“ముందు మీ గోల ఆపి నేచేప్పేది కాస్త వింటారా”
ఇన్నాళ్ళుగా కస్సూబుస్సులు లేకుండా తమ
మధ్యనే ఉంటున్న ఆ నాగుపాము పడగవిప్పి, నోరు
తెరిచి రెండు నాలుకలతో అలా అనగానే యావన్మందీ నిశ్చేష్టులయ్యారు.
“నేను ఇన్నాళ్ళు పుట్టల్లో, గుట్టల్లో తిరుగుతూ నోటికి అందిన
పురుగూపుట్రా తింటూ హాయిగా శేష జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఓ జెర్రి గొడ్డుతో
వెర్రిస్నేహం చేసి, దాని మాయ మాటల్లో పడి ఇదిగో ఈ ఊరు
చేరుకొని ఒక ఇంటి చూరుపై తల దాచుకున్నాను. ఆ రాత్రి వాళ్ళింట్లో పిల్లాడు పెద్దవాళ్ళు
నిద్రపోయిన తరువాత లేచి ‘జంతు ప్రపంచం’ ఇంగ్లీష్ ఛానల్ పెట్టాడు. అందులో ఒక పాము
కనిపించింది. ఎవరో ఓ తెల్ల పిల్లాడు ఆ నల్లతాచును ఎంచక్కా తన చేతిలో పట్టుకుని ఆడిస్తున్న దృశ్యం కంట పడింది. అది చూసి నాకూ కన్ను కుట్టింది. ఒక్క సారయినా అలా తెరపై కనిపిస్తే జన్మధన్యం అనికూడా
అనిపించింది. కొన్నాళ్ళు ‘కాటు’ వేసే బుద్ధి
మానుకుంటే ఇలా ఎంచక్కా టీవీలలో చూపెడతారు అనిపించి మర్నాడు తెల్లారగానే ఈ కొత్త
అవతారం ఎత్తాను. ముందు నన్ను చూసి జనం భయపడ్డా, వారిలోని
భక్తిప్రపత్తులు నన్ను ఒడ్డున పడేశాయి. ప్రాణ భయం లేదని తేలిపోయింది కాబట్టి
కొన్నాళ్ళు ఉపాసం వుంటే ఏం పోయిందని నేనూ ఇదే బాగుందని నిర్ణయించుకున్నాను.
అనుకున్నట్టే టీవీ వాళ్ళు రంగప్రవేశం చేసారు. ఆ హాలీవుడ్ పాముకు బుల్లితెరకు
ఎక్కడానికి ఎంత కాలం పట్టిందో తెలియదు కానీ నాకు మాత్రం ఆ భాగ్యం వెంటనే
వెతుక్కుంటూ వచ్చింది. నాలాగే ఆ టీవీ వాళ్ళూ ఇక్కడే మకాం వేసి ఉదయం నుంచి రాత్రి
దాకా అలసట లేకుండా లైవ్ టెలికాస్టులు మొదలెట్టారు. వాళ్ళు రాగానే వూళ్ళో వాళ్లకు
పూనకాలు పూనాయి. ‘ఒకరికి పుట్టె, ఇద్దరికి పుట్టె, అర్ధరాత్రి వేళకు అందరికీ పుట్టింది’ అన్నట్టు పూనకాలు, పూజలూ పెరిగిపోయి నాకు కంటిమీద కునుకు లేకుండా చేసాయి. మధ్యలో జంతు
ప్రేమికులూ, జీవ కారుణ్య సంఘాల వాళ్ళు వచ్చేసి
‘నాకేదో జరిగి పోతోంది, తమ ప్రాణాలు పణంగా పెట్టయినా సరే నా
ప్రాణాన్ని కాపాడతాం’ అంటూ వాదించడం మొదలెట్టారు. ఇన్నాళ్ళు నిద్రాణంగా ఉన్న తమ
ఊరుకు ఇంత వైభోగం తెచ్చిన ఈ పామును వూరు దాటించాలని చూస్తే ఊరుకునేది లేదంటూ
అప్పటికప్పుడు నాకు భక్తులు అయిపోయినవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళతో గిల్లీ కజ్జాకు దిగారు. పోలీసులు, అధికారులూ సరేసరి. ఈ మూడువారాల పూజలకే నాకు మతిపోతోంది. మరి తిరుపతి దేవుడు
అర్ధరాత్రి దాకా ఈ తాకిడి ఎలా తట్టుకుంటున్నాడో ఏమిటో!
‘మీ అందరికీ చెప్పేది ఏమిటంటే నేను వచ్చిన పని అయిపొయింది. టీవీల్లో కనబడీ
కనబడీ నాకే చిర్రెత్తుతోంది. ఈ విషయంలో ఊళ్లోవాళ్లకు ఉన్న టీవీ కాపీనం కూడా తీరి పోయుంటుంది. ఇన్నాళ్ళు మీరు చేసిన పూజా ఫలం ఏమో
తెలియదు కానీ నాకూ కొంత మహత్తు వంట్లోకి వచ్చింది. కావున, కాబట్టి నేను ఇంతటితో ఈ కధ ముగించి అంతర్ధానం అయిపోతున్నాను. మళ్ళీ
అడవిలోకి వెళ్లి దొరికిన కప్పనో, చిప్పనో తిని కడుపు నింపుకుంటాను. మీరు కూడా మీ లగేజి సర్దుకుని ఎవరి ఊళ్లకు, ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపొండి. శ్రీశ్రీశ్రీ మంగళం మహత్!’
పాము అలా చెప్పి మాయం అయిపోగానే
అప్పటిదాకా శిలలమాదిరిగా అయిపోయిన జనం మళ్ళీ
తెలివిలోకి వచ్చారు.
వున్నట్టుండి నిశ్శబ్దాన్ని భగ్నం
చేస్తూ ఒకడు గట్టిగా అరిచాడు.
‘ఈ పాము నోరు తెరవడంతో నా తెలివికాస్తా తెల్లారి పోయింది. పాము మాట్లాడుతున్న షాట్ తీయడం మరచిపోయాను’
అతడు ఆ టీవీ కెమెరామన్.
ట్యాగ్ లైన్ : మూఢనమ్మకాలు
విశ్వసించరాదు, ప్రచారం చేసుకోవచ్చు.
ట్యాగ్ లైన్ అద్దిరిపోయింది భండారు గారూ!
రిప్లయితొలగించండి