బెజవాడ సీవీఆర్
హైస్కూల్లో నా సహాధ్యాయులందరూ మెరికలే. బహుశా పల్లెటూరి నేపధ్యం కారణంగా నేను వారి
కంటే చదువులో కొంచెం వెనుకబడ్డానేమో తెలియదు. అలా అని వెనుక బెంచి బాపతు కాదు.
ముందు బెంచీలోనే కూర్చొనే వాడిని. ప్రతి
క్లాసు పాసవుతూ వచ్చాను కానీ మంచి మార్కులతో మాత్రం కాదు. ప్రస్తుతం టచ్ లో ఉన్న
స్కూలుమేట్స్ ఇద్దరు ముగ్గురే వున్నారు. నా మేనల్లుడు సాంబశివరావు (శాయిబాబు)
ఇప్పుడు లేడు. వుంటే నాకు రెడీ రికనర్) .
దేనికీ తడుముకోవాల్సిన పని వుండేది కాదు. ఇక వేమవరపు భీమేశ్వరరావు హైదరాబాదులోనే వున్నాడు. అతడికి జ్ఞాపకశక్తి
ఎక్కువ. పొతే, మరొక మిత్రుడు దేవరకొండ ప్రసాద్, దేశాల మధ్య, నగరాల మధ్య
గాలిలో తిరుగుతుంటాడు. ధారణలో అతడూ దిట్టే. మొన్నీమధ్య ఫోన్ చేసి డిసెంబరు రెండో వారంలో ఒక పెళ్ళికోసం హైదరాబాదు
వస్తున్నాను, తప్పకుండా కలవాలి అన్నాడు. నిజానికి అది నా అవసరం. ‘తప్పకుండా.
భీమేశ్వరరావుని కూడా కలుద్దాం అన్నాను. వీళ్ళని కలిస్తే నా స్కూలు జీవితానికి
సంబంధించిన విశేషాలు పోగుచేసుకోవచ్చు. అదీ నా తాపత్రయం. మతిమరపులో నాది మొదటి ర్యాంకు కదా! అందుకు.
దాదాపు నలభయ్ ఏళ్ల విరామం
తర్వాత బీమేశ్వరరావుని పదిహేనేళ్ల క్రితం కలిసాను.
2009 డిసెంబరులో ఒకరోజు
ఉదయాన్నే ఫోను మోగింది. కాఫీ తాగుతూ పేపరు
చదువుతున్ననేను ‘ఇంత పొద్దున్నే ఎవరబ్బా’ అనుకుంటూనే ఫోను తీశాను. లాండ్ లైన్
రోజులు. ‘శ్రీనివాసరావా!’ అంటూ అవతలనుంచి కాస్త వయసుమీద పడినట్టున్న గొంతు
పలకరించింది. ‘అవును. మీరు....’ అన్నాను కొంచెం సందిగ్ధంగా . ‘గుర్తు పట్టు
చూద్దాం’ అంది అవతలి గొంతు కవ్వింపుగా. ‘భీమేశ్వరరావు కదూ..’ అంటూ నలభయ్ ఏళ్ళ
తరువాత విన్న ఆ స్వరాన్ని గుర్తుపట్టాను. మరో బాల్య మిత్రుడు సాంబశివరావుని కూడా
పిలిచి మా ఇంట్లో కలవాలని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాం. అలాగే కలిశాం. నలభయ్
ఏళ్ళ తరవాత కలయిక. ముచ్చట్లకు లోటేమిటి?
స్కూలు చదువులు, పై చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, రిటైర్ మెంట్లు ఇలా అన్నీ పూర్తయ్యాక జరిగిన సంగమం ఇది.
భీమేశ్వరరావు
కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయి హైదరాబాదు వచ్చాడు. వచ్చినప్పటి నుంచి
కూడా తనతో కలిసి చదువుకున్న మా జాడకోసం తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నిస్తూనే వున్నాడు.
తన దగ్గరకు హోమియో వైద్యం కోసం వచ్చిన ఒక మీడియా మిత్రుని ద్వారా నా ఫోను నెంబరు పట్టుకున్నాడు. అదీ ఫోన్ కాల్ వెనుక
కధ. అప్పటికే ముగ్గురం మా వృత్తిపరమైన
కొలువుల నుంచి రిటైర్ మెంటు పేరుతొ బయటపడ్డాము. భీమేశ్వర రావు తనకు తండ్రి గారి
నుంచి సంక్రమించిన హోమియో వైద్యాన్ని అవసరమైన వారికి అందిస్తూ తృప్తిగా జీవనం
గడుపుతున్నాడు. అతడో చెయ్యి తిరిగిన రచయిత అని ఫేస్ బుక్ ద్వారానే తెలిసింది. అతడు
రాసిన తన జీవిత చరిత్ర అపూర్వం. అతడికి వున్న అసాధారణ ధారణ శక్తి ఆ పుస్తకం
రాయడానికి బాగా ఉపకరించింది. రాసే రంగంలో వుండి
కూడా నేను అతగాడిలా అంత విస్తృతంగా, అంత బాగా రాయలేకపోయాను.
మా జ్ఞాపకాలను, చిన్ననాటి
అనుభూతులను నెమరు వేసుకోవడానికి అదృష్టవశాత్తు మా రిటైర్ మెంటు పనికి వచ్చింది. ముందే కలిసివుంటే హోదాల గోదాలు అడ్డు వచ్చి
వుండేవేమో. నేను ఆరోజుల్లో అలా ఇలా అని
చెప్పుకోవడానికే సమయం సరిపోయేదేమో మరి.
ముందు నుంచీ కూడా భీమేశ్వరరావు చాలా క్రమశిక్షణతో వుండేవాడు.
వాళ్ళ నాన్నగారి నుంచి అబ్బిన మంచి లక్షణం. మితభాషి కూడా. ఇప్పుడు ఇంతలా
మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా వుంది. ఇన్నాళ్ళు టీచింగ్ ఫీల్డ్ లో వున్నాడు కదా! బహుశా
అంచేత మాటకారిగా మారివుంటాడు’ అన్నాడు శాయిబాబు అనే సాంబశివరావు, అన్నాడు ఆనాటి కలయికలో.
“కానీ మేమిద్దరం
అలా కాదు. కొంచెం ఆకతాయిలం. అప్పట్లో వాలీబాల్ లాంటి ఆటలను గంట ఆడుకోవడానికి రెండుగంటలు ప్రాక్టీసు చేసేవాళ్ళం. సెకండ్ షో సినిమాలు, నాటకాలు అబ్బో
..చాలా వేషాలు వేశాం” అని తుర్లపాటి చెబుతుంటే, “అవును. మా
స్కూల్లో మాకు చక్కని వినోదాన్ని పంచేవాడు శ్రీనివాసరావు. పాటలు, పద్యాలు, కవితలు. అతడికి రాని
కళలు లేవంటే నమ్మండి. మాయాబజార్ లో పాటలూ, పద్యాలు అన్నీ
కంఠస్థ౦. నేనెప్పుడు మాయాబజార్ పాటలు విన్నా నాకు శ్రీనివాసరావు చాలా గుర్తుకు
వచ్చేవాడు. అల్లరికి అల్లరి, చదువుకు చదువు
అన్నీ చేసేవాళ్ళం’ అని మాటలు మొదలు పెట్టాడు, భీమేశ్వరరావు.
లోపల కాఫీ
కలుపుతున్న మా ఆవిడ వింటున్నదన్న భావనలో కాస్త చాతీ పెంచుకుని నేనూ సంభాషణలో
పాలుపంచుకున్నాను.
“అంతేనా ఏ మాస్టారు
తగిలినా ఆ మాస్టారు మీద కవిత్వం
రాసేవాళ్ళం. అయితే వీళ్ళిద్దరూ చదువులో ఫాస్ట్. నేనేమో లాస్ట్ నుంచి ఫస్ట్. అయినా మా మీద ఇప్పటి పిల్లల మాదిరిగా ఒత్తిళ్ళు, లక్ష్యాలు లేవు. హాయిగా
తిరిగాం, తిరుగుతూ పెరిగాం. బాల్యాన్ని చక్కగా
ఆస్వాదించాం” అనేది నా మాట.
“మొత్తానికి
ఇన్నాళ్ళ తరువాత కలుసుకోవడం ఉద్విగ్నంగానే కాదు ఎంతో ఎమోషనల్ గా
అనిపిస్తోంది. చదువు పూర్తయిన తరువాత
హైదరాబాదులోనే ఉద్యోగం సంపాదించుకుని అక్కడే స్థిరపడాలనే కోరిక నాకుండేది. అయితే
దురదృష్టవశాత్తు నాకిక్కడ ఉద్యోగంచేసే అవకాశం రాలేదు. కానీ ఇక్కడ స్థిరపడే అదృష్టం
మాత్రం దక్కింది. అయితే ఇప్పటి హైదరాబాదు అప్పటిలా లేదు. చాలా మారింది. అప్పట్లో
విజయవాడ నుంచి హైదరాబాదు రావాలంటే ఎంతో సంబరపడేవాళ్ళం. మళ్ళీ ఇక్కడనుంచి బెజవాడ
వెళ్ళాలంటే ఏడుపొచ్చేది” అని భీమేశ్వరరావు చెబుతుంటే, “అవును! ఇప్పుడున్న
రామోజీ సిటీ ప్రాంతంలో రోడ్డుకు రెండు వైపులా ద్రాక్షతోటలు ఉండేవి. ఆ పొలిమేరల్లోకి
బస్సు రాగానే వాతావరణం పూర్తిగా మారిపోయేది. బస్సు కిటికీ ఇనుప రాడు చల్లగా ఐసు
కడ్డీలా అయిపోయేది. అలా రాడ్లు చల్లబడ్డాయంటే హైదరాబాదు వచ్చినట్టు లెక్కన్న మాట.
అసలా హైదరాబాదుకు ఇప్పటి హైదరాబాదుకు పోలికే లేదు” నా అనుభవం నాది.
ఇవన్నీ ఎలా
గుర్తున్నాయి అంటారా. కారణం సరస్వతి రమ అనే జర్నలిస్టు. మా ముగ్గురి కలయిక గురించి
ఆంధ్రజ్యోతి పత్రికలో ‘నలభయ్ ఏళ్ల తర్వాత కలిసిన ముగ్గురు మితృలు’ అంటూ సంగమం అనే శీర్షిక కింద ఒక వ్యాసం రాసారు. అదీ కధ.
నాకు మొదటినుంచి మాటకారి అనే పేరు వుండేది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మాట పడి పోయింది, కానీ నేను నా జీవితాన్ని మాటలతోనే నెట్టుకు వచ్చాను. శ్రీనివాసరావు ఎక్కడ వుంటే అక్కడ సందడే సందడి అనేవాళ్ళు. వ్చ్! అంతా ఇప్పుడు అందమైన గతం. ఓ కల. ఇప్పుడు గంటకో మాట మాట్లాడితే గొప్ప.
మాటల్లో
మరచిపోయి ఏదేదో మాట్లాడుతున్నాను. ఏం చెబుతున్నాను? నాకు మాట్లాడం అంటే వ్యసనం అని. మాటలు
అంటే పోచికోలు కబుర్లు చెప్పడం అన్నమాట. రైల్లో రిజర్వేషన్ లేకుండా ఎక్కినా, నా మాటల
మత్తులో పడి ‘ఎంతసేపు అలా నిలుచుంటారు మాస్టారు, ఇదిగో ఇలా వచ్చి ఇక్కడ కూచోండి, నేను పడుకుని
చాలాసేపు అయింది, మీరు కాళ్ళు చాపి పడుకోండి, నేనెలాగో అలా సర్దుకు కూచుంటాను’ అని రిజర్వేషన్ వున్నవాళ్ళు
పక్కకు తప్పుకుని ఒదిగి కూచున్న ఘట్టాలు నా జీవితంలో చాలా వున్నాయి. ఇవన్నీ చూసి
నేనో మాటల పోటుగాడిని అని భ్రమించి ఎస్సారార్ కాలేజీ వాళ్ళు జగ్గయ్యపేటలో జరిగే
అంతర్ కళాశాలల వక్తృత్వ పోటీలకు పంపారు. అణు బాంబులు ప్రపంచానికి అవసరమా అనేది
టాపిక్. నన్ను పిలిస్తే వెళ్లి ప్రసంగం మొదలు పెట్టాను. అణ్వస్త్రాలు కావాలా ?
అన్నవస్త్రాలు కావాలా? అంటూ ప్రారంభించాను. సభలో
చప్పట్లు. ఆ చప్పట్లకు చిన్న మెదడులో చిన్న కుదుపు వచ్చి తరవాత ఏం మాట్లాడాలో
మరచిపోయాను. రెండు మూడు నిమిషాలు మైకు బాగు చేసేవాడిలా ఏమీ మాట్లాడకుండా నిలబడి
పోయేసరికి మళ్ళీ చప్పట్లు. అయితే ఈసారి దిగిపొమ్మని. నేనేమో మాటల మనిషిని. సభలో
ప్రసంగించమంటే ఎలా! అది కుదరని పని. పైగా మతిమరపు ఒకటి.
నా మతిమరపు
గురించి ఇలాంటి కధలు చాలా వున్నాయి. చాలావరకు మరచిపోయాను. భీమేశ్వరరావు, ప్రసాద్
గుర్తుచేస్తారేమో చూడాలి.
కింది ఫోటో:
2009 లో జర్నలిస్టు సరస్వతి రమ
ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం క్లిప్పింగ్
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి