14, ఫిబ్రవరి 2023, మంగళవారం

నిశ్శబ్దం రాజ్యమేలిన ముఖ్యమంత్రి సభ - భండారు శ్రీనివాసరావు

 (ఫిబ్రవరి 14 దామోదరం  సంజీవయ్య గారి జయంతి)

ఈ విషయం చెప్పే ముందు దీంతో సంబంధం ఉన్న మరో విషయంతో మొదలు పెడతాను.

మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ స్థాయికి చేరడానికి ముందు ఎక్కిన అనేకానేక నిచ్చెన మెట్లలో నెలకు పాతిక రూపాయల ‘విలేకరి కొలువు’ కూడా వుంది.

ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బీజీ ఎన్ ఆర్ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తిచేశారు. రామ్మోహనరావు గారు ఆ కాలేజీలో లెక్చరర్. వారి నాన్నగారికి పత్రికల ఏజెన్సీ కూడా వుంది. అప్పట్లో ఆ ఏజెంట్లే పత్రికా విలేకరుల పాత్ర కూడా పోషించేవారు. మా అన్నయ్యకు తెలుగులో ఉన్న ప్రావీణ్యం గమనించి ‘నెలకు ఓ పాతిక ఇస్తాను, నీకు పాకెట్ మనీగా పనికి వస్తుంది, నువ్వు ఆంద్రజ్యోతి పత్రికకు వార్తలు రాస్తుండు. వాళ్ళు వేస్తె వేస్తారు, లేకపోతే లేదు, కానీ నీకు మంచి కాలక్షేపంగా వుంటుంది’ అని ప్రోత్సహించడంతో మా అన్నయ్య ఒప్పుకున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తాను.

నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు అయింది. అప్పటికే జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ రెండు వర్గాలుగా విడిపోయివున్నారు. జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి వంటి అతిరధులు కలిగిన ప్రధాన వర్గం అప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవ రెడ్డికి అనుకూలం. మరో వర్గం సంజీవయ్య వైపు. దీనికి మాకు బాబాయి వరుస అయిన బొమ్మకంటి సత్యనారాయణ నాయకులు. ఖమ్మం జిల్లాకు సంబంధించినంతవరకు ఆయన ముఖ్యమంత్రి సంజీవయ్యకు కుడి భుజం. సంజీవయ్యకు సంఘీభావం తెలిపేందుకు గోకినేపల్లిలో జిల్లా దళిత మహా సభ ఏర్పాటు చేశారు. ఈ సభను కవర్ చేయడానికి పాతిక రూపాయల విలేకరి అయిన మా అన్నయ్యను పురమాయించారు రామ్మోహన రావు గారు.

సభ బాగా జరిగింది. ముఖ్యమంత్రి ప్రసంగించడానికి మైకు ముందు నిలబడ్డారు. సంజీవయ్య స్వతహాగా మంచి వక్త. ఆయన ప్రసంగం మొదలు పెట్టారు.

నన్ను బాధ పెడుతున్న, నా మనసును కలచి వేస్తున్న ఓ విషయాన్ని మీకు చెప్పదలచుకున్నాను. ఇక్కడ పైనా కిందా కూర్చున్న మనుషులం అందరం ఒకే తీరున ఉన్నాము. ఒంట్లో పారే రక్తం రంగు అందరికీ ఎరుపే. కానీ మనలో చాలామందిమి సాటి మనిషిని మనిషిగా చూస్తున్నామా అంటే అనుమానమే. డబ్బున్న ఖామందులు పెంపుడు బొచ్చు కుక్క పిల్లల్ని తమ పక్కలపై పడుకోబెట్టుకుంటారు. ముద్దు చేస్తారు. అదే సాటి మనిషిని తాకడానికి కూడా వారికి అస్పృశ్యత అనే అనాచారం అడ్డం వస్తుంది. కుక్కలపాటి చేయరా ఈ మనుషులు? ఎందుకీ వ్యత్యాసం? ఎందుకీ వివక్ష?’

రెండు చేతులూ గట్టిగా గాలిలో ఊపుతూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్వరం బొంగురుపోయింది. పైకిలేపిన చేతులను అలాగే వుంచి ఆయన కాసేపు మౌనంగా వుండిపోయారు.

సభకు హాజరై ప్రసంగం వింటున్న యావన్మంది చేష్టలు ఉడిగి వుండిపోయారు. అంతటా నీరవ నిశ్శబ్దం.

సరే! ఆ రోజు సభ ముగిసింది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి దామోదరం సంజీవయ్య అంబాసిడర్ కారు ఎక్కారు. ఆయన పక్కనే మా బాబాయి బొమ్మకంటి సత్యనారాయణ. ముందొక పోలీసు జీపు, వెనక మరో జీపు. అదీ ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆ రోజుల్లో.

మా అన్నయ్య ఖమ్మం చేరుకున్న వెంటనే తన రిపోర్ట్ రాసి మర్నాడు పోస్టులో పంపారు. ఆ మరునాడు అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది.

ముఖ్యమంత్రి దళిత సభలో రాజ్యమేలిన నిశ్శబ్దం’.

వార్తతో పాటు మా అన్నయ్య పెట్టిన హెడ్డింగ్ కూడా యధాతధంగా పత్రికలో రావడం కొసమెరుపు.



 

3 కామెంట్‌లు: