15, ఏప్రిల్ 2021, గురువారం

మా మంచం కధ – భండారు శ్రీనివాసరావు

 పెళ్ళయి, కాపురం పెట్టిన పదేళ్లకు కాబోలు మొట్టమొదటిసారి మొదటి మంచం కొనుక్కున్నాము. ఇందుకోసం నేనూ మా ఆవిడా కలసి పెద్ద సర్వేనే చేసాం. ఎక్కడమంచివి కొనుక్కోవచ్చని కాదు, ఎక్కడ కారు చౌకగా దొరుకుతాయా అని.

మొత్తం మీద లక్ డి కా పూల్ టెలిఫోన్ భవన్ దగ్గర మాకు తగ్గ షాపువాడు ఒకడు దొరికాడు. డెకొలం షీట్ వేసిన సింగిల్ కాట్స్ రెండూ కలిపి రెండువందల యాభయ్ రూపాయలు. షాపువాడే రిక్షాలో వేసి పంపిస్తానన్నాడు. సాయంత్రానికల్లా అవి దిగాయి. వున్న రెండు గదుల్లో ఒక రూమును ఫినాయిల్ వేసి కడిగి సిద్ధంగా ఉంచాము. మంచాలు వేయగా కాస్త కాళ్ళు కదపడానికి కాసింత జాగా మిగిలింది. మంచాలు అయితే వచ్చాయి కానీ వాటిమీద పరుపులు కొనడానికి మళ్ళీ ఒక నెల ఆగాల్సి వచ్చింది. ఏ పని చేయాలన్నా ఫస్ట్ తారీకు రావాలికదా.

మొత్తం మీద పరుపులు కూడా అమిరాయి. ఇక ఆ మంచాలే మాకు సర్వస్వం అయిపోయాయి. నలుగురు కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవాలన్నా, చీట్ల పేకలు ఆడుకోవాలన్నా, ఆ మంచాల మీదనే. డైనింగ్ టేబుల్ అమిరేవరకు టిఫిన్లు, భోజనాలు కూడా వాటిమీదనే. నిజం చెప్పొద్దూ భోజనాల బల్లలు కొనుక్కున్న తర్వాత కూడా మంచాల మీద కూర్చునే అన్నాలు తినేవాళ్ళం.

ఉండడానికి మరో రూము వుంది కానీ, ఆ గది పగలల్లా అమ్మవొడి. అంటే మా ఆవిడ నడిపే చైల్డ్ కేర్ సెంటర్ అన్నమాట. పదిహేను ఇరవైమంది పసిపిల్లలు, చిన్న పిల్లలతో కీసర బాసరగా వుండేది. సాయంత్రం కాగానే శుభ్రంగా కడిగించి వుంచేది. ఇక అప్పటినుంచి అది పర్మిషన్ అక్కరలేని పేకాట క్లబ్ గా మారిపోయేది. పెద్దపెద్ద వాళ్ళు సాయంత్రానికల్లా అక్కడ జమయ్యేవాళ్ళు. అలా కాలక్షేపం చేసిన వాళ్ళు చాలామంది జీవితంలో చాలా పెద్ద స్థానాలలోకి చేరుకున్నారు. ఇక మా ఆవిడ అమ్మవొడిలో పెరిగిన పిల్లలు అనేకమంది ఇప్పుడు విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

ఇలా అందరికీ కలిసొచ్చిన ఆ చిక్కడపల్లి ఇల్లు ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్ మెంటుగా మారిపోయింది. మాస్కో వెళ్ళేంతవరకు మేము ఆ ఇంట్లోనే అద్దెకు ఉన్నాము. ముప్పయ్యేళ్ళ తరవాత కూడా ఆ ఏరియాలో అమ్మవొడి అంటే గుర్తుపట్టేవాళ్ళు వున్నారు.

సందర్భం వచ్చింది కాబట్టి ఓ విషయం చెప్పుకోవాలి. నేను ఉదయం ఆరుగంటల కల్లా బయలుదేరి ఆఫీసు కారులో రేడియో స్టేషన్ కు వెళ్లి పొద్దుటిపూట ప్రసారం అయ్యే న్యూస్ బులెటిన్ తయారుచేసి వార్తల అనంతరం ఏడున్నర కల్లా మళ్ళీ ఇంటికి చేరేవాడిని. అలా అప్పుడు పక్క ఎక్కితే మళ్ళీ మిట్ట మధ్యాన్నమే దిగడం. తర్వాత సెక్రెటేరియేట్ లో మంత్రులు, లేదా ముఖ్యమంత్రి ఏర్పాటు చేసే ప్రెస్ కాన్ఫరెన్సులు కవర్ చేసుకుని, ఆఫీసుకు వెళ్లి రిపోర్టులు ఫైల్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చేవాడిని. ఇది ఎవరికంటా పడలేదు కానీ, నేను పొద్దస్తమానం ఇంట్లో పడివుండడం మాత్రం ఇరుగింటి పొరుగింటి అమ్మలక్కల కంటపడింది. నాకు ఉద్యోగం లేదనీ, అందుకే ఇల్లు నడపడానికి మా ఆవిడ ఇలా కేర్ సెంటర్ నడుపుతోందని వాళ్లకి వాళ్ళే తీర్మానించుకుని మా ఆవిడమీద బోలెడు జాలి, నా మీద లేనిపోని అక్కసు పెంచుకున్నారు (ట). ‘ సెక్రెటేరియేట్ లో మా వారికి తెలిసిన వాళ్ళు వున్నారు. ఏదో కొలువు ఇప్పిస్తారు, మీ వారిని ఓసారి కలవమని చెప్పండి’ అన్నదో ఆవిడ నేరుగా మా ఆవిడతోనే.

ఆ అమ్మలక్కలు అందించిన ఆ ఆయుధం నన్ను ఆట పట్టించడానికి మా ఆవిడకు కొన్ని రోజులు బాగా ఉపయోగపడింది.

ఇప్పుడా ఆటలు, మాటలూ అన్నీ గతకాలపు ముచ్చట్లు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి