17, సెప్టెంబర్ 2020, గురువారం

కోర్టు ధిక్కరణ - భండారు శ్రీనివాసరావు

ఇది చాలా పాత ముచ్చట. ఎంత పాతది అంటే ఓ అరవై ఏళ్ళో అంతకు పూర్వమో. కాస్త లీలగా గుర్తు వుంది.
బెజవాడలో ఓ పేరు మోసిన ప్లీడరు గారు ఓ సివిల్ కేసు తీసుకున్నారు. ఎదుటి కక్షిదారు సామాన్యుడు కాదు. ఆయనా ఓ గట్టి లాయరును పెట్టుకున్నాడు. సివిల్ కేసుకదా! తీరిగ్గా చాలా రోజులు సాగింది.
చివరికి తీర్పు వెలువడింది. మన లాయరుగారు ఓడిపోయారు. ఎదుటి పక్షానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ సంగతి బెజవాడనుంచి వెలువడే ఓ పత్రిక తన ఈవినింగ్ ఎడిషన్ లో ప్రచురించింది. ఆ పత్రిక యజమానికి కూడా ఈ సివిల్ దావాతో సంబంధం వుందని చెప్పుకునేవారు.
మామూలుగా అయితే ఈ కధ అంతటితో ముగిసేది. కానీ ఈ లాయరు గారిది ఉడుం పట్టు.
ఆ పత్రిక మీద కోర్టు ధిక్కరణ (Contempt of court) కేసు వేశారు.
కోర్టు తీర్పు సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో వెలువడింది. ఆ పత్రిక సాయంత్రం ఎడిషన్ ముద్రణ పూర్తయి మార్కెట్లోకి వచ్చేసరికి ఆరుగంటలు. ఆ రోజుల్లో పత్రికల ముద్రణ ఇప్పట్లోలా మాదిరిగా కంప్యూటర్లతో కాదు. Manual Composing.
లాయరు గారు ఈ పాయింటు పట్టుకున్నారు. నాలుగున్నరకు వెలువడిన కోర్టు తీర్పు గురించి ఆ పత్రిక వారికి ముందుగా ఎలా తెలిసింది. తీర్పు వచ్చే సమయానికి పత్రిక ముద్రణ కూడా పూర్తయిపోయింది. అలాంటప్పుడు కోర్టు తీర్పు కాపీ వారికి ఎలా వచ్చింది అని ఆ లాయరు గారు లా పాయింటు లేవదీశారు.
చివరికి ఏమి జరిగింది అనేది చాలామందికి ఉత్సుకత.
ఏం జరిగింది! అనేకానేక కధల మాదిరిగానే ఆ కధ కూడా ఎలా ముగిసిందో, ఎక్కడ వుందో ఎవరికీ తెలియదు.
కంచికి పోయి వెతుక్కోవాలేమో!

2 కామెంట్‌లు:

  1. కొంప తీసి, జడ్జీ & పత్రికాధిపతులు ఉభయులు అసమదీయులా ఏమిటి? అసలే బెజవాడ కూడా.

    ఈ వ్యాఖ్య చూసినప్పుడు ఫలానా ఆయన కూతుళ్లు గుర్తుకు వస్తే నన్ను తప్పు పెట్టరాదని మనవి.

    రిప్లయితొలగించండి
  2. ఇంకా నయం కోడి కత్తి , బాబాయి గొడ్డలి కాలుజారటం గుర్తుకు రాలేదు. ఎంతయినా highly respected కడప batch కదా.

    రిప్లయితొలగించండి