(10-01-2022,
సోమవారం
రాత్రి 9.30 గంటలకు
సాక్షి టీవీలో ప్రొడ్యూసర్ సి.ఎన్.ఎస్. యాజులురూపొందించిన ‘మహాసంగ్రామం’ మేగజైన్ స్టోరీ కార్యక్రమంలో నా
కొన్ని మాటలు)
చాలా ఏళ్ళ క్రితం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఒకరు
నాతొ చెప్పారు. మమ్మల్ని ఎవరూ ఓడించాల్సిన అవసరం పడదు. ఎందుకంటే మమ్మల్ని మేమే ఓడించుకుంటాం. ఆ
విద్యలో మేము ఆరితేరాం అని. ఇన్నేళ్ళు గడిచిన
తర్వాత కూడా కాంగ్రెస్ వైఖరి గురించి ఆయన
చెప్పిన మాట ఇప్పటికీ నిజమే అనిపిస్తోంది .
దీనికి
ఉదాహరణ చండీఘడ్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు. ఈ మధ్యనే జరిగాయి.
అమ్ ఆద్మీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. బీజేపీకి రెండు సీట్లు
తక్కువ వచ్చాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీని ప్రధాన ప్రత్యర్ధిగా చూడాల్సిన
కాంగ్రెస్, ఎవరి
సలహానో ఏమిటో కాని గైరు హాజరు అయింది. దాంతో బీజేపీ మేయరు పీఠం ఎగరేసుకు పోయింది.
ఇలా వుంటాయి ఆ పార్టీ అధిష్టానం కప్పదాట్లు. కాంగ్రెస్ కనుమరుగు అయిపోతోంది అని నలుగురూ
అంటుంటే అనరా మరి.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన
బలహీనత తన ప్రధాన ప్రత్యర్థి ఎవరో అనే విషయంలో ప్రాధాన్యతలు నిర్ణయించుకోకపోవడం. అదే బీజేపీని చూడండి. కాంగ్రెస్ ముక్త భారత్ తన ప్రధాన ధ్యేయం
అని స్పష్టంగా చెబుతుంది. ఆ దిశగా ఎవరితో అయినా ఇచ్చి పుచ్చుకోవడం అనే విధానం
అవలంబిస్తుంది. రాజకీయం అంటే అదీ.
పేరుకు అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు
జరగబోతున్నప్పటికీ, వీటిల్లో రాజకీయంగా చూస్తే ఉత్తర ప్రదేశ్, పంజాబు
రాష్ట్రాలే ప్రాధాన్యత కలిగిన రాష్ట్రాలు. రైతుల ఆందోళన అంశం ఇంకా పచ్చిపచ్చిగానే
వుంది. పంజాబులో బీజేపీ విజయావకాశాలను ఈ
అంశం ప్రభావితం చేయగలదన్న ఆశాభావంతో ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా అమ్ ఆద్మీ,
కాంగ్రెస్ పార్టీలు ఉన్నట్టుగా వుంది.
పొతే ఉత్తరప్రదేశ్. నా చిన్నప్పటి నుంచీ స్కూలు
చదువులు పూర్తయి,
కాలేజీకి వచ్చేవరకు అక్కడ కాంగ్రెస్
పాలనే. పైగా ఆ పార్టీ ముఖ్యమంత్రులు చాలామంది బ్రాహ్మణులే. గోవింద వల్లభ పంత్,
కమలాపతి త్రిపాఠి,
హేమవతి నందన్ బహుగుణ, ఎన్డీ తివారి, శ్రీపతి మిశ్రా ఇలా అయిదుగురు
ముఖ్యమంత్రులు ఆ అగ్రకులానికి చెందినవారే కావడం ఓ విశేషం. పైగా నెహ్రూ కుటుంబానికి ఈ రాష్ట్రం పెట్టని కోట. ఎక్కువ పార్లమెంటు సీట్లు ఉన్న
ఉత్తరప్రదేశ్ చేతికి చిక్కితే ఎర్రకోటలో పాగా వేసినట్టే అని చెప్పుకునేవారు.
అలాంటి చోట ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏమిటి అంటే చిన్న పిల్లాడు కూడా జవాబు చెబుతాడు.
ఒకప్పుడు ఆ రాష్ట్రంలో చక్రం తిప్పిన మాయావతి
పార్టీ, బీ ఎస్ పీ పరిస్థితి కాంగ్రెస్
కన్నాకొంత మెరుగే కాని ఒంటరిగా అధికారంలోకి
వచ్చే పరిస్థితి లేదు. ఆ పార్టీని కలుపుకు పోయే పార్టీ కూడా ప్రస్తుతానికి కనుచూపు
మేరలో కనబడడం లేదు. ఒకానొక కాలంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు శాతం జనాభా ఉన్న బ్రాహ్మణులు, అధిక సంఖ్యలో ఉన్న ఎస్సీలు కలిస్తే అధికారం తధ్యమనే
భావనతో బీ ఎస్పీ ఆ ప్రయోగం సైతం చేసింది. గెలుపొందింది కూడా. ప్రస్తుతం వస్తున్న మీడియా సమాచారం ప్రకారం మాయావతి
ప్రభావం రానున్న ఎన్నికలలో అంతగా
లేనట్టుగా అనిపిస్తోంది.
ఇక సమాజ్ వాదీ పార్టీ. దాని నాయకుడు అఖిలేష్ యాదవ్ యువకుడు. ఒకసారి ముఖ్యమంత్రి
చేశాడు కూడా. ఎన్నికల రంగంలో బీజేపీకి బాగా పోటీ ఇచ్చేట్టు
కనబడుతున్నాడు. ఆ మధ్య ఆ పార్టీ వాళ్ళు పరశురాముడి విగ్రహం వేయించారు. రాముడి
పేరుతొ ఒకరు, పరశురాముడి పేరుతొ మరొకరు అన్నమాట.
పరశురాముడి పేరుతొ బ్రాహ్మణుల ఓట్లపై
పట్టు సాధించాలని సమాజ్ వాదీ ప్రయత్నిస్తున్నట్టుగా
వుంది. అయితే, మతం, కులం
ఇవి మాత్రమే ఎన్నికల్లో గెలిపిస్తాయి అని చెప్పడం ఉత్ప్రేక్ష. కానీ ఈనాటి మారిన రాజకీయ పరిస్థితుల్లో గెలవడానికి అవసరమైన
వనరుల జాబితాలో ఈ రెండూ వుండాలి.
(10-01-2022)
ఉత్ప్రేక్ష కాదేమోనండి అతిశయోక్తి అయ్యుంటుంది
రిప్లయితొలగించండి