరాన్ని గురించి టెక్నో సావీ రాజకీయ నాయకుడైన చంద్రబాబుకు ఒకరు చెప్పేది ఏమీ వుండదు.

“ఎన్నికల సమరంలో  చదరంగపు ఎత్తులు, ఎత్తుగడలు అవసరమే. కానీ  సాంఘిక మాధ్యమాలు రాజ్యం చేస్తున్న ప్రస్తుత కాలంలో మరీ ఎక్కువ చాణక్యం మేలుచేయకపోవచ్చు.

“చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నా, ఇప్పుడు కొత్తగా రాష్ట్ర విభజన అనంతరం తీసుకున్నా అత్యంత ఎక్కువ కాలం పాలించిన నాయకుడు.  సందేహం లేదు.  పరిపాలనా వ్యవస్థకు సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి,  వ్యవస్థల నడుమ ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి కారణం అని ఎవరైనా లేశ మాత్రంగా అనుమానించినా కూడా చంద్రబాబు నాయుడికి శోభస్కరం కాదు.

“ఏదో సినిమాలో చెప్పినట్టుయుద్దం గెలవడం అంటే శత్రువును చంపడం కాదు.. ఓడించడం’ 

ఇది హితవచనం మాత్రమే.”

చంద్రబాబు నాయుడికి సలహాల రూపంలో ఇన్ని విషయాలతో కూడిన నా  వ్యాసం సాక్షి పత్రికలో రావడం నాకే విడ్డూరం అనిపించింది. ఎడిట్  పేజీ  వ్యాసాల విషయంలో  తమకు  వీలున్న మేరకు కొంత నిష్పాక్షిక ధోరణి ప్రదర్శించడానికి  కనీసం ఒక పత్రిక అయినా ముందుకు రావడం చూసి అయిదు దశాబ్దాల పాత్రికేయ అనుభవం కలిగిన  ఓ జర్నలిస్టుగా సంతోష పడ్డాను కూడా. పొతే, నా వ్యాసంలో సింహభాగం ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా లేకపోవడం, పైగా ప్రచురించింది సాక్షి పత్రిక కావడం దుమారానికి కారణం అయ్యాయేమో అనిపిస్తోంది.

కాలేజీలో చదువుకునే రోజుల్లో  మాకు ఇంగ్లీష్  నాన్ డీటెయిల్ క్లాసు వుండేది. ఆ లెక్చరర్ ని స్టూడెంట్స్ లెక్కపెట్టే వాళ్ళు కాదు. దానికి ప్రత్యేకమైన పరీక్షల్లో పాసు కావడానికి ఆ మార్కులు అవసరం లేకపోవడం కారణం కావచ్చు. అల్లరిచేసే పిల్లలతో ఆ క్లాసు లెక్చరర్ అంటుండేవారు “ లెస్  నాయిస్  ప్లీజ్!’ అని.

అంటే ‘ఎలాగూ మీరు అల్లరి చేయక మానరు. అంచేత ఆ చేసేదేదో కాస్త తక్కువ గోల చేయండి’ అని టీకా  తాత్పర్యం.

అలాగే ఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో మీడియా యాజమాన్యాలు మరీ మడి కట్టుకుని పత్రికలు, టీవీ ఛానళ్ళు నడపలేరు. అలా ఆశించడం అత్యాశే అవుతుంది.  కాకపోతే వీలు  వున్నంతలో కాస్త నిఖార్సయిన జర్నలిజానికి సాయపడగలిగితే అదే పదివేలు.

రాజకీయాలతో సంబంధం పెట్టుకుంటూనే రాజకీయులతో  అంటకాగకుండా ఉండడాన్ని నేను అభిలషిస్తాను. మీడియా ఒక్కటే నా ప్రధమ ప్రాధాన్యత. ఆ కోణంలోనే నేను ఏది రాసినా.

సరే! అదలా ఉంచితే..  

ఫేస్ బుక్ లో మిడుతల దండు  మాదిరిగా వెలువడ్డ వ్యాఖ్యలు, విమర్శలు, నిందారోపణలు చూసి చాలామంది మితృలు, హితులు చాలా ఖేదపడ్డారు. వారికి  పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపాల్సిన  బాధ్యత నా మీద ఉన్నప్పటికీ, ఈ విషయంలో నా అశక్తతను మన్నించే సహృదయత వారికి పుష్కలంగా వున్నదని నా నమ్మకం.

అసలు వ్యాసంతో సంబంధం లేకుండా  వ్యాఖ్యలు, పై వ్యాఖ్యలు చేస్తూ పోవడం వల్ల అసలు విషయం మరుగున పడి పోయిందేమో అనే శంకతో ఈ వివరణ.

వ్యక్తిత్వ హననం మాదిరి సాగిన ఆరోపణలు, విమర్శల విషయంలో బాధ అంటారా! నిజానికి నేను అలా  బాధ పడివుంటే, నాలో వాళ్ళు చూపించిన లోపం ఏదో నిజంగానే  వుందని నేనే నమ్మాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి బాధ నాకేదీ లేదు.

పొతే, బాధ ప్రసక్తి ఎలాగూ వచ్చింది కనుక  ఒక విషయం చెప్పి ముగిస్తాను.  బాధ అనేది సాపేక్షం. నిరుడు ఆగస్టులో మా ఆవిడను పోగొట్టుకున్న బాధ ముందు నిజానికి ఇవన్నీ ఏపాటి?   

పెద్ద గీత ముందు చిన్న గీత.

నమస్కారం!

 (21-12-2020)

6 కామెంట్‌లు:

  1. @భండారు శ్రీనివాసరావు:

    టపా చాలా బాలెన్సుడుగా ఉంది.

    మీ సాక్షి వ్యాసం కూడా మీ సహజ "నొప్పించక తానొవ్వక" తరహాయే. అంగీకరించని వారు సైతం దానికి ఆక్షేపణ చెప్పాల్సిన అవసరం నాకయితే కనిపించలేదు.

    రిప్లయితొలగించండి
  2. మెజారిటీ ఇండియన్స్ లో ఆత్మవిశ్వాసం తక్కువ , ఇంఫిరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ . చదువుతో సంబంధం లేదు . మూడు పీజీ లు చేసినోడు కూడా వాడి నాయకుడికి కొబ్బరికాయ కొట్టి, చేతిలో హారతి వెలిగిస్తాడు , వ్యక్తి పూజ .
    డిబేట్ స్కిల్స్ అంటే ఏంటో కూడా విని ఉండరు , ఈ పిచ్చి జనాలు. ఈ పనికి రాని జనాల మాటలుకి మీరు విలువ ఇచ్చి , ఈ పోస్ట్ రాయడం అంటే ... వాళ్ళకి వీసమెత్తు గౌరవం ఇవ్వడమే . అది కూడా అనవసరం .

    రిప్లయితొలగించండి
  3. జగన్ గారు ఇచ్చిన ఉచిత పథకాలకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది ? ఈ ఉచిత పధకాలవల్ల ప్రజల నెత్తిన ఎంత రుణ భారం పడుతుంది వ్రాసి సాక్షి లో ప్రచురించండి.సాక్షి గొప్పతనం తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. భండారు వారూ, ఎందుకండీ అంత ఇబ్బందిపడటం? "చంద్రబాబు నుండి జగన్ పాలనలో‌ మెళుకువలు నేర్చుకోవాలి" అని ఇంకొక వ్యాసం వ్రాసి ఈనాడు పత్రికలో అచ్చుకొట్టిస్తే సరిపోతుంది కదా.

    రిప్లయితొలగించండి
  5. శుభం
    "సాక్షిలో వచ్చిన నా వ్యాసంపై చెలరేగిన దుమారానికి మూలకారణం అయిన Adusumilli Srenivasa Rao గారు ఈ యావత్ ఎపిసోడ్ కి 'శుభం' కార్డు వేస్తూ ఒక పోస్టు పెట్టారు. వారికి ధన్యవాదాలు "
    "Bhandaru Srinivasa Rao గారూ!
    నేను మీరు వ్రాసిన ఆర్డికల్ మీద తీవ్రంగా స్పందించిన మాట వాస్తవం..అది మిమ్మల్ని గాయపరిచిందని అర్ధమవుతున్నది.
    నిజానికి నాకు మీరంటే చాలా మంచి అభిప్రాయం ఉండేది ..ఉన్నది కూడా..!
    చాలా మంది ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న అరాచకం ..చూసి కూడా కులం పేరుతోనో..చంద్రబాబు వ్యతిరేక ధోరణి తోనో ..రాష్ట్రం సర్వనాశనమైపోతున్నా ...ఇంకా చంద్రబాబు మీద బురద చల్లటమో..విషప్రచారం చెయ్యటమో చేస్తున్నారు.
    ఒక పక్క ఏడాది కాలంగా రైతుల వేదన గమనించకుండా భ్రమారావతి అంటూ కించపరుస్తున్నారు..
    ఆంధ్రాలో దళితుల తో సహా మహిళల మీద దాడుల పరంపర కొనసాగుతున్నది.
    ప్రజలు బిక్కచచ్చి పోయి బ్రతుకుతున్నారు.
    మొత్తం సీనియర్ అనలిష్డులు అసలు వీటి మీద స్పందిచటం లేదు.
    మహిళా హక్కుల సంఘాలు మాట్లాడటం లేదు..
    ఢిల్లీ వరకు వెళ్ళిన వారు..అమరావతి లో ఒక మహిళ పొత్తి కడుపు మీద ఒక అధికారి బూటు కాలితో తన్నితే ..సమాజంలో గుర్తింపు ..గౌరవం..విశ్వసనీయత ఉన్నవారు..పల్లెత్తు మాట అనలేదు..
    ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం..
    దాని నుండి వచ్చిన ఆక్రోశమే ఇది..
    బండారు శ్రీనివాసరావు గారి లాంటి వారు కూడా..జగన్..చంద్రబాబు ని ఒకే గాటన కట్టడాన్ని..సహించటం కష్టమనిపించింది.
    రాజకీయాలు..ఎన్నికలు..ప్రజాతీర్పు ఎలా అయినా ఉండవచ్చు..
    కాని గత అయిదేళ్ళలో..కేంద్రం ..అప్పటి ప్రతిపక్షం..హోదా ఉద్యమ కారులు ఎన్ని ఆటంకాలు..అడ్డంకులు ....విమర్శలు చేసారో చూసాము.
    ఇప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు..
    ఇదంతా చూసిన తర్వాత..ఇలాంటి సమయంలో మీ ఆర్డికల్ కళ్ళబడింది.
    దాంతో స్పందించటం జరిగింది.
    మీ స్పందన చూసిన తర్వాత నాకు బాధ కలుగుతున్నది.
    మీకు భార్యావియోగము కలిగినదన్న విషయం మీ ద్వారానే తెలిసినది..
    నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను..
    అలాగే మీరు ఇంతగా గాయపడ్డారంటే ...కచ్చితంగా నిష్కల్మషులని నమ్ముతున్నాను.
    మిమ్మల్ని హర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నాను.
    ఇక పై మనం మీ అనుభవాల్ని పంచుకుందాము.
    నేను టీడీపి కార్యకర్తను కాదు..ప్రాధమిక సభ్యత్వం కూడా లేదు..కేవలం సానుభూతి పరుడ్ని మాత్రమే..
    కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం తో పెరిగాను..
    కమ్యూనిష్డులు మా కుటుంబానికి ఇష్డులు..!
    నా వాల్ లో స్పందించినందుకు ధన్యవాదాలు..
    మిమ్మల్ని మరొక్కసారి క్షమించమని కోరుతున్నాను".
    ఇక నాకు సంబంధించినంతవరకు ఇది ముగిసిన అధ్యాయం !

    రిప్లయితొలగించండి