18, డిసెంబర్ 2020, శుక్రవారం

నిచ్చెన మెట్లు – భండారు శ్రీనివాసరావు

 చాలా కాలం క్రితం ఒకతను, వయసులో నాకంటే చాలా చిన్నవాడు, మా ఇంటికి వచ్చి కలిశాడు. టీవీ చర్చల్లో పాల్గొనాలనే అభిలాష వుందని, ఎవరికైనా చెబుతారా అనేది ఆయన చేసిన అభ్యర్ధన. అందులో తప్పేమీ లేదు. సిఫారసులు పనిచేయక పోవచ్చు,కాబట్టి మీరే మీ ప్రయత్నం చేసుకోవడం మంచిదని సలహా ఇచ్చాను.

ఆయన ఏ ప్రయత్నం చేసుకున్నారో నాకు తెలియదు కానీ ఒకరోజు ఏదో టీవీలో విశ్లేషకుడిగా కనిపించారు. మొదటి ప్రయత్నం అయినప్పటికీ బాగానే మాట్లాడాడు అని నాకు అనిపించింది.
ఆ తర్వాత మధ్య మధ్య ఫోన్ చేస్తూ వివిధ రాజకీయ అంశాల మీద నా అభిప్రాయం అడుగుతూ ఉండేవాడు. క్రమంగా నాలుగయిదు టీవీల వాళ్ళు ఆయనని చర్చలకు పిలిచే పరిస్థితి ఏర్పడింది. సొంత కారులో రావడం టీవీల వాళ్లకి కూడా కలిసొచ్చే అంశం అయివుంటుంది.
ఏడాది తిరక్క ముందే ఒక పార్టీకి అధికార ప్రతినిధి హోదాలో చర్చల్లో పాల్గొనడం మొదలు పెట్టాడు. ప్రతిపక్షంలో వుంటే కొన్ని విషయాల్లో వెసులుబాటు ఉంటుందని ఆయనే ఒక సారి నాతొ అన్నారు. ప్రతి అంశం మీదా ప్రభుత్వాన్ని ఝాడించే అవకాశం ఉంటుందని, తేలిగ్గా గుర్తింపు లభిస్తుందని ఓ సారి నాకు గీతాబోధ కూడా చేశారు. ప్రభుత్వం తరపున మాట్లాడే వాళ్ళు చాలామంది వుంటారు. దానివల్ల టీవీల్లో కనబడే అవకాశాలు అరుదుగా దొరుకుతాయి. అదే ప్రతిపక్షం తరపున అయితే చాలా టీవీల్లో కనిపించవచ్చు అనేది ఆయన థియరీ. సమర్థించే వాదనలు ప్రజలకు నచ్చవు, అదే ఘాటుగా విమర్శలు చేస్తుంటే అభిమానులు పెరుగుతారు. ఇలా ఉండేవి ఆయన అభిప్రాయాలు.
ఆయన అంచనా తప్పలేదు. కొన్నాళ్ళకు అధికార పార్టీ నుంచి పిలుపు వచ్చినట్టుంది. కొన్నేళ్ళు అలా అధికార పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ చర్చలు కొనసాగించిన పిదప, ఆయన సేవలకు సంతోషించిన పార్టీ పెద్దలు ఏదో కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు.
ఆరంభంలో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ స్టూడియోలకి వచ్చిన అతడు, అనతికాలంలోనే అధికారిక వాహనంలో రావడం మొదలు పెట్టాడు. అతడి ఎదుగుదల క్రమం, అతడి పట్టుదల, అతడి ప్రణాళిక చూసి ముచ్చట వేసేది.
నేను స్టూడియోలకు పోక చాలాకాలం అయింది. ఎప్పుడయినా ఏ టీవీలో అయినా కనబడతాడేమో అని చూస్తుంటాను.
బహుశా అతడు నిర్ణయించుకున్న తొలి లక్ష్యం నెరవేరిందేమో తెలియదు. అతడయితే కనబడడం లేదు. ఫోను కూడా చేయడం లేదు. (18-12-2020) టీవీ చర్చలు

4 కామెంట్‌లు:

  1. ఘంటా చక్రపాణి కాదేమో? చక్రపాణి తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ కు తొలి ఛెయిర్మన్ అయ్యారు. ఈ టపాలో పేర్కొన్న పెద్దమనిషి ఏదో కార్పొరేషన్ కు ఛెయిర్మన్ అంటున్నారు రచయిత శ్రీనివాస రావు గారు.

    రిప్లయితొలగించండి