14, సెప్టెంబర్ 2020, సోమవారం

ఆరు రాత్రులు, ఆరు పగళ్ళు - 2 - భండారు శ్రీనివాసరావు

 

సత్సంగత్వే నిస్సంగత్వం

ఆధ్యాత్మికం, ఆముష్మికం ఈ పదాలు చిన్నతనం నుంచి అనుక్షణం వినబడే కుటుంబ నేపధ్యం అయినప్పటికీ వాటిపట్ల అభిలాష కానీ అనురక్తి కానీ ఏర్పడలేదు. అలా అని వాటిని తృణీకరించే స్వభావమూ నాకు అలవడలేదు. జీవితంలో అనేక విషయాలు ప్రస్తావనకు వస్తుంటాయి. వాటిల్లో ఇవీ ఒక భాగమే అనే తత్వం.

“సత్సంగత్వే నిస్సంగత్వం

నిస్సంగత్వే నిర్మోహత్వం

నిర్మోహత్వే నిశ్చలత్వం

నిశ్చలతత్వే జీవన్ముక్తి:” 

మంచి మనసున్న మనుషులతో సాంగత్యం మనసుపై మంచి సానుకూల ప్రభావం చూపుతుంది. ఆది శంకరాచార్యులు తన భజగోవింద స్త్రోత్రంలో చెప్పిన ఈ శ్లోకం అంతరార్ధం ఇదే.

ఈ ఆరు రాత్రులు, ఆరు పగళ్ళ కాలంలో మంచి మాటలు వినడానికీ, మంచి రచనలు చదవడానికీ, మంచి మనుషులతో గడపడానికీ ఓ మంచి అవకాశం లభించింది. సందేహాలు, సమాధానాలతో కూడిన అర్థవంతమైన చర్చలకు ఆస్కారం దొరికింది. గూడుకట్టుకుని ఉన్న సందేహాలు తీరాయా, దొరికిన సమాధానాలు సంతృప్తి ఇచ్చాయా అంటే చప్పున జవాబు చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఇంతకు  ముందు దాదాపు డెబ్బయి సంవత్సరాల సంచితం మెదడులో నిక్షిప్తమై గడ్డకట్టి వుంది. ఇలా అయిదారు రోజుల ప్రయత్నంతో దాన్ని పెకలించడం కష్టం.

వయసులో పెద్ద అయిన నావి సందేహాలు. నాకంటే దాదాపు పదేళ్లు చిన్నవాడయిన నా మేనల్లుడు రామచంద్రం వాటిని తీర్చే ప్రయత్నం చేసేవాడు. ఇదో వైచిత్రి.

ఉదయం మొదలయిన వాదసంవాదాలు ఒక పెట్టున తేలేవి కావు. అపరాహ్నం వరకూ సాగి వాటి నడుమనే ఉపాహారాలు, అల్పాహారాలు, మధ్యాన్న భోజనాలు.  ఇక సాయంసమయంలో మొదలయితే అర్ధరాత్రివరకూ అంతువుండేది కాదు.  ఇద్దరు ప్రాసంగికులే. ఇద్దరూ శ్రోతలే. జవాబుల అన్వేషణలో ప్రశ్నలు,  సందేహాల నివృత్తిలో మరిన్ని ప్రశ్నలు.

మా మేనల్లుడు రామచంద్రానికి పూర్వజన్మ వాసనలతో కూడిన ఆధ్యాత్మిక భావజాలం వుంది. అది బహుశా వారి నాన్నగారు కొమరగిరి అప్పారావు బావగారి నుంచి వారసత్వంగా లభించి వుంటుంది. చేసింది గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం అయినా రామాయణ, భారత భాగవతాలు నాలుకపై ఆడుతుంటాయి. చిన్నవయసులోనే ఇలాంటి అధ్యాత్మిక వాసనలు ఉన్న వారిని తోటివారు చిన్నచూపు చూడడం కద్దు. కానీ రామచంద్రం విషయం కొంత విభిన్నం. అందరికీ రామచంద్రం చెప్పే విషయాలు వినడంలో ఆసక్తి వుంది. నా ఒక్కడికీ కొంత మినహాయింపు ఇవ్వాలేమో. ఎందుకంటే నాదంతా అనుమానాలతో కూడిన ఆరాలు. దేవుడు అంటే భక్తీ లేకా కాదు, దేవుడు అంటే నమ్మకం లేకా కాదు. ఏ విషయాన్ని వెంటనే నమ్మేయడం ఎందుకనే సాధారణ ప్రాపంచిక విషయ పరిజానం తాలూకు  ప్రభావం నామీద ప్రబలంగా ఉన్న కారణంగా వచ్చిన తిప్పలు ఇవి. మూఢ నమ్మకాల మీద అతిమూఢ౦గా పెంచుకున్న అయిష్టత, ఏహ్యత ఒక కారణం కావచ్చు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే మా ఆవిడ గర్భవతిగా వున్న సమయంలో వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో ఆమెని సాంప్రదాయక విశ్వాసాల ప్రకారం  చీకటి గదిలో పడుకోబెట్టకుండా ఆమె చేత అఢవా చాకిరీ చేయించిన చరిత్ర నాకుంది. తొలిచూలు అయినా మూఢ నమ్మకాల మీద నా యుద్ధానికి మౌనంగా సహకరించింది.  గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కదలకుండా విశ్రాంతిగా పడుకోని పక్షంలో వారికి పుట్టే బిడ్డలు అవకరంగా జన్మిస్తారనే నమ్మకాలు ప్రబలంగా వున్న రోజుల్లోనే    నా నిర్వాకం ఇది.

ఈ నేపధ్యంలో ఈ ఆరు రాత్రులు, ఆరు పగళ్ళ అధ్యాయం మొదలయింది. (14-09-2020)

(తరువాయి మరోసారి)                   

    

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి