16, ఏప్రిల్ 2021, శుక్రవారం

సర్కారీ జర్నలిస్టు

 సుమారు మూడు దశాబ్దాలు హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేసిన అనుభవం నాకుంది. ఇన్నేళ్ళ ఉద్యోగ పర్వంలో ఏనాడు పై అధికారులెవ్వరూ, ఆ మాటకు వస్తే కేంద్రప్రభుత్వంలో, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ,  సమాచార ప్రసార శాఖ మంత్రులుగా పనిచేసిన తెలుగువారు కూడా 'ఈ వార్త ఇలా ఇవ్వండి, ఆ వార్త అలా యెందుకు ఇచ్చారు' అని అడిగిన జ్ఞాపకం లేదు. ఆ పాటి ఫంక్షనల్ అటానమీ (విధి నిర్వహణా స్వేచ్ఛ) ని నాతోపాటు పత్రికల్లో పనిచేసిన సాటి జర్నలిష్టు మిత్రులు అనుభవించారని అనుకోవడం లేదు. అయినా కానీ, సర్కారీ వార్తలు రాసే సర్కారీ జర్నలిష్ట్ అనే ముద్ర నుంచి తప్పించుకోలేకపోవడం విచిత్రం. బహుశా, పాలక పక్షాలకు ఎలాటి రాతలు, ఎలాటి వార్తలు రుచిస్తాయో అవగతం చేసుకుని అందుకు తగ్గట్టుగానే వార్తలు వండి వడ్డించి వుంటామని అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు.

రేడియో వార్తల సేకరణ, కూర్పు, ప్రసారాల్లో 'విధి నిర్వహణా స్వేచ్ఛ' గురించి సోదాహరణంగా చెప్పుకోవడం సముచితంగా వుంటుంది.

నర్రావుల సుబ్బారావు గారు. మోచేతుల కిందకి చొక్కా, పంచెకట్టుతో, చేతిలో చుట్టతో అచ్చం ఒక రైతు మాదిరిగా కనిపించేవారు. ఆయన్ని చూడగానే హైదరాబాదు ఆకాశవాణి ప్రాంతీయ వార్తావిభాగంలో న్యూస్ ఎడిటర్ అని ఎవరూ అనుకోరు. ఆకారంలోనే కాదు, నిజంగానే ఆయన రైతు పక్షపాతి. ఆ నైజం వార్తల్లో కూడా ప్రతిఫలించేది. వర్షాలు కురవక పలానా జిల్లాలో పైర్లు ఎండిపోతున్నాయని వార్తల్లో వివరాలతో సహా ప్రసారం చేసేవారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు. ఆయన మాటకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎదురులేదు. అయినా సుబ్బారావు గారు తరువాత అనేక సంవత్సరాలు రేడియోలో కొనసాగారు.

ఒకసారి ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సుబ్బారావు గారు లేచి పలానా ప్రాంతంలో పంటలు ఎండి పోతున్నాయని, అధికారులు చేతులు ముడుచుకుని కూర్చున్నారని అన్నారు ఆయన తరహాలో. చెన్నారెడ్డి గారి తరహా కూడా విలేకరులకు తెలుసు. ఆ ప్రశ్న ఆయనకు సుతరామూ నచ్చలేదు. అది ఆయన మాటల్లో కనబడింది.

చూడు సుబ్బారావ్! నువ్వు విలేకరిగా ఈ ప్రశ్న వేస్తే జవాబు చెబుతాను. రైతుల ప్రతినిధిగా వేస్తె ఇక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు”

ఇరువురూ హుందాగా వ్యవహరించడంతో రసాభాస కాకుండా అది అక్కడకి ముగిసిపోయింది.

రేడియోమీద కానీ, రేడియో వార్తలమీద కానీ సర్కారువారికి పట్టో, పెత్తనమో వుంటుందని ఆ రోజుల్లో ఓ అభిప్రాయం ప్రచారంలో వుండేది. ఇలాటి ఉదంతాలు విన్నప్పుడు వాటికి సరైన ప్రాతిపదిక లేదన్న వాస్తవం బోధపడుతుంది.

నా ఈడువాడే, కొంచెం చిన్నవాడు కూడా ఓ జర్నలిస్టు స్నేహితుడు ఉండేవాడు. ప్రముఖ పత్రికలో పనిచేసేవాడు. నన్ను ఎప్పుడూ సర్కారీ జర్నలిస్ట్ అని ఎద్దేవా చేస్తుండేవాడు. నేనొకసారి అతడితో అన్నాను.

గంటలో ప్రాంతీయ వార్తలు వస్తాయి. నువ్వు ఒక వార్త ఇవ్వు ఏదైనా సరే. అది రేడియోకి ఇస్తాను. అలాగే నేను నీకొక వార్త చెబుతాను. అది రేపటి నీ పత్రికలో వచ్చేట్టు చూడు. ఆ తర్వాత జర్నలిస్టుల స్వేచ్చ గురించి తీరిగ్గా మాట్లాడుకుందాము’

అతడు చెప్పిన వార్త రేడియోలో వచ్చింది. నేను చెప్పిన వార్త అతడి పేపర్లో రాలేదని వేరే చెప్పక్కరలేదు. మరునాడే కాదు, ఎప్పటికీ రాదని అతడికీ తెలుసు.

ఆ తర్వాత అతడెప్పుడూ సర్కారీ జర్నలిస్టు అనే పదం నా వద్ద తేలేదు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి