16, ఏప్రిల్ 2021, శుక్రవారం

డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారిక లేరు

 డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారితో చిన్న పర్సనల్ టచ్

దూరదర్శన్ విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో ఓ రోజు తెల్లగా తెలవారక మునుపే, కప్పు కాఫీ కూడా కడుపులో పడకుండానే జూబిలీ హిల్స్ లోని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కెమెరామన్ తో సహా చేరుకున్నాను. మిగిలిన జాతీయ చానళ్ళ బృందాలు కూడా బిలబిల మంటూ అక్కడికే చేరాయి. మామూలుగా అయితే బాబుగారి ఇంట్లో విలేకరులకు రాజభోగాలు. కానీ ఆ రోజు విలేకరులది పిలవని పేరంటం. బీజేపీతో టీడీపీకి ఎన్నికల పొత్తు విషయం గురించి తేల్చడానికి ఆ రెండు పార్టీల నాయకుల నడుమ ఎడతెగని చర్చలు లోలోపల సాగుతున్నాయి. బయట ఫుట్ పాత్ మీద నిలబడి కొందరం, కూలబడి కొందరం పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నాం. ముందు జాగ్రత్త చర్యగా వెంట తెచ్చుకున్న సిగరెట్లను ఒకదాని వెంట మరోటి తగలేస్తూ, తెచ్చుకోని వాళ్లకు ఉదారంగా పంచిపెడుతూ నా మానాన నేను కాలక్షేపం చేస్తుండగా సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. కడుపులో ఎలుకలు. మరో పక్క సిగరెట్ల పొగతో కళ్ళ కలకలు. అలా నిలబడి సిగరెట్ తాగుతూ వున్నవాడ్ని వున్నట్టుండి స్లో మోషన్ లో కిందకు వొరిగి పోతూ వుండడం వరకే గుర్తు.
కట్ చేస్తే నిమ్స్ ఆసుపత్రిలోని ప్రత్యేక గదిలో డాక్టర్ల పర్యవేక్షణలో. ఆందోళనగా నా వైపే చూస్తున్న నా భార్య. ఆమెతో పాటు నా ఇద్దరు పిల్లలు. ముఖ్యమంత్రి గారా మజాకా. జరిగిన విషయం విలేకరుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన అంబులెన్స్ తెప్పించి నన్ను నిమ్స్ లో అడ్మిట్ చేయించారట.
అందుకే కాబోలు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు కూడా స్వయంగా వచ్చి చూసారు. రిపోర్టులన్నీ తిరగేశారు. కళ్ళు తిరగడానికి, వొళ్ళు తూలడానికీ నా సిగరెట్లే కారణం అని ఆయన తన అనుభవంతో ఇట్టే కనుక్కున్నారు. ఆ విషయం మా ఆవిడతో చెప్పి, ‘నెమ్మదిగా ఈ అలవాటు మానిపించమ’ని సలహా ఇచ్చారు. కళ్ళు తెరిచి ఇదంతా చూస్తూ, చెవులు వొగ్గి ఇదంతా వింటున్న నేను హఠాత్తుగా ముందుకు వొంగి, ‘నేను సిగరెట్లు మానేశాను డాక్టర్ గారు’ అని ఒక బహిరంగ ప్రకటన చేసాను. ఆయన విలాసంగా మందహాసం చేసి, నెత్తి మీది వెంట్రుకలు చేత్తో పట్టి చూపిస్తూ, ‘ఇలాటి వాళ్ళను నా సర్వీసులో ఇంతమందిని చూసాను’ అంటూ, ‘అదంత తేలిక కాద’ని ఆయనే చెబుతూ, నేను తాగే బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి అప్పటికప్పుడే తెప్పించి మా ఆవిడ చేతిలో పెట్టి, ‘రాత్రి అందరూ నిద్ర పోయిన తరువాత నీ మొగుడు నీ మెదడు కొరుక్కు తింటాడు, ఎందుకయినా మంచి ఇది దగ్గర వుంచుకోమ్మా’ అని వెళ్ళిపోయారు.
అంతే! ఎంతయినా నేనూ పట్టుదల కలిగిన మనిషిని కదా! ఇంటికి వెళ్ళినప్పటినుంచి ఆ ప్యాకెట్టూ ముట్టుకోలేదు. అప్పటినుంచి సిగరెట్టూ అంటించలేదు.
మరో వింత ఏమిటంటే, ఆనాటి నుంచి సిగరెట్ తాగాలని కూడా అనిపించలేదు.
నా చేత సిగరెట్లు మానిపించడం నా భార్యకే చేత కాలేదు. అలాంటిది ఆ పని చేసింది డాక్టర్ కాకర్ల గారు.
వారు కన్ను మూశారు అనే వార్త ఇప్పుడే తెలిసింది.
వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...
(16-04-2021)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి