(ఉపక్రమణిక)
ఇదేమీ వెనుకటి
రోజుల్లోని మళయాళం డబ్బింగు సినిమా టైటిల్ కాదు. అచ్చంగా నా సొంత గొడవ. ఎవరితోనూ
పెట్టుకున్న గొడవ కాదు, నాకై
నేను నాతో పెట్టుకున్న గొడవ.
గతంలో
మాదిరిగా పేరాలు పేరాలు రాయడం
కుదరకపోవడానికి కారణం చెయ్యి నొప్పి అనుకున్నాను. అంచేత పూర్వం నేను రాసుకున్న నా
రాతలనే కొంతకాలంగా తిరగమోత పెడుతూ వస్తున్నాను. అక్కరాజు నిర్మల్ వంటి స్నేహితులకు
ఇది బాగా తెలుసనే అనుకుంటున్నాను.
ఇప్పుడు
రాయకపోవడానికి ఆ చెయ్యి నొప్పి కారణం కాదు. చేతి మీద అదనపు భారం పడకుండా టైప్
చేయడానికి మా అబ్బాయి సంతోష్ ఇంట్లో
టేబులూ, కుర్చీ ఇలా మంచి ఏర్పాట్లే చేశాడు, కార్పొరేట్ తరహాలో. అలాగే ఈ
ఏడాది చేసుకోని నా పుట్టిన రోజును పురస్కరించుకుని మా కోడలు నిష బోలెడు డబ్బు పోసి
ఏకంగా ఓ లేటెస్ట్ మోడల్ లాప్ టాప్
కొనిచ్చింది. దాన్ని జరాసంధుడి మాదిరిగా మధ్యకు విరగదీసి మరీ రాసుకోవచ్చు(ట).
అసలు
సంగతి ఇది కాదు,
మనిషికి రాయాలనే ఇచ్చ కలగనిదే ఏది రాసినా అందులో సారం వుండదు. ఇన్నాళ్ళు అలాంటి
చేవ లేని రచనలే చేస్తూ వస్తున్నాను అనే సంగతి ఈ మధ్యకాలంలో తరచూ మనసును పీకుతోంది.
ఇదిగో
ఈ నేపధ్యంలో ఈ ఆరు రాత్రులు, ఆరు
పగళ్ళ అనుభవం అన్నమాట.
గతవారం
నేను మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి మూడో అబ్బాయి ఉంటున్న కౌంటీకి వెళ్లి
దాదాపు వారం రోజులు వున్నాను. పెద్ద ఇల్లు, విశాలమైన పడక గదులు,
అన్నింటికీ మించి అతి విశాలమైన మనసులు కలిగిన దంపతులు దీప, లాల్ బహదూర్, తమ మాటలతో చేతలతో ఆకట్టుకునే పిల్లలు వారి స్పురిత, హసిత. నాకు తోడుగా నా మేనల్లుడు
రామచంద్రం, అతడి
భార్య కరుణ. అందరికీ ఎవరి పడక గదులు వారికే వున్నాయి. అందరూ ఎడం ఎడంగా కూర్చుని మాట్లాడుకోవడానికి వీలుగా విశాలమైన
హాలు. చుట్టూ పూలమొక్కలు,
కూరగాయల పాదులు, అన్ని
రకాల ఫల వృక్షాలు. అన్ని రకాల వసతులతో ఒక చక్కని పల్లెటూరులో వున్నట్టు వుంటుంది.
వాళ్ళు ఆ విల్లా కొనుక్కున్నప్పటినుంచీ నన్నూ మా ఆవిడనూ వారి దగ్గరికే వచ్చి కొన్నాళ్ళు
గడపాలని పోరుపెట్టేవారు. కానీ కుదరలేదు.
ఓ
శుక్రవారం వచ్చి నన్ను కారులో తీసుకుపోయారు. తెలిసిన ఇల్లే. తెలిసిన మనుషులే.
అక్కడ
ఉండగానే నాకేమీ తెలియదనే నిజం ఒకటి తెలిసివచ్చింది.
అది తెలియగానే సెల్ ఆఫ్ చేసాను. పత్రికలు ముట్టుకోలేదు. టీవీ వార్తలు చూడలేదు.
ఇన్నాళ్ళూ జీవించిన ప్రపంచానికి దూరం జరిగాను.
దీనికి
కారణం మా మేనల్లుడు రామచంద్రం. నాకంటే చాలా చిన్నవాడు.
మరో
కారణం, నాలో మరో నేను వున్నాడు అనే సంగతి తెలియరావడం.
ఆ
రెండో నేను నాలో ఉన్నాడని తెలిసింది కాని, ఎవరో ఏమిటో తెలియదు.
అది
తెలియడానికే ఈ ఆరు రాత్రులు, ఆరు
పగళ్ళు ఖర్చు చేయాల్సివచ్చింది. తెలిసిందా అంటే ఏమి చెప్పాలి, మహామహులకే సాధ్యం కాలేదు ఆ సంగతి తెలుసుకోవడం. నాకెలా వీలుపడుతుంది?
ఆ వివరాలు
మరోమారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి