15, ఫిబ్రవరి 2023, బుధవారం

ఈనాటి వార్త: ఓనాటి జ్ఞాపకం

 





ఎక్కడ ? ఎప్పుడు ? 


కొంత కాలం గత కాలంలో కలిసిపోయిన తర్వాత, ఆ నాటి పాత విషయాలను గుర్తు చేసుకుంటూ వుంటే, గుర్తుకు వస్తూ వుంటే, కొంత సంతోషం అనిపిస్తుంది, కొంత తమాషాగా అనిపిస్తుంది.


ఈ ‘ఎక్కడ ఎప్పుడు’ ఇలాటి విషయాల్లో ఒకటి. 

ఈ రెండు పదాలతో రేడియో మార్నింగ్ బులెటిన్ లో ఒక హెడ్ లైన్ వార్త తయారు అయ్యేది.


అర్ధరాత్రో అపరాత్రో మా చిక్కడపల్లి ఇంట్లో ఫోన్ రింగయ్యేది. ఆ రోజుల్లో ల్యాండ్ లైన్ ఫోన్లే. సెల్ కాలం కాదు.


ఫోను  మంచం పక్కనే  పెట్టుకునేవాడిని. మరీ అర్ధరాత్రి ఫోనయితే అవతల  రైల్వే పీఆర్ఓ మైఖేల్. తెల్లవారుఝామున అయితే సీపీఆర్వో కృష్ణయ్య గారు. అదీ లెక్క.


ఫోను ఎత్తి ‘ఎక్కడ? ఎప్పుడు?’ అని అడిగేవాడిని.

వాళ్ళ నుంచి జవాబు తీసుకుని వెంటనే విజయవాడ రేడియో ప్రాంతీయ వార్తా విభాగం న్యూస్ ఎడిటర్ శ్రీ ఆర్వీవీ కృష్ణారావు గారు లేదా శ్రీ ఏమ్వీఎస్ ప్రసాద్ గారికో ఫోను కలిపేవాడిని. ఎవరు డ్యూటీలో వుంటే వాళ్ళు నా ఫోన్ రిసీవ్ చేసుకుని  'ఎక్కడ? ఎప్పుడు?' అని అడిగేవారు. నేను క్లుప్తంగా ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళు ఓ వార్త రూపంలో రాసుకునే వారు.  వాళ్ళిద్దరూ ఎంతటి సమర్ధులు అంటే కొన్ని  క్షణాల్లో నేను చెప్పిన వార్తను విస్తరించి,  మరికొన్ని నిమిషాల్లో ప్రసారం అయ్యే ప్రాంతీయ వార్తల బులెటిన్ లో ప్రాధాన్యతా క్రమంలో చేర్చేవారు. 


“ఆకాశవాణి  ప్రాంతీయ వార్తలు చదువుతున్నది  ప్రయాగ రామకృష్ణ/ కొప్పుల సుబ్బారావు.


“దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఒక గూడ్స్ రైలు  రాత్రి పట్టాలు తప్పింది. పలానా  స్టేషన్ల నడుమ జరిగిన ఈ దుర్ఘటన కారణంగా పలు రైళ్ళ రాకపోకలకు  అంతరాయం కలిగిందని, కొన్ని రైళ్లు దారి మళ్లిస్తున్నారని రైల్వే అధికారులు కొద్దిసేపటి క్రితం మా హైదరాబాదు ప్రతినిధికి తెలియచేసారు. వివరాలు.....”


ఎక్కడో సికిందరాబాదు  రైల్వే క్వార్తర్స్ లో పొద్దున్నే రేడియో పెట్టుకుని వార్తలు వింటున్న రైల్వే అధికారులు, ఎలాంటి పొరబాటు లేకుండా వార్త ప్రసారం అయిన సంగతి తెలుసుకుని ఊపిరి పీల్చుకునే వారు. చెప్పిన వార్త ఎలాంటి తభావతు లేకుండా వస్తుందని తెలుసు కనుక నేను ముసుగు తన్ని నిద్రపోయేవాడిని.

1 కామెంట్‌:

  1. “ఓనాటి జ్ఞాపకం” అంటే మరో రైలు ప్రమాదం గురించేమో అనుకున్నాను.

    ఓ ఇరవై యేళ్ళ క్రితం వరంగల్ / కాజీపేట దగ్గర గోల్కొండ ఎక్స్-ప్రెస్ రైలుకు ప్రమాదం జరిగింది. కొన్ని రైలు పెట్టెలు పట్టాలు తప్పి అక్కడున్న రైల్-రోడ్ బ్రిడ్జి మీద నుంచి క్రింద నున్న రోడ్డుపై పడ్డాయి. ప్రాణనష్టం అధికంగానే జరిగిందని గుర్తు (రోడ్డు మీద ట్రాఫిక్ టైం కదా). ఒక ఫొటో నాకు బాగా గుర్తు - స్లీపర్ పెట్టెలో మధ్యనున్న బెర్త్ విరిగి క్రింద బెర్త్ మీద కూర్చునున్న వ్యక్తి మెడ మీద పడి అతన్ని కిటికీ వైపు నొక్కి పట్టింది. ఫొటో తీసేటప్పటికి అతనింకా ప్రాణాలతోనే ఉన్నాడు, సహాయం కోసం చాలా సేపు అరిచాడని, ఎంత సేపటికీ సహాయం రాలేదనీ, చివరకు అతను మరణించాడనీ వార్త వచ్చినట్లు జ్ఞాపకం. మీరప్పటికింకా సర్వీసులోనే ఉన్నారా? ఈ రైలు ప్రమాదం వార్తను రేడియోలో మీరే కవర్ చేశారా?

    రైల్వే స్టేషన్ల లాగా రేడియో స్టేషన్లకు కూడా ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు (ఉదా:: హైదరాబాద్-విజయవాడ, విజయవాడ-వైజాగ్, హైదరాబాద్-కడప etc etc) హాట్ లైన్ ఫోన్లు ఉండేవాండీ ఆరోజుల్లో? అలా లేకపోతే ట్రంక్ కాల్ కలవాలి అంటే కాలాతీతం అయిపోతుంది కదా?

    రిప్లయితొలగించండి