ముందు మాటలో ముందే చెప్పాను, ఇది నా ఒక్కడి కధ కాదని. నా చుట్టూ అల్లుకున్న చారిత్రిక, సామాజిక రాజకీయ అంశాల సమాహారం అని. రాజకీయ అంశాల ప్రస్తావనకు ఇప్పటికి, అంటే ఈ వ్యాస పరంపరలో నేనింకా చిన్నపిల్లవాడినే, జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించడానికి ఇంకా బోలెడు వ్యవధానం వుంది. సమయం వచ్చినప్పుడు ఆ చిట్టా విప్పుతాను.
కృష్ణ నీళ్ళ
ప్రభావం ఏమో తెలియదు కానీ, బెజవాడ వాసులకు బెజవాడ అంటే ప్రాణం. ఈ సరికి మీకూ విషయం అర్ధం
అయివుండాలి. నా చిన్నతనం గడిచిన ఊరు ప్రస్తావన వచ్చినప్పుడు బెజవాడ అంటున్నాను.
పెరిగి పెద్దయిన తర్వాత విజయవాడ అని పేర్కొంటున్నాను. రెండూ వేరు కాదు కానీ, నా
దృష్టిలో రెండూ వేరే. అప్పుడు నేనున్నది బెజవాడ. ఇప్పుడు అది విజయవాడ.
ఒకానొక రోజుల్లో బెజవాడ అంటే రెండు
రోడ్ల నడుమ వెలిసిన ఒక పెద్ద బస్తీ. ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు వీటి మధ్య అడ్డం నిలువులు గీతల
మాదిరిగా చిన్న చిన్న వీధులు ఒకమోస్తరు అడ్డ రోడ్లు. ఎటు వెళ్ళినా నడిచి
తిరగొచ్చు. కొంచెం దూరం అయితే రిక్షాలు. మరీ దూరం అయితే సిటీ బస్సులు. గొల్లపూడి –
గుణదల,
గొల్లపూడి – పోరంకి, గుణదల- రైల్వే స్టేషన్, పోరంకి రైల్వే స్టేషన్. ఇలా వెళ్ళ మీద లెక్కపెట్టే
సిటీ బస్సులు, అవీ ప్రైవేటు బస్సులు రయ్యిరయ్యిమని తిరుగుతుండేవి.
పొట్టు బస్తాలో పొట్టు కూరినట్టు ప్రయాణీకులని బస్సులో కుక్కి కానీ బస్సు
బయలుదేరతీసే వాళ్ళు కాదు. అప్పటిదాకా ఉక్కబోతతో జనం అల్లాడి పోయేవారు. ప్రతి
బస్సుకి ముగ్గురు సిబ్బంది. డ్రైవరు, కండక్టరు, క్లీనరు. బస్సు మెట్టు మీద నిలబడి, క్లీనర్ కుర్రాడు
గట్టిగా బస్సు మీద చరుస్తూ రైట్ రైట్ అంటే
బస్సు కదిలేది. అలాగే హోల్డాన్ అంటే ఆగేది. ఇక కండక్టర్ ప్రయాణీకుల మధ్య నుంచి
అభిమన్యుడిలా దూసుకుపోతూ టిక్కెట్ టిక్కెట్ అంటూ టిక్కెట్లు కొట్టేవాడు. రోడ్డు
మీద రిక్షాలు, లారీల రద్దీ ఎంతవున్నా కూడా డ్రైవర్ మాత్రం బీడీ
తాగుతూ వేగం తగ్గించకుండా, చేతిలో స్టీరింగ్ విరిగి ఊడివస్తుందేమో అన్నట్టుగా
భయంకరంగా అటూ ఇటూ తిప్పుతూ నడిపేవాడు. ఈలోగా టిక్కెట్టు, అర టిక్కెట్టు విషయంలో పేచీలు.
కండక్టర్ వెంటనే హోల్డాన్ అంటూ కేకపెట్టి బస్సు ఆపించేవాడు. ఆ లడాయి తెగేదాకా
బస్సు రోడ్డు మీదనే నిలిచేపోయేది. మిగిలిన ప్రయాణీకులు తమ తొందరలో కండక్టర్ పక్షాన
నిలబడి బస్సు కదలడానికి తమ వంతు నోటి సాయం చేసేవారు. మా చిన్నతనంలో
బస్సులకు మూతులు ఉండేవి. అంటే
ఇంజిన్ ముందు వుండేది, తరువాత మూతి కనబడని బస్సులు వచ్చాయి. మా పెద్దల
కాలంలో బొగ్గు ఇంజిన్ల బస్సులు వుండేవిట. నైజాం నుంచి బెజవాడ పని మీద వచ్చిన
వాళ్ళు ఇదెక్కడి గోల అనుకునే వాళ్ళు. ఎందుకంటే తెలంగాణా ప్రాంతంలో బస్సులు నిజాం
సర్కారు ఆధ్వర్యంలో చిరకాలంగా నడుస్తూ వచ్చాయి. నైజాం సర్కారుకు ప్రత్యేకంగా రైళ్లు
కూడా వుండేవి. నైజాం భారత ప్రభుత్వానికి
లొంగి పోయిన తర్వాత ప్రభుత్వ రోడ్డు రవాణా
సంస్థ ఆధ్వర్యంలో బస్సులు నడిచేవి. వాటిని ఎర్ర బస్సులు అనేవారు.
ఆంధ్ర ప్రాంతంలో ప్రైవేటు రంగంలో వున్న
బస్సు రూట్లను జాతీయం చేయాలనే డిమాండ్ జనంలో బాగా పెరిగిపోవడానికి ఆ బస్సు రూట్ల
యజమానులు వాళ్ళు అనుసరించిన అమిత లాభాపేక్ష విధానాలే కారణం. బెజవాడ వంటి పట్టణంలో ఒక్కో రూటును గుత్తకు
తీసుకున్నవాళ్లు కోటీశ్వరులయ్యారు అనే
అభిప్రాయం కూడా ప్రజల్లో ప్రబలింది. ఒక్క రూటు మీదనే ఇంత ఆదాయం వున్నప్పుడు, మొత్తం రూట్ల మీద పెత్తనాన్ని
ప్రభుత్వమే తీసుకుంటే ఖజానాకు లభించే లాభాలను గురించి ప్రజల్లో చర్చ మొదలయింది. ఈ
అంశం తీవ్రంగా మారి ఏస్థాయికి చేరిందంటే, ఆ నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రధమ ముఖ్యమంత్రి
డాక్టర్ నీలం సంజీవరెడ్డి రాజీనామా చేయాల్సిన పరిణామానికి పరోక్షంగా దారి తీసింది.
కర్నూలు జిల్లాలో బస్సు రూట్ల జాతీయకరణకు సంబంధించిన ఒక కేసులో ( వివరాలకు : శ్రీ
గుళ్ళపల్లి నాగేశ్వర రావు వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, https://www.advocatekhoj.com/library/judgments/index.php?go=1959/august/5.php) ప్రభుత్వం
దాఖలు చేసిన అఫిడవిట్ విషయంలో సుప్రీం కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలకు స్పందిస్తూ, నైతిక బాధ్యతగా సంజీవ రెడ్డి గారు
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం రాజకీయాల్లో విలువల ప్రాధాన్యతను నిరూపించింది.
సరే! కొన్నేళ్ళ తర్వాత ఆంధ్ర ప్రాంతంలో
కూడా బస్సు రూట్లను జాతీయం చేయడం, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అనే పేరుతొ ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలకు కలిపి ఒకే కార్పొరేషన్
ని ఏర్పాటు చేయడం జరిగాయి. ఆ విధంగా ఆర్టీసీ వారి ఎర్ర బస్సులు తమ ఊరికి
వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతం ప్రజలు పండగ చేసుకున్నారు.
అప్పటికి నేను విజయవాడ వదిలేశాను.
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి